Thursday, June 28, 2018

*ముహూర్త దర్పణం :

ముహూర్తాలు శబ్ధార్థం :
“ముహూర్తం" అను పదానికి రెండు అర్థాలు గోచరిస్తాయి. మొదటిది కాలాన్ని సూచించే కాలమానం. రెండవది ఏదైనా ఒక కార్యం ప్రారంభించేటందుకు ఎంచుకున్న సమయం.

అమరకోశం ప్రకారం - తే క్షణాః ద్వాదశ ముహూర్త ఇత్యుచ్యతే - 12 క్షణాలు కూడిన కాలాన్ని ముహూర్తం అంటారు. హూర్ఛతి కుటిలో భవతి శుభాశుభదర్శనాదితి ముహూర్తః - హుర్ఛాకౌటిల్యే - శుభాశుభ దర్శనం వల్ల కుటిలమగునట్టిది. ముహుర్ముహురియర్తీతి ముహూర్తః - ఋగతౌ - పలుమారును పోవుచుండునది. ఘటికాద్వయం ముహుర్తః - 1 ముహూర్తం - రెండు గడియల సేపు.
శబ్దార్ధ రత్నాకరం ప్రకారం: ముహూర్తమనగా - నిమేషకాలము, రెండు గడియల కాలం, నలువది యెనిమిది నిముషముల కాలము, లిప్త, శుభకార్యములకు నిర్ణయించు కాలం.

ముహూర్తం కాలమానం :
ఒక ముహూర్తకాలము 2 ఘడియలు లేక 48 నిముషాలకు సమానం. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 15 ముహూర్తాలుగాను, సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యోదయం వరకు 15 ముహూర్తాలుగాను విభజించారు.
పగలు సంబంధిత రాత్రి సంబంధిత ముహూర్తం నక్షత్రం ముహూర్తంపేరు నక్షత్రం
1. శివ ఆరుద్ర 1. శివ ఆరుద్ర
2. సర్ప ఆశ్లేష 2. అజైకపాద పూర్వాభాద్ర
3. మిత్ర అనూరాధ 3. ఆహిర్భుద్న్య ఉత్తరాభాద్ర
4. పిత్ర మఖ 4. పూష రేవతి
5. వసు ధనిష్ఠ 5. అశ్వనీకుమార అశ్వని
6. జల పూర్వాషాడ 6. యమ భరణి
7. విశ్వేదేవ ఉత్తరాషాడ 7. అగ్ని కృత్తిక
8. బ్రహ్మ అభిజిత్ 8. బ్రహ్మ రోహిణి
9. బ్రహ్మ రోహిణి 9. చండ్ర మృగశిర
10. ఇంద్ర రోహిణి 10. అదితి పునర్వసు
11. ఇంద్రాగ్ని విశాఖ 11. బ్రహస్పతి పుష్యమి
12. రాక్షస/నిరుతి మూల 12. విష్ణు శ్రవణ
13. వరుణ శతభిషం 13. సూర్య హస్త
14. ఆర్యమ ఉత్తర 14. విశ్వకర్మ చిత్త
15. భగ పుబ్బ 15. పవన స్వాతి
సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి '8' వ ముమూర్తం అభిజిత్ ముహుర్తం. “ఏ యే నక్షత్రాలలో ఏయే కర్మలు విధించబదినవో ఆ నక్షత్రాధిదేవతల ముహుర్తాలలో ఆ కర్మలు చేయదగును" అని ముహూర్త ప్రయోజనములను నారద మహర్షి చెప్పిరి.

వారజనిత దుర్ముహూర్తములు :
ఆదివారమందు పగలు 'ఆర్యమ' అనే 14 వ ముహూర్తం
సోమవారమునందు పగలు 'బ్రహ్మ' అనే 9వ ముహూర్తం
మంగళవారం పగలు 'రాక్షస' అనే 2 వ ముహూర్తం
రాత్రి 'అగ్ని' అనే 7వ ముహూర్తం
బుధవారమందు పగలు 'బ్రహ్మ' లేజ 'విద్యాఖ్య' అనే 8 వ ముహూర్తం
గురువారం పగలు 'రాక్షస' అనే 12వ ముహూర్తం
రాత్రి 'జల' లేక 'దారాఖ్య' అనే 6వ ముహూర్తం
శుక్రవారం పగలు 'బ్రహ్మ' అను 9 వ ముహూర్తం
రాత్రి 'పిత్ర' అను 4వ ముహూర్తం
శనివారం ఉదయం 'రుద్ర' అను 1వ ముహూర్తం
ఉదయం 'సర్ప' అను 2వ ముహూర్తం
పై ముహూర్తాలు వారజనిత దుర్ముహూర్తాలు.
సూర్యోదయానికి ముందు ఉండే ముహూర్తం ’బ్రాహ్మీముహూర్తం’ అంటారు.

ముహూర్తం ఎంపిక :
ముహూర్తం శబ్దానికి గల మరియొక అర్థం, ఏదేని కార్యం మొదలు పెట్టుటకు ఎంచుకొనే సమయం, ఈ సమయం లేక కాల ఎంపికలో శుభాశుభ కాలజ్ఞానం అవసరం.

ఆయన జ్ఞానము. మాస, పక్ష, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, మరియు లగ్న పరిశీలన ముఖ్యమైనది.

అయనములు :
సంవత్సరమునకు రెండు అయనములు అవి. 1. ఉత్తరాయణం, 2. దక్షిణాయనం.

రవి, తన గోచారంలో మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల ఆరు నెలల కాలము ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం పుణ్యకాలం సాధారణంగా అన్ని కార్యములకు శుభకరం.

