శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామివారి వ్రతమును గూర్చి 
తెలియనివారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు అంతటి మహిమతో 
విశేషప్రాచుర్యంగల ఈ వ్రతాన్ని ఎలా? ఆచరించాలో  ఈ వ్రతకథ ప్రథమాధ్యాయంలో 
ఎలా వివరించారో సప్రమాణంగా నా అనుభవసారముగా వివరిస్తాను. ఈవ్రతమును 
చేసేటప్పడే ఈ వివరాలన్ని వినలేదే మేము ఇప్పుడివన్నీ చదువుతామా? అనేవారికి 
ఇది అక్కర్లేదు. "*ఙ్ఞాత్వాకర్మాణికుర్వీత*" ఏపనినైనా తెలుసుకొని చేయాలనే 
శ్రద్ధాళువులకే ఈవిశేషాంశములు.

శ్లో.ప్రాతరుథాయనియతో దంతధావనపూర్వకం,
నిత్యకర్మవిధాయావీవంసంకల్పయేన్
నరః,భగవన్దేవ దేవేశ సత్యనారాయణవ్రతం, త్వత్ప్రియార్ధం కరిష్యామి ప్రసీదకమలాపతే●
☆వ్రతమాచరిచేవారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను 
నెరవేర్చుకొని శుచియై నిశ్చల భక్తితో "దేవాదిదేవా 
శ్రీసత్యనారాయణస్వామిప్రభూ! నీ ప్రీతికై (అనుగ్రహము పొందుటకై ) 
భక్తి,శ్రద్దలతో  ఈవ్రతమును ఆచరించుచున్నాను" అని తన మనస్సున స్వామిని 
ధ్యానము చేసుకొని నమస్కారము చేయవలెను.
 
శ్లో. ఏవంసంకల్ప్య మధ్యాహ్నేకృత్వా మాధ్యాహ్నికీఃక్రియాః 
ఇలా  శ్లోకాలను తాత్పర్యాన్ని రాస్తూ పోతే మేటర్ చాలాపెరిగిపోతుంది కనుక 
మఖ్య విషయమునకే వస్తున్నాను. వ్రతాన్ని సాయంత్రం పూట ప్రారంభించాలి.ముందుగా
 గోమయంతో అలికి ఆ ప్రదేశంలో ఐదురంగులతో అష్టదళపద్మమును ముగ్గువేసి దానిపై 
ధృఢమైనపీటవేసి దానిపై తెల్లని నూతనవస్త్రములను పరవాలి. 
(పూజాద్రవ్యాలలిస్టులో పంతులుగారు తుండుగుడ్డలు రెండు అని రాస్తారు ఇక ఆ 
తుండుగుడ్డలుజత ఉంటాయి చూడండి ఆ వ్రతంచేసుకునే యజమానికిగాని వ్రతంచేయించే 
పురోహితలవారికిగాని చుట్టుకోబోతే వెనక్కొస్తే ముందరికిరావు ముందరికి వొస్తే
 వెనక్కి రావు  ఏమిటండి ఈ తుండుగుడ్డలుజత ఎందుకన్నా పనికొస్తాయా? అని 
పురోహితులవారు అసలు సామాన్యంగా అడగరు ఒకవేళ స్వతంత్రించి అడిగారే 
అనుకోండి.వ్రతంచేసుకునేవారంటారు నేను లిస్టు ఇస్తే కొట్టువాడే ఇలాంటి 
తుండుగుడ్డలు ఇచ్చాడని తప్పును దుకాణదారునిపై తోసేస్తారు. 
తెచ్చుకొనేటప్పుడే కొనేది ఉపయోగపడేదా? లేదా? అనేది చూసుకోవల్సిన బాధ్యత 
అమ్మినవానికంటే కొనుక్కునేవారిమీదే ఉంటుందికదా? ఒకొక్కసారి నేను గమనించిన 
విషయమేమిటంటే? పూజలకైతేఈతుండుగుడ్డలుచాలనిచెప్పి  చాలిచాలని ఈ చిన్నతుండుగుడ్డల్ని ఎక్కువ రేటుకుఅమ్మేసుకుంటూవుంటారుదుకాణదారలైనవ్యాపారులు.
