నక్షత్ర ఆధారిత ఉపశమనాలు
జ్యోతిష శాస్త్రము మరియు కర్మ సిద్ధాంతానికి చాలా అవినాభావ సంబంధము కలదు. మన కర్మలను అనుసరించి మనకు జన్మ లభిస్తుంది. మన కర్మ ఫలాలను తెలిపేదే జ్యోతిషము, జన్మ కుండలి మరియు అందులో గల యోగాలు. మనము అనుభవించే సత్ఫలితము లేదా దుష్ఫలితము అన్ని కూడా కర్మ ఫలాలే. సత్ఫలితాలుంటే అందరికీ సంతోషము. కాని దుష్ఫలితాలు అనుభవించ వలసి వచ్చినపుడు అసలు ఆ దోషమేంటి మరియు దానికి ఏదైనా పరిహారము ఉందా అనే విషయము గూర్చి మనము మనన చేసుకుంటాము. నాకుండే పరిజ్ఞానము మరియు అనుభవాన్ని అనుసరించి దోషానికి పరిహారము లేదు. ఏలనన దోషాలు మన కర్మ ఫలాలు. కర్మ ఫలాలు అనుభవించ వలసిందే. దానికి విరుగుడు లేదు. ఐతే దానికి ఉపశమనాలు ఉంటాయి. ఉపశమనము – పూజలు, జపాలు, దానాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు ఇలా ఎన్నో రకాల ఉపశమనాలు ఉంటాయి. ఈ ఉపశమనాల వలన మనలో మనోబలం పెంపొందుతుంది. భగవంతుని పట్ల నమ్మకము పెరుగుతుంది. మనకు ఎదురగు కష్టాన్ని ఎదుర్కునే శక్తి మనలో వస్తుంది. మనకు ఎదురగు కష్టాలను అత్యంత సునాయాసంగా మనము ఎదుర్కొన గలుగుతాము. ఉపశమనాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనము అత్యంత సులభమైన మరియు ఇతరుల సహాయం లేకుండా మనమే స్వంతగా ఆచరించదగు ఉపశమనాల గూర్చి తెలుసుకొందాము. “లాల్ కితాబ్” అనే గ్రంథము లో కూడా చాలా విధాల ఉపశమనాల గూర్చిన చర్చ ఉంది. ఇట్టి ఉపశమనాలు మరియు ఇతర ప్రామాణిక గ్రంథాలు, స్వతహాగా నాకుండే అనుభవాన్ని జోడించి మీకు కొన్ని సులభమైన ఉపశమన పద్దతులను అందిస్తున్నాను.
ఇట్టి శీర్షికలో మనము ప్రధానముగా జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను.
అశ్విని:
అశ్విని నక్షత్రము నాలుగు చరణాలు – చు, చే చొ, ల – అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారందరూ అశ్విని నక్షత్ర జాతకులు. వీరు దేవా గణానికి చెందిన వారు. వీరి నక్షత్రానికి అధిపతి కేతువు. నక్షత్ర అధిష్టాన దేవత అశ్విని దేవతలు. వీరందరూ కూడా మేష రాశికి చెందినా వారు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు. మంగళవారము నాడు ఉపవాస దీక్షలు
౨. నిరుపేదలకు వైద్య సహాయాన్ని అందించడం
౩. ఉలవలతో చేసిన వంటకాన్ని భుజించడం
౪. ఉలవలు దానం ఇవ్వడం (బ్రాహ్మణుడికి – మంగళవారం నాడు)
౫. వైఢూర్యము మరియు పగడము ధరించడం – వైఢూర్యాన్ని మరియు పగడాన్ని దానం చేయడం (జాతి రత్నాలు ధరించేటపుడు జాగ్రత్తగా ఉండాలి)
౬. లోహంతో చేసిన (ఇత్తడి, రాగి లేదా పంచ లోహాలు) చేసిన అశ్వ ప్రతిమను ఇంటికి వాయువ్య మూలలో అమర్చాలి. ఇట్టి ప్రతిమను దక్షిణ ముఖము ఉండే విధంగా అమర్చాలి. ఇట్టి ప్రతిమ యొక్క ప్రత్యేకమైన ప్రమాణం లేదా సైజు అనేది ఏమీ లేదు. అశ్వ పటము అనగా ఫోటో అనుకున్నంతగా సత్ఫలితాలను ఇవ్వలేక పోవచ్చును (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి) దీన్ని చాల సులువుగా మన గృహము నందు అమర్చుకొన వచ్చును.
భరణి
భరణి నక్షత్ర నాలుగు చరణాలు మేష రాశి యందే ఉండుట వలన భరణ నక్షత్ర జాతకులు మేష రాశికి చెందినా వారై ఉంటారు. లి, లు, లే, లో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత ‘యముడు’. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి. వీరికి తూర్పు ఉత్తర దిశలు శుభము మరియు పశ్చిమ దక్షిణ దిశలు అధమాలు.