రవి గోచారంలో కర్కాటకరాశిలో ప్రవేశించినది మొదలు తిరిగి మకరరాశిలో ప్రవేశించువరకు గల ఆరు నేలలు దక్షిణాయనం. ఈ దక్షిణాయనం పుణ్యకాలం ఉపాసన, దైవారాధనలకు ఎంతో మంచిది.

ఋతువులు మాసములు :
1. చైత్రం, 2.వైశాఖం, 3. జ్యేష్ఠం, 4. ఆషాడం, 5. శ్రావణం, 6. భాద్రపదం, 7. ఆశ్వీజం, 8. కార్తీకం, 9. మార్గశిరం, 10. పుష్యం, 11. మాఘం, 12. పాల్గుణం.

ప్రతినెల పూర్ణిమరోజున గల నక్షత్రాన్ని బట్టి మాసనామం నిర్ణయించారు.

సౌరమాసాలు: రవి గోచారంలో ఒక్కొక్క రాశిలో ఒక నేల సంచరిస్తాడు. రవి ఏ రాశిలో సంచరిస్తుంటే ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. ఉదా: రవి ధనూరాశిలో సంచరిస్తుంటే 'ధనుర్మాసం' అని పిలుస్తారు.

ఋతువులు: 
ఒక సంవత్సరమునాకు ఋతువులు ఆరు ఒక్కొక్క రుతువుకు రెండు నెలలు ఉంటాయి.

చైత్ర, వైశాఖమాసాలు వసంత ఋతువు అధిపతి శుక్రుడు
జ్యేష్ట, ఆషాడములు గ్రీష్మ ఋతువు అధిపతి రవి, కుజ
శ్రావణ, భాద్రపదము వర్షఋతువు అధిపతి చంద్ర
ఆశ్వీజ, కార్తీకములు శరదృతువు అధిపతి బుధుడు
మార్గశిర, పుష్యమాసములు హేమంత ఋతువు అధిపతి గురుడు
మాఘ, పాల్గుణమాసములు శిశిర ఋతువు అధిపతి శని

అధికమాసాలు:
రెండు అమావాస్యలమధ్య రవి సంక్రమణం జరుగకపోతే ఆ చాంద్రమాసాన్ని'అధికమాసం' అంటారు. దీనినే 'మలమాసం' అని కూడా పిలుస్తారు. ఈ అధికమాసంలో ప్రతిరోజూ చేసుకునే నిత్యకర్మలు మాత్రమే చేసుకోవాలి. శుభకార్యాలు చేయరాదు.

క్షయమాసం:
రెండు అమావాస్యల నడుమ రెండు సూర్య సంక్రమణాలు జరిగితే ఆ చాంద్రమాసాన్ని'క్షయమాసం' అనిపిలుస్తారు. అనగా ఒకే చంద్రామాసంలో రెండు రాశులలో రవి సంచరిస్తాడన్నమాట.

శూన్యమాసం:
రవి మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు చైత్రమాసం
మిథునరాశిలో సంచారిస్తునప్పుడు ఆషాడమాసం
కన్యయందు సంచారిస్తునప్పుడు భాద్రపదమాసం
ధనస్సునందు సంచరిస్తునప్పుడు పుష్యమాసం
పై మాసాలు శూన్య మాసాలు.
ఆధిక, క్షయ, శూన్య మాసాలందు శుభకార్యాలు చేయరాదు.

పక్షములు :
ఒక చంద్రామాసంలో రెండు పక్షాలుంటాయి.

శుక్లపక్షము: అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి నుండి పూర్ణిమ వరకు గల 15 రోజులు శుక్లపక్షం.
కృష్ణపక్షం: దీనిని బహుళ పక్షం అని కూడా అంటారు. పూర్ణిమ తరువాత వచ్చు పాడ్యమి నుండి అమావాస్య వరకు గల 15 రోజులు కృష్ణపక్షం.

తిథులు :
చాంద్రమాసానికి తిథులు 30. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.

శుక్లపక్ష తిథులు అధిపతులు కృష్ణపక్ష తిథులు అధిపతులు
ప్రతిపద/పాడ్యమి అగ్ని పాడ్యమి అగ్ని
విదియ బ్రహ్మ విదియ బ్రహ్మ
తదియ పార్వతి తదియ పార్వతి
చవితి విఘ్నేశ్వర చవితి విఘ్నేశ్వర
పంచమి ఆదిశేషుడు పంచమి ఆదిశేషుడు
షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య
అష్టమి శివ అష్టమి శివ
నవమి అష్టవసువులు నవమి అష్టవసువులు
దశమి దిగ్గజములు దశమి దిగ్గజములు
ఏకాదశి యమ ఏకాదశి యమ
ద్వాదశి విష్ణు ద్వాదశి విష్ణు
త్రయోదశి మన్మథ త్రయోదశి మన్మథ
చతుర్దశి కలిపురుష చతుర్దశి కలిపురుష
పూర్ణిమ చంద్ర అమావాస్య పితృదేవతలు

తితులను 5 రకాలుగా విభజించారు. అవి నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ తిథులు.

నంద భద్ర జయ రిక్త పూర్ణ
పాడ్యమి విదియ తదియ చవితి పంచమి
షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి
ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ/అమావాస్య

నందతిథులలో శిల్పం, కృషి. యజ్ఞయాగాది క్రతువులు, వివాహం, ప్రయాణం, నూతన వస్త్రాలంకరణ, వైద్యం, మిత్రదర్శనం చేయవచ్చును.