 ఎలా అంటే? సాధారణంగా మంచి తుండుగుడ్డఒకటి 70రూపాయలుంటుంది "ఈధరలు సామాన్య 
దుకాణాలలోని ధరలు కొన్నిషాపులలో ఇంకా ఎక్కువేఉండవచ్చనటంలో సందహమేఅఖర్లేదు "
 10రూపాయలుకూడా చేయని ఈ చిన్నతుండుగుడ్డలను షాపువాడు 40 రూపాయలకే ఇస్తానని ఈ
 చిన్నతుండుగుడ్డలను అంటగట్టి తాములాభాన్ని పొందుతూ  చూశారా? పూజలకు ఎంత 
తుండుగుడ్డలు కావాలో అంతే ఇచ్చి మీకెంతలాభాన్ని కల్గజేశామో అని 
వినియోగదారుని సంతోషపరుస్తుంటారు కొందరు షాపువాళ్ళు.ఈ చిన్నతుండుగుడ్డలనను 
నిజంగా పూజలకోసమే తయారు చేస్తున్నారేమో లేకపోతే ఇంత చిన్నతుండుగుడ్డలు 
ఎవరికి ఉపయోగపడతాయి? ) సరి మొత్తానికి చిన్నవో పెద్దవో  రెండుతుండుగుడ్డలను
 పీటమీదపరచి (తుండుగుడ్డలే ఇంతతవి వుంటే ఇక పీట ఎంత ఉంటుంది 
ఓమూరమాత్రంవుంటుంది) దానిపై బియ్యమును  పోసి బియ్యమంటే స్టోరుబియ్యమునో లేక
 నూకలులోబియ్యంకలిసిఉంటాయ్ వాటినే ఇస్తారు. అదేమంటే? మేము ఇంట్లోవాడుకునేవి
 ఇవేనండి అంటారు. మాఇంట్లో ఇలాంటిబియ్యంవాడమండిఅంటే? అట్లల్లోకిపోసుకోమని 
చక్కని చిట్కా చెబుతారు. పాపంపంతులుగారిదాతలంతా ఈ అట్లల్లోకి బియ్యంఇస్తే 
ఆయన భోజనం ఏ బియ్యముతో చెయ్యాలో? ముక్కులువిరిగీనబియ్యం పూజకి 
పనికిరావుకదంటే?ఆవిషయం మాకు తెల్సండి అందుకే అక్షతల వరకు వేరేబియ్యం 
ఇస్తామండి అంటారు. చతురస్రముగా ఆ లావుబియ్యాన్నే నెరపి దానిపైన వెండి లేక 
రాగి తుదకు మట్టిదైనా సరే "నూతనకలశము" ఒకదానిని ఉంచమని వ్రతాధ్యాయకథలోవుంటే
 మనవారు కలశమనగానే యప్పటినుండో కలశం చెంబనే పేరుతో మన ఇంట్లో దాచి 
వుంచుతారు ఇక దానిని తీసి ఆనాడే బాగాతోమి బయట పెడతారు కలశముగా పెట్టమని. 
మరో నూతన వస్త్రాన్ని దానిపై ఉంచాలి. మరో నూతన వస్త్రమంటే 
జాకెట్ముక్కన్నమాట. కలశం మీదకి ఓ జాకెట్ముక్క ఇవ్వమని పంతులుగారు అడగగానే 
నోమునోచుకునేవారు అడిగేప్రశ్న అది ఏరంగుదికావాలి? అదిమాకొస్తుందా? మీకు 
పోతుందా? అని. (పంతులుగారికి పోయేదైతే ఏసిల్క్ ముక్కోపెట్టేయచ్చు మనకైతే 
మంచిజాకెట్టుముక్క ఇవ్వాలికదా?)
పంతులుగారు వారడగినదానికి సమాధానంగా  వ్రతకథలో ఐతే కలశం మీద వుంచే 
వస్త్రంరంగు ఏమి చెప్పలేదు. కనుక మంగళకరముగా ఉండేరంగు గల ఏ 
(నూతనవస్త్రమైనా) ఏజాకెట్ ముక్కనైనా పెట్టవచ్చని సమాధానమిస్తారు. 
వాస్తవానికి    కలశము దానిమీదనూతనవస్త్రం తనకేవొస్తుంది. కాని లోకంలో 
ఈదురాచారాన్ని ఎవరు ప్రారంభించారో తెలియదు కాని కలశం మీద వుంచినవస్త్రాన్ని
 వ్రతాన్ని ఆచరించినవారు కుట్టించుకోవాలని ఓ ఆపప్రథ లోకంలో దుష్ప్రచారం 
వుంది. అలా కాదంటే ఈ బ్రాహ్మణుని ఇక పిలవటం మానేస్తారోనని కలశం మీద ఆ 
నుతనవస్త్రం మీకే వొస్తుందంటారు పంతులుగారు.   ఈ రకముగా కలశాన్ని 
సిద్ధపరిచి అటుపిమ్మట  "ప్రతిమాశోధనచేయాలి" అంటే శ్రీసత్యనారాయణస్వామి వారి
 "నూతన ప్రతిమను" (రూపుగానో విగ్రహంగానో)ఒకదానిని తీసుకొచ్చి     ఆ 
నూతనముగా తయారైన శ్రీస్వామివారిప్రతిమను పంచామృతాలతో అభిషేకం చేయాలి. 
