పంచమభావఫలముల చెప్పుచున్నాను;- లగ్నాధిపతి పంచమాధిపతియు పంచమమున ఉన్నను,కేంద్రకోణగతులైననన పుత్రుల సుఖము పూర్తిగా ఉండును.పంచమాధిపతి 6,8 12 లలోనున్న పుత్రులుండరు.పంచమాధిపతి అస్తంగతుడైనను,దుర్భలుడైనా కొడుకులు పుట్టరు; పుట్టినా చనిపోవుదురు.పంచమాధిపతి షష్ఠమున ఉండిన,లగ్నేశుడు కుజునితో కలిసియున్న ప్రథమ సంతానము చనిపోవును.అతని భార్య కాకవంధ్య(ఒక్కసారిమాత్తమే కన్నది)అగును.పంచమాధిపతి నీచస్థుడై పంచమమున చూడకున్న,పంచమమున శనిబుధులున్న కాకవంధ్య అగును.భాగ్యాధిపతి లగ్నమున ఉండి,పంచమాధిపతి నీచస్థుడైనా పంచమమున కేతుబుధులున్నా సుతుడు కష్టమున (ధర్మానుష్ఠానాదులు చేసినందున)కలుగును.పంచమాధిపతి త్రిక(6,8,12)స్థుడైనా,నీచస్థుడైనా,శత్రుక్షేత్రవర్తియైనా,పంచమమందున్నను కష్టమున పుత్రోత్పత్తి యగును.
పుత్రస్థానమున,బుధక్షేత్రమునగాని (కన్యామిథువములు)శనిక్షేత్రమున గాని(మకరకుంభములు)శనియుండి,మాందీగ్రహముతో కూడినను,చూడబడినను,దత్తాదిపుత్రులు కలుగుదురు.రవిచంద్రులోకేరాశి ఓకే అంశలో ఉన్న ముగ్గురు తల్లులచేగాని,ఇద్దరు తండ్రులచేగాని పోషింపబడును.పంచమమున ఆరుగ్రహములుండి,పంచమాధిపతి వ్యయమునున్న లగ్నాధిపతిచంద్రులు బలవంతులైన దత్తపుత్రాదులు కల్గుదురు.పంచమము బలవంతులైన బుధగురుశుక్రులతో కూడినను,చూడబడినను పంచమాధిపతి బలవంతుడైనా చాలమంది పుత్రులు కలుగుదురు.
పంచమాధిపతి చంద్రునితోకూడి చంద్రద్రేక్కాణమున ఉన్నచో కన్యకలే కలుగును.
పంచమాధిపతి చరరాశియందుండి,చంద్రుడు రాహువుతో కూడియుండి,పుత్రస్థానమున శనియున్న జాతకుడు పరజాతుడనవలెను.చంద్రునికష్టమమున గురుడుండి లగ్నమున కష్టమమున చంద్రుండి,పాపగ్రహములచే చూడబడిన కూడినా,జాతకుడు జారజుడని తెలియదగినది.
ఉచ్ఛస్థుడైన పుత్రస్థానాధిపతి 2,3,5,9 స్థానములందుండి,గురునితో కూడినను,చూడబడినను పుత్రభాగ్యము కలుగును.పంచమమున ముగ్గురు నలుగురు పాపులుండి,శుభులు లేకుండ,పంచమాధిపతి నీచస్థుడైన జాతకుడు నీచుడగును.
Thursday, May 31, 2018
*పంచమ(పుత్ర)భావ ఫలాధ్యాయము*
Monday, May 28, 2018
*చతుర్థ(సుఖ)భావ ఫలాధ్యాయము*
ఇప్పుడు మాతృభావఫలము చెప్పుదును,వినుము.చతుర్థాధిపతిగాని,లగ్నాధిపతిగాని చతుర్థమందుండి,శుభగ్రహ దృష్టిగాని,యుతిగాని కల్గియున్న జాతకునకు సంపూర్ణముగా గృహసౌఖ్యమబ్బును.సుఖేశుడు స్వక్షేత్రవర్తిగాని,ఉచ్ఛస్థితుడు గాని,స్వనవాంశగతుడుగాని యైనమంచి సుఖము,గృహము,భూమి,వాహనము,మాతృసౌఖ్యము,సంగీత వాద్యాదిక సుఖము కలుగును.చతుర్థ,దశమాధిపతులు కేంద్రమునగాని,కోణమునగాని కలిసియున్న జాతకుడు రాజభవనమున నివాసము కలుగును.చతుర్థాధిపతి,సౌమ్యగ్రహమై,శుభులతో కూడినను,చూడబడిననన బుధుడు లగ్నమున ఉన్నను జాతకుడు బంధు పూజ్యుడగును.
