Thursday, April 19, 2018

ప్రశ్న జ్యోతిష్యం - ప్రశ్న ఫలించు యోగాలు

మానవుడి మనసే ప్రశ్నల పుట్ట. నిత్యం ఎన్నో ప్రశ్నలు వేదిస్తాయి. ఉద్యోగం వస్తుందా? పెళ్లవుతుందా? సమస్యలు తొలగిపోతాయా? ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుంది? వంటి ప్రశ్నలెన్నో మనసుల్ని తొలుస్తుంటాయి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? 'ప్రశ్న' లేనిదే జవాబు లేదు. కానీ, జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వీటికి సమాధానం చెప్పేందుకు ఉద్ధేశించిందే 'ప్రశ్న జ్యోతిష్యం'. జ్యోతిష్య శాస్త్రానికి అనుబంధంగా ఈ 'ప్రశ్న' విధానాన్ని మన మహర్షులు ఎప్పుడొ రూపొందించారు. 

జ్యోతిష్యశాస్త్రం సిద్ధాంత, హోరా, సంహిత, ప్రశ్న, శకునం అను పంచస్కందాత్మకంగా వివరించబడింది. ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహముల స్ధితి ఆ ప్రశ్న గురించిన వివరాలు, ఆ ప్రశ్న భవిష్యత్తును తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది. జాతకంలోని ఒక అంశానికి సంబంధించిన సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది. ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు. ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు.

జాతకుడు ఈ జన్మలో చేసిన పుణ్య పాపముల ప్రభావాలు పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. జాతకం గత జన్మ కర్మ ఫలాలను నిర్దేశించేదైతే ప్రశ్న జ్యోతిష్యం ఈ క్షణం వరకు మనం చేసిన పుణ్య పాపాలను కూడా పరిగణలోకి తీసుకొని ఫలిత నిర్దేశం చేస్తుంది. జాతకం అనుకూలంగా ఉండి ,ప్రశ్న వ్యతిరేకంగా వస్తే ఈ జన్మలో ఎక్కువ పాపాలు చేశాడని, జాతకం వ్యతిరేకంగా ఉండి ప్రశ్న అనుకూలంగా వస్తే ఈ జన్మలో పుణ్యాలు ఎక్కువగా చేసినట్లు గుర్తించమన్నాడు.రెండు సమానంగా వస్తే పుణ్య పాపాలు సమానంగానే చేసినట్లు గుర్తించమన్నాడు. దీనిని బట్టి జాతకం పరీక్షించే ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశానికి ప్రత్యేకంగా ప్రశ్నను కూడా పరీక్షించి చూడాల్సిందే. 

జాతకుడు జాతక సహకారంతో పాటు, ప్రశ్నా శాస్త్రాన్ని కూడా పరిశీలించి, పరిశీలన చేయటానికి అవకాశం లేని తక్కిన అంశాలను తపశ్శక్తితో గమనించే శక్తిని సంపాదించి ప్రశ్న శాస్త్రం ద్వారా దాన్ని నిర్ధారించుకొని ఆ తరువాత ఫలితాన్ని చెప్పినట్లయితే ఎక్కువశాతం వాస్తవానికి దగ్గరగా, జాతకుడికి ఉపయుక్తమయ్యే సలహాలను జాతకుడు ఇవ్వగలడు.

చంద్రుడు లగ్నంలో శని కేంద్రంలో ఇంకా బుదుడు అస్తంగత్వం చెందిన లేక లగ్నములోని చంద్రునిపై బుధ,కుజుల దృష్టి ఉన్న జాతకుడు ప్రశ్నించు విధానం మంచిది కాదు అని అర్ధం. అనగా జాతకుని నిజాయితీలో లోపమును సూచించును. జ్యోతిష్యున్ని పరీక్షించటానికి ప్రశ్న అడిగే సూచనలు ఉన్నాయి.

ప్రశ్నించకూడని సమయాలు
నక్షత్రాలు: భరణి, కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, మఖ, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, పూర్వాభాద్ర, ఇంకా గండాంత నక్షత్రాలు (ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి చివరి పాదాలు, అశ్వని, మఖ, మూల మొదటి పాదాలు)
తిధులు: అష్టమి, విదియ, సప్తమి, ద్వాదశి, చవితి, నవమి, చతుర్దశి ఇంకా అమావాస్య.
యోగములు: వ్యతీపాత, వైదృతి యోగాలు.
కరణము: శకుని, చతుష్పాద, నాగ, కింస్తుఘ్న కరణాలు.
వారములు: మంగళ, శనివారములు.
సూర్య, చంద్ర గ్రహణముల 3 రోజులు. గుళిక లగ్నంలో ఉన్నప్పుడు, లగ్నంపై పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు, సంక్రమణ జరిగిన రోజులలో జాతకుడు జ్యోతిష్యుడిని ప్రశ్నించరాదు. పై సమయాలు జాతకుడి కంటే జ్యోతిష్యునికే గుర్తించే అవకాశాలు ఎక్కువ కాబట్టి జ్యోతిష్కుడు ఆ సమయాలలో ప్రశ్న ఫలితం చెప్పరాదు.