ప్రాణప్రతిష్ఠ కూడా చేయని నూతనప్రతిమకు పంచామృతాలతో అభిషేకమేమిటి అని అంటే?
 నూతన ప్రతిమను తయారు చేసేటప్పుడు కాల్చడం కొట్టడం మొదలగునవి చేస్తారు 
అట్టి దోషాలు పోవటంకొరకు పంచామృతాలతో శుద్ధిచేయాలి. పంచామృతాలతో 
శుద్ధిచేయటాన్నే ప్రతిమాశోధన అన్నారు అసలు నూతనప్రతిమ ఎందుకంటే? 
శ్రీరమాసహితసత్యనారాయణస్వామివారి వ్రతమును  కథలో ఉన్నది ఉన్నట్లు 
కల్పోక్త విధానంగా ఆచరించుదాం అని అనుకునే జిఙ్ఞాసువులైన ఆస్తికులు 
మూఖ్యముగా బాగా గుర్తుంచుకోవల్సిన విషయం ఏమనంటే ఎప్పుడు ఎక్కడ 
శ్రీరమాసహితసత్యనారాయణస్వామివారివ్రతమును ఆచరించినా? వెండిదో లేక 
రాగిదో తుదకు మట్టిదైనా సరే తన తాహతకు తగ్గట్టు  నూతన కలమును సిద్ధం 
చేసుకోవాలి.సత్యదేవుని వ్రతకథ ప్రథమాధ్యాయం ప్రకారం చూసినట్లైతే  
శ్రీస్వామివారి ప్రతిమను కర్షమాత్ర సువర్ణం అనగా ఎనిమిది గురువిందెల 
బరువుతో సమానంగా తూ గే  అంటే 8గ్రాములబంగారంతో ప్రతిమని చేయించాలి. 
అంతశక్తిలేకపోతే దానిలో సగం అంటే 4గ్రాములలో కాని కనీసం ఒక గురువిందఎత్తైన 
బంగారంతోనైనాసరే నూతన ప్రతిమను చేయించాలి. అదీ శక్తి లేకపోతే వెండితోకాని 
రాగితోకాని నూతనప్రతిమనొకదానిని సిద్ధపరుచుకోవాలి. శ్రీస్వామివారికి ప్రతిమ
 కలశం అనగానే బీరువాలోంచి తీసి ఇచ్చేవారిని చూస్తే నాకు పెద్దఅమ్మమ్మే 
గుర్తుకువొస్తుంది ఎందుకంటే? షుమారు డెభైసంవత్సరాలక్రితం వాళ్లపిల్లలు 
ఆడుకున్నబొమ్మలు నేటికి చెక్కుచెదరకుండా ఉండటంచూసి అశ్చర్యపోతె అసలువిషయం 
మా అమ్మ చెప్పినది పిల్లకైకొన్న ఆబొమ్మలు రోజు బైటికి తీసి పిల్లలకు చూపి 
మళ్లీ బీరువాలో పెట్టేదట.  శ్రీస్వామివారిప్రతిమ,కలశంపూజకాంగానే మళ్లీ
 బీరువాలో పట్టడం అలాగేఉందికదూ . "*విత్తశాఠ్యంనకారయేత్*" డబ్బు వుండి కూడా
 పిసినారితనాన్ని చూపించారాదు స్పష్టంగా చెప్పాలంటే? నూతనకలశమును 
పెట్టమంటున్నారు కనుక వెండికలశం పెట్టగల సామర్ధ్యం వున్నా? ఏరాగికలశమో 
పెట్టరాదు. రాగి కలశం పెట్టగల స్తోమత వున్నా? మట్టికలశం పెట్టరాదు. 