చతుర్థస్థానము శుభగ్రహములతో కూడియుండి,తదధిపతి స్వ,ఉచ్ఛరాశులందుండి,మాతృకారకుడు బలవంతుడైన తల్లి చిరకాలము జీవించును.సుఖేశుడు కేంద్రమందున్నను,శుక్రుడు కేంద్రమందున్నను,బుధుడుచ్ఛయందున్నను,వాహనసౌఖ్యమబ్బును.చతుర్థమున శని రవితో కలిసియుండి,భాగ్యమున చంద్రుడుండి,లాభమున కుజుడున్న యెడల ఆవులు,గేదెలు మున్నగు పశులాభముండును.చతుర్థమున చరమై,తదధిపతి కుజునితో కలిసి షష్ఠమునగాని,వ్యయమునగాని ఉన్న జాతకుడు మూగవాడగును.లగ్నాధిపతి శుభుడై,చతుర్థాధిపతి నీచయందుండి కారకుడు వ్యయమందుండి,సుఖేశుడు లాభముననున్న పండ్రెండవ వత్సరమున వాహనసౌఖ్యము కలుగును.చతుర్థమున రవియుండి,తదధిపతి స్వ,ఉచ్ఛస్థానములందుండగా,శుక్రునితో కలిసియున్న ముప్పదిరెండవ సంవత్సరమున వాహనప్రాప్తి జరుగును.దశమాధిపతి కలిసి ఉచ్ఛాంశలందుండిన 42వ సం"న వాహనప్రాప్తి కలుగును.లాభాధిపతి చతుర్థమందుండి,సుఖాధిపతి లాభమందున్న 12వ సం"న వాహనప్రాప్తి జరుగును.భావమున శుభగ్రహమున్న భావపుష్టియు,పాపగ్రహమున్న నాశనము(లేకపోవుట)న్న చెప్పదగినది.
Sunday, May 27, 2018
*తృతీయ(సహజ)భావ ఫలాధ్యాయము*
ఇక సోదరభావఫలము చెప్పుదును.తృతీయము శుభగ్రహయుక్తమైనా,శుభగ్రహములచే చూడబడినా జాతకుడు భ్రాతృమంతుడగును.భ్రాతృస్థానాధిపతి కుజునితో కలిసియుండి,భ్రాతృస్థానమును చూచుచున్నను,భ్రాతృక్షేత్రమునఉన్నను,సోదరసుఖము కలుగును.భ్రాతృపతి,కుజులిద్దరు పాపులతో కూడినను,పాపక్షేత్రములందు కలిసినను,సోదరనష్టము కలుగును.
భ్రాతృభావాధిపతి స్త్రీగ్రృహముకాని,స్త్రీగ్రహము తృతీయమందుకానిఉన్న సోదరియుండును.పురుషరాశి పురుషగ్రహమునైన సోదరుడుండును.మిశ్రమములైన మిశ్రఫలమే చెప్పవలెను.బలాబలములు సరిచూచి చెప్పవలెను.తృతీయాధిపతి కుజుడు అష్టమమున పాపయుక్తులై ఉన్నను,పాపదృష్టులైనను సోదరులు చవిపోవుదురు.తృతీయాధిపతిగాని,సోదరకారకుడుగాని కేంద్రకోణ,ఉచ్ఛమిత్ర,స్వక్షేత్రములందు స్వవర్గలందున్నను భ్రాతృసౌఖ్యము చెప్పవలెను.భ్రాతృపుడుగాని,కారకుడుగాని,శుభయుక్తుడుగాని,శుభగ్రహవీక్షితుడుగానియైనను,భ్రాతృభావము బలయుక్తమైనను భ్రాతృవృద్ధి చెప్పనగును.
