Tuesday, November 24, 2015

కార్తిక మాసములో వల్మిక లింగము లతో మహా,సహస్ర లింగార్చన ఫలితము మరియు వివరణ.Significance of Maha Sahasra Lingarchana.

Significance of Maha Sahasra Lingarchana . 

శ్లో : వాగర్ధా వివ సంపుృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే,
      జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ .
జగతః పితరులు అయిన పార్వతీ పరమేశ్వరులకి ముందుగా నమస్కారము. కలియుగంలో మానవులు అల్పఆయుష్షు కలవారుగా, భగవత్ అనుగ్రహం పొందటానికి ఘోర తపస్సు గాని , విశేష యజ్ఞ యాగములు చేయు శక్తి మరియు సాధన సామద్యాన్ని  పొంది లేక ఉండటమే కాక దైవసంబంధ కార్యములు చేయుటకు ఆశక్తి వున్నా నిత్య జీవితం లో తగిన సమయము భగవత్ ఆరాధనకు వినియోగించ లేక పోవటం మనం ప్రత్యక్షంగా గమనిస్తూనే వున్నాం . 
కనుక కలియుగంలో మానవులకి భక్తి ప్రదాయకమైన విధానాలను పూజలు,వ్రతాలు,అభిషేక మరియు హోమ ప్రకరణముల తో, తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ ఫలమును , జ్ఞానమును మరియు ముక్తిని ప్రసాదించేవి గా మనకి వీలుగా మహర్షులు మనకి ఎన్నో అందించారు , వాటిలో ఈ కార్తీకమాస లో చేసే విశేష శివారాధన విధి కూడా ఒకటి. 
సాధారణంగా శివాలయంలో మనకి శివలింగాన్ని దర్శనం చేసుకొనే వీలు మాత్రమే ఉంటుంది స్ప్రుసించి అభిషేకాదులు చేసుకొనే వీలు స్వయం భు లింగములు అనగా ఉదాహరణకు శ్రీశైలం లాంటి మహా పుణ్య ప్రదేశాల లో మాత్రమే అది కొన్ని సమయాల లో మాత్రమే వుంటుంది , ఒకవేళ సామాన్యులు ఇంటిలో శివలింగాన్ని ఉంచి అభిషేకాలు నిత్యం నిర్వహించాలన్నా ఆచార నియమాలు , పరిశుబ్రత తప్పకుండ పాటించ వలసి వుంటుంది . వాటిని ప్రస్తుత కాలంలో పాటించటం అసాద్యం కాకపోయినా కొంచం కష్ట సాద్యం .
మరి ప్రస్తుత కాలమానంలో  మానవులకి ఏ రకంగా శివ ఆరాధన చేసి శివ అనుగ్రహం పొందవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం . శివారాధనలో మనకి ముఖ్యంగా మహాశివరాత్రి , కార్తీక మాసం విశేషంగా చెప్పబడింది.

 శ్లో : న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్. 
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. 

కనుక కార్తీకమాసంలో శివలింగార్చన చేయటం భక్తి ముక్తిదాయకాలుగా మనయొక్క పురాణాలు మనకి చెబుతున్నాయి . మరి భక్తులు ఎటువంటి శివలింగాన్ని అర్చన చేయవచ్చు అనగా, మనకి వల్మీకముతో చేసిన అనగా "పుట్టమన్నుతో " చేసిన శివలింగము కలియుగమున విశేషముగా చెప్పబడినది . శాస్త్రంలో మనకు వల్మీకము (పుట్టమన్ను) కు , ఎంతో ప్రాధాన్యత ఉంది. పంచ మృత్తికలు, అష్ట మృత్తికలు, ఇలా అన్ని పవిత్రమైన మట్టి విషయాలలో వల్మీకము (పుట్టమన్ను )కు స్థానం ఉంది. వీటిని అనేక వైదిక కార్యక్రమాలలో వినియోగిస్తారు. కనుకనే పుట్టమన్నును పవిత్రమైనదిగా శాస్త్రం చెబుతోంది. ఇక శైవ సంబంధమైన విషయానికి వస్తే పుట్టమన్నుతో శివలింగము చెసి అర్చించటం కలియుగంలో సత్వర విశేష ఫలితం ఇస్తుంది అని చెప్పబడింది. 
కృతయుగంలో రత్న లింగమును, త్రేతాయుగంలో బంగారు లింగమును , ద్వాపరయుగంలో పాదరస లింగమును , కలియుగంలో వల్మీక లింగమును అర్చించవలేనని, యుగధర్మం మనకు చెబుతోంది. అదియునుకాక పరమేశ్వరునికి కంఠంనందు అలంకారం అయిన నాగేంద్రుడుకి నివాసస్థానం అయిన పుట్ట శివునికి ఎంతో ప్రీతిపాత్రం కనుక పుట్టమన్నుతో శివలింగాన్ని అర్చించటం పరమేశ్వరునికి ఎంతో ప్రీతిని కలిగించును. " మృత్తికే హనమే పాపం యన్మయా దుషుౄృతం కృతం " అన్న వేద వాక్యం మనకు  మృత్తిక స్పర్శనం వల్ల చేతనే, మనయొక్క చెడు స్వభావం, స్వయం కృత పాపములు  తొలగునని తెలియజేయు చున్నది , అందుకనే పుట్టమన్ను అతి పవిత్ర మైనది . పుట్టమన్నుతో ఏక లింగమును చేసి అనగా శివలింగ రూపముగా మట్టిముద్దను చేసి , అర్చన చేయటం ఒక సాధారణం మరియు సులభమైన మార్గము . ఇది కాక మనకి "365"శివలింగములు  లేదా "1128" లింగములని పూజించు విశేష పూజా విధానములు వున్నవి . అదియే " మహాలింగార్చన 365 లింగములతో" సహస్ర లింగార్చన 1128 లింగములతో "చేసి అభిషేకించటం . మహాలింగార్చనలో 365 లిన్గములను ఒక క్రమపద్దతిలో వేద మంత్రములతో కైలాస మహా యంత్ర రూపముగా అమర్చి శివలింగఆకృతిని ఏర్పరచి మహాన్యాసముతో దేహ ఇంద్రియ శుద్ధి చేసుకొని నమక చేమకములతో అభిషేకం చేస్తారు. ఈ ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి చేసినను, ప్రతి రోజు అభిషేకం చేసిన ఫలితాన్ని పొందవచ్చును .
ఇక సర్వోత్క్రుష్టమైన సహస్రలింగార్చనని వేదమంత్రాలతొ పదహారు దశలలో  ( ఆవరణములు ) 1128 లింగములని ఒకదాని తర్వాత ఒకటి శివ ప్రోక్త కైలాస రహస్య మహా యంత్ర ప్రకరణం ప్రకారంగా ఏర్పరుస్తూ శివలింగాకృతి చేయటం ఒక మహాఅద్భుతం. ఈ ప్రకారం చేసిన సహస్రలిన్గాలకు మహాన్యాసముతో దేహ ఇంద్రియ శుద్ధి చేసుకొని నమక చేమకములతో అభిషేకం చేయటం పూర్వ జన్మ సుకృతం మరియు శివ అనుగ్రహ హేతువు . వీరికి వేయి లిన్గాలని అభిషేకించిన ఫలితం మాత్రమే కాక మహా యజ్ఞ యగాములను చేసి నను పొందని మహా ఫలితమును పొందుదురు . 
వల్మీక శివలింగ అర్చన , మహా , సహస్ర లింగ అర్చన చేసిన కలుగు ఫలితము మరియు శివుడు అభిషేక ప్రియుడు కనుక వివిధ ద్రవ్యములతో అభిషేకించిన వచ్చు విశేష ఫలితము , ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం . . . . 

కామ్య కర్మలను సఫలం చేయటానికి వల్మీకములో ఇతర పదార్ధాలు కలిపి శివలింగాలు చేయటం ద్వారా కామ్యములు అనగా కోరికలు తీరుతాయి. శివాభిషేక ఫలములు 
1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును. 
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. 
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. 
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. 
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. 
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. 
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది. 
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. 
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును. 
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
" రుదం ద్రావయతీతి రుద్రః " శం కరోతీతి శంకరః 
రుదం అనగా ఏడుపు , బాధ , దుఖం వీటిని మన నుంచి ద్రవింప చేయగలిగినది , కడిగి వెయ గలిగినది " రుద్రము . 
శం అనగా శుభము " మనకు శుభములను ప్రసాదించ గలిగిన వాడు శంకరుడు . 
కావున ఈ పవిత్ర కార్తీక మాసమున శివ అర్చన , అభిషేకములు చేసి శివ పురాణమును చదివి , విని తరిద్దాం ..!
కార్తీకం లో విష్ణు మూర్తి పూజ చేయటం వలన కార్తీక దామోదరుని అనుగ్రహం పొందుతాము .అందుకనే మనకు స్కాంద పురాణ అంతర్గత మయన " సత్యనారాయణ స్వామి వ్రతం " ఈ మాసములన ఎక్కువగా చేయటం గమనిస్తాం . 
భక్తులు ఉపాసనా కాల మయన ఈ కార్తీక మాసమున శివ కేశవులను ఆరాదించి తరించాలి అని ఆసిస్తూ .... సెలవు ..! 
దయచేసి మీ బంధువులతో మిత్రులతో ఈ వ్యాసమును షేర్ చేయ గలరు .. సదా భగవత్ సేవలో మీ ...
లోకా సమస్తా సుఖినో భవంతు ..!