ప్రశ్న ఫలించు యోగాలు
పృష్టోదయ రాశులు: మేషం, వృషభం, కర్కాటకం, ధనస్సు, మకరం.
శీర్షోదయ రాశులు: మిధునం, సింహం,కన్య, తుల, వృశ్చికం, కుంభ.
ఉభయోదయ రాశులు: మీనం.
శీర్షోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే శుభం, పృష్టోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే ప్రశ్న ఫలించదు. ఉభయోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి.

చరరాశులు ప్రశ్న లగ్నమైతే ప్రస్తుత పరిస్ధితులలో మార్పు కనబడుతుంది. స్దిర రాశులు ప్రశ్న లగ్నమైతే మార్పు కనబడదు. ద్విస్వభావ రాశులు ప్రశ్న లగ్నమైతే ఆలస్యం, కష్టంతో ఫలితం కనిపిస్తుంది.

లగ్నాధిపతికి,కారక భావాదిపతికి సంబంధం ఉంటే ప్రశ్న ఫలిస్తుంది. లగ్నాధిపతి చంద్రుడు శుభ భావాలలో ఉండాలి. కేంద్రాలలో శుభగ్రహాలు, త్రిషడాయులలో పాప గ్రహాలు ఉండాలి. చంద్రుడు ఉపచయాలలో ఉంటే మంచిది. ప్రశ్నాచక్ర లగ్నం, జన్మ లగ్నం ఒకదానికొకటి ద్విద్వాదశాలు, షష్టాకాలలో ఉండరాదు.

ప్రశ్న చక్రంలో వక్రగ్రహం ఏ భావంలో కలదో ఆభావానికి సంబందించిన అంశములలో అడ్డంకులు కలుగుతాయి. వక్రించిన శుభగ్రహాలు 6, 8, 12 భావాలకు ఆదిపతులైతే శుభపలితం రావటం కష్టం. పాపగ్రహాలు వక్రించి 6,8,12 భావాలకు అధిపతులైతే శుభ ఫలితం రాకపోగా అడ్డంకులు ఎదురవుతాయి...!

Friday, April 13, 2018

*చతుఃషష్టి ఉపచారాలు* వివరాలు !

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము..
🙏🙏🙏🙏🙏

Thursday, April 12, 2018

గోచారములు అంటే ఏమిటి ? వాటి ఫలితాలు తెలుసుకోవటం ఎలా ?

జ్యోతిష్య శాస్త్రంలో అనేక విధాల అధ్యయనాలున్నాయి. ఇందులో భాగంగా గోచారం ఉంది. గోచారము అంటే ప్రస్తుత గ్రహస్తితిని బట్టి వ్యక్తికి సంబంధించిన రాశి ఫలము. జాతకచక్రంలో వ్యక్తి జన్మించినప్రథమ భాగాన్ని లగ్నంగా తీసుకుంటారు. చంద్రుడున్న నక్షత్రాన్ని ఆ వ్యక్తి జన్మ నక్షత్రంగానూ, ఆ చంద్రుడున్న రాశిని ఆ వ్యక్తి రాశి గానూ చెబుతారు.

ఉదాహరణకు... 2014  సెప్టెంబర్‌ 25 తేదీన సూర్యోదయంలో(సుమారు 6 గంటలకి) జన్మించిన వ్యక్తి ఐతే, ఆ సమయానికి చంద్రుడున్న హస్త నక్షత్రం ఆ వ్యక్తి జన్మ నక్షత్రం, అలాగే చంద్రుడున్న రాశి కన్య ఆవ్యక్తి రాశి అవుతుంది. ఆ సమయంలో ఉదయిస్తున్న రాశి లగ్నము అవుతుంది. ఈ లగ్నాన్ని అనుసరించి జీవితంలోని స్వభావ, రోగ, వృత్తి, వివాహ, సంతాన, ప్రమాద మొదలైన అంశాలు నిర్ణయిస్తారు. గోచారానికి జాతకంతో ఉన్న సంబంధం ఒక వ్యక్తికి ఈ అంశాలకి సంబంధించిన పూర్తి సమాచారం అతని జాతకం చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాలాన్ని బట్టి వచ్చే మార్పులు పాప పుణ్యబలాల్ని సుఖ ఫలంగానూ దు:ఖ ఫలంగానూ చూపించే పట్టిక గోచారము. జాతకంలో ఉద్యోగంకానీ వివాహంగానీ యోగమున్నా గోచారంలో అనుకూల దశ లేకపోతే అవి వికటించవచ్చు. అలాంటప్పుడు పరిమితుల్లో ప్రవర్తనని ఉంచుకోవటం పుణ్యబలం పెంచుకోవటం అవసరం. అంటే జ్యోతిష జీవితాన్ని మార్చేది కాదు జీవితాన్ని సరిదిద్దుకునే సూచనలిచ్చేది అని తెలుసుకోవాలి.