తృతీయమున బుధుడుండి,తృతీయాధిపతి చంద్రునితో కూడియుండి భ్రాతృకారకుడు శనితో కలిసియున్న జాతకునకు అక్క ఒకామెయు,చిన్నవాడొక సోదరుడు ఉండి,చిన్నవాడొకడన మృతుడగును.కారకుడు రాహువుతో కూడియుండి,భ్రాతృధిపతి నీచయందుండినను,తనతర్వాత సోదరులుందురు;పైన ముగ్గురుందురు.భ్రాతృభావాధిపతి కేంద్రమునుండి,కారకుడు వానికి త్రికోణమున గురునితో కూడ ఉచ్ఛయందున్న యెడల పండ్రెండుగురు సోదరులుందురు.అందులో అన్నలిద్దరు,ఇతడు మూడు,ఏడు,తొమ్మిది,పండ్రెండు చనిపోగా,మిగిలిన ఆరుగురు దీర్ఘాయుష్మంతులుగా నుందురు.
లాభాధిపతితో కుజుడు కలిసియున్నను,గురునితో కూడియున్నను,తృతీయమున చంద్రుడున్న యెడల ఏడుగురు సోదరులుందురు.తృతీయమున చంద్రుడుండి,పురుషగ్రహముచే చూడబడిన సోదరులే ఉందురు;శుక్రునిచే కూడినను,చూడబడినను స్త్రీ సోదరులుందురు.తృతీయమున రవియున్న అగ్రజులు చనిపోవుదురు.కుజుడున్న పెద్దవారు,చిన్నవారు ఉభయులును చనిపోవుదురు.
*ద్వితీయ(ధన)భావ ఫలాధ్వాయము*
తనుభావఫలము చెప్పియున్నాము కదా,ఇక ధనభావఫలము చెప్పుదును,శాంతచిత్తుడవై వినుము.ధనాధిపతి ధనస్థానమునగాని,1,4,5,6,9,10 లందుగాని ఉన్న జాతకుడు ధనధాన్యసంపన్నుడగును,ధనేశుడు త్రిక(6,8,12)మున ఉన్న ధనక్షయమగును.ధనస్థానమున శుభుడున్న ధనము,పాపుడున్న ధనక్షయము కలుగును.ధనాధిపుడు గురుడై ధనస్థానముననున్నచో కుజునితో కూడినను సరే,జాతకుడు ధనవంతుడగును.ధనాధిపతి లాభమందు లాభాధిపతి ధనమందు ఉన్నను,వారిద్దరు కేంద్రమునగాని కోణమునగాని ఉన్నను ధనవంతుడగును.ధనేశుడు కేంద్రమందుండి,లాభాధిపతి వానినుండి త్రికోణమునఉండి,గురుశుక్రులతో కూడినను,చూడబడినను ధనలాభము కలుగును.
ధనాధిపతి షష్ఠమందున్నను,లాభేశుడుకూడ అక్కడే ఉన్నను,ధనలాభాధిపతులు పాపులతో కలిసినా,చూడబడినా దరిద్రుడగును.ధనాలాభాధిపతులు అస్తంగతులైనా,పాపులతో కూడినా,జన్మమెుదలు దారిద్ర్యము కల్గి,భిక్షాన్నముచే జీవించును.ధనలాభాధిపులు 6,8,12 లందుండి,లాభమున కుజుడు,స్థానమున రాహువు ఉన్నరాజదండనవలన ధననాశనమగును.
లాభమున గురుడు,ధనమున శుక్రుడు ఉండి,ధనాధిపుడు శుభులలో కూడియుండి,వ్యయమున శుభగ్రహములున్న ధర్మమూలమున ధనవ్యయగును.ధనాధిపతి పరమెాచ్ఛయందున్నను,స్వక్షేత్రమందున్నను,గురువుచే చూడబడినను,జాతకుడు ప్రసిద్ధుడు,సర్వజనప్రియుడు నగును.ధనాధిపతి శుభగ్రహములతోకూడి,పారావతాది శుభాంశమున ఉండిన వాని భవనమున స్వతఃవివిధమైన ధనసంపత్తి యగును.
ధనేశుడు బలవంతుడైన జాతకుడు,అందమైన కన్నులు కలవాడగును.6,8,12 లందున్న నేత్రవైకల్యము కల్గును.ధనాధిపతి పాపయుక్తుడైనను,ధనస్థానమున పాపయుక్తమైనను జాతకుడు అసత్యవాది,పిసినారి,వాతరోగపీడితుడగును.
ప్రథమ(తనుభావ)ఫలాధ్యాయము.
