రాహువు స్త్రీ గ్రహం.ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది. రాహువు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ మూడు నక్షత్ర జాతకులకు మొదటి దశ రాహుదశా శేషంతో ప్రారంభం ఔతుంది. రాహు దశాకాలం పద్దెనిమిది సంవత్సరాలు. సాధారణంగా రాహుదశాకాలంలో మనిషి జీవితంలో ఒడి దుడుకులు అధికం. కాని కొన్ని నక్షత్రాలకు కొంత వెసులు బాటు ఉంటుంది. రాహువుకు రాశిచక్రంలో ఇల్లు లేదు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితి పొందుతాడు. రాహువు వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. కొన్ని ప్రాచీన గ్రంథాలలో జ్యోతిహ శాస్త్ర రాహువు ప్రస్తావన లేదు. కాని ఆధునిక శాస్త్రంలో రాహువుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. అందుకనే రాహువుకు విషముతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడూ రోదశీలో ఉండే సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేస్తాడు కనుక కల్పనా జగత్తుకు ప్రతీకగా జ్యోతిష పండుతులు విశ్వసిస్తారు. కళాకారుల జీవితంలో రాహువు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష శాత్ర పండితులు విశ్వసిస్తారు.
*గుణగణాలు*
రాహువు తమోగుణ ప్రధానుడు, గ్రహ సంఖ్య రెండు, అధిదేవత గౌరి, ముసలి వారిని సూచిస్తాడు. బుధుడు, శుక్రుడు, శని మిత్రులు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రువులు. గురువు సముడు. స్వక్షేత్రం కుంభం, శత్రు క్షేత్రం సింహం, మిత్ర క్షేత్రం తుల. అసుర, బహి, స్వర్భాను, తమస అనేవి ఇతర నామాలు. జాతి మ్లేచ్ఛ, స్వాభావము క్రూరము, రుచులలో పులుపును సూచిస్తాడు. ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. దిక్కు నైరుతి, పాలనా శక్తి భటుడు, ఆత్మాధికారం కష్టాలు, లోహము సీసం, గృహ స్థానం ఉపయోగంలో లేని ప్రదేశం, గ్రహపీడ సంతాన లేమి, గ్రహం రాశిలో ఉండే కాలం ఒకటిన్నర సంవత్సరం. వృక్షము పొదలు, ఆహార పదార్ధాలు మినుములు, ఖర్జూరం, ఆవాలు. జంతువులు ఏనుగు, పాములు అడవి ఎలుకలు. వస్తువు గొడుగు, సమిధ దుర్వ, మూలిక చందనం, దేవ వర్గం శైవ, అవతారం వరాహావతారం.
*కారకత్వం*
రాహువు పితామహుడు (తాత), వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ, వాయువు, విచారము, జూదము, కఫము, సంధ్యా సమయం, బయట ప్రదేశం, గొడుగు, పల్లకి, అపరి శుభ్రం, గొడుగు, పల్లకి, విమర్శ, అంటరాని తనం, నల్లులు, దోమలు, గుడ్లగూబలు, విషకీటకములను సూచిస్తాడు.
*వృత్తులు* :- విషసంబంధిత రథథసాయనాల తయారీ సంస్థలు, పాములు పట్టుట, భూతవైద్యము, శ్మశానంలో పని చేయుట, నాగ పూజ, దొంగతనం, వైద్య శాస్త్రం, గారడీ విద్యలు. శుక్రుడితో కలిసి ఉంటే సినీరంగం, నాటక రంగం, అడ్వర్టైజ్ మెంటు రంగం, బుధుడితో చేరిన రచయిత, గారడీ విద్య, శనితో చేరిన మోసపూరిత జీవితం, గురువుతో కలిసిన కపట గురువు మొదలైనవి. జైళ్ళు, క్రిమినల్ కోర్ట్లో ఉద్యోగాలు, ఎలెక్ట్రిక్‌సిటీ, ఆటోమొబైల్స్, గ్యాస్, ఇనుము, నిప్పుకు సంబంధించిన వృత్తులు. అగ్నిమాపక దళ వృత్తులను సూచిస్తాడు.