కొన్ని ఉదాహరణలు... ఆదాయవ్యయాలు గమనించినప్పుడు.. వ్యయం ఎక్కువగా ఉన్నట్లైతే ఎలాగూ తప్పని ఖర్చు కనుక ఆ ఖర్చును పుణ్యకార్యాలకు ఖర్చుపెడితే మళ్లీ అది మనకు పుణ్యంరూపంలో ఉపయోగపడి కాపాడుతుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే పుణ్యకార్యాలతో పాటు స్థలాలు, ఇంటి నిర్మాణాలు మొదలైనవి కొనే ప్రయత్నం చేయటం మంచిది. భవిష్యత్ ఫలితాలను జాతకాదులలోని యోగావయోగాలతో పోల్చి చూసుకోవటం ద్వారా కాలాన్ని జీవితాన్ని సద్వినియోగంచేసుకోవచ్చు.

గోచార రీత్యా జన్మరాశి నుంచి 12 రాశులలో నవగ్రహములు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలు ఈ విధముగా ఉంటాయి.

సూర్యుడు
సూర్యుడు జన్మ రాశిలో సంచరింస్తున్నప్పుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును ౩ సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును.

చంద్రుడు
చంద్రుడు 12 రాశులలో సంచరింస్తున్నప్పుడు 1 భోజన సౌఖ్యమును 2 ధన క్షయమును ౩ ద్రవ్యలాభమును 4 విశేష రోగ భయమును 5 కార్య నాశనము 6 ధనరాబడిని 7 ద్రవ్య లాభమును 8 మరణ సమాన ఫలితములను 9 రాజ కోపమును 10 సౌఖ్యమును 11 లాభమును 12 ధన నష్టమును కలిగిస్తున్నాడు. 
       
కుజుడు
కుజుడు ద్వాదశ రాశులలో సంచరిస్తున్నప్పుడు 1 దుఃఖము 2 భాగ్య హాని ౩ సౌభాగ్యము 4 శత్రువుల వలన బాధలు 5 శత్రు భయము 6 ద్రవ్య సిద్ది 7 కార్య హాని 8 శస్త్రబాధ గాయములు ఏర్పడుట 9 ధన వ్యయము 10 దుఃఖ నాశనము 11 ధన యోగము 12 క్రూరత్వమును కలుగ జేయును.

బుధుడు 
బుధుడు 12 రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము ౩ శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును .

గురుడు 
గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .

శుక్రుడు 
శుక్రుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు 1 ఆరోగ్యము 2 అలంకారము ౩ లాభము 4 రతిసౌఖ్యము 5 మిత్రదర్శనము 6 మానహాని 7 విశేష రోగము 8 భూలాభము 9 ధాన్యవృద్ధి 10 ప్రమోదము 11 ధనము 12 సంతోషముల ను కలుగ జేయును .

శని   
శని 12 రాశులలో సంచారము చేయునపుడు 1 ఆపదలను 2 హానిని ౩ సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .

రాహు , కేతువులు 
రాహు కేతు గ్రహములు జన్మరాశి నుంచి 12 రాశులలో సంచరించు సమయమున 1 భయమును 2 కలహాలను ౩ సౌభాగ్యమును 4  మానహానిని 5 ధన నష్టములను 6 మహా సుఖములను 7 శత్రువుల వలన భయమును 8 చొర భయమును 9 శత్రు వృద్ధిని 10 ధన క్షయమును 11 శుభ ఫలములను 12 భ్రుత్యునాశనమును కలిగించుదురు .