మట్టికలశంమాత్రమే పెట్టగల పరిస్తితి వుంది  చక్కగా మట్టికలశాన్నే 
ఆరాధించవచ్చును. దానిలోఎట్టిదోషమూలేదు. మన శక్త్యనుసారముగా
ఈ విధముగా ప్రతిమను కలశమును సిద్ధపరుచుకొన్న తర్వాత "ఫల" అనగానే 
సామాన్యంగా ఎండుఖర్జూరకాయల్ని తీసుకుంటున్నారు అలకాకుండా ఏఫలమునైనా 
తీసకోవచ్చు. "పుష్ప" పూవులను "అక్షత" "క్రముక" వొక్కను  "హిరణ్యములను" 
బంగారునాణాలు కనీసం ప్రస్తుత కాలంలో చెలామణిలో ఉండేనాణమును ఇలా ఈ ఐదుటిని  
తీసుకుని (మంటపం)పీట మీద వినాయకుని, శ్రీవిష్ణువును,శ్రీలక్ష్మీదేవిని,శ్రీశివ,
 శ్రీపార్వతిదేవిని ఆవాహనచేయాలి. ఈఐదుటినితీసుకొని (ఫలపుష్పాదులను) తూ 
ర్పుమొదలగు8దిక్కులయందు ఇంద్రాద్యష్టదిక్పాలకులను.కలశానికి దక్షిణముగా
 ఆదిత్యాదినవగ్రహాలను. కలశానికి ఉత్తరముగా గణేశాది పంచ లోకపాలకులను ఆవాన 
చేసి పూజించి.ప్రత్యేకముగా మంటపంలో మధ్యలో సిద్ధముజేసివుంచిన వరుణకలశాన్ని 
పూజించి పంచామృతాలతో శుద్ధిచేసి సిద్ధపరుచుకొన్న నూతన శ్రీరమాసహిత 
సత్యనారాయణ స్వామివారిప్రతిమను కలశంపైనుంచి ప్రాణప్రతిష్ఠచేసి 
ధ్యానావాహనాది శోడశోపచార పూజను చేయాలి నైవేద్యముగా శర్కరాదిపంచామృతమిశ్రిత 
గోధుమచూర్ణాన్ని కదలీఫలసహితముగా నైవేద్యాన్ని ఏకీకృతంగాపెట్టాలి 
ఐదుభాగాలుచేసిమాత్రకాదు. మిగతాపూజచేసి ఐదుఅధ్యాయాలవ్రతకధను శ్రవణంచేయాలి 
అధ్యాయం అధ్యాయానికి మధ్యలో పూజును చేసి గోధుచూర్ణప్రసాదాన్నే ఐదుభాగలుచేసి
 ఒక్కోఅధ్యాయానికి ఒక్కోబాగం నైవేద్యం పెట్టమని ఎక్కడాలేదు.మరి ఎట్లా 
వొచ్చినదీఅచారం అంటే ఉపవాసంతో పాటు  ఈ వ్రతకథలతోనే జాగారాన్నికూడా 
ఆచరించేవారు ఝాముఝాముకి అధ్యాయాన్ని ముగిస్తూ పూజ నైవేద్యం  కూడా మొదలు 
పెట్టుంటారని భావించవచ్చు. పూజానంతరం తీర్ధప్రసాదాలు తీసుకుని 
స్వర్ణస్వర్చిత ప్రతిమా సహిత మండపదానం తుభ్యమహం సంప్రదదే నమమ అని మంటపారాధన
 అర్చించిన స్వర్ణప్రతిమకలశంతోసహాదానంచేయాలి దానదక్షిణకూడా ఇవ్వాలి. 
ఇలా చేయాలని ఓ చోట చెబితే. యజమాని బంధువొకామె రావణాసురదక్షిణ అడిగారుగా 
అంటుంది. అంటే ఈ ఓదిక్కమాలిన పిట్టకథ ప్రకారం శ్రీపార్వతీపరమేశ్వరులు 
ఇల్లకట్టుకొని గృహప్రవేశం చేయించిన రావణబ్రహ్మ  తాను ఏఇంటినిగృహప్రవేశం 
చేయించాడో  అదే ఇంటిని దక్షిణగా ఇమ్మనికోరి స్వర్ణ లంకను దక్షిణ గా 
పొందనట.  స్వర్ణలంక కుబేరుడిది రావణుడు ఆక్రమించాడని వాల్మీకిరామాయణం 
చెబుతున్నది. కావున ఈ కథ శుద్ధతప్పు  ఏపుడబుక్కలవాడి దగ్గరవిందో ఈకథను 
రావణాసురదక్షిణ అడగారు గా అన్నది ఈపుక్కటపురాణగాధను నేనూ వినే వున్నాను 
కనుక నాకర్ధమై అమ్మా  ఇలా అర్చించిన స్వర్ణప్రతిమ,కలశంతోసహామంటపదానంచేయాలని
 నేను చెప్పటంకాదు  శ్రీసత్యనారాయణస్వామివ్రతకథలు వున్న ఏ ప్రసిద్ధ 
పుస్తకంలోనైనా ఉన్నది కావల్సివొస్తే చూస్కొమని చెప్పాను. వారు 
అర్చించినప్రతిమాసహితమంటపదానం చేయలేదు. మాటైతే అన్నారు. ఇకనుండి కథను 
యథాతథంగా చెప్పడం మానేశాను ఎందుకు ఎవరూ చేయరు పైగా మాటపడాల్సివొంస్తుందని. 
