Monday, May 28, 2018

*చతుర్థ(సుఖ)భావ ఫలాధ్యాయము*

ఇప్పుడు మాతృభావఫలము చెప్పుదును,వినుము.చతుర్థాధిపతిగాని,లగ్నాధిపతిగాని చతుర్థమందుండి,శుభగ్రహ దృష్టిగాని,యుతిగాని కల్గియున్న జాతకునకు సంపూర్ణముగా గృహసౌఖ్యమబ్బును.సుఖేశుడు స్వక్షేత్రవర్తిగాని,ఉచ్ఛస్థితుడు గాని,స్వనవాంశగతుడుగాని యైనమంచి సుఖము,గృహము,భూమి,వాహనము,మాతృసౌఖ్యము,సంగీత వాద్యాదిక సుఖము కలుగును.చతుర్థ,దశమాధిపతులు కేంద్రమునగాని,కోణమునగాని కలిసియున్న జాతకుడు రాజభవనమున నివాసము కలుగును.చతుర్థాధిపతి,సౌమ్యగ్రహమై,శుభులతో కూడినను,చూడబడిననన బుధుడు లగ్నమున ఉన్నను జాతకుడు బంధు పూజ్యుడగును.
చతుర్థస్థానము శుభగ్రహములతో కూడియుండి,తదధిపతి స్వ,ఉచ్ఛరాశులందుండి,మాతృకారకుడు బలవంతుడైన తల్లి చిరకాలము జీవించును.సుఖేశుడు కేంద్రమందున్నను,శుక్రుడు కేంద్రమందున్నను,బుధుడుచ్ఛయందున్నను,వాహనసౌఖ్యమబ్బును.చతుర్థమున శని రవితో కలిసియుండి,భాగ్యమున చంద్రుడుండి,లాభమున కుజుడున్న యెడల ఆవులు,గేదెలు మున్నగు పశులాభముండును.చతుర్థమున చరమై,తదధిపతి కుజునితో కలిసి షష్ఠమునగాని,వ్యయమునగాని ఉన్న జాతకుడు మూగవాడగును.లగ్నాధిపతి శుభుడై,చతుర్థాధిపతి నీచయందుండి కారకుడు వ్యయమందుండి,సుఖేశుడు లాభముననున్న పండ్రెండవ వత్సరమున వాహనసౌఖ్యము కలుగును.చతుర్థమున రవియుండి,తదధిపతి స్వ,ఉచ్ఛస్థానములందుండగా,శుక్రునితో కలిసియున్న ముప్పదిరెండవ సంవత్సరమున వాహనప్రాప్తి జరుగును.దశమాధిపతి కలిసి ఉచ్ఛాంశలందుండిన 42వ సం"న వాహనప్రాప్తి కలుగును.లాభాధిపతి చతుర్థమందుండి,సుఖాధిపతి లాభమందున్న 12వ సం"న వాహనప్రాప్తి జరుగును.భావమున శుభగ్రహమున్న భావపుష్టియు,పాపగ్రహమున్న నాశనము(లేకపోవుట)న్న చెప్పదగినది.

No comments:

Post a Comment