*నిత్యా వసర శుభ ముహూర్తములు*

*దత్త స్వీకారమునకు* :- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి తిధులునూ,రోహిణి,పునర్వసు,పుష్యమి,ఉత్తర,హస్త,స్వాతి,అనూరాధ,ఉత్తరాషాడ,శ్రవణకము,ధనిష్ఠ,శతభిషము,ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్రములును,మేష,కర్కాటక,తుల,మకరము,వృషభ,సింహ,వృశ్చిక,కుంభ లగ్నములు శుభ దాయకము.ఉత్తరాయణము - పూర్వహ్నకాలము మంచిది.యజమాని అంటే దత్తత తండ్రికి దత్తత పుత్రునకు ఇద్దరికి తారాచంద్రబలములు సరిగా ఉండునట్లు చూడాలి.పుత్ర స్థానమగు పంచమ స్థానములో పాపులుండరాదు,పితృభాగ్యస్థానమగు నవమ స్థానము కూడ గ్రహములు బలీయముగా ఉండాలి.లగ్నమందు శుభగ్రహములు వుండాలి.లేదా కనీసము శుభగ్రహవీక్షణమైనను.ఉండాలి.బుధ,గురు,శుక్రావారములు శ్రేష్ఠములు.
*ద్వారంబధ స్థాపనము*
ద్వారబంధము స్థిరరాశులైన వృషభ,సింహ,వృశ్చిక,కుంభలగ్నములు ప్రశస్తములు.స్థిరనక్షత్రములగు ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరభాద్ర,రోహిణి నక్షత్రములు ప్రశస్తములు.చరలగ్నమైనను తులా లగ్నము ద్వారబంధస్థాపన చేయువచ్చునని కృష్ణ వాస్తు నందుతెలుపబడినది.
*ద్వారబంధ చక్ర వివరణము*
సూర్యడున్న నక్షత్రము లగాయితు మెుదటి
1,2,34, నక్షత్రమలు = రాజ్యసుఖము.
5,6,7,8,10,11,12, నక్షత్రములు = ఉద్యాసనము.
13,14,15,16,17,18,19,20. నక్షత్రములు = సంపద.
21,22,23. నక్షత్రములు = వరణము
24,25,26,27. నక్షత్రములు = సౌఖ్యము.
పైవిదముగా పరిశీలించి ద్వారబంధ స్థాపన గావించుకోవాలి.       *పథ్యము*:-స్థిరరాసులుత్తమంబలు గరిమ ్ ద్వారంబు నిలుపగా చరమైన ్ చరగతులు ద్విస్విభావము లరుదుగ దలుపులు ఘటింప ననువగు కృష్ణా (కృష్ణవాస్తు శాస్త్రము).
పైపద్యము స్థిరరాశులందు ద్వారబంధము నిలుపుట మంచిది.ద్వాస్వభావరాశులైన మిధున,కన్య,ధనస్సు,మీనలగ్నములందు తలుపు అమర్చుకోవాలి.తలుపులు అమర్చుటకు చరనక్షత్రములైన స్వాతి,పునర్వసు,శ్రవణ,ధనిష్ఠ,శతభిషా నక్షత్రములు ప్రశస్తము.సామాన్యముహూర్తములకు తిథి,వార,నక్షత్ర బలములు గ్రహించినచో చాలును.
*వ్యాపార ప్రారంభమునకు* :- సోమ,బుధ,గురు,శుక్రావారములు ప్రశస్తములు.విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమ తిధులు ప్రశస్తములు.ముఖ్యముగా వృషభ,మిధున,కర్కాటక,కన్య,తుల,ధనస్సు,మీన లగ్నములు శ్రేయెాదాయకము.
*కొనుగోలు నక్షత్రములు* :- వ్యాపారమునకు ఇచ్చిపుచ్చు కొనుటకు మంచి నక్షత్రములు.శ్రవణము,ధనిష్ఠ,శతభిషము,హస్త,చిత్త,స్వాతి,పుష్యమి,పునర్వసు,మృగశిర,అశ్వని,రేవతి,,అనూరాధ నక్షత్రములు ధనము ఇచ్చుటకు,భూమి,వగైరా కొనుటకు మంచిది.
*చేతినుండి పోయిన వస్తువు,అప్పు పెట్టిన ధనము,వగైరాలు తిరిగి చేతికి రాని నక్షత్రములు* :- ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,పుబ్బ,పూర్వాషాడ,పూర్వాభాద్ర,విశాఖ,రోహిణి,కృత్తిక,మఖ,ఆర్ద్ర,భరణి,ఆశ్రేష,మూల, ఈ నక్షత్రములలో దొంగిలించిబడిన వస్తువు,తాకట్టు పెట్టిన వస్తువు,పాతిపెట్టిన వస్తువు,అప్పు ఇచ్చిన ధనము తిరిగిచేతికిరావు.
మంగళవారమందు,సూర్య సంక్రమణదినమందు,హస్త నక్షత్రములో కూడిన ఆదివారమందు ఎవరి వద్ద అప్పు పుచ్చుకొనరాదు.అతని జీవితములో అప్పు తీరదు.