భద్రతిథులలో గృహారంభం, ప్రయాణం, ఉపనయనం, రాజసేవ, రాజ్యాభిషేకం, విద్యాభ్యాసం, వాహనములపై ఆరోపణ, పౌష్టిక కర్మలు చేయవచ్చును.

జయతిథులతో వివాహం. అలంకారములు, శుభాకర్మలు, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, యుద్ధం, ఆయుధములు ధరించుట మంచింది.

రిక్త తిథులలో బంధనం, అగ్ని సంబంధిత కర్మలు, మిత్రభేదం, విరోధం, విషప్రయోగములు మొదలగు కర్మలకు మంచిది.

పూర్ణ తిథులలో వివాహం, ప్రయాణం, శాంతికపౌష్టిక కర్మలు చేయవలెను. అమావాస్యయందు పితృకర్మలు మాత్రమే చేయవలెను. ప్రయాణములు చేయరాదు.

క్షయతిథి: రెండు దినములో ఏ సూర్యోదయానికి లేని తిథిని క్షయతిథి అంటారు. ఉదా: ఒకరోజు సూర్యోదయానికి గల తిథి దశమి, మరుసటి రోజు సూర్యోదయానికి గల తిథి ద్వాదశి అయితే మధ్యగల ఏకాదశి క్షయతిథి అవుతుంది.

వృద్ధి తిథి: రెండు సూర్యోదయాలకు గల తిథిని వృద్ధితిథి అంటారు. ఒకే తిథి మూడు దినములు వ్యాపించియున్న 'త్రిధ్యుస్ప్రక్' అంటారు. దీనినే 'త్రిదినస్ప్రక్' అని కూడా అంటారు. ఒకే దినమున మూడు తిథులున్న 'అవమతిథి' అని పిలుస్తారు.

క్షయ, వృద్ధి,. త్రిధ్యుస్ప్రక్, అవమ తిథులు శుభకార్యాలకు పనికిరావు.

తిథి గండాంతాలు: పూర్ణ తిథులయొక్క చివరి 48 నిముషాలు (రెండు ఘడియలు) తిథులయొక్క మొదటి 48 నిముషాలు (రెండు గడియలు) తిథి గండాంతములు. ఈ గండాత సమయంలలో ఏ శుభకార్యము చేయరాదు.

పంచపర్వ తిథులు: బహుళ అష్టమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ మరియు ప్రతిమాసం సూర్య సంక్రమణ తిథి పంచపర్వ తిథులు. ఈ తిథిలో శుభకార్యాలు చేయరాదు.

పక్షరంద్ర తిథులు: చవితి తిథిలో మొదటి 8 ఘడియలు
షష్ఠి తిథిలో మొదటి 9 ఘడియలు
అష్టమి తిథిలో మొదటి 14 ఘడియలు
నవమి తిథిలో మొదటి 25 ఘడియలు
ద్వాదశి తిథిలో మొదటి 10 ఘడియలు
చతుర్దశి తిథిలో మొదటి 5 ఘడియలు - పక్షరంధ్ర తిథులు.

ఈ కాలములో ఏ శుభకార్యాలు చేయరాదు.
సంకల్ప తిథి: సూర్యోదయమునకు ఏ తిథి ఉంటుందో ఆ తిథి సంకల్ప తిథి అవుతుంది. ఆ రోజు చేయు ప్రతి నిత్యకర్మకూ సంకల్పములో ఈ తిథినే చెప్పవలెను

వారములు :
వారములు 7. అవి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం.

వారాలు ఏర్పడే పద్దతి: ఆకాశంలో చంద్రుని స్థానంలో సూర్యుడు, సూర్యుడున్న స్థానంలో చంద్రుని భావించగా, కక్ష్యాక్రమం ఈ విధంగా ఏర్పడుతుంది. శని, గురు, కుజ, రవి, శుక్ర, చంద్ర. ఆ క్రమంలో హోర (1గంట)లు ఏర్పడతాయి. శనివారం శని హోరతో ఆరంభం అవుతుంది. సూర్యోదయం నుండి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరలు నడుస్తాయి. (మందామరేజ్య భూపుత్రః సూర్య శ్శుక్రేంద్రుజేందవః) అవే మరల పునరావృతం అవుతాయి. 3x7=21 గంటలు పూర్తి అయిన తర్వాత 22 వ గంట శనిహోర, 23వ గంట గురుహోర, 24వ గంట కుజహోర పూర్తికాగా ఆదివారం రవిహోరతో ప్రారంభం అవుతుంది. ఆ విధంగా ఏ వారం ఆ గ్రహానికి చెందిన హోరతో ఆరంభం అవుతుంది.

ఆదివారం: రాజకార్యములు. ఉద్యోగప్రయత్నములు, కోర్టుపనులు, విక్రయపనులు, విద్యారంభం. సీమంతములకు శుభం.

సోమవారం: అన్నప్రాశన, కేశఖండన. అక్షరాభ్యాసం, యాత్రలు, బావులు తవ్వుటకు, ప్రతిష్టాదులు, విత్తనములు చల్లుట, ఉద్యోగ, ఉపనయన, గృహారంభములకు శుభం.

మంగళవారం: శుభకార్యాలకు మంచిది కాదు. అగ్నిసంబంధ పనులు, పొలం దున్నుట, అప్పుతీర్చుట, సాహసకార్యములు, ఆయుధ విద్యలకు మంచిది.

బుధవారం: సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రదారణకు, గృహారంభ, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, హలకర్మ, విత్తనములు జల్లుతకు, క్రయ విక్రయాది వ్యాపారాది పనులకు, అప్పుచేయుటకు, ఉద్యోగములో చేరుటకు మంచిది.