ఉపశమనాలు:
౧. శివ పంచాక్షరి జపం
౨. రుద్రార్చనలు – ఇంటియందు స్పటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్ఛారణ తో ప్రతి నిత్యం శివ లింగానికి అభిషేకం చేయడం
౩. పొట్టుతో ఉన్న బబ్బెర్లు భుజించడం (పొట్టుగల భిన్నము చేయని ధాన్యము నీటియందు నానబెట్టుకుని భుజించడం వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యం)
౪. బబ్బెర్లు, లవణం, పత్తి (గింజలు తీయని పత్తి) దానం చేయడం
౫. ఇంట్లో ప్రత్తి మొక్క పెట్టుకొని ప్రతి నిత్యం దానికి నీరు పోయడం
౬. పంచదార తో చేసిన బబ్బెర/శనగ/పెసర/కంది (ధాన్యానికి పొట్టు ఉండాలి) పూర్ణం ప్రతి నిత్యం శ్రీ మహా లక్ష్మికి నైవేద్యం చేసి తినాలి, వివాహం అయిన వారైతే భార్యాభర్తలు ఇరువురు తినాలి (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
కృత్తిక
కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు. మరియు అధిష్టాన దేవత అగ్ని. కృత్తిక నక్షత్ర ప్రధమ చరణము మేష రాశి యందును మరియు మిగిలిన మూడు చరణాలు వృషభ రాశి యందును ఉంటాయి. అ, ఇ, ఉ, ఎ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు. కృత్తిక మేష రాశి యందు జన్మించిన వారికి పశ్చిమ దక్షిణ దిశలు ప్రతికూలంగా ఉంటాయి. కృత్తిక వృషభ రాశి యందు జన్మించిన వారికి ఉత్తర దిశ ప్రతికూలంగా ఉంటుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. శివ పంచాక్షరి, శివ మానస పూజ, ఆదిత్య హృదయ పారాయణము
౨. రుద్రార్చనలు – ఇంటియందు స్పటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్ఛారణ తో ప్రతి నిత్యం శివ లింగానికి అభిషేకం చేయడం
౩. బెల్లంతో గోధుమల పాయసము ఆదివారం భుజించుట వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యము.
౪. తెల్ల సంపంగి, జాజి మల్లె, మాలతి మరియు నందివర్ధనం పుష్ప వృక్షాలను పెంచుకోవడం. వాటితో శివార్చన.
౫. గృహ/కుల సిద్ధాంతి మరియు పురోహితుల ను తరచూ కలవడం వారి ఆశిస్సులు ప్రతి సారి పొందడం (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
౬. వేదపండితుల శుశ్రూష – వారి పాదాలకు నమస్కరించుట – ఆశిస్సులు పొందుట (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
౭. దేవాలయాలయందు కామ్యాపెక్ష లేకుండా తెలుపురంగులో గల పుష్పాలను పూజకై పంపించడం. శర్కర తో వండిన శ్వేతాన్నం నివేదన చేయడం. ఇట్టి వాటియందు కామ్యాపెక్ష ఏమాత్రం ఉండరాదు. (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
రోహిణి:
రోహిణి నక్షత్ర నాలుగు చరణాలు వృషభ రాశియందే ఉంటాయి. ఓ, వ, వి, వు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మనామాక్షరము గల వారు, జన్మ నామము లేని వారికి వ్యవహార నామాక్షరము గల వారందరూ రోహిణి నక్షత్రానికి చెందిన వారే మరియు వారు వృషభ రాశికి చెందిన వారే. వీరిది మనుష్య గణము. వీరికి పశ్చిమ మరియు తూర్పు దిశలు అనుకూలంగా ఉంటాయి మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమములు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు
౨. తెలుపు రంగు వస్త్రాలు ధరించడం
౩. తెల్లని ధాన్యము మరియు తెలుపు రంగు వస్త్రాలు బ్రాహ్మణోత్తమునికి దానము చేయడం
౪. శివునికి గోక్షీరము తో అభిషేకము
౫. శ్రీ లలితాంబ కు త్రిమధుర నైవేద్యము (ఆవుపాలు, తేనే, శర్కర)
౬. తెల్లని ఎద్దును శివాలయంలో పూజించడం. వాటికి గ్రాసము తినిపించుట.
౭. గోశాలకు గోగ్రాసమును సమకూర్చుట
౮ గోవులకు సేవ చేయడం
మృగశిర:
మృగశిర ప్రథమ ద్వితీయ చరణాలు వృషభ రాశి యందును, తృతీయ చతుర్థ చరణాలు మిథున రాశి యందును ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులు దేవ గణమునకు చెందిన వారు. వె, వో, క, కి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు లేదా వ్యవహార నామము గల వారు ఈ నక్షత్ర కోవకు వస్తారు. మృగశిర ప్రథమ ద్వితీయ నక్షత్ర జాతకులకు తూర్పు దిశ శ్రేష్టమైనది. మిగిలిన దిశలు మాధ్యమాలు. తృతీయ చతుర్థ చరణాల వారికి తూర్పు ఉత్తర దిశలు శ్రేష్టము. మిగిలిన దిశలు మధ్యమ లేదా అధమములు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. అంగారక చతుర్థి, అంగారక షష్టి, సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు
౨. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన, పైన తెలపబడిన దినములందు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు
౩. ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు ధాన్యము బ్రాహ్మణోత్తమునికి దానము చేయుట
౪. ఎర్రని కందులు శర్కర తో చేసిన పూర్ణము శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయుట.
౫. వీరు నలుపు మరియు నీలము రంగు వస్త్రాలను దరించ రాదు
౬. వార్తాహరునికి (వార్తలు చేరవేయు వారు, దూతలు) ఎరుపు రంగు వస్త్రాలు బహుకరించుట
౭. సంగీత వేత్తలకు ఎర్రని వస్త్రములు బహుకరించి వారి ఆశిస్సులు పొందుట.
౮. శ్రీ దుర్గ అమ్మవారికి ఎర్రని వస్త్రమును బహుకరించుట. శ్రీ దుర్గా ఆలయమందు ఎర్రని వస్త్రాలు దానం చేయుట.
౯. దేవాలయాలయందు పళ్ళు దానం చేయుట.
ఆర్ద్ర:
ఆర్ద్ర నక్షత్ర 4 చరణాలు మిథున రాశిలోనే ఉంటాయి. కావున ఆర్ద్ర నక్షత్రము ఏ పాదములో జన్మించినను వారు మిథున రాశికి చెందిన వారే. కూ, ఘ, జ్ఞ, ఛ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామ మరియు వ్యవహార నామము గల వారందరూ ఈ రాశి కోవకే వస్తారు. ఈ నక్షత్ర జాతకులు మనుష్య గణము నకు చెందిన వారు. ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత ‘రుద్రుడు’. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభాలు మరియు పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమ ఫలాలను ఇస్తాయి. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. రుద్రార్చనలు వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౨. ప్రతి నిత్యము స్పటిక లింగానికి ఆవు పాలతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అభిషేకించడం.