బుధవారము అప్పులు ఇవ్వరాదు.
ముఖ్యముగా వ్యాపారలగ్నమునకు ధనస్థానముగు ద్వితీయమున శుభగ్రహములు,1,5,9, శుభగ్రహములు,ఆరవశుద్ధి,11వ స్థానమున శుభగ్రహములున్న సంక్రమ సంపాదన,పాపగ్రహములున్న అక్రమసంపాదనలు వచ్చును.దస్రారంబాదులకు సహితము గ్రహబలము ప్రాముఖ్యమని గుర్తింపగలరు.
స్వాతి,పునర్వసు,మృగశిర,రేవతి,చిత్త,అనూరాధ,పుష్యమి,శ్రవణము,ధనిష్ఠ,శతభిషము,అశ్వని, నక్షత్రములందునూ,చరలగ్నములైన,మేష,కర్కాటక,తుల,మకరలగ్నములందు అప్పుఇచ్చుకోవాలి.అష్టమ శుద్దికూడా యుండునట్లు చూడాలి.ఫైనాన్స్ షాపులవారు పై నియమములను జాగ్రత్తపాటింప గోరుచున్నాను. *వివాహ నిశ్చయ తాంబూలములకు* :- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,తిథులు ఉభయపక్షములలోను శుక్ల పక్షములో ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమతిధులునూ,ఆది,బుధ,గురు,శనివారములును,శుభయుత లగ్నములు మంచివి.లగ్నాది 5,9 స్థానములందు పాపగ్రహములు లేకుండగను,శుభగ్రహ సంబంధముండునప్పుడు వివాహ నిశ్చయ తాంబూలములను స్వీకరించ వలయును.
*పెండ్లికూతురు,పెండ్లికుమారుని చేయుటకు*:- శుభతిధులతో కూడిన ఆది,బుధ,గురు,శనివారములలో పునర్వసు,పుష్యమి,అశ్వని,అనూరాధ,హస్త,చిత్త,స్వాతి,శ్రవణము,ధనిష్ఠ నక్షత్రములు మంచివి.పూర్వహ్నకాలము శ్రేయెాదాయకము.లగ్నది 5,9 స్థానములు శుద్ధికల్లిఉండాలి.సోమ,మంగళ వారములందు పెండ్లి కూతురును,పెండ్లికుమారుడుని చేయరాదు.పసుపుకొమ్ములను కొట్టరాదు.
సింహరాశియందు గురువు సంచరించు కాలమందు వివాహది శుభకార్యములు చేయరాదు.తోకచుక్క,భూకంపము,సూర్య,చంద్ర గ్రహణము వచ్చిన తరువాత 7 రోజులవరకు శుభకార్యములు చేయరాదు.
*పునర్వివాహము*:- భర్య మరణించినను,ఎడబాటు జరిగినను మరొకసారి వివాహము చేసుకొనుటనే పునర్వివాహము అందురు.చనిపోయిన భార్యయెుక్కసంతానము జీవించియున్న బేసిమాసము ,బేసిసంవత్సరము లందును,సంతానములేనివారు సరిసంవత్సరము,సరిమాసములందువివాహము జరుపుకోవాలి.
*వివాహ సూదకములు*:- తండ్రి మరణించిన 1 సంవత్సరకాలము,తల్లిమరణించిన 6 మాసములు,భార్య మరణించిన 3 మాసములు,పుత్రలుగాని,సోదరులుగాని మరణించిన1 1/2మాసములు,వారసులు మరణించిన 1 నెల రోజులు విడచిన తరువాత శుభముహూర్తమున వివాహము గావించుకోవాలి.
*పెండ్లికుమారై - ఆచారములు* :- పెండ్లికుమారై వివాహమైన మెుదటి సం" అత్తవారిఇంట జ్యేష్ఠమాసములో యున్న బావగార్కి,పుష్యమాసములో యున్న మామగార్కి,అధికమాసములో భర్తకు,క్షయమాసములోతనకు కీడుకలుగును.ఆషాడమాసములో అత్తవారింట ఉన్న అత్తగార్కి కీడు.చైత్రమాసములో పుట్టింట ఉన్న తండ్రికి కీడు.ముఖ్యముగా లోకాచారముగా ఆషాడ మాసము మాత్రమే ఆచరణలో ఉన్నది