గురువారం: సమస్త శుభకార్యములకు మంచిది. వివాహ యాత్రాధులకు, నూతన వస్త్ర ఆభరణ ధారణకు, గృహారంభం, గృహప్రవేశ దేవతాప్రతిష్టాదులకు, చెరువులు, తవ్వుటకు, పదవీస్వీకారం చేయుటకు మంచింది.

శుక్రవారం: వివాహాది శుభకార్యాలకు పంచదశ సంస్కారాలకు, క్రయవిక్రయాది వ్యాపారాలకు, ఔషధసేవకు, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలకు, లలిత కళలు అధ్యయనం చేయుటకు మంచిది.

శనివారం: ఇనుము, ఉక్కు సంబంధిత పనులకు, నూనె వ్యాపారమునకు, స్థిరాస్తులను అమ్ముటకు, ఉద్యోగ స్వీకరణకు మంచిది. గృహారంభం, గృహప్రవేశ వివాహాదులకు మాధ్యమం.

నక్షత్రములు విభజన :
1. ధృవ (స్థిర) నక్షత్రములు: ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రోహిని - బీజావాపం, వివాహం, ఉపనయనం, గృహ ప్రవేశం, శాంతికర్మ, ఉద్యాన ప్రతిష్ఠ, వస్త్ర, క్రీడా, మిత్ర సంబంధమైన పనులు మొదలగు వానికి మంచిది.

2. చర నక్షత్రములు: స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం - ప్రయాణాలకు వాహనాలు నడపటానికి, వ్యాపారంలో మార్పు చేయడానికి, అభివృద్ధికి, గృహారంభానికి మంచిది.

3. గ్రహ నక్షత్రములు: భరణి, మఖ, పూర్వఫల్గుణి, పూర్వాషాడ, పూర్వాభాద్ర – ఆయుధములు కొనుగోలుకు, ఉపయోగమునకు అగ్ని సంబంధ పనులు చేయుటకు, విషపదార్దములు, మందులు తయారు చేయుటకు మంచిది.

4. మిశ్ర నక్షత్రములు: విశాఖ, కృత్తికలు - బాణసంచా తయారు చేయడానికి మంచిది.

5. క్షిప్ర/లఘునక్షత్రములు: అశ్విని, హస్త, పుష్యమి, అభిజిత్ - విద్యారంభమునకు, అమ్మకాలు మొదలుపెట్టడానికి, ఆభరణాలు ధరించడానికి, శ్రేష్ఠఫలములు పొందడానికి మంచిది.

6. మృదునక్షత్రములు: మృగశిర, రేవతి, చిత్త అనూరాధలు - సంగీతం మరియు ఇతర లలితకళలకు, కచేరీలు ఇవ్వడానికి, స్నేహం చేసుకోవడానికి, కొత్త బట్టలు కొనడానికి, ధరించడానికి మంచిది.

7. తీక్షణ/దారుణ నక్షత్రములు: మూల, జ్యేష్ఠ, ఆరుద్ర, ఆశ్లేషలు - చేతబడులు చేయుటకు, తాంత్రిక విద్యలు అభ్యసించుటకు, దుష్టశక్తులను లొంగదీసుకొనుటకు మంచిది.

8. ఊర్ధ్వముఖ నక్షత్రాలు: ఆరుద్ర, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రోహిణి - వ్యవసాయ పనులకు, చెట్లునాటడానికి, బహుళ అంతస్థుల నిర్మాణానికి దేవాలయాలు నిర్మించడానికి మంచిది.

9. అధోముఖ నక్షత్రాలు: మూల, ఆశ్లేష, విశాఖ, కృత్తిక, పూర్వఫల్గుణి, పూర్వాషాడ, పూర్వభాద్ర బావులు తవ్వడానికి, చెరువులు తవ్వడానికి, పునాదులు గనులు తవ్వడానికి మంచిది.
10. తిర్యక్ ముఖ నక్షత్రాలు: మృగశిర, రేవతి, చిత్త, అనూరాధ, హస్త, స్వాతి, పునర్వసు, అశ్వని, జ్యేష్ఠ – పురోభివృద్ధి జరగడానికి, రహదారులు నిర్మించడానికి, స్తంభ ప్రతిష్టకు, గృహారంభమునకు మంచిది.

నక్షత్రములు :
భారతీయ జ్యోతిష శాస్త్రానికి సంబంధించినంత వరకు నక్షత్రములు 27.
1. అశ్విని 2. భరణి 3. కృత్తిక 4. రోహిణి
5. మృగశిర 6. ఆరుద్ర 7. పునర్వసు 8. పుష్యమి
9. ఆశ్లేష 10. మఖ 11. పుబ్బ 12. ఉత్తర
13. హస్త 14. చిత్త 15. స్వాతి 16.విశాఖ
17. అనూరాధ 18. జ్యేష్ఠ 19. మూల 20.పూర్వాషాడ
21. ఉత్తరాషాడ 22. శ్రావణం 23. ధనిష్ఠ 24. శతభిషం
25. పూర్వాభాద్ర 26. ఉత్తరాభాద్ర 27. రేవతి

ఉత్తరాషాడ నక్షత్రంలో చివరిపాదం, శ్రావణా నక్షత్రంలో మొదటి 1/15వ భాగం కలిపి 'అభిజిత్' నక్షత్రం అంటారు. అనగా మకరరాశిలో 6 డిగ్రీలు .40 నుండి 10డిగ్రీలు .53'20” వరకు అభిజిత్ నక్షత్రము

నక్షత్ర త్యాజ్యములు
త్యాజ్యం అనగా వర్జ్యం.ప్రతి నక్షత్రమును 4 ఘడియలకాలం (1గం. 36ని) విషఘడిక అని, ఈ సమయమును వర్జ్యము అని అంటారు. ఈ వర్జ్య సమయంలో సమస్త శుభకార్యాలు నిషిద్దములు. అదే విధంగా ప్రతి నక్షత్రములో వేరొక 4 ఘడియలు అమృతకాలం. ఈ అమృతకాలంలో సమస్త శుభకార్యాలు చేయవచ్చును. ఔషధసేవకు ప్రశస్తసమయం. నక్షత్రత్యాజ్య, అమృత ఘటి సమయములు పట్టికలో చూపబడినవి.