వ్యాధులు :- నులి పురుగులు, గుల్మ రోగం, అంతు చిక్కని రోగాలు మొదలైనవి. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆయాగ్రహ సంబంధిత రోగాలను ఇస్తాడు.
విద్యలు :- రాహువు ఏగ్రహముతో చేరిన ఆగ్రహ సంబంధిత విద్యలనుసూచించును *రూపము*
రాహువు క్రూర రూపము కలవాడు, పొడగరి, నల్లని మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు గలవాడు. కత్తి, త్రిశూలమును ధరించి కవచ ధారణ చేసి ఉంటాడు. సింహాన్ని అధిరోహించి ఉంటాడు. తండ్రి కశ్యపుడు, తల్లి సింహిక, భార్య కరాళ. పార్ధివ నామ సంవత్సరం బాధ్రపద శుక్ల పూర్నిమ నాడు పూర్వాభద్రా నక్షత్రములో జన్మించాడు. రాహువు క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి మోహినీ చేతి అమృతపానం చేసాడు. దానిని సూర్య, చంద్రులు విష్ణుమూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుండి వేరు చేయడంతో పాము శరీరం పొందాడు. విష్ణుమూర్తి అతడిని అనుగ్రహించి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడని పురాణ కథనం వివరిస్తుంది. రాహువు రాక్షస నామ సంవత్సరం మాఘ కృష్ణ చతుర్ధశి ఆశ్లేష నక్షత్రంలో గ్రహజన్మను ఎత్తాడు.
*రాహుకాలం*
రాహు కాలం వారంలో ప్రతి రోజు ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆంటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆసమయంలో చేయరు. కాని దోష నివారణ కొరకు రాహుకాలంలో పూజలు నిర్వహిస్తారు. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మడిప్పలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఆది వారం సాయంత్రం 4 1/2 (నాలుగున్నర ) గంటల నుండి 6 గంటల వరకు, సోమ వారం ఉదయం 71/2 (ఏడున్నర) 9 వరకు, మంగళ వారం 3 గంటల నుండి 41/2 (నాలుగున్నర) గంటల వరకు, బుధ వారం 12 గంటల నుండి 11/2 (ఒకటిన్నర), గురువారం 1/2 గంటల నుండి 3 గంటల వరకు, శుక్ర వారం 10 1/2 గంటల నుండి 12 గంటల వరకు, శని వారం 9 గంటల నుండి 101/2 గంటల వరకు రాహుకాలం ఉంటుంది.
*పరిహారం*
రాహువును శాంతింప చేయడానికి చేయవలసిన పరిహార విధులు. ప్రతిమకు కావలసిన లోహము సీసం, ప్రతిమకు పూజకు గ్రహ ఆసనం చేట, సమిధ దూర్వ, నైవేద్యం మినప సున్ని, మినప గారెలు, ఖర్జూరం, చేయవలసిన పూజ అధిష్టాన దేవత అయిన సరస్వతి పూజ, దుర్గా పూజ, సుభ్రహ్మణ్య స్వామి పూజ, శివారాధన, రాహుకాలంలో దుర్గకు నిమ్మకాయ దీపం పెట్టడం. ఇది దేవాలయంలో దుర్గాదేవి సన్నిధిలో చేయాలి. ఇంట్లో అయితే నేతి దీపం పెట్టాలి.ఆచరించ వలసిన వ్రతం సరస్వతి వ్రతం, రాహువుకు ప్రియమైన తిథి చైత్ర బహుళ ద్వారశి, పారాయణ చేయవలసినవి రాహు అష్టోత్తరం, లలితా సహస్రనామం, ఆచరించవలసిన దీక్ష భవానీ దీక్ష, ధరించవలసిన మాల రుద్రాక్ష మాల, అష్టముఖ రుద్రాక్ష, రత్నము గోమేధికము, దర్శించవలసిన దేవాలయములు సరస్వతి, దుర్గ, సుభ్రహ్మణ్య స్వామి దేవాలయం, శివాలయాలు, నవగ్రహాలయాలు. దానం చెయ్యవలసినవి ఎండు ద్రాక్ష, తేనె, ఖర్జూరములు. చేయవలసిన జపసంఖ్య పద్దెనిమిది వేలు.