*నవవధూ ప్రవేశము* :- పెండ్లి అయిన 6 వరోజునుండి 16 వరోజులలోపల గృహప్రవేశము చేయువారికి తిథివార నక్షత్రాదులతో వనిలేదు.అనంతరమైన బేసి మాసములు,బేసి సంవత్సరములు శుభదాయకము.విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమ,తిధులనూ,సోమ,బుధ,శనివారములును,అశ్వని,రోహిణి,మృగశిర,పుష్యమి,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,శ్రవణ,మఖ,మూల,పునర్వసు,జ్యేష్ఠ,ధనిష్ఠ,రేవతి,నక్షత్రములునూ,వృషభ,మిధున,కర్కాటక,సింహ,వృశ్చిక,ధనస్సు,కంభ,మీనలగ్నములుమంచివి.లగ్నమునకు ద్వాదశ శుద్ధి ఉండాలి.                  *గర్భవతి స్త్రీని పురిటికి తెచ్చుటకు* :- పంచాంగా శుద్ధి అంటే తిథి ,వారము ,నక్షత్రము కరణము,మంచిగా ఉండుట.పంచాంగశుద్ధి గల దినములన 7వ నెలలోగాని,9వ నెలలోగాని అత్తవారి ఇంటినుండి పుట్టింటికి పురిటికి తీసుకొనిరావాలి.మెుదటి రెండు పురుళ్ళు పుట్టింట,మూడవ పురుడు అత్తవారింట పోయవలయును.
*బాలింత స్నానమునకు* :- పురుడయిన 11వరోజున చేయించవలయును.అట్లు సాధ్యపడనివారు ఆది,సోమ,బుధ,గురు,శుక్ర,శనివారములనూ,అశ్వని,రోహిణి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,స్వాతి,అనూరాధ,రేవతి నక్షత్రములలో బాలెంతలకు స్నానము చేయించాలి.
*వెండి,బంగారు,పాత్రలు వాడుటకు* :- బుధ,గురు,శుక్రవారములనూ,శుభ తిధులందునూ,అమృతయెాగకాలమందు,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,హస్త,చిత్త,స్వాతి,శ్రవణ,ధనిష్ఠ,శతభిష,రేవతి,పుష్యమి,అనూరాధ,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర, నక్షత్రములతోకూడి శుభయుత లగ్నములందు వెండి,బంగారు పాత్రలు వాడుటకు మంచివి.
*మంచమునకు నులక,నవ్వారీ అల్లుటకు*:- అదివారము లాభము,సోమవారము సుఖము,మంగళవారము అగ్నికిదగ్ధం,జ్వరపీడ,బుధవారము రోగము,గురువారము పుత్రలాభము,శుక్రవారము సౌఖ్యము,శనివారము మరణ కలుగును.
*మంచములు కుర్చీలు వాడుటకు* :- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి తిధులనూ,బుధ,గురు,శుక్రవారములును,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,అనూరాధ,శ్రవణము,రేవతి నక్షత్రములందు కొత్త కలపవస్తువులు ఉపయెాగించుటకు శుభము.
*శిశువును ఊయలలో పరుండబెట్టుటకు*:- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి తిథులందునూ,సోమ,బుధ,గురు,శుక్రవారము లందునూ,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,అనూరాధ,రేవతి నక్షత్రములు శుభదాయకములు.వృషభ,మిధున,కర్కాటక,కన్య,తుల,ధనస్సు,మీనలగ్నములు శుభదాయకములు.ముఖ్యముగా లగ్నమునకు అష్టమశుద్ధి ఉండవలయును.వర్జ్యములు,దుర్ముహూర్తములు లేనికాలము మంచిది.1,3,5 మాసములు మంచివి.ముఖ్యముగా 11వ రోజుగాని,21వ రోజుగాని,29 వ రోజుగాని ముహుర్త నిర్ణయము చేసి పెద్ద ముత్తైదువుతోగాని,శిశువుయెుక్క తల్లితోగాని శిశువు శిరస్సు తూర్పు దిక్కుగా ఉండునట్లు చూచి శిశువును ఊయలలో పరుండబెట్టవలయును.
*బాలెంతరాలు నూతిలో చేద వేయుటకు*:- శుభ తిధులందు,సోమ,బుధ,గురు,శుక్రవారములును,పునర్వసు,పుష్యమి,హస్త,మృగశిర,మూల,అనూరాధ,శ్రవణ నక్షత్రములును కలువ చూచి ప్రసవానంతరము 21,23,25,27,29వ రోజులలో బాలెంతరాలుచేత జలపూజ చేయించి నూతిలో నీరు తోడించవలయును.
*పండ్లదుకాణముల ప్రారంభమునకు* :- రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,శ్రవణము,ధనిష్ఠ,పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్రములును,సోమ,బుధ,గురు,శుక్రవారములు.శుభగ్రహయుత లగ్నములు శ్రేయెాదాయకము.