నామ నక్షత్రములు
సంగ్రామ వ్యవహార ధామనగర గ్రమేషు మంత్రార్వణే
జాతే సత్యపి జన్మభేచ సతతం నామర్ క్షజం స్యాత్ఫలమ్ (కాలామృతం)

యుద్ధం, వర్తకం, గృహం, పురం, గ్రామం, మంత్రం, అనువాటికి నామనక్షత్రము ఫలప్రదమగునని కాలామృతంలో వివరించబడినది.

జన్మ నక్షత్రం తెలియని వారు కూడా నామనక్షత్రమునే గ్రహించవలెను. నామనక్షత్రము వివరణ పట్టికలో చూపబడినది.

నక్షత్ర త్యాజ మరియు అమృత కాల వివరములు

నక్షత్రం నక్షత్రత్యాజ్యం వర్జం వివరణ అమృతకాలం

అశ్వని 50-0 42-00
భరణి 24-0 48-00
కృత్తిక 30-00 54-00
రోహిణి 40-00 52-00
మృగశిర 14-00 38-00
ఆరుద్ర 21-00 35-00
- 54-00
పునర్వసు 30-00 05-40
పుష్యమి 20-00 44-00
ఆశ్లేష 32-00 56-00
మఖ 30-00 54-00
పుబ్బ 20-00 44-00
ఉత్తర 18-00 42-00
హస్త 21-00 45-00
చిత్త 20-00 44-00
స్వాతి 14-00 38-00
విశాఖ 14-00 38-00
అనూరాధ 10-00 34-00
జ్యేష్ఠ 14-00 38-00
మూల 20-00 -
56-00 44-00
పూర్వాషాడ 24-00 48-00
ఉత్తరాషాఢ 20-00 44-00
శ్రవణం 10-00 34-00
ధనిష్ఠ 10-00 34-00
శతభిషం 18-00 42-00
పూర్వాభాద్ర 16-00 40-00
ఉత్తరాభాద్ర 24-00 48-00
రేవతి 30-00 54-00

నామ నక్షత్ర విజ్ఞానము:

నక్షత్రము 1వ పాదం 2వ పాదం 3వ పాదం 4వ పాదం

అశ్విని చూ చే చో లా
భరణి లీ లూ లే లో
కృత్తిక ఆ ఈ ఊ ఏ
రోహిణి ఓ వా వీ వూ
మృగశిర వే వో కా కీ
ఆరుద్ర కూ ఖం ఙ్గ ఛ
పునర్వసు కే కో హా హీ
పుష్యమి హూ హే హో డా
ఆశ్లేష డీ డూ డే డో
మఖ మా మీ మూ మే
పుబ్బ మో టా టీ టూ
ఉత్తర టే టో పా పీ
హస్త పూ షం ణా థా
చిత్త పే పో రా రీ
స్వాతి రూ రే రో తా
విశాఖ తీ తూ తే తో
అనూరాధ నా నీ నూ నే
జ్యేష్ఠ నో యా యీ యూ
మూల యే యో బా బీ
పూర్వాషాఢ బూ ధా భా ఢా
ఉత్తరాషాఢ బే బో జా జీ
శ్రవణం జూ జే జో ఖా
ధనిష్ఠ గా గీ గూ గే
శతభిషం గో సా సీ సూ
పూర్వాభాద్ర దూ శం ఝా ధా
రేవతి దే దో చా చీ

యోగములు :
యోగములు 27 అవి చంద్ర, సూర్య స్ఫుటములను కలుపగా ఏర్పడును.

1. విష్కంభం 2. ప్రీతి 3. ఆయుష్మాన్ 4. సౌభాగ్య
5. శోభన 6. అతిగండ 7. సుకర్మ 8. ధృతి
9. శూల 10. గండ 11. వృద్ధి 12. ధృవ
13. వ్యాఘాత 14. హర్షణ 15. వజ్ర 16. సిద్ది
17. వ్యతీపాత 18. వరీయాన్ 19. పరిఘ 20. శివ
21. సిద్ధి 22. సాధ్య 23. శుభ 24. శుక్ల
25. బ్రహ్మ 26. ఇంద్ర 27. వైధృతి

పై 27 యోగాలలో విష్కంభ, అతిగండ, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వ్యతీపాత, పరిఘ, వైధృతి యోగాలు దోషములనిచ్చు యోగాలు. కావున శుభకార్యములకు మంచివికావు.

యోగసాధన:
చంద్రసంఖ్య – చంద్రుడు ఉన్న నక్షత్రమును "శ్రవణ"ము నుండి లెక్కించగా వచ్చు సంఖ్య చంద్రసంఖ్య.

రవి సంఖ్య- 'పుష్యమి' నక్షత్రమునుండి రవి నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్య రవి సంఖ్య. ఈ రెండు సంఖ్యలమొత్తం యోగమును సూచించును.