౩. బియ్యాన్ని నానబెట్టి అట్టి నానిన బియ్యముతో శివుడిని అభిషేకించుట.
౪. నల్లని లేదా నీలి వర్ణము గల వస్త్రములకు సాధ్యమైనంత వరకు దూరముగా ఉండుట.
౫. శ్రీ సుబ్రహ్మణ్య యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతి నిత్యం దానికి విభూదితో అర్చన చేయుట
౬. ప్రతి నిత్యం ఆహారంలో రెండు విధాల పప్పు దినుసులను వాడుట వీరికి శుభ ఫలాలను ఇస్తుంది.
౭. చోరులను మరియు మోసగాళ్ళను పట్టించుట లో సహాయపడుట.
౮. జంతు వధ నిషేధాన్ని వీరు సమర్థించాలి.
౯. నిరంతరమూ శివపంచాక్షరి జప చేస్తూ ఉండాలి. అదే వీరికి సర్వ విధాల రక్ష.
పునర్వసు:
పునర్వసు నక్షత్ర ౩ చరణాలు మిథున రాశి యందును మరియు చతురత చరణము కర్కాటక రాశి యందును ఉంటుంది. కే, కో, హ, హి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహారము నామము గల వారందరూ కూడా ఈ నక్షత్ర జాతకులే. ఈ నక్షత్రములో జన్మించిన వారు దేవగణ జాతకులు. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభాలు మరియు పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమ ఫలాలను ఇస్తాయి. ఈ నక్షత్రానికి అధిపతి గురు మరియు అధిష్టాన దేవత ‘అదితి’ జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వేదపండితులు మరియు సద్బ్రాహ్మణ ఆశిస్సులు పొందడం మరియు వారి శుశ్రూష
౨. పేద బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా దానం
౩. వృద్ధ బ్రాహ్మణులకు చేయూతనందించుట
౪. శ్రీ దత్తాత్రేయుని ఆరాధన
౫. గురు దేవుల ఆశిస్సులు పొందుట
౬. మేలిరకం బియ్యం తో అన్నదానం
౭. మేలిరకం బియ్యాన్ని ఊరికి పడమర దిశలో ఉన్న లేదా ఊరికి దగ్గరగా ఉన్న శివాలయానికి దానం చేయుట.
పుష్యమి:
పుష్యమి నక్షత్ర నాలుగు చరణాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. హు, హి, హో, ఢ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు లేదా వ్యవహార నామము గల వారందరూ పుష్యమి నక్షత్ర కర్కాటక రాశికి చెందినా వారే. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు మరియు అధిష్టాన దేవత బృహస్పతి. ఈ నక్షత్రమున జన్మించిన వారందరూ కూడా దేవ గణము నకు చెందిన వారు. వీరికి తూర్పు, ఉత్తర మరియు దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ ఫలాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. యజ్ఞ యాగాదులు చేయు ఋత్త్విక్కులను గౌరవించడం – వారి ఆశిస్సులు పొందడం
౨. యజ్ఞ యాగాదులు నిర్వహించకున్నను వాటిని దర్శించు కోవడం మరియు యజ్ఞ నారాయణుడి ప్రసాదం స్వీకరించడం
౩. సాధు సత్పురుషులు, బ్రహ్మజ్ఞానుల ఆశిస్సులు పొందడం. వారికి తగిన విధంగా సేవలందించడం.
౪. ఈ నక్షత్రము లో జన్మించిన వారు రాజాజ్ఞను ఎట్టి పరిస్థితిలో నైనా తిరస్కరించ రాదు. రాజాజ్ఞ పాలన వీరు తప్పక చేయాలి.
౫. రాజు వద్ద గల మంత్రుల వద్ద శిష్యరికం చేయడం.
౬. గోధుమలు, యవలు(బార్లీ), బియ్యం మరియు చెరుకు మొదలు వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం చేయుట. ఇట్టి వస్తువులను శివాలయంలో దానం చేయుట.
౭. గురువులను పూజించుట మరియు వారి ఆశిస్సులు పొందుట వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౮. ఇంటిలో దక్షిణ గోడకు ఉత్తర అభిముఖంగా శ్రీ దత్తాత్రేయుని ప్రతిమను ఉంచిన వీరికి అత్యంత శుభ ఫలితాలు అందుతాయి. ఇట్టి ప్రతిమకు నిత్యం ధూప దీప నైవేద్యాలు చేసిన ఇంకను చక్కని సత్ఫలితాలు ఉంటాయి.
౯. గురువారము పుష్యమి నక్షత్రము వచ్చిన రోజున గురు పుష్యమి యోగము – అట్టి యోగము గల నాడు లేదా రోజున గురువుల ఆశిస్సులను పొందుట, శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సద్గురు సాయినాధుని దర్శనము శుభ ఫలితాలను ఇస్తుంది.
ఆశ్రేష:
ఆశ్రేష నక్షత్రము నాలుగు చరణాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందినా వారు. డీ, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా ఆశ్రేష నక్షత్ర కర్కాటక రాశికి చెందిన వారు. ఆశ్రేష నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత ‘సర్పము’. తూర్పు మరియు ఉత్తర దిశలు సత్ఫలితాలను మరియు దక్షిణ పశ్చిమ దిశలు వీరికి మధ్యమ లేదా అధమ ఫలితాలను ఇస్తాయి. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వైద్యులను, వైద్య వృత్తిలో ఉన్న వారిని సన్మానించుట
౨. సర్పారాధన, సర్ప ప్రతిమలకు లేదా విగ్రహాలకు మంగళ వారాలు ఆవుపాలతో అభిషేకించుట.