*స్త్రీలు క్రొత్తకాటుక వాడుటకు* :- ఆది,శుక్ర,శనివారములును,అశ్వని,చిత్త,స్వాతి,విశాఖ,అనూరాధ,ధనిష్ఠ,రేవతి నక్షత్రములందు పూర్వాహ్నకాలమందు శుభదాయకము.
*స్త్రీలు ఆభరణములు ధరించుటకు* :- అశ్వని,హస్త,చిత్త,స్వాతి,విశాఖ,అనూరాధ,ధనిష్ఠ,రేవతి నక్షత్రములు,బుధ,గురు,శుక్రవారములందు ఉదయకాలమున వెండి,బంగారు నగలు మరియు రత్నాభరణములు,నూతన వస్త్రములు ధరించుటకు మంచిది.
*ఆభరణములు ధరించరాని నక్షత్రములు* :- రోహిణి పునర్వసు.పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర నక్షత్రములందును,మంగళవారమునందు సౌభాగ్యవతియగు స్త్రీ నూతన వస్త్రములు,భూషణములు ధరించకూడదు.శనివారము దొంగభయము,సోమవారము మన్నికగా ఉండదు.
*శిశువును ఇల్లు కదుపుటకు* :- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి తిధులునూ,అశ్వని,రోహిణి,పునర్వసు,పుష్యమి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,అనూరాధ,శ్రవణము,ధనిష్ఠ,శతభిషము,రేవతి నక్షత్రములు,మేష,వృషభ,కర్కాటక,తుల,ధనస్సు,మీన లగ్నములు,సోమ,బుధ గురు,శుక్రవారములు శుభదాయకము.
*శిశువునకు నేలపై కూర్చుండ బెట్టుటకు* :- 1 1/4 మానెడు ధాన్యము రాశిగా పోసి దానిపైనూతన వస్త్రమువేసి 5వ నెలలో శిశువపను దానిపై కూర్చుండబెట్టవలయును.పెద్దలచే ఆశీర్వాదము చేయించవలయును.
శుభతిధులతో కూడిన అశ్వని,మృగశిర,పుష్యమి,జ్యేష్ఠ నక్షత్రములును,సోమ,బుధ,గురు,శుక్రవారములు శ్రేయెాదాయకము.
*శిశువుకు సూర్యచంద్రల దర్శనము* :- శిశువు జన్మించిన 3వ నెలలో మంచి తిథి వార నక్షత్రములలో శిశువుకు సూర్య చంద్రులను  చూపాలి.
శుక్లపక్షములో ప్రాతః కాలమున సూర్యుని చూపాలి.శుక్లపక్షమున రాత్రి మెుదటి జాములో చంద్రదర్శనము చూపాలి.ముఖ్యముగా తొలిసారి క్షీణచంద్రుని,అస్తమిస్తున్న సూర్యుని చూపరాదు.
*కన్యలకు ముక్కుకుట్టుటకు* :- అశ్వని,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,స్వాతి,శ్రవణ,ధనిష్ఠ,శతభిషము,రేవతి నక్షత్రములను,శుక్లపక్షమున శుభతిథులందు ముక్కు కుట్టవలయును.
*ఉద్యోగములో చేరుటకు* :- అశ్వని,హస్త,పుష్యమి,మృగశిర,చిత్త,అనూరాధ,రేవతి నక్షత్రములును,బుధ,గురు,శుక్రవారములును,రవి,కుజులు 10,11స్థానము లందున్నప్పుడు చేరురుట మంచిది అట్లాగే గుమస్తాలను చేర్చుకొనువారు కూడా ఈ నియమములను పాటించుట మంచిది.
*పరుండుటకు మంచి దికికులు* :-దక్షిణ శిరస్సు ధనలాభము,పడమర శిరస్సు సంపద,తూర్పు శిరస్సు సుఖము,ఉత్తర శిరస్సు హానికల్లించును.పరాయి ఇంట్లో పడమర,తన ఇంట్లో దక్షిణము శిరస్సు శ్రేయెాదాయకమని పెద్దల నానుడి.
*భోజన విధికి* :- తూర్పుముఖముగా కూర్చుని భుజించిన దీర్ఘాయువు,దక్షిణమున కీర్త,పడమర భాగ్యవృద్ధి,ఉత్తర జ్ఞానము కలుగును.
*నెల పురుడు* :- మగ పిల్ల పుట్టిన 30 దినములు,ఆడపిల్లలు పుట్టిన 40 దినములు నెల పురుడు ఉండును.
*ఔషధము సేవించుటకు* :-4,6,8,13,30 తిధులు కూడదు.మిగతా తిధులలో ఆది,సోమ,గురువారములు,రేవతి,అశ్వని,పునర్వసు,హస్త,శ్రమణము,ధనిష్ఠ,అనూరాధ,మృగశిర నక్షత్రములు శుభదాయకములు.
*పెండ్లిపీట* :- పెండ్లిపీట 6 అంగుళములు ఎత్తు,37 అంగుళములు పొడవు 5 అంగుళముల వెడల్పు కల్గి ఉండవలెను.
