ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధమైనవి. భగవంతుడి దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మొదటిదైన మత్సా్యవతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు.
బ్రహ్మకు ఒక పగలు, అంటే- వేయి మహాయుగాలు గడిస్తే… ఆయన సృష్టిని ఆపి నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పుడు ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనమవుతుందంటారు. దీన్ని *నైమిత్తిక* ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మరల యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడంటారు. దీనికి *‘కల్పం’* అని పేరు.
వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో *సత్యవ్రతుడనే* రాజు ఉండేవాడు. అతడు *ధర్మాత్ముడు.* విష్ణుభక్తుడు. ఒకసారి అతడు కృతమాలానదికి వెళ్లి స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుండగా దోసిట్లో చేపపిల్ల పడింది. రాజు దాన్ని నీటిలోకి జారవిడిచాడు. మళ్ళీ నీటిని తీస్తున్నప్పుడు చేప చేతిలోనికి వచ్చి ‘రాజా! నన్ను పెద్దచేపలు తినివేస్తాయి. రక్షించు’ అని కోరింది. రాజు దాన్ని ఒక పాత్రలో వేశాడు. మర్నాటికి ఆ చేప, పాత్ర పట్టనంత పెద్దదైంది. అప్పుడు చెరువులో విడిచాడు. మర్నాటికి చెరువు కూడా పట్టలేదు. అప్పుడు రాజు దాన్ని సముద్రంలో వదిలాడు. ఆ మత్స్యం శతయోజన ప్రమాణానికి విస్తరించింది. తాను శ్రీమన్నారాయణుడినని, నాటికి ఏడు రోజుల్లో ప్రళయం రానున్నదని, సర్వజీవరాసులు నశించిపోతాయని, ఈ లోకమంతా మహాసాగరమవుతుందని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి, దానిలో పునఃసృష్టికి అవసరమైన ఓషధులు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తర్షులు కూడా ఆ నావలోకి రాగలరని చెప్పింది. మీనరూపుడైన నారాయణుడు తన కొమ్ముకు మహాసర్పరూపమైన తాటితో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యయోగ క్రియాసహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యుడికి శ్రద్ధదేవుడిగా జన్మించి *‘వైవస్వత మనువు*’గా ప్రసిద్ధికెక్కాడు.
బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురయ్యాయి. పరమేష్ఠి నిద్రావస్థలో ఉన్నప్పుడు సోమకాసురుడు నాలుగు వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలోకి వెళ్లిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ధ్యానించగా ఆయన మత్స్యరూపంలో జలనిధిని అన్వేషించి సోమకుడితో పోరాడి ఆ రాక్షసుడి కడుపుచీల్చి వేదాలను, దక్షిణావర్త శంఖాన్ని తీసుకుని బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను గ్రహించాడు. శిథిలమైన వేదభాగాలను పూరించమని బ్రహ్మను ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యాయవతారం.
వేదాలను అపహరించడమంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకారశక్తిని తనలో లయం చేయడమని సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృష్టికార్య ప్రతిబంధరూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందడమే వేదాలు మరల గ్రహించడమని తత్వార్థం. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి.
*మత్స్యజయంతి సందర్భంగా పఠించవలసిన మత్స్యావతార స్తోత్రం :
*నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణోవ్యయః|*
*అనుగ్రహాయ భూతానాం ధత్తె రూపం జలౌకసామ్ |*
*నమస్తే పురుషశ్రేష్ఠ! స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర |*
*భక్తానాం నః ప్రపనానాం ముఖ్యొహ్యాత్మగతిర్విభో*
*సర్వే లీలావతారాస్తె భూతానాం భూతిహెతవః|*
*జ్ఞాతుమిచ్ఛామ్యదొ రూపం యథార్థం భవతా వృతమ్*
*న తేరవిన్దాక్ష పదోపసర్పణం మృషా భవేత్ సర్వసుహృత్ప్రియాత్మనః|*
*యథెతరెషాం పృథగాత్మనాం సతా మదీదృశొ యద్వపురద్భుతం హి నః*
thank you so much. please share with friends and family. Hari Om.
ReplyDelete