*రాహువు స్థానాలు ఫలితాలు*
రాహువు ఉన్న స్థాన ఫలితాలు రాహు మహర్ధశా కాలములో మాత్రమే ఫలితాలను ఇస్తాయి.
1. లగ్నము :- జాతక చక్రములో ప్రథమ స్థానాన్ని లగ్నము అంటారు. రాహువు ప్రథమ స్థానములో ఉన్న జాతకుడు సహాయగుణము కలిగి ఉంటాడు. ముఖము మీద మచ్చలు కలిగి ఉంటాడు. ధైర్యసాహసాలు ప్రదర్శించే వారుగా ఉంటారు.
2. ద్వితీయస్థానములో రాహువు ఉన్న జాతకుడు. నల్లని ఛాయగలవారు వివాహేతర సంబంధముల అందు ఆసక్తి కలవారుగా ఉంటారు.
3. రాహువు తృతీయ స్థానమున ఉన్న జాతకుడు క్రీడాకారుడు, ధనవంతుడు, సాహసికులు ఔతారు.
4. రాహువు చతుర్ధ స్థానమున ఉన్న జాతకుడు బహుభాషాకోవిదుడు ఔతాడు. తల్లికి కష్టాలు ఉంటాయి. విద్యల అందు ఆటంకం కలిగిస్తాడు.
5. రాహువు పంచమస్థానములో ఉన్న జాతకుడు క్రూరస్వభావము కలిగి ఉంటాడు. భ్రమలు అధికంగా ఉంటాయి. సంతానము కలగటములో ఆటంకములు కలిగిస్తాడు.
6. రాహువు షష్టమస్థానమున ఉన్న జాతకుడు శత్రురహితుడు ఔతాడు. పెద్ద బంధువర్గము కలిగి ఉంటాడు.
7. రాహువు సప్తమ స్థానమున ఉన్న జాతకుడు భోజనప్రియత్వము కలిగి ఉంటాడు. మధుమేహవ్యాధికి కారకుడు ఔతాడు. కళత్రానికి ఆరోగ్యసమస్యలు కలిగిస్తాడు.
8. రాహువు అష్టమ స్థానమున ఉన్న జాతకుడు పోట్లాడె గుణము కలిగి ఉంటాడు. సంకుచిత మనస్తత్వము కలిగి ఉంటాడు.
9. రాహువు నవమ స్థానమున ఉన్న జాతకుడు పిరికితనము కలిగి ఉంటాడు. తంద్రికి కష్టాలు ఉంటాయి.
10. రాహువు నవమస్థానమున ఉన్న జాతకుదు కళాకారుడు, కవి, రచయిత, యాత్రికుడు ఔతాడు.
11. రాహువు ఎకాదశమున ఉన్న జాతకుడు ధనసంపద కలిగి సమాజంలో గౌరవమర్యాదలు కలిగి ఉంటాడు.
12. రాహువు జాతకుడు ఉన్న జాతకుడు తాత్విక చింతన కలిగి ఉంటాడు. నేత్ర వ్యాధి కలిగి ఉంటాడు.
*గోచార రాహువు ఫలితములు*
1 . స్థానము :- రాహువు చంద్రుడు ఉన్న స్థానములో ఉన్నప్పుడు లెక ప్రవేశించినప్పుడు వ్యాధులు, రొగములు పీడించును. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి ఉన్నందు వలన మానసిక వ్యాకులత కలుగును. శారీరక అలసట కలిగి ఉంటారు.