ఉదా: చంద్రుడు పునర్వసు నక్షత్రములోను, రవి విశాఖ నక్షత్రములోను
ఉన్నప్పుడు చంద్రసంఖ్య శ్రవణం నుండి పునర్వసు వరకు - 13,
రవి సంఖ్య శ్రవణం నుండి పునర్వసు వరకు -9.
మొత్తం 13+9=22.
కావున ఆ దినము యోగమైన సాధ్యయోగం.

కరణములు :
కరణములు 11. కరణము తిథిలో సగభాగం.
1. బల 2. బాలవ 3. కౌలువ 4. తైతుల 5. గరణి/గణజి 6. వణజి 7. విష్టి. ఈ ఏడు కరణములు చరకరణములు

1. శకుని 2. చతుష్పాద 3. నాగ 4. కింస్తుఘ్న. ఈ 4 కరణములు స్థిరకరణములు.

భద్ర, శకుని చతుష్పాద, నాగ, కింస్తుఘ్న కరణములు శుభ కార్యములకు మంచివి కావు.

బహుళ చతుర్దశి రెండవ భాగం, శకుని, అమావాస్య 1వ భాగం చతుష్పాత్, రెండవ భాగం నాగం, శుద్ధ పాడ్యమి మొదటి భాగం కింస్తుఘ్నం - ఇవి స్థిర కరణాలు. శుద్ధపాడ్యమి రెండోభాగం నుండి బహుళ చతుర్దశి మొదటి భాగం వరక శుక్ల పక్షంలో 29కృష్ణపక్షంలో 27 మొత్తం 56 కరణాలుంటాయి. అవి బవ మొదటి విష్టి వరకు 7 చరకరణాలు, ఎనిమిది సార్లు 7x8=56 సార్లు పునరావృతం అవుతాయి. విష్టి కరణములు భద్రకరణము అని కూడా అందురు.

కర్తరి :
రవి భరణి 3,4 పాదములందు, కృత్తికానక్షత్రంలోని నాల్గు పాదములందు, రోహిణిలో మొదటి పాదమునందు గోచారరీత్యా సంచరించుకాలము కర్తరీకాలం. దీనినే కత్తెర అని కూడా పిలుస్తారు. రవి, భరణి, 3, 4 పాదాలలో సంచరించే కాలాన్ని చిన్న కత్తెర లేక డొల్లు కత్తెర అని అంటారు.

కర్తరిలో చేయకూడని పనులు: చెట్లు నరుకుట, భూమిని త్రవ్వుట, ఇళ్ళు కట్టుట, చెరువులు బావులు త్రవ్వుట, కొత్తవాహనాలు ఎక్కుట చేయరాదు, శిల (రాతి) దారు (చెక్క) మృత్తిక (మట్టి)తో చేసేపనులు వదిలివేయాలి.

ద్విపుష్కర త్రిపుష్కర యోగాలు :
భద్రతిథి (2, 7, 12 తిథులు) ఆది మంగళ శని వారములు, ద్విపాద నక్షత్రములైన మృగశిర, చిట్టా, ధనిష్ఠలు కలిసిన ద్విపుష్కరయోగం.

ఉదా: 24. 11. 2009 నాడు సప్తమి, ధనిష్ఠ, మంగళవారం.

భద్రతిథి + ఆది లేక మంగళలేక శనివారం + కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, నక్షత్రములు కలిసిన 'త్రిపుష్కరయోగం'.

ఉదా: 29. 12. 2009 నాడు, ద్వాదశి, కృత్తిక నక్షత్రం, మంగళవారం.

పై యోగాలలో పనులు ప్రారంభించిన రెండు లేక మూడు సార్లు తిరిగి చేయవలసి వచ్చును, కాబట్టి పునరావృత్తం కాకూడని పనులు ఈ సమయాలలో చేయరాదు.

శుభముహూర్త లగ్న లక్షణములు :
1. ముహూర్తలగ్నం, బలంగా ఉండాలి.
2. ఏ ముహూర్తానికైనా అష్టమశుద్ధి ఉండటం మంచిది.
3. కేంద్రాలలో శుభ గ్రహాలు, ( 3, 6, 11) త్రిషడాయాలలో పాపగ్రహాలుండాలి.
4. ముహూర్తచక్రంలో కేంద్రస్థానంలో బుదుడుంటే 500 దోషాలను, శుక్రుడుంటే 5000 దోషాలను, గురుడుంటే 1,00,000 దోషాలను పోగొడతాడు.
5. లాభభావంలో రవి స్థితి మంచిది.
6. లగ్నం వర్గోత్తమం చెందితే బలాన్ని పొందుతుంది. రాశిచక్రంలోను, నవాంశ చక్రంలోను లగ్నం ఒకే రాశిలో ఉంటే లగ్నం వర్గోత్తమం చెందుతుంది.

7. పుష్కరాంశం:
లగ్నం పుష్కరాంశంలో ఉండాలి.
అగ్ని తత్త్వరాశులలో 7,9 నవాంశలు.
భూ తత్వరాశులలో 3,5 నవాంశలు.
వాయుతత్వరాశులలో 6,8 నవాంశలు.
జల తత్వరాశులలో 1,3 నవాంశలు పుష్కరాంషలు.

అగ్ని తత్వరాశులలో 21 వ డిగ్రీ, భూతత్వరాశులలో 14 వ డిగ్రీ వాయుతత్వరాశులలో 24 వ డిగ్రీ, జల తత్వరాశులలో 7 వ డిగ్రీ పుష్కర భాగం.
8. పుష్కరాంశలో ఉన్న లగ్నానికి, గ్రహానికి పవిత్రత పెరుగుతుంది.
9. ముహూర్తలగ్నం శుభ షష్ట్యంశలో ఉన్న శుభఫలితానిస్తుంది.
10. అష్టకవర్గు ప్రకారం లగ్నంలో మరియు సంబంధిత భావంలో శుభ బిందువులుండాలి.
11. ముహూర్తచక్రంలోని దశాంశక్రమం కూడా అష్టకవర్గు ప్రకారం అనుకూలంగా ఉండాలి.