౩. పెసళ్ళు లేదా పెసరపప్పు నాన బెట్టి శ్రీ దుర్గాదేవికి నివేదించి స్వీకరించాలి
౪. పెసళ్ళు లేదా పెసరపప్పు శర్కర తో పూర్ణం వండి అమ్మవారికి నివేదించి భుజించాలి.
౫. సీసం తో గాని లేదా రాగితో గాని లేదా వెండితో తో చేసిన సర్ప ప్రతిమను చెరువులోనో, నదిలోనో లేదా నూతిలోనో ఆశ్రేష నక్షత్రము గల దినము నాడు వేయాలి.
౬. ఆశ్రేష నక్షత్రము గల రోజు సర్ప విగ్రహాన్ని లేదా ప్రతిమను అభిషేకించుట.
(ఆశ్రేష నక్షత్ర ఉపశమనాలు జాతకమున సర్ప దోషము గల వారికీ మరియు కాల సర్ప దోషము గల వారికి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి)
మఖ:
మఖ నక్షత్ర 4 చరణాలు కూడా సింహ రాశిలోనే ఉంటాయి. మఖ నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. మా, మీ, ము, మే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ మఖ నక్షత్ర సింహ రాశికి చెందిన వారే. మఖ నక్షత్రానికి అధిపతి కేతువు మరియు అధిష్టాన దేవతలు “పితృ”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలితాలను దక్షిణ దిశ మధ్య పశ్చిమ దిశా అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరు పితృ దేవతల ప్రీత్యర్థం తర్పణలు దానాలు చేస్తూ ఉండాలి.
౨. ముసలి వారికి, రోగ గ్రస్తులకు నిరంతరం సహాయం అందిస్తూనే ఉండాలి.
౩. తల్లిదండ్రుల ఆశిస్సులు నిరంతరం పొందుతూ ఉండాలి. మరియు వారికి సరియైన విధంగా సేవలు చేస్తూ ఉండాలి
౪. పూర్వీకుల ప్రీత్యర్థం దాన ధర్మాదులను ఆచరించాలి.
౫. ఈ నక్షత్ర జాతకులు మాతా పితరులకు సేవ చేయని ఎడల – మాత్రు శాప మరియు పితృ శాప సుతక్షయమనబడే యోగాల వలన బాధపడలసి ఉంటుంది.
౬. వీరు కొండలు మరియు ఎత్తైన ప్రదేశం లో ఉన్న శివాలయాలు లేదా ఇతర ఆలయాలందు వెలసి ఉన్న దేవతలను దర్శించు కోవాలి. ఇట్టి దేవాలయాలయందు దాన ధర్మాదులను ఆచరించాలి.
౭. ఉలవలు దానం చేయడం మరియు ఉలవలను వంటకాలందు వాడుట మరియు ఇట్టి నక్షత్ర జాతకులు భుజించుట.
పూర్వా ఫల్గుణి (పుబ్బ)
పుబ్బ లేదా పూర్వ ఫల్గుణి నక్షత్రము నందలి 4 చరణాలు కూడా సింహ రాశియందు ఉంటాయి. మో, ట, టి, టు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు జన్మ నక్షత్రము గల వారందరూ కూడా పుబ్బ నక్షత్ర సింహ రాశికి చెందినా వారే. ఈ నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. పూర్వాఫల్గుణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత “భగ”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలితాలను దక్షిణ దిశ మధ్య పశ్చిమ దిశా అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఈ నక్షత్ర జాతకులు కళాకారులను, కవులను, సంగీత కారులను, నటులను, మిత్ర వర్గాన్ని సదా గౌరవించాలి.
౨. వీరు తేనే ను దానం చేయాలి. ప్రధానంగా శుక్ర వారం నాడు తేనే దానం చేయుట వీరికి శుభము
౩. ఇంటి యందు తూర్పు ముఖంగా నటరాజ విగ్రహాన్ని పెట్టుకోవాలి
౪. సుగంధ ద్రవ్యాలు, అగర, చందనము, మసాలా దినుసులను సద్బ్రాహ్మణు లకు దానం చేయాలి.
౫. ఇంటి యందు “కస్తూరి” ఉంచుకోవాలి. మరియు కస్తూరి ని దానం చేయాలి.
ఉత్తరాఫల్గుణి (ఉత్తర):
ఉత్తరా ఫల్గుణి ప్రథమ చరణము సింహ రాశి యందును మరియు మిగిలిన 3 చరణాలు కన్యా రాశి యందును ఉంటాయి. టే, టో, ప, పి అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామాలు గల వారు మరియు వ్యవహార నామాలు గల వారందరూ ఉత్తరా ఫల్గుణి నక్షత్రమునకు చెందిన వారే. వీరు మనుష్య గణమునకు చెందిన వారు. ఉత్తరా ఫల్గుణి నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత “అర్యముడు”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరికి శ్రీ సూర్యారాధన అత్యంత శుభ ఫలాలను ఇస్తుంది.
౨. బ్రాహ్మణులు తప్పని సరిగా సంధ్యా వందనము ఆచరించుట, సూర్యునికి అర్ఘ్య ప్రధానము చేయుట.
౩. బ్రాహ్మణులు కాని వారు రాగి పాత్రలో జలాన్ని సూర్యునికి అభిముఖముగా నిలబడి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం వదలాలి.
౪. కుల దైవాన్ని మరియు ఇష్టదైవాన్ని తప్పని సరిగా పూజించుకోవాలి.
౫. ప్రతి ఆదివారం నాడు గోధుమలు, ఆవు నెయ్యి మరియు బెల్లం తో చేసిన పాయసం సూర్య భగవానునికి నివేదన చేసి స్వీకరించాలి.
౬. గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము, ఆవు నెయ్యి, రాగి పాత్రలను శివాలయాలకు దానం చేయాలి. ఇట్టి వస్తువులను సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౭. వీరు రాగి కడియాన్ని దక్షిణ హస్తమునకు ధరించాలి.
