మానవుడి జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ.. వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి జన్మ సమయానికి రాశిచక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే గోచరించవు. జాతక చక్రాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. జన్మ సమయానికి 40 రోజులు ముందు నుంచి ఉన్న గ్రహస్థితులను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
రాశిచక్రంలో కంటికి కనపడే దోషాలను దృష్ట దోషాలు అంటారు. కంటికి కనపడని దోషాలను అదృష్ట దోషాలు అంటారు. ఈ దోషాలు పితరుల నుంచి సంక్రమిస్తుంటాయి. ఈ పరంపరలో అదృష్ట దోషాలు మొదటి భాగాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.
ఓ వ్యక్తి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడా కనిపించకపోయినప్పటికీ.. తొలి వివాహం దెబ్బతిని విడాకులు తీసుకున్నారు. అయితే, ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది..? ఇలాంటి సందర్భాలలో కేవలం దోషమనేది వివాహ స్థానంలోనే ఉంటుందని కాదు. ఆ దోషాన్ని ఇచ్చే గ్రహ స్థితులు, జాతకంలో మరో స్థానంలో ఉండి, పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపి ఉంటుంది.
కొందరికి ఇంటి నిండా ధనం ఉన్నా.. తెలియని ఆవేదన, అశాంతి వెంటాడుతూనే ఉంటాయి. ఇంకొంత మందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉన్నప్పటికీ, తనివితీరా భోజనం చేయటానికి అనారోగ్యం అడ్డుపడుతుంటుంది.
ఇంక కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ధన సంపద ఎంత ఉన్నప్పటికీ, సదరు కుటుంబంలో అధికులకు వివాహం కాకుండా వుండటం లేదా సంతానం కలగకుండా ఉండిపోవటం కనిపిస్తుంది. అంతేకాదు నయం చేయలేని వ్యాధులు కూడా వెంటాడుతాయి. అంగవైకల్యంతో బాధ పడటం గానీ, వంశ పారంపర్యంగా వస్తున్నదన్నట్లుగా కనుచూపు తగ్గిపోవటం, చిన్న వయసులోనే బట్టతల రావడం, మూగవారుగా ఉండిపోవటం గాని, కేసుల్లో చిక్కుకోవడం... ఇలా ఎన్నో అనర్ధాలు ఎదురవుతుంటాయి.
ఈ సమస్యలు ఏ దోషాల వలన వస్తాయన్నది చాలా స్పష్టంగా పరిశీలించాల్సి ఉంటుంది. అవి జాతకాలలో అంతర్లీనంగా ఉంటుంటాయి కనుక వాటి గురించి పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు జ్యోతిష్య తాళపత్రాల గ్రంధాల్లో స్పష్టమవుతాయి. అలాంటి జాతకాలలో దాగి ఉన్న దోషాలను తెలుసుకొని, వాటి పరిహారాలను క్రమబద్దంగా, శాస్త్రీయంగా పాటించగలిగినప్పుడే.. మనకు పరిపూర్ణమైన ప్రశాంతత చేకూరుతుంది.
ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాతక పరమైన దోషం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మాత్రమే పరిహారం పాటిస్తూ ఉంటే.. జీవితం సంతోషమయంగా ఉంటుంది. అలా కాక ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పరిహారం పాటిస్తే, ఫలితాలు సజావుగా ఉండవు.
వ్యాధి ఒకటి ఉంటే దానికి సంబంధం లేని మాత్ర ఇంకొకటి వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు. అలాగే జాతక దోషాలకు ఏదో ఒక రీతిలో పరిహారాలు చేయడం వల్ల కూడా ఎలాంటి శుభ ఫలితం ఉండదు. జాతక చక్రం ప్రకారం ఖచ్చితంగా ఆచరించాల్సిన కర్మలను విసర్జించడం తగదు. నిత్య యాంత్రిక జీవనంలో సమయాభావం వలన ఆచరించాల్సిన కర్మలను ఆచరించలేక, తేలికపాటి అంశంతోనే చాలా మంది తూతూ మంత్రంగా చేయి దులుపుకుంటున్నారు. ఈ కారణం వల్లే నిత్యంసమస్యలు, మానసిక వత్తిడులు, చెప్పుకోలేని కష్టాలు ఎదురవుతున్నాయి.
జాతక చక్రంలోని 12 భావాలలో కనపడని దోష స్థితులు వేరు వేరు రకాలుగా కనపడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ, దోష పరిహారం కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటుండాలి. మరికొన్ని దోషాలకు ఉపశమనంగా చేసే పరిహారాలు కొంతకాలం వరకే ఆచరించాల్సి ఉంటుంది. మరికొన్ని దోషాలకు అతి దీర్ఘ కాలం పరిహారాలు ఆచరిస్తూ ఉండాలి.
No comments:
Post a Comment