2. రాహువు చంద్రుడికి ద్వితీయ స్థానములో ప్రవేశించినప్పుడు అవవసర ధన వ్యయమును కలిగించి వ్యక్తిని ఆర్థిక ఇబ్బమ్దులకు గురి చేస్తాడు. కుటుంబము, సహసంబంధులతో కలతలు కలిగించును. కుటుంబ సభ్యుల మధ్య వివాదములు తలెత్తుతాయి. ఈ కాలము వ్యక్తిని మద్యము వంటి మత్తు పదార్ధములకు బానిసను చేస్తుంది కనుక జాగ్రత్త వహించుట మంచిది.
3. రాహువు తృతీయ స్థాన ప్రవేశము శుభఫలితాలను ఇస్తుంది. ఇతరులతో చేరి చతురతను ఉపయోగించి కార్యములు చక్కబెట్టుటకు ప్రయత్నము చేస్తారు. ఏ కార్యము చేసినా గుప్తముగా చేసి దానిని పూర్తి చేసిన తరువాతనే బహిర్గతము చేస్తారు.
4. రాహువు చతుర్ధ స్థాన ప్రవేశము అనేక సమస్యలను కష్తములను కలిగించును. రహువు నాలగ్వవ స్థాన ప్రవేశము తల్లికి కష్తములను కలిగించును. అడుగడునా కష్టములు, సమస్యలు ఎదురౌతూ అగౌరవము, అవమానము కలుగుతాయాన్న భయము సదా వెన్నంటి ఉంటుంది. భూమి వాహనము సంబంధించిన సమస్యలు ఎదురౌతాయి.
రాహువు పంచమస్థాన ప్రవేశము కష్టములు, దుఃఖము కలిగించును. మతిభ్రమను కలిగించును. త్వరగా ధనికుడు కావాలన్న పగటికలలు కంటూ ధనము కావలన్న లాలసలో ఉన్న ధనమును కోల్పోవదము జరుగుతుంది.
రాహువు షష్టమ స్థాన ప్రవేశము అంతగా హాని కలిగించక పోయినా ఆరోగ్యము మిద ప్రభావము చూపెట్టవచ్చు కనుక భోజన పానీయాలను తీసుకునే విషయములో శ్రద్ధవహించ వలసి ఉంది. ఉదర సంబంధిత సమస్యలు పీడిస్తాయి. ఈ సమయములో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆకస్మిక ధనలాభము వస్తుంది.
రాహువు సప్తమభావ ప్రవేశము దాంపత్య జీవితము బాధించును. భార్యాభర్తల మధ్య కలతలు పెరిగి దూరము కలగ వచ్చు. కళత్రానికి కష్టములు కలుగుతాయి. ఆరోగ్యకారనముగా దుఃఖిస్తారు. సహజమైన బుద్ధి కూడా సరిగా పని చెయ్యదు.
రాహువు అష్టమ స్థానప్రవేశము ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పలువిధ రోగములు వస్తాయి. మూత్ర సంబంధిత వ్యాదులతో బాధపద వచ్చు. ఆర్థికమైన సమస్యలను ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు ఆర్థిక నష్టము సంభవము.
రాహువు నవమ స్థాన ప్రవేశము తలపెట్టిన కార్యమౌలన్నింటా రాహువు ఆటంకములను కలిగించ వచ్చు. పనులు పూర్తికానున్న తరుణములో పనులు ఆగవచ్చు. అనవసర ఖర్చుల వలన ఆర్థికపరమైన చిక్కులు తలెత్తవచ్చు.
రాహువు దశమ స్థాన ప్రవేశము ఉద్యోగ బదిలీలకు కారణము ఔతుంది. అప్పటి వరకూ చేస్తున్న పనిని వదిలి వెరొక పని చేయవలసి ఉంటుంది. ఆర్థికపరమైన నష్టముకలగ వచ్చు. అనవసర శృఅమ ఫలితముగా అలసట కలగ వచ్చు.