౮. ఉత్తములకు చక్కని నాణ్యమైన లేదా నాణ్యత గల ధాన్యమును దానం చేసుకోవాలి. వారి ఆశిస్సులను పొందాలి. ప్రధానంగా భానువారాలు ఇట్టి దానాలు చేసిన శుభ ఫలితాలు ఉంటాయి.
హస్త (హస్తమి):
హస్త నక్షత్ర నాలుగు చరణాలు కన్యా రాశి ఉంటాయి. పు, ష, ణ, ఠ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ హస్త నక్షత్ర కన్యా రాశికి చెందిన వారే. వీరు దేవ గణమునకు చెందిన వారు. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు మరియు అధిష్టాన దేవత “సవితృ”. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరికి సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౨. వేద పండితులు, వేదాధ్యయనము చేయు వారి సాంగత్యము చేయాలి
౩. వ్యాపార వేత్తలతో స్నేహం చేయండి. వారిని గౌరవించండి. అవసరమైతే వారికి సహాయం చేయండి.
౪. వీలైనంత వరకు తెల్లని వస్త్రాలను ధరించాలి. వీరికి నలుపు మరియు నీలం రంగ వస్త్రాలు ప్రతికూల ఫలాలను ఇస్తాయి.
౫. ఇంటికి తూర్పు ఈశాన్య భాగంలో శ్రీ గణేశ వెండి విగ్రహాన్ని పశ్చిమ ముఖంలో ఉంచి ఇంట్లో నుండి బయటకు వెళ్ళునపుడు నమస్కరించుకోండి.
౬. వెండితో చేసిన శ్రీ గణేశ విగ్రహాన్ని వేద పండితులకు మరియు సద్బ్రాహ్మణుడికి దానం చేయండి.
౭. శ్రీ సరస్వతి దేవాలయం లో అమ్మవారికి తెల్లని వస్త్రాలను బహుకరించండి.
౮. తెలుపు రంగు వస్త్రాలను, తెల్లని ధాన్యాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేయండి.
చిత్త:
చిత్త నక్షత్రము రెండు పాదాలు కన్యా రాశి యందును మరియు మిగిలిన రెండు పాదాలు తులా రాశి యందును ఉంటాయి. ఇట్టి నక్షత్రమున జన్మించిన వారు రాక్షస గణమునకు చెందిన వారు. పె, పో, రా, రి అనే నక్షత్రాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహారము నామము గల వారందరూ చిత్త నక్షత్రమున జన్మించిన వారే. చిత్త నక్షత్ర ప్రథమ మరియు ద్వితీయ చరణములు కన్యా రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. చిత్త నక్షత్ర తృతీయ మరియు చతురత చరణములు తులా రాశి యందు జన్మించిన వారికి తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు మరియు అధిష్టాన దేవత “త్వష్ట” జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. బట్టల నేతగాళ్లకు సహాయాన్ని అందించుట
౨. నేత్ర దానం చేయుట
౩. నేత్ర సంబంధమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారికి సహాయాన్ని అందించుట
౪. నేత్ర వైద్యులను గౌరవించుట
౫. హస్త కళలు, డిజైన్ వేయు వారు, వడ్రంగి మరియు కంసాలి పని చేయువారికి చేయూతనందించుట
౬. పలు విధాలైన సుగంధ ద్రవ్యాలను ఎర్రని వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం చేయుట
స్వాతి:
స్వాతి నక్షత్ర నాలుగు చరణాలు కూడా తులా రాశియందే ఉంటాయి. రు, రే, రో, త అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహారము నామము గల వారందరూ కూడా స్వాతి నక్షత్ర తులా రాశికి చెందిన వారే. వీరు దేవగణము నకు చెందిన వారు. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత “వాయు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. గుర్రపు నాడ ఇంటికి నైఋతి భాగంలో వేలాడదీయాలి.
౨. గుర్రాలు, పశువులు, పక్షులు మొదలగు వాటి గ్రాసము మరియు దాన కొరకు ఆర్ధిక సహాయమును అందించుట.
౩. గోగ్రాసము నకు ఆర్ధిక సహాయమును అందించుట.
౪. నిరంతరం దైవ ధ్యానం లో గడిపే వారికి, యోగులకు, దేవాలయాలయందు నిత్యార్చన చేసే ఉత్తములైన మరియు సద్గుణ సంపన్నులైన అర్చకులకు రెండు సేర్ల లేదా రెండు కిలోల శనగ పప్పును దానం చేయుట.
౫. ఉత్తములైన బ్రాహ్మణులకు విసనకర్రలను – వింజామర లను (ఇప్పటి కాలానికి అనుగుణంగా ఫ్యాన్) దానం చేయుట
విశాఖ:
విశాఖ నక్షత్రము 3 పాదాలు తులా రాశి యందును మరియు చతుర్థ చరణము వృశ్చిక రాశి యందును ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. తీ, తు, తే, తో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము లేదా వ్యవహార నామము గల వారందరూ విశాఖ నక్షత్ర జాతకులే. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి మరియు అధిష్టాన దేవత ఇంద్ర/అగ్ని. విశాఖ నక్షత్ర మొదటి మూడు చరణాలు తులా రాశి యందు ఉండుట వలన ఇట్టి నక్షత్ర జాతకులకు తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. మరియు విశాఖ చతుర్థ చరణము వృశ్చిక రాశి యందుండుట వలన తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలాలను, దక్షిణ దిశా మధ్య ఫలాలను, పశ్చిమము అధమ ఫలాలను ప్రసాదించును. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. మీ కంటే వయస్సులో గాని లేదా స్థాయిలో గాని తక్కువ అయిన వారిని అగౌరవ పరచరాదు.
