Monday, July 23, 2018

వాస్తుదోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి.....?

వాస్తుదోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి.....?
ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనబడదు.  కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ  అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ వుండవచ్చు.  వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూంటే ఆ ఇంటి వాస్తులో లోపం వున్నదని చెప్పుకోవచ్చు.  మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది.  మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి.

అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే.  ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

కొన్ని ఇళ్ళు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి.  అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మ హత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు  అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులుపడవలసి రావచ్చు.  అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు వుంటాయి.  ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం వుండదు.  అయినా మనలో అంతర్లీనంగా వున్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము.  అందుకని శాస్త్రజ్ఞులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది.  కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.

అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకులు మనమే అనుభవించాలి...వాస్తు శాస్త్రాన్ని నిందించి లాభం లేదు.
మనలో చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు శాస్త్రజ్ఞుల్ని సంప్రదిస్తాము.  అది సరికాదు.  అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్తారు.

మొదటిది భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి.  ఎందుకంటే లూజ్ సాయిల్  అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు.  కట్టడం బలంగా వుండదు.  అలాగే నేల అడుగున దేవాలయాలు, జల నాడులు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన వున్న ప్రదేశాలలో కూడ ఇల్లు కడితే సుఖంగా వుండలేరు.  అలాగే చుట్టుపక్కల ఎలా వుంది, ఇరుగూ, పొరుగూ కూడా చూసుకోవాలి.

రెండవది యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ వుండాలి, ఎన్ని గుమ్మాలు వుండాలి, ఎక్కడెక్కడ వుండాలి, కిటికీలు ఎక్కడ వుండాలి వగైరాలన్నీ ముందే వాస్తు శాస్త్రజ్ఞులను సంప్రదించి నిర్ణయించుకోవాలి.  ఆ నమ్మకం లేనివారు  శాస్త్రజ్ఞులను సంప్రదించాలి.

ఇవ్వన్నీ చూపించినా కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు.  దానికి కారణం మన ప్రవర్తనవల్ల వచ్చింది.  ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో, ఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం వుంటుందంటారు.-  జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులు, వృధ్ధులు,  బాధపడే ఇంట్లో వాస్తు దోషం వున్నట్లే.  అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు వుండవు.  సర్ప, దేవతా, ఋషి శాపాలు వున్న ఇంట, పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం వున్నట్లే.  ఇవ్వన్నీ భూమి ఎంచుకునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలుకాదు.  మన ప్రవర్తనవల్ల వచ్చిన దోషాలు.  అలాగే కొందరు ఇల్లు కట్టాక వాస్తుకోసమని కొంత భాగం పడగొట్టి మార్పులు చేర్పులు చేస్తూవుంటారు.  అలా చెయ్యటంకూడా వాస్తుదోషమేనట.

భూమిలోను, ఇంట్లోను దోషాలుంటే ఆ ఇంటిని మారిస్తే సరిపోతుంది.  మన ప్రవర్తనలో దోషం వుంటే మనం ఏ ఇంటికెళ్ళినా ఆ ప్రవర్తన మారకపోతే తిప్పలు తప్పవు.  ఎంత బాగా వాస్తు ప్రకారం కట్టిన ఇల్లయినా కలసిరాదు.  అందుకే ముఖ్యంగా మన ప్రవర్తనని సరి చేసుకోవాలి.  అప్పుడు ఏ ఇంట్లోనైనా సంతోషంగా వుండవచ్చు.

1 comment:

  1. Hi Guys, It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.

    ReplyDelete