లగ్నాధిపతి కేంద్రకోణస్థుడైన(1,4,5,7,9,10)జాతకునకు శరీరసౌఖ్యముండును.అతడుత్రిక(6,8,12)స్థుడైనా,పాపులతో కలిసినా సౌఖ్యముండదు.లగ్నేశుడు,అస్తంగతుడు,నీచశ క్షేత్రవర్తి అయిన శరీరమున రోగముకలుగజేయును.శుభగ్రహములు కేంద్రత్రికోణగులైన సర్వరోగములు పోగొట్టుదురు.
లగ్నమునకాని చంద్రుడుకాని పాపగ్రయుక్తమైనా,లేకా పాపగ్రహములచే చూడబడినా,శుభగ్రహదృష్టి లేకున్నచో జాతకునికి శరీరసౌఖ్యముండదు.లగ్నమున శుభగ్రహమున్న సుందరుడు,పాపగ్రహమున్న కురూపుడు అగును.శుభగ్రహములతో కూడినా,చూడబడినా సౌఖ్యము నిశ్చయము.
లగ్నాధిపతి బుధ,గురు,శుక్రులు కేంద్రకోణములందున్న జాతకుడు దీర్ఘాయువు కలవాడు,బుద్ధివంతుడు,ధనవంతుడు,రాజప్రియుడు నగును.లగ్నేశుడు చరరాశియందుండి శుభగ్రహములచే చూడబడిన జాతకుడు కీర్తిమంతుడు,ధన,సుఖసంపన్నుడు,భోగియగును.గురుశుక్ర బుధులలో ఒకడు చంద్రునితో కలసి లగ్నమందున్ననను,లగ్నాత్ర్కేంద్రమందున్నను రాజలక్షణములు కలవాడగును.
మేష,వృషభ,సింహములలో వెనుకటి లగ్నమై అందు శనికాని కుజుడు గానియున్న లగ్నమున ఏ రాశి నవాంశయుండునో ఆ రాశి అంగమున నాలవేష్టితుడై జన్మించును.రవి చతష్పాత్తైన రాశియందుండి,తక్కిన బలవంతులైన గ్రహములు ద్విస్వభావగతులైన జాతకుడు కవలలో నోకడగును.
రవిచంద్రులు ఒకేరాశిలో ఒకేనవాంశలో ఉండిన,జాతకుడు మూడుమాసములవరకు ముగ్గురు తల్లులచే పోషించబడువాడు,తండ్రిచేతను,సోదరుని చేతను పోషించబడువాడు అగును.చంద్రునినుండియు ఇట్లే ఫలము చెప్పదగినది.ఇక జాతకుని శరీరమున వ్రణములు,చిహ్నములను చెప్రెదను,మినుము.
లగ్నమున ప్రథమ ద్రేక్కాణమున జన్మమైన - లగ్నము తల,ద్వితీయ - ద్వాదశములు కన్నులు,తృతీయైకాదశములు - చెవులు,చతుర్థ - దశమములు ముక్కు,పంచమ నవములు - చెక్కిళ్ళు(చెంపలు),షష్ఠ,అష్టమములు - గడ్డము,సప్తమము - నోరు,ఇవి కుడి ఎడమలగును.ద్వితీయ ద్రేక్కాణమైన - లగ్నము కంఠము,2,12 మూపురములు (స్కంధ),3,11 భుజద్వయము,4,10 పక్కలు,5,9 రోమ్ము 6,8, పోట్ట,7 నాభి,తృతీయద్రేక్కాణమైన - లగ్నము పోత్తికడుపు, 2,12 లింగము,గుదము,3,11,అండములు,4,10,తోడలు,5,9,మెాకాళ్ళు,6,8,పిక్కలు,7 పాదములు.ఈ అవయవములు లగ్నమునకు ముందు వెనుక తెలియవలెను.ఏ అంగమున పాపగ్రహమున్న అక్కడ వ్రణముండును.బుధ యుక్తుడైన పాపుడున్న తప్పక వ్రణము కల్గును.శుభగ్రహమున్నను,దృష్టియున్నను చిహ్నమాత్ర ముండునని నిర్దేశింపవలెను.
Saturday, May 19, 2018
అర్చకుని వైభవం ...!
శ్లో: అర్చకస్య తపోయోగాత్
అర్చకస్యాతి శాయనాత్
అభిరూప్యాచ్చ బింబానాం
దేవస్సాన్నిధ్య మృచ్చతి.