పంచకరహితం :
ప్రతి ముహూర్తానికి పంచకదోషరాహిత్యం ముఖ్యమైనది.

“తిథవారోడు భీర్యుక్తం తత్కాలోదయ మిశ్రితం
నవభిస్తు హారేద్భాగం శేషం పంచకమీరితం
ఏకో మృత్యుర్ధ్వయం వహ్నిశ్చత్వారో రాజపంచకం
షట్చోరో వసురోగస్స్యాదిత్యే తత్పంచకం స్మ్రతమ్"

పక్షాదిగా తిథులు, అశ్విన్యాదిగా నక్షత్రములు, భానువారాదిగా వారములు, మేశాదిగా లగ్నములు కలిపిన మొత్తమును 9 చే భాగించగా శేషం 1 అయిన మృత్యుపంచకం, 2 అయిన అగ్ని పంచకం, 4 అయిన రాజపంచకం, 6 అయిన చోర పంచకం, 8 అయిన రోగ పంచకం అవుతుంది. ఈ ఇందింటిని పంచకములు అంటారు. ఈ పంచకములు చెడు ఫలితాలనిస్తాయి. కనుక వివాహాది శుభకార్యములకు యాత్రలకు పనికిరావు.

శేషం 3, 5, 7, 0 అయిన అట్టి లగ్నము పంచకరహితమైనదిగా గుర్తించవలెను.
మృత్యుపంచకం - మృత్యువును, అగ్ని పంచకం- అగ్ని భయమును,
రాజ పంచకం - రాజభయమును, చోరపంచకం - దొంగల భయమును,
రోగపంచకం రోగభయమును కల్గించును.
ఉదా: విరోధినామ సం|| కార్తీక షష్టి శుక్రవారం మూలా నక్షత్రం, వృషభలగ్నం.

తిథి షష్టి 6
వారం శుక్రవారం 6
నక్షత్రం మూల 19
లగ్నం వృషభం 02
33/9= శేషం -6 చోరపంచకం

పంచకరహితం - మతాంతరాలు: పంచకరహిత గణనములో మతాంతరాలున్నాయి. గత తిథి సంఖ్యను తత్కాల లగ్నసంఖ్యను మాత్రమే కలిపి 9 చే భాగించగా మిగిలిన శేషమును పైన చెప్పిన పంచకరహిత పద్ధతిలో ఫలితములు తీసుకోనవలెను.
పై ఉదాహరణలో గత తిథి పంచమి, ప్రస్తుతం లగ్నం వృషభం.
5+2=7 పంచక రహితమైనది.

పంచకరహితము - మాసాదిగా గణనము: శుక్ల పాడ్యమి మొదలు తెలుగు సంఖ్య, ఆదివారం మొదలు వారసంఖ్య, అశ్వని నక్షత్రము మొదలు నక్షత్ర సంఖ్య, మేషాదిగా లగ్న సంఖ్యలను కలుపగా వచ్చిన మొత్తాన్ని 9 చే భాగించగా వచ్చిన శేష సంఖ్య 1 మృత్యు పంచకం, 2 అగ్ని పంచకం, 4 రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగ (వసు) పంచకాలు అవుతాయి.

ఉదా: విరోధినామ సం|| మార్గశిర బహుళ విదియ గురువారం, ఆరుద్ర నక్షత్రము, సింహ లగ్నం పరీక్షిద్దాం.
పక్షాదిగా మాసాదిగా
తిథి బ.విదియ 2 17 (15+2)
వారం గురువారం 5 05
నక్షత్రము ఆరుద్ర 6 06
లగ్నం సింహం 5 05
మొత్తం 18 33
9 చే భాగించగా శేషం 0 6

పక్షాదిగా లగ్నం పంచక రహితమైనది. మాసాదిగా చోరపంచకమైనది.

ధృవక పధ్ధతి: మేఘమునకు 4, వృషభమునకు 6, కర్కాటకమునకు 5, సింహమునకు 4, కన్యకు 3, తులకు 2, వృశ్చికం 1, ధనుస్సుకు 0, మకరమునకు 1, కుంభమునకు 2, మీనమునకు 3 ధృవకములు.

తిథి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలతో పాటు పై ధృవక సంఖ్యను కూడా కలిపి భాగించి పంచకహితమైనదా అని పరీశీలించవలెను.

పంచ రహితము:
పంచకరహితములో వేరొక పద్దతి 'పంచ రహితము' అనగా 5 శేషంగా రాకూడదు.

'తిథి ఉడు దినలగ్నం మిశ్రితం పంచధాకృతా
తిథి రవి దశ నాగైర్వేద సంఖ్యా యుతం యత్
నవహృత హర శేషం శోభనే వర్జనీయం
రుగనల నృపచోరైర్శ్వమ్యనా దూషితంచ'
తిథి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపి, ఆ మొత్తమును అయిదు ప్రతులుగా ఉంచి, మొదటి ప్రతిలో 15, రెండవ ప్రతిన 12ను మూడవ ప్రతిలో 10ని, నాల్గవ ప్రతిలో 8ని, అయిదవ ప్రతిలో 4ను చేర్చి 9 చే అయిదు మొత్తాలను భాగించగా 5 శేషం గా రాని యెడల పంచకరహితం. అయినట్లుగా తెలిసికొనవలెను.