*శస్త్రచికిత్సలకు* :- శస్త్రచికిత్స చేయుటకు శుక్లపక్షము మంచిది.పూర్ణిమ తిధియందు అపరేషన్ చేయరాదు.మంగళ,శనివారములు,చవితి,నవమి,శుద్ద,చతుర్ధశి తిధులందు,ఆర్ధ్ర,జ్యేష్ఠ,అశ్రేష,మూల నక్షత్రములందు మంచిది.లగ్నమునకు అష్టమశుద్ధి కల్గిఉండవలయును.కుజుడు బలవంతుడై ఉండగా శస్త్ర చికిత్స చేయించ వలయును.చంద్రుడు జన్మరాశియందున్నప్పుడు,పాపగ్రహక్రాంత యున్నప్పుడు,చంద్రస్థిత నక్షత్రమునకు పాపగ్రహక్రాంత యున్నప్పుడు ప్రారంభించరాదు.            *ఇంట మెుండిచెయ్యి మెులుచుట* :- ఇంటిలో పుట్టే ఒకరకమైన పుట్టలను మెుండిచెయ్యిపుట్టింది అటారు.వీటిలో రెండురకములు.నలుపురంగు కలది.రామహస్తము,ఎఱుపురందుకలది రావణహస్తము,రామహస్తము మేలు,రావణ హస్తము కీడుగా గుర్తించేది.ఈశాన్య ఉత్తర దిశలలో మెులచిన భార్యకు కీడు,వాయవ్యము పశుహని,పడమర మృత్యవు,నైరుతి సంతానహాని,ఆగ్నేయము అగ్నిభయము,దక్షిణము దురదృష్టము తూర్పు యజమానికి కీడుగా గుర్తంచి వెంటనే తొలగించుకోవాలి.శక్తిచాలనివారు పురోహితులతో శాంతులు చేసుకోవాలి.
*క్రొత్త వాహనములు వాడుట మెుదలిడుటకు*:- విదియ,తదియ,పంచమి,సత్తమి,ఉభయ పక్షములందును,శుక్లపక్ష ఏకాదశి,త్రయెాదశి తిధులు మంచివి.సోమ,బుధ,గురు,శుక్రవారములు మంచివి.రోహిణి,పునర్వసు,పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,జ్యేష్ఠ,శ్రవణ,రేవతి తారలు మంచివి.ముఖ్యముగా లగ్నమునకు అష్టమ శుద్ధికల్గి ఉండవలయును.
*యజ్ఞోపవీతధారణము* :- శ్రావణ పౌర్ణమినాడు,గ్రహణము విడిచిన తరువాత,పురిటిమైలకు శుద్ది అయిన తరువాత పాత యజ్ఞోపవీతమును త్యజించి క్రొత్త యజ్ఞోపవీతమును ధరించాలి.
*యజమాని సేవకులకు అచ్చుబాటు* :-యజమాని యెుక్కనామ నక్షత్రము లగాయితు సేవవకుని యెుక్క నామనక్షత్రము వరకు లెక్కించి ఆసంఖ్యను 4చే గుణించి దానిని 7చే భాగింపగా మిగిలిన సంఖ్య ధనమగును.సేవకుని నామనక్షత్రము నుండి యజమాని నామనక్షత్రము వరకు లెక్కించి 4చే గుణించి 7చే భాగింపగా మిగిలిన సంఖ్య ఋణమగును.ధనము  హెచ్చుగా ఉన్నమేలు.ఋణము హెచ్చుగా ఉన్న కీడు కలుగును.
*సర్వకార్యములకు విడువ వలసినవి* :-సర్వకార్యములకు జన్మనక్షత్రములు,జన్మమాసము,జన్మతిధి,వ్యతీపాతయెాగములు,భద్రవకరణములు,వైధృతియెాగములు,అమావాస్య,మాతపిత మరణదనమునాటి తిధి,క్షయవృద్ధితిధి అధికమాసము,పాత,సూర్యచంద్రల సంక్రాంతి,విష్కంభము,వజ్రము,పరిఘాయెాగము,శాల,అతిగండ,వ్యాఘాతయెాగ దినములు.
*సకేశ విధవస్త్రీని పరామర్శ* :- వర్జ్యము,దుర్ముహూర్తములు,పంచపర్వములు,మంగళ,గురు,శుక్రవారములు వదలి మిగిలి కాలమందు కేశఖండన చేయని స్త్రీని తాను భుజించిన తరువాత వెళ్ళి పరామర్శించవచ్చును.ఇందు విషయములో ద్విపాద,త్రిపాద నక్షత్రములను విచక్షణ చేయవలయును.
*కేశఖండన చేసిన విధవస్త్రీని పరామర్శ* :- జుట్టు కత్తిరించిన విధవాస్త్రీని ద్విపాద,త్రిపాద,ధనిష్ఠాపంచక నక్షత్రములందు చూడరాదు.
అనుకొనని రీతిలో చూచిన పక్షములో వెంటనే సూర్యదర్శనము చేసుకోవాలి.మబ్బులు పట్టి కానరానిచో సూర్యభగవానుని స్మరించుకోవాలి.
రాత్రికాలములో అయిన అగ్న దర్శనము,దీపము చూడాలి,సాధ్యపడనిచో అట్టివానిని స్మరించాలి.                 🙏🙏🙏🙏🙏