రాహువు ఏకాదస స్థాన ప్రవేశము శూభఫలితాలను ఇస్తుంది. ఈ సమయములో గౌరవము, కీర్తి, ప్రతిష్ఠ కలగ వచ్చు. పాత దారులలో ఆదాయముతో కొత్త దారులలో కూడా ఆదాయము రావచ్చు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యసఫలత కలుగుతుంది.
రాహువు ద్వాదశ స్థాన ప్రవేశము అనవసర ఖర్చులను కలగ చేస్తుంది. ఫలించని పగటి కలలను కలిగిస్తాయి. గాలిమేడలు కట్టడం ఊహాగానాల వలన ప్రయోజనము శూన్యము.
*ద్వాదశస్థానములలో రాహువు*
లగ్నంలో రాహువు ఉన్న జాతకుడు అల్పాయుస్షు కలవాడు, ధనం కలవాడు, దృఢమైన శరీరం కలవాడు, ముఖం శిరస్సు నందురోగములు కలవాడు, ఔతాడు.
ద్వితీయ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అనుమానాస్పద పలుకులు చెప్పువాడు, నోటియందు రోగములు కలవాడు, సునిసిత హృదయుడు, రాజాశ్రయం చేత ధనం సంపాదించే వాడు, సుఖవంతుడు, రోషవంతుడు ఔతాడు.
తృతీయ స్థానమున రాహువు ఉన్న జాతకుడు గర్వం కలవాడు, సోదరులతో విరోధించు వాడు, స్థిరచిత్తుడు, చిరాయుష్మంతుడు, ధనవంతుడు ఔతాడు.
చతుర్ధ స్థానమున రాహువు ఉన్న జాతకుడు దుఃఖకారకుడు, మూర్ఖుడు, అప్పుడప్పుడూ సుఖపడే వాడు ఔతాడు.
పంచమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ముక్కుతో మాట్ళాడినట్లు మాట్లాడు వాడు, పుత్రులు లేని వాడు, కఠినాత్ముడు, గర్భరోగములు కలవాడు ఔతాడు.
షష్టమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు శ్తృవుల చేత బాధలను అనుభవించువాడు, గ్రహపీడితుడు, గుర్తించ లేని రోగము కలవాడు, ధనవంతుడు, చిరంజీవి ఔతాడు.
సప్తమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, రోగగ్రస్థుడు, ఆత్మీయల ఎడబాటు వలన బాధలను అనుభవించు వాడు, తన భావములే గొప్పవని భావించే వాడు, మానవత్వం కోల్పోయిన వాడు, పాపం చేయువాడు ఔతాడు.
అష్టమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అల్పాయుష్కుడు, అపవిత్ర కార్యాలు చేయువాడు, అంగవైకల్యం కలవాడు, వికల మనస్కుడు, వాత ప్రకృతి కలవాడు, అల్పసంతతి కలవాడు ఔతాడు.
నవమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ప్రతికూల భావములు కలిగిన వాడు, కులపెద్ద, గ్రామ పెద్ద, పట్టణముకు అధిపతి, పాపక్రియాసక్తుడు, ఔతాడు.
దశమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు ఔతాడు. అల్పసంతానవంతుడు, పరుల కార్యములు చేయు వాడు, నిర్భయుడు, సత్కర్మ రహితుడు ఔతాడు.
ఏకాదశ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు, స్వల్పసంతాన వంతుడు, చిరంజీవి, మరియు కర్ణ రోగి ఔతాడు.
ద్వాదశ స్థానమున రాహువు ఉన్న జాతకుడు రహస్యముగా దుష్కృత్యములు చేయువాడు, అధికంగా ఖర్చు చేయువాడు, శరీరమున జలసంబంధ రోగములు కలవాడు ఔతాడు.