౨. విద్యాధికులను గౌరవించండి మరియు వారి ఆశిస్సులు పొందండి.
౩. ఇట్టి నక్షత్ర జాతకులు వీలైనంత వరకు ఆగ్నేయ భాగం లో వంట గది గల ఇళ్లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
౪. యజ్ఞ యాగాదులందు యజ్ఞ నారాయణుడి తీర్థ ప్రసాదములు మరియు అట్టి యజ్ఞాన్ని నిర్వహించు ఋత్విక్కుల ఆశిస్సులు పొందాలి.
౫. ఇంటికి ఉత్తర భాగంలో ఎర్రని పూలు పూసే చెట్లను పెంచాలి (ఎర్ర మందార, ఎర్ర గులాబి, కాంచనం మరియు గన్నేరు మొదలగునవి).
౬. శనగలు మరియు పెసళ్ళు బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౭. శ్రీ సద్గురు సాయినాధుని మరియు శ్రీపాద శ్రీ వల్లభుడి ఆరాధన చేయాలి.
అనూరాధ:
అనూరాధ నక్షత్ర 4 చరణాలు కూడా వృశ్చిక రాశి యందు ఉంటాయి. న, ని, ను, నే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా అనూరాధ నక్షత్ర వృశ్చిక రాశికి చెందిన వారే. వీరు దేవ గణమునకు చెందిన వారు. ఇట్టి నక్షత్రమున జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలాలను, దక్షిణ దిశ మధ్యమ ఫలాలను, పశ్చిమము అధమ ఫలాలను ప్రసాదించును. అనూరాధ నక్షత్రానికి అధిపతి శని మరియు అధిష్టాన దేవత “మిత్ర”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరు చక్కని గోష్టి మరియు సత్సంగాలందు పాల్గొనాలి.
౨. ఉత్తములు మరియు జ్ఞానులతో మిత్రుత్వాన్ని చేయాలి
౩. వీరు ఎట్టి పరిస్థితిలో మిత్ర ద్రోహము చేయరాదు.
౪. ఉన్ని మరియు చర్మం తో చేసిన వస్తువులను దానం చేయాలి.
౫. శ్రీ మహావిష్ణు ఆరాధన శుభ ఫలాలను ఇస్తుంది
౬. స్వచ్చమైన నెయ్యి, ఖర్జూరాలు, బెల్లం, కొబ్బరి మరియు బియ్యం పిండి తో చేసిన తీపి పదార్థాలను దానం చేయాలి. ఇట్టి దానాన్ని సద్బ్రాహ్మణుడికి గాని మిత్రులకు గాని ఇవ్వాలి.
జ్యేష్ఠ:
జ్యేష్ఠ నక్షత్ర నాలుగు చరణాలు వృశ్చిక రాశియందే ఉంటాయి. నో, యా, యి, యూ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా జ్యేష్ఠ నక్షత్ర వృశ్చిక రాశికి చెందిన వారే. వీరు రాక్షస గణమునకు చెందిన వారు. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు, ఉత్తర దిశలు శుభ ఫలితాలను, దక్షిణ మరియు పశ్చిమ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత “ఇంద్రుడు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఇట్టి నక్షత్ర జాతకులు తమకంటే పెద్ద వారిని ఎల్లప్పుడూ గౌరవించాలి.
౨. చోరులు మరియు చొర ప్రవృత్తి గల వారిని పట్టించుటలో సహకరించాలి
౩. యుద్ద వీరులను మరియు సైన్యాన్ని గౌరవించాలి. వారికి సదా సేవలను అందించాలి.
౪. పెసర్లు, శర్కర మరియు మంచి నెయ్యి తో చేసిన పూర్ణం శ్రీ మహావిష్ణుకు నివేదన చేసి స్వీకరించాలి.
౫. శ్రీ విష్ణు దేవాలయాలకు తరచూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి
౬. శ్రీ మహావిష్ణు దేవాలయాలయందు పెసర్లు దానం చేయాలి
౭. ఒక కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి గాని లేదా రక్షక భటులకు గాని దానం చేయాలి.
౮. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం శుభ ఫలాలను ఇస్తుంది
౯. శ్రీ వైష్ణవ పీఠాధిపతుల సందర్శన మరియు వారి ఆశిస్సులను పొందాలి.
మూల:
మూల నక్షత్ర నాలుగు చరణాలు ధనుస్సు రాశిలో ఉంటాయి. యే, యో, బ. బి అను అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారందరూ మూల నక్షత్ర ధనుస్సు రాశికి చెందిన వారే. మూలా నక్షత్రములో జన్మించిన వారు రాక్షస గణమునకు చెందిన వారు. మూల నక్షత్ర జాతకులకు తూర్పు మరియు ఉత్తర దిశలు అత్యంత శుభప్రదముగాను, దక్షిణ మరియు పశ్చిమ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరియు అధిష్టాన దేవత “రాక్షస”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. గృహము నందు ఓషధులను పెంచాలి.
౨. రైతులకు మేలురకం విత్తనాలను దానం చేయాలి
౩. ఔషధ తత్త్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౪. పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలలకు చేయూతనందించాలి.
౫. కుమారి లేదా Aloe Vera లేదా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య భాగంలో పెంచాలి.
౬. మంగళ వారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషది మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్త్వం గల పుష్పాలను జలం లో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి.
పూర్వాషాఢ:
పూర్వాషాఢ నక్షత్ర 4 చరణాలు కూడా ధనుస్సు రాశి యందే ఉంటాయి. బూ, ధ, భా, ఢ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ పూర్వాషాఢ నక్షత్ర ధనుస్సు రాశి కి చెందిన వారే. వీరు మనుష్య గణమునకు చెందిన వారు, వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు అత్యంత శుభప్రదముగాను మరియు పశ్చిమ దక్షిణ దిశలు మధ్యమ ఫలితాలను ఇస్తాయి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత “ఆప”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామమునకు తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి. తూర్పు దిశలో దేవాలయము లేనట్లయితే గ్రామములో గల ఏదేని ఒక దేవాలయంలో బహుకరించాలి.
