Thursday, March 8, 2018

అష్టసిద్ధులంటే ఏమిటి?

భారతీయ తత్వ శాస్త్రంలో సిద్ధి అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. అప్పుడు అతనికి సిద్ధించే శక్తులే ‘సిద్ధులు’. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా నిర్వచిస్తున్నప్పటికీ.... ప్రచారంలో ఉన్నది మాత్రం అష్టసిద్ధులే! వాటిని శ్లోక రూపంలో చెప్పుకోవాలంటే...
“అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః”

దీని బట్టి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అన్న ఎనిమిది సిద్ధులే ఆ అష్టసిద్ధులని తెలుస్తోంది. పతంజలి యోగ సూత్రాల ప్రకారం ఈ సిద్ధులు కేవలం యోగం ద్వారానే కాకుండా, ఒకోసారి జన్మతః సిద్ధించవచ్చు. మంత్రబలంతోనూ సాధించవచ్చు. ఒకోసారి దివ్యౌషుధలని స్వీకరించడం ద్వారా కూడా వీటిని పొందవచ్చు. అయితే సాధకుడు ఈ సిద్ధుల భ్రమలో పడితే, మోక్షం అనే అసలు లక్ష్యం నుంచి దూరమైపోతాడని హెచ్చరిస్తాయి పతంజలి యోగ సూత్రాలు!
అష్టసిద్ధుల గురించి ప్రస్తావన రాగానే వినాయకుడు, హనుమంతుడు గుర్తుకురాక మానరు. వీరిరువురికీ అష్టసిద్ధుల మీద పూర్తి సాధికారత ఉందనీ, వీరిన పూజించిన భక్తులకు ఆయా సిద్ధులను అతి సులభంగా అనుగ్రహించగలరనీ ఓ నమ్మకం. అందుకనే హనుమంతుని ‘అష్టసిద్ధి నవవిధికే దాతా’ అంటాడు తులసీదాసు తన హనుమాన్‌ చాలీసాలో. ఇక వినాయకుని భార్య సిద్ధి అన్నది కేవలం ఒక పేరు మాత్రమే కాదు... ఆమె అష్టసిద్ధులకు ప్రతిరూపం అన్నది ఓ విశ్లేషణ! ఇంతకీ ఈ అష్టసిద్ధుల ద్వారా సాధకులు సాధించే శక్తులు ఏమిటంటే...

అణిమి- శరీరాన్ని అతి సూక్ష్మరూపంలోకి తీసుకురాగలగడం.
మహిమ- ఎంత పెద్దగానైనా శరీరాన్ని మార్చేయగలగడం.
గరిమ- ఎంతటి బరువునైనా సాధించగలగడం.
లఘిమ- కావల్సినంత తేలికగా తన బరువును మార్చుకోవడం.
ప్రాప్తి- ఏ వస్తువు కావాలనుకున్నా దాన్ని శూన్యం నుంచి సైతం సాధించడం.
ప్రాకామ్యం- కోరుకున్నది సాధించడం.
ఈశత్వం- అష్టదిక్పాలకును శాసించగల ఆధిపత్యం.
వశిత్వం- సకల జీవరాశులను వశం చేసుకోగల అధికారం.
 

నవనిధుల్లో పుణ్యం వల్ల కలిగేవి, శాంతం వల్ల కలిగేవి, ధర్మం వల్ల కలిగేవి
పద్మనిధి, మహాపద్మనిది, నీలనిధి.
నవనిధుల్లోని ఈ మూడు నిధులే సుఖాలు.. సౌఖ్యాలు... కీర్తి... ఆరోగ్యం.. పరమానందమును తన కుటుంబ సభ్యులకి, తన రక్త సంబంధీకులకి, స్నేహితులకి ఇస్తాయి. రెండు చేతులతో దండం పెట్టాలనిపించే గౌరవాన్ని తెచ్చిపెడతాయి.

కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, వ్యధలు, నష్టాలను తెచ్చే నిధులు....
కుందనిది, శంఖనిధి, ముకుందనిది, మిశ్ర నిధి, మకరనిధి, కచ్ఛపనిధి. 
అధర్మం.. అన్యాయం.. అక్రమం.. నీచం.. స్నేహంలో ద్రోహం.. నమ్మినవారిని మోసం చెయ్యటం వల్ల, అధిక వడ్డీల వల్ల వచ్చేవే పై నిధులు.  ఆ నిధులన్నీ వేశ్యల పాలు, విలాసాలపాలు,  వైద్యశాలల పాలు,  అపాత్రుని పాలు అవుతాయి.
నిలువెత్తు సంపదలున్నా అనుక్షణం వెలితి, దిగులు, నిరాశ, నిస్సహాయత, తగాదాలు, గొడవలు, కోట్లు కరిగించినా పోని దరిద్రాలు.

1 comment:

  1. Thank you for sharing such great information. It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Best Astrologer in India

    ReplyDelete