కొంతకాలం తర్వాత ఓ వదాన్యులైన ఆర్యవైశ్యుల ఇంట్లో వ్రతాన్ని చేయిస్తే 
అర్చించినప్రతిమాసహితమంటపమును కలశసహితందానంగా ఇచ్చారు అదేమని అడిగితే 
బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వరరావుగారు చెప్పగావిన్నానని అనటం ఆశ్చర్యం 
ఈఘోరకలిలో కూడా విన్నది విన్నట్లు ఆచరించే ఆచారపరులు ఉన్నారని అట్టి  
సంస్కారంగలవారి గృహములలో కార్యక్రమములను నిర్వహించే 
యోగ్యతననుగ్రహించినదులకు ఆనందం కల్గినది.కావున ఆస్తికమహాశేయులారా!
వివాహమో బారసాలో అన్నప్రాశనో శంకుస్థాపనో గృహప్రవేశమో ఇలా
ఏ వైదికకార్యమును నిర్వహించినా శ్రద్ధ తో  పెద్దల ద్వారా చక్కగా తెల్సుకొని
 విధివిహితముగా ఆ కార్యములను భక్తిగా ఆచరించి తరించెదరుగాక.
      
   
 
మంచి విషయాలతో చక్కని టపా వ్రాసారు. పూజలో భక్తిశ్రధ్ధలు లోపిస్తే పూజ నిష్ఫలం. భక్తికూడా ఒక విలాసవైభోగవస్తువుగా మార్చుతున్న రోజులివి. సాధారణంగా సత్యనారాయణవ్రతం ఐనా మరొక వ్రతం ఐనా చేసే వారు చూస్తే ఇంకా ఎంతసేపు పడుతుందని అడిగే వారూ, ఎప్పు డైపోతుందా అని ఎదురుచూసే వారు, మధ్యమధ్యలో చేతిగడియారాలు చూసుకొనే వాళ్ళూ, విచ్చేసే అతిధులతో కబుర్లాడుతూ చేతు లాడించే వారూ, అరకొర సంభారాలతో సరిపెట్టే వాళ్ళూ చివరకు ఈమాత్రానికి ఒక బ్రహ్మగారెందుకూ అని కాసెట్లూ సీడీల సహాయంతో పని కానిచ్చుకొనే వాళ్ళూ - ఇల్లాగ ఉన్నారు. పూజ జరుగుతున్నంత సేపూ దర్శనార్థం వచ్చిన జనం లోకాభిరామాయణం తెగ గడబిడగా బిగ్గరగా మాట్లాడుతూ ఉంటారు - అరే, ఇక్కడ వ్రతం జరుగుతోందే అన్న స్పృహ అన్నదే ఎవ్వరికీ సాధారణంగా ఈషణ్మాత్రం కూడా ఉండదు. ఇక కథను వినటం సొంపు చెప్ప నక్కరలేదు. వ్రతం చేసే వారితో సహా ఎవ్వరికీ అది పట్టదు. వచ్చిన బ్రహ్మగారు తనకు తాను చెప్పుకుంటూ పోవటమే తన ఓపికా తీరికా మేరకు. పైగా ప్రతి అధ్యాయం చివరనా కొబ్బరికాయెందుకండీ కొట్టటం - ఒక అరటి పండు నైవేద్యం పెడితే సరిపోతుందా అని వ్రతంచేసేవాళ్ళు వాకబుచేయటాలు ఒకటి! మిమ్మల్ని నైవేద్యాలు పెట్టమని దేవుడేమైనా బ్రతిమాలి పిలిచి వ్రతం చేయించు కుంటున్నాడా? 'భక్తిలేని పూజ పత్రి చేటు' అని అక్షరాలా సత్యోక్తి. ఈ మాత్రం పూజలకు వీడియోలకు ఫోటోలకూ పోజులిస్తూ ఆటంకాలు కలిగించుకోవటం అదనపు అకర్షణ అన్నమాట మరచిపోకూడదు. ఏంచేస్తాం ఆచారహీనః నపునంతి వేదాః.
ReplyDelete