౨. ప్రతి గురు మరియు శుక్ర వారాలలో చేపలకు ఆహారం వేయాలి.
౩. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలి వేయాలి
౪. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్ర వారం నాడు దానం చేయాలి
౫. దేవాలయాలకు అగరువత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబి జలము, మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొని ఇవ్వాలి.
౬. జాలరులు – చేపలు పట్టే వారు కష్టాలలో ఉన్నట్లైతే వారిని ఆపన్నహస్తం అందించాలి.
ఉత్తరాషాఢ:
ఉత్తరాషాఢ ప్రథమ చరణము ధనుస్సు నందును మరియు మిగిలిన మూడు చరణాలు మకర రాశి యందును ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. బే, బో, జా, జి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులే. ఉత్తరాషాఢ ప్రధమ చరణమున ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. ఉత్తరాషాఢ ద్వితీయ, తృతీయ మరియు చతుర్థ చరణము మకర రాశి యందు జన్మించిన వారికీ తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత “విశ్వదేవ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమకూర్చాలి
౨. ఏనుగు మరియు గుర్రపు బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండే లాగ అమర్చాలి లేదా తగిలించాలి
౩. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభ ఫలాలను ఇస్తుంది
౪. వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్ళు పోయాలి
౫. ఏనుగులకు అరటి పండ్లను తినిపించాలి
౬. గోధుమలు, బెల్లం, మంచినేయ్యి తో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి
శ్రవణము:
శ్రవణా నక్షత్ర నాలుగు చరణాలు మకర రాశి యందు ఉంటాయి. జు, జే, జో, ఖ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము మరియు వ్యవహార నామము కల వారందరూ శ్రావణ నక్షత్ర మకర రాశికి చెందిన వారు. వీరు దేవా గణమునకు చెందిన వారు. శ్రావణ నక్షత్ర మకర రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. శ్రవణా నక్షత్రమునకు అధిపతి చంద్రుడు మరియు అధిష్టాన దేవత “విష్ణు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరు విష్ణు మూర్తిని మరియు విష్ణు భక్తులను గౌరవించాలి.
౨. వీరు గృహము నందు ఔషధ గుణములు గల మొక్కలను పెంచాలి.
౩. వీరు అహింస ను ఎత్తి పరిస్థితి లో ప్రోత్సహించ రాదు.
౪. సాధ్యమైనంత వరకు శాకాహార భోజనం చేయాలి
౫. సర్వ భూతములందు దయను కలిగి ఉండాలి. ఈర్ష్య అసూయలకు దూరంగా ఉండాలి.
౬. బకుల, జుహీ లేదా మల్లెలు, కదంబ పుష్పము, సంపంగి, అశోక, చంప అనబడే పుష్పాలు అన్ని గాని లేదా ఏవేని కొన్ని గాని శ్రీ విష్ణు దేవాలయాలకు బహుకరించండి. ఇట్టి పుష్పాల మొక్కలను ఇట్టి దేవాలయాలకు బహుకరించండి.
౭. శ్రీ మహా విష్ణు దేవాలయాలయందు మూల విరాటు విగ్రహానికి అలంకార సామాగ్రిని సమకూర్చండి.
౮. శ్రీ మహా విష్ణు దేవాలయాలను, శ్రీ వెంకటేశ్వర దేవాలయాలను, శ్రీ కృష్ణ మందిరాలను దర్శించాలి.
ధనిష్ఠ:
ధనిష్ఠ నక్షత్ర రెండు చరణాలు మకర రాశి యందును మరియు చివరి రెండు చరణాలు కుంభ రాశి యందును ఉంటాయి. గ, గి, గు, గే అనబడే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము లేదా వ్యవహార నామము గల వారు ధనిష్ఠ నక్షత్ర జాతకులు. ధనిష్ఠ నక్షత్రము రాక్షస గణమునకు చెందినది. ధనిష్ఠ నక్షత్ర ప్రథమ మరియు ద్వితీయ చరణములతో మకర రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. ధనిష్ఠ నక్షత్ర తృతీయ మరియు చతురత చరణము కుంభ రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి అంగారకుడు మరియు అధిష్టాన దేవత “వసు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరికి శ్రీ శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
౨. శివాలయాలయందు గోధుమలను సద్బ్రాహ్మణు లకు దానం చేయాలి
౩. కందులు మరియు కందిపప్పు లాంటి ధాన్యాన్ని దానం చేయాలి
౪. శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయాలయందు స్వామి వారి అభిషేకానికి కావలసిన సామాగ్రిని ఇవ్వాలి.
౫. స్త్రీలను ద్వేషించ రాదు. స్త్రీలను గౌరవించాలి.
౬. పాత మిత్రులను సదా గౌరవించాలి
౭. ధర్మ పరాయణత ను కలిగి ఉండాలి. అధర్మాన్ని ప్రోత్సహించ రాదు.
శతభిష (శతతార):
శతభిష నాలుగు చరణాలు కుంభ రాశి యందు ఉంటాయి. గో, స, సి, సు అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారు శతభిష నక్షత్ర కుంభ రాశికి చెందిన వారగుదురు. శతభిష నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. శతభిష నక్షత్ర కుంభ రాశి యందు జన్మించిన వారికీ తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత “వరుణ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరు ఎల్లపుడూ పరిశుభ్రమైన దుస్తులను మాత్రమె ధరించాలి.
౨. నీటియందు తిరిగే చేపలు మరియు ఇతర జంతు రాశికి ఆహారాన్ని వేయాలి.
౩. వీరు సముద్ర వస్తువులను ఇతరులకు దానం చేయాలి
౪. స్వల్ప ప్రమాణంలో మద్యం ను నీటిలో ప్రవహింప చేయాలి.