తాత్పర్యము:- అర్చకునియొక్క తపస్సు యోగము వినయము భక్తిప్రపత్తులు ఆచారము మంత్ర సౌష్ఠవముల వలన దేవతా విగ్రహములు "దైవసాన్నిధ్య శక్తి " కలిగి లోకానుగ్రహము కరుణించ గలవు.
🙏జై శ్రీరాం🙏
Sunday, May 6, 2018
*కర్తరీ - డొల్లు కర్తరి* అనగా ఏమిటి ? చేయ కూడని పనులు ?
భారత పురాణాల ప్రకారం కాలాన్ని సూర్య, చంద్ర, బృహస్పతి మానాలలో కొలుస్తారు. 27 నక్షత్రాలు ప్రతిరోజు ఒక దాని తర్వాత ఒక్కటి ఉదయించి, అస్తమిస్తాయి. చంద్రుడు ఉదయించి నప్పుడు ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నక్షత్రం ఆ రోజుగా భావిస్తారు. చైత్ర పౌర్ణమినాడు చిత్ర నక్షత్రంతో ఉదయించే చంద్రుడు మరుసటిరోజు వెనుకబడుతాడు. సూర్యుని గమనంతో ముడిపడి వున్న కాలమానాన్ని సౌరమానం అంటారు. సూర్యుడు 14 రోజులపాటు ఒకే నక్షత్రంతో కలిసి ఉదయించి తర్వాత వెనుకబడుతాడు. అశ్వనీ నక్షత్రంలో సూర్యుడు ఉదయించడం అరంభం కాగానే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినట్లుగా గణిస్తారు. సూర్యునితో కలిసి ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ 13 రోజుల సమయాన్ని కార్తె అని పిలుస్తారు. ఇలా అశ్వని నుండి రేవతి వరకు 27 కార్తెలు వుంటాయి.
సాధారణంగా కర్తరీ మే నెల 4 వతేదీన డొల్లుకర్తరీ ,మే నెల 11 వ తేదీన నిజకర్తరీ ప్రారంబమై మే నెల 28 వ తేదీతో కర్తరీ త్యాగం జరుగుతుంది.
సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు.అంటే భరణి నాలుగో పాదం ,కృత్తిక నాలుగు పాదాలు,రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు.దీనినే “కత్తెర” అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు.డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో(డిగ్రీల 23°-20' నిమిషాలు) నుండి వృషభరాశిలో (డిగ్రీల 26°-40' నిమిషాలు).
సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే “డొల్లు కర్తరీ”ప్రారంభమవుతుంది.దీనినే "చిన్న కర్తరీ" అని కూడా అంటారు.సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరీ అంతమై "నిజకర్తరి" ప్రారంభమవుతుంది.సూర్యుడు రోహిణి నక్షత్ర రెండవ పాదం ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది.
కర్తరీ లో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.కర్తరిలో గృహ సంబంధమయిన పనులు చేయద్దన్నారు. నాటిరోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేడి కాదు. వేసవి నుంచి, వడగాడ్పు నుంచి రక్షణకే ఈ కర్తరి చెప్పి పని వద్దన్నారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక, కార్మిక పంచాంగం అనచ్చు.భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు దొల్లు కర్తరి, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం. కర్తరి అంటే కత్తెర అని అర్ధం, దేనికి కత్తెర? ఎండలో పనికి కత్తెరనమాట. వేసవిలో మే నెలలో 4,5 తారీకులమొదలు మే 27,28 దాకా కర్తరి ఉంటుంది. ఆ తరవాత చల్లబడుతుంది కనక పనులు మొదలుపెట్టచ్చని చెప్పి ఉంటారు. వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసేరో చూడండి. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.
కర్తరీలో చెట్లు నరకటం, నారతీయటం, వ్యవసాయం ఆరంభం, విత్తనాలు చల్లటం,భూమిని త్రవ్వటం,తోటలు వేయటం, చెఱువులు, బావులు,కొలనులు త్రవ్వటం,కొత్త బండి కొనటం,అదిరోహించటం,నూతన గృహ నిర్మాణం చేయటం,పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు చేయరాదు.
కర్తరీలో ఉపనయనం,వివాహం,యజ్ఞం,మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును.