Monday, April 8, 2019

🙏🌷 రుద్రం విశిష్ఠత 🌷🙏

🙏🌷 రుద్రం విశిష్ఠత 🌷🙏

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.

రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.

నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |

నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||

నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.

నమకం విశిష్టత :

నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.

అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.

అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం – 3:
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.

అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:

అనువాకం – 5:
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.

అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.

అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం –9:
ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

అనువాకం – 10:
ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.

అనువాకం – 11:
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.

చమకం విశిష్టత:

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే.. 👏

Saturday, April 6, 2019

🌹రాశి లగ్నాలు జాతకుల లక్షణాలు🌹

🌹రాశి లగ్నాలు  జాతకుల లక్షణాలు🌹

మేషలగ్నములో జన్మించినవారి లక్షణాలు
మేషలగ్నములో జన్మించినవారు రూపవంతులు, విద్యానిపుణులు, వినయము గలవారు. కుటుంబ  సభ్యులపై అభిమానము చూపుదురు. చురుకైన తత్వమూ, వాడి నేత్రములు, కోప స్వభావము, తామస గుణము వన విలాస ప్రీతి అందరు తన స్వాదీనములో ఉండాలనే కోరిక, దీర్ఘ కాల శత్రువులు ఉంటారు. గొప్ప దైర్యము, అధికమైన ఆశ. అధిక ధనము, మంచి భోజన ప్రియులు వీరు. వీరిలో కోప స్వభావం కనిపిస్తుంది.

వృషభ లగ్నములో జన్మించినవారి లక్షణాలు
దేవతలను, గురువులను, పూజించు గుణము కలిగి ఉంటారు. క్షత్రియ స్వభావము, స్వల్పసంతానము, దర్పములలో రాజసము శాంతమైన బుద్ది కలిగి ఏ పనైనను బుద్ది బలంతో సాధిస్తారు. ఆరోగ్యం, ఆనందంతో జీవిస్తారు. వీరు భోజనప్రియులు. కార్యశూరులు, శ్రమకోర్చి పనులు నెరవేర్చువారు కాగలరు. మృదు స్వభావం కలిగి ఉంటారు. కామా వాంఛ అధికంగా ఉంటుంది.

మిధున లగ్నములో జన్మించినవారి లక్షణాలు
బంధు ప్రీతి, దయాగుణము, ఊహాలలో తేలిపోయే స్వభావం వీరిది. పట్టనపట్టు విడువక పూర్తిగావించుచుందురు. అన్నివేళలా మిత్రులకు సహకరింతురు. నూతన పరిశోధనలను చేయుచుందురు. ఇక వీరు ఆరోగ్య విషయములో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

కర్కాటక లగ్నములో జన్మించినవారి లక్షణాలు
ధర్మ గుణము, సున్నితమైన మాటలు, మృష్టాన్న ప్రియులు, కపటమైన బుద్ది. సున్నిత మనస్సు, దయగల నేత్రములు, గొప్ప జ్ఞానము, మనోధైర్యము ఉంటుంది. విద్యతోపాటు వివేకము కలిగియుందురు. పెద్దలందు గౌరవము చూపుతారు. అనారోగ్యముతో పోరాడుచుందురు. వీరు అసహనశీలురు.

సింహ లగ్నములో జన్మించినవారి లక్షణాలు
స్థూల శరీరము, మంచి శారీర చాయ, గొప్ప సురత్వము, శత్రు జయము పిసినారి గుణము మంచి నిర్ణయము, విదేశీ ఉద్యోగం, కష్టసాధ్యమైన పనులను కూడా అవలీలగా పూర్తిచేస్తారు. తలకు మించిన పనులను ప్రారంభిస్తారు. అన్నింటా తమదే జయమని భావిస్తారు.

కన్య లగ్నములో జన్మించినవారి లక్షణాలు
పనిలో నైపుణ్యము, విద్వాంసులు, విలాస వంతులు, వ్యాపార దక్షిత, బంధుప్రీతి, సుఖమైన జీవితము, మంచి కండ పుష్టి, హాస్యముగా మాట్లాడతారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. నేర్చుకొన్న విద్యలు మరచిపోరు. చాలాకాలం జ్ఞాపకముంచుకొందురు. ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఉందురు. దేశభక్తి ప్రజాసేవలు వీరికి హితవు.

తుల లగ్నములో జన్మించినవారి లక్షణాలు
జీవితములో మంచి చెడ్డలను పూర్తిగా తెలిసికొని తమకు తోచిన విధంగా సంచరింతురు. పరోపకాబుద్ధితో అందరితో మైత్రి కలిగి యుందురు. రాజ పూజ్యమైన గౌరవం కలిగి ఉంటారు. ఆరోగ్యకరమైన దంతాలు ఉంటాయి. శాంత స్వభావము. దాంపత్య అన్యోన్యత, ప్రశాంత జీవితమూ గడుపుతారు.

వృశ్చిక లగ్నములో జన్మించిన వారి లక్షణాలు
వృశ్చిక లగ్నములో జన్మించిన వారికి అతి ఆశ ఉంటుంది. చురుకైన నేత్రములు, మూర్ఖత్వము అధికం అతి చపలత్వము. గొప్ప అభిమానవంతులు, శరీరము బలహీనము. శత్రు జయము మంచి మనస్తత్వము, కలిగి ఉంటారు.

ధనుస్సు లగ్నములో జన్మించినవారి లక్షణాలు
ఈ లగ్నమున జన్మించిన వారు స్వశక్తితో జీవితంలో ఎదుగుతారు. శాస్త్రకృషితోనే జీవితాంతం కాలం గడుపుచుందురు. కులంనందు ప్రధానులు కాగలరు. ఆరోగ్యవంతులు, విషాద ప్రియులు, సుజన ద్వేషము, ప్రజ్ఞ వంతులు, మంచి చాయ, ఎత్తుగా ఉండి బలము కలిగి ఉంటారు. లావు తొడలు, కడుపు ఉంటుంది. సాత్విక స్వభావము. భోజన ప్రియులు.

మకర లగ్నములో జన్మించినవారి లక్షణాలు
లోభము ఖర్చు ఎక్కువ తమపనులు పూర్తియైన చాలునని భావిస్తారు. తమకు కేటాయించిన పనులలో నిర్లక్ష్యము చూపుచుందురు. కుల శ్రేష్ఠులు, శ్రీమంతులు, గొప్ప కీర్తి, గొప్ప ధనవంతులు, రమణి లోలత, దీన స్వభావము, నల్లని శరీరము, తామస గుణము కలిగి ఉంటారు.

కుంభ లగ్నములో జన్మించినవారి లక్షణాలు
వీరు ధనవంతులు. కుటుంబ పోషకులు. కాలమును సద్వినియోగ పరచుకొనువారు. ఎంతటి కష్టనష్టములు వచ్చిననూ తొణకరు, బెణకరు. గొప్ప ధనవంతులు, పరకాంత లోలత్వము, కఠినమైన మనస్సు, కరుణ్యశీలము, నలుపు వర్ణ శారీర చాయ. నరముల పుష్టి, కఠినమైన నిర్ణయముల వలన ఇబ్బంది పడవలసి వస్తుంది.

మీన లగ్నములో జన్మించినవారి లక్షణాలు
మంచి తేజోవంతులు. సౌఖ్యవంతులు, గుణవంతులు, సంగీత సాహిత్యములందు ఆసక్తి గలవారు. అందరికి ఇష్టము కలిగి ఉంటారు. ధన, దాన్య సమృద్ది, మంచి విద్వాంసులు, సుజన సహవాసం, మంచి చాయ ఉంటుంది.