మొదటి ప్రతిలో 5 మిగిలిన రోగము
రెండవ ప్రతిలో 5 మిగిలిన అగ్ని
మూడవ ప్రతిలో 5 మిగిలిన రాజ
నాల్గవ ప్రతిలో 5 మిగిలిన చోర
అయిదవ ప్రతిలో 5 మిగిలిన మృత్యుపంచకములు.

అన్ని ప్రతులలో 5 శేషంరాని యెడల పంచకరహితమైనట్లు తెలుసుకొనవలెను.

ఉదా: విరోధినామ సం|| కార్తీక శుద్ద షష్టి శుక్రవారం, మూలానక్షత్రం, వృషభలగ్నం.

తిథి -6 + వారం -6 +నక్షత్రం - 19 +లగ్నం -2=33.

రోగ అగ్ని రాజ చోర మృత్యు
33 33 33 33 33
+ 15 12 10 08 04
మొత్తం 48 45 43 41 37
పై మొత్తమును 9 చే భాగించగా
శేషం 3 0 7 (5) 1
4వ దానిలో 5 శేషంగా మిగిలినది కావున చోరపంచకమైనది.

పంచక పరిహారములు: రాత్రి యందు రోగపంచకమును, పగటి యందు రాజపంచకమును, సాయంప్రాతస్సంధ్యలందు మృత్యుపంచకమును, అన్నివేళలందు మృత్యుపంచకమును విడువవలెను.

ఆదివారం రోగపంచకం, మంగళవారం అగ్ని పంచకం మరియు చోరపంచకం, శనివారం రాజపంచకం, బుధవారం మృత్యుపంచకం విడువవలెను.

రాజ సేవలందు, రాజపంచకం, గృహసంబంధ విషయములందు అగ్ని పంచకం, ప్రయాణము నందు చోర పంచకం, వివాహమందు మృత్యుపంచకం మంచివి కావు.

తారాబలం :
జన్మ నక్షత్రం మొదలు నిత్య నక్షత్రం వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా మిగిలిన శేషము తారను సూచిస్తుంది.

జన్మ నక్షత్రం మారభ్య నిత్యభాంతించ గణ్యతే
నవ సంఖ్యా హరద్భాగం నవతారాః ప్రకీర్తితాః
జన్మ సంపద్విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధన
మిత్రం పరమ మైత్రంచ నవతారాః ప్రకీర్తితాః

1. జన్మతార, 2. సంపత్తార, 3. విపత్తార, 4. క్షేమతార, 5. ప్రత్యక్ తార, 6. సాధనతార, 7. నైధనతార, 8. మిత్రతార, 9. పరమమిత్రతార

తార ఫలితాలు
జన్మభం దేహనాశాయ సంపత్సంపద ఏవచ
విపచ్చ కార్యానాశాయ, క్షేమం క్షేమకృతే భవేత్
ప్రత్యక్చ కార్యానాశాయా సాధనం కార్యసాధనే
నైధనం నిధనేకపి స్యా మిత్రంచ సుఖసంపది
పరమమైత్రం సుఖే వింద్యాత్తారా బలమితిక్రమాత్

జన్మతార దేహనాశనము, సంపత్తార సంపదను, విపత్తార కార్యనాశనము, ఆపదలు, క్షేమతార క్షేమాన్ని, ప్రత్యక్ తార కార్యనాశనము, ప్రయోజనహానిని. సాధనతార కార్యసాధనాన్ని, నైధనతార మరణాన్ని లేక కార్యనాశనాన్ని, మిత్రతార సుఖ సంపదలను, పరమమిత్రతార సుఖాన్ని కలుగజేస్తాయి.

పై తారలలో జన్మతార, విపత్తార, ప్రత్యక్ తార, నైధనతారలు దోషతారలు.
జన్మ నక్షత్రం మొదలుగా 9 నక్షత్రాలు ప్రథమ నవకం, 10 నుండి 18 వ నక్షత్రం వరకు ద్వితీయ నవకం. 19 నుండి 27వ నక్షత్రం వరకు తృతీయ నవకం.

ప్రథమ ప్రథమం త్యాజ్యం ద్వితీయేచ తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషు వర్జయేత్

మొదటి నవకంలో జన్మతార, రెండవ నవకంలో విపత్తార, మూడవ నవకంలో ప్రత్యక్తార అశుభకరమే.

తారలు అధిపతులు
జన్మ - రవి - తాపము
సంపత్ - బుధ - ద్రవ్యలాభం
విపత్ - రాహువు - నాశనము
క్షేమ - బృహస్పతి - ధైర్యం
ప్రత్యక్ - కేతువు - మరణం
సాధన - చంద్రుడు - యశస్సు నైధన - శని - హాని
మిత్ర - శుక్ర - సంతోషం
పరమమిత్ర - కుజ - మృత్యువు

'పరమమైత్రం సుఖే వింద్యాత్' అని పరమమిత్రతార సుఖాన్ని యిస్తుందని, తారాధిపతి కుజుడు మృత్యువని వ్యతిరేక ఫలితాలని సూచించారు. కాబట్టి పరమ మిత్రతార మధ్యమ ఫలప్రదాయినిగా చెప్పుకొనవచ్చును

దోషతారలు దానములు
శాకం గుడంచ లవణం సతిలం కాంచనం క్రమాత్

అనివార్య పరిస్థితులలో జన్మ, విపత్, ప్రత్యక్, నైధన తారలలో పనులుప్రారంభించవచ్చు.

No comments:

Post a Comment