౫. వీరు మాధ్యమును సేవించ రాదు (ఆ విషయానికి వస్తే మద్యం ఎవరు కూడా సేవించ రాదు)
౬. వీరు మినుములు మరియు నల్లని నువ్వులు శివాలయాలయందు దానం చేయాలి
పూర్వాభాద్ర:
పూర్వాభాద్ర మొదటి మూడు చరణాలు కుంభ రాశి యందును మరియు చివరి పాదము మీన రాశి యందును ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. సే, సో, ద, ది అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ పూర్వాభాద్ర నక్షత్రమునకు జన్మించిన వారు. పూర్వాభాద్ర మొదటి మూడు చరణము లందు జన్మించిన కుంభ రాశి వారికీ తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. పూర్వాభాద్ర చతుర్థ చరణము మీన రాశి యందు జన్మించిన వారికి ఉత్తర మరియు దక్షిణ దిశలు శుభ మరియు తూర్పు మరియు పశ్చిమ దిశలు మధ్యమ లేదా హీన ఫలాలను ఇస్తాయి. పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి బృహస్పతి మరియు అధిష్టాన దేవత “అజైకపాద”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఆవులను కాచే కాపరులకు కష్టాలలో ఉన్న వారికి చేయూతనందించాలి.
౨. గృహము నందు మామిడి చెట్టు పెంచాలి. పెంచే సౌకర్యము లేని పక్షంలో మామిడి చెట్టుకు నీళ్ళు పోయాలి.
౩. ఔషధీ మొక్కలను గృహము నందు పెంచాలి.
౪. ఆయుర్వేద వైద్యులను గౌరవించాలి. అవసరం అయినపుడు ఆయుర్వేద మందులను సేవించాలి.
౫. దొంగలను పట్టించుటలో సహకరించాలి
౬. ఒంటరిగా జీవించే సాదువులకు నెయ్యిని దానం చేయాలి.
౭. గ్రామానికి దూరంలో ఉన్న శివాలయాలయందు శివునికి చక్కని నాణ్యమైన గోఘ్రుతం తో అభిషేకం చేయాలి. ఇట్టి ఆవునేయ్యిని శివాలయాలకు దానం చేయాలి.
౮. వేద పండితులను సన్మానించాలి మరియు వారి ఆశిస్సులు పొందాలి.
౯. ఏక పాదులకు (కుంటి వారు) సేవ చేయాలి. ప్రధానంగా వారికి వైద్య సహాయాన్ని అందించాలి.
ఉత్తరాభాద్ర:
ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు చరణాలు మీన రాశిలో ఉంటాయి. దూ, శం, ఝూ, థ – అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము కల వారందరూ ఉత్తరాభాద్ర నక్షత్ర మీన రాశి జాతకులు. వీరు మనుష్య గణమునకు చెందిన వారు. ఈ నక్షత్రమున జన్మించిన వారికీ ఉత్తర దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు తూర్పు మరియు పశ్చిమ మధ్యమ ఫలాలను ఇస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు మరియు అధిష్టాన దేవత “ఆహిర్బుద్నియ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఇట్టి జాతకులు నిరంతరమూ దాన ధర్మాదులను ఆచరిస్తూ ఉండాలి.
౨. బ్రాహ్మణులు, ప్రధానంగా వృద్ధ బ్రాహ్మణులు, తపస్సు చేసుకునే వారి ఆశిస్సులు సదా పొందాలి.
౩. విలువైన ధాన్యము, పంచదార, బియ్యం మరియు పాలు మొదలగునవి బ్రాహ్మణులకు దానం చేయాలి.
౪. “అష్టౌ బ్రాహ్మణాన్” ఎనిమిది మంది బ్రాహ్మణులకు పాలతో చేసిన మిఠాయిలు, కోవా మొదలగునవి దానం చేయాలి.
౫. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాలయందు పాలతో చేసిన మిఠాయిలు మరియు కోవా మొదలగునవి స్వామి వారికి నివేదన చేయాలి.
౬. వృద్ధాశ్రమాలయందు ఉన్న వృద్ధులకు మంచి నాణ్యమైన విలువైన ధాన్యము, పంచదార, బియ్యం మరియు పాలు, వస్త్రాలను దానం చేయాలి. (ఇట్టి వస్తువు లందు ఏదేని ఒకటి కాని లేదా అన్నీ కాని చేయవచ్చు. యథాశక్తి.)
రేవతి:
రేవతి నక్షత్ర నాలుగు చరణాలు మీన రాశి యందు ఉంటాయి. దే, దో, చ, చి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ రేవతి నక్షత్ర మీన రాశికి చెందినా వారే. ఇట్టి నక్షత్ర జాతకులు దేవా గణమునకు చెందిన వారుల. ఈ నక్షత్రమున జన్మించిన వారికి ఉత్తర దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు తూర్పు మరియు పశ్చిమ మధ్యమ ఫలాలను ఇస్తాయి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత “పూషన్”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. “దక్షిణావర్తి శంఖాన్ని” శివ మరియు విష్ణు ఆలయాలకు బహుకరించాలి.
౨. వీరు గృహము నందు దక్షిణావర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి
౩. గ్రామము నందు గల శక్తి దేవాలయాలయందు శ్రేష్టమైన ముత్యాల హారాన్ని అమ్మవారి మూల విరాట్టుకు బహుకరించాలి.
౪. శంఖము, ముత్యాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౫. సువాసన గల పుష్పాలను మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక బుట్టతో సహా శివాలయంలో దానం చేయాలి.
౬. పలు రకాలైన సుగంధ పుష్పాలతో శ్రీ మహా విష్ణును పూజించాలి.
౭. ఉప్పు, పద్మాలు, పలు విధాలైన ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లు మరియు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానం చేయాలి.