Friday, January 17, 2020

Results of Transit of Sani into Makara. మకర రాశిలో శని గోచర ఫలము వివరణ !

శని పేరెత్తగానే ప్రతివాడికి ఒక విధమైన వణుకు పుడుతుంది. అసలు శని భ గూర్చి అంత భయం ఎందుకు? భయం శని భగవానుడి వలన కాదు, మనిషికి ప్రధానంగా దుష్కర్మల భయం ఉండాలి. ఆ భయం ఉన్న వాడు గ్రహాలకు భయపడవలసిన అవసరం లేదు. ప్రతి మానవుడు తాను ఆచరించిన దుష్కర్మల ఫలాలను అనుభవించుటకు సిద్ధంగా ఉండదు. సత్కర్మ ఫలాలను ఆనందంగా ఆహ్వానిస్తాడు, కాని దుష్కర్మ ఫలం అనగా ‘కష్టాన్ని’ అనుభవించుటకు సిద్ధంగా ఉండడు. అనగా కర్మనాచరించుటకు భయం గాని సందేహం గాని ఉండదు, కాని దాని ఫలాన్ని అనుభవించే సమయం వచ్చే వరకు సంతోషాన్ని కలిగించే ఫలం అయితే ఆనందంగా స్వీకరిస్తాడు. కాని కష్టాన్ని ఇచ్చే ఫలం అయితే భయం మొదలౌతుంది. అట్టి కష్టాన్ని తప్పించుకునే మార్గం కొరకు అన్వేషణ చేస్తాడు. కాని ‘భోగేన త్వితరే’ అని శ్రీ శజ్ఞ్కర భగవత్పాదులు అన్నారు. అనగా కర్మ ఫలాలను అనుభవించుట ద్వారా మాత్రమే అవి దహించ బడతాయి. అనగా కష్ట నివారణ కొరకు జరిపే వైదిక క్రతువులు ఆ కష్టాన్ని కొంత కాలం పాటు వెనక వేయగలవు గాని అట్టి కష్టాన్ని సంపూర్ణంగా దహించి వేయు శక్తి వాటికి లేదు.


ఇక శని భగవానుడి విషయానికి వస్తే, ప్రతి ఒక్కరు శని అనగానే బాధపెట్టు గ్రహ అనే ఆలోచనలో ఉంటారు. కాని అది తప్పు. నవగ్రహాలు ఏవీ కూడా బాధ పెట్టడం గాని లేదా సుఖ పెట్టడం గాని జరగదు. మన జాతక చక్రంలో అట్టి గ్రహ ఉన్న స్థానాన్ని అనుసరించి శుభ లేదా అశుభ ఫలితాలను అది సూచిస్తుంది. అంతేకాదు, తత్కాల గోచారము కూడా మన కర్మ ఫలాలు అనుభవించే సమయం ఆసన్నమైందని సూచన ఇస్తుంది. నవగ్రహలన్నిటిలో ఏ గ్రహ కూడా శుభం అని గాని పాపం అని అనడానికి అవకాశం లేదు. గ్రహాలన్నీ శ్రీమన్నారాయణ అవతారాలని శ్రీ పరాశర మహర్షి తాను రచించిన బృహత్పరాశర హోరా శాస్త్రం తెలియచేసి యున్నారు.


బృహత్పరాశర హోరా శాస్త్రః – ద్వితీయోధ్యాయః:

అవతారా ణ్యనేకాని హ్యజస్య పరమాత్మనః ।

జీవానాం కర్మ ఫలదో గ్రహరూపీ జనార్దనః ।।౩।।

దైత్యానాం బలనాశాయ దేవానాం బలవృద్ధయే ।

ధర్మ సంస్థాపనార్థాయ గ్రహాజ్జాతాః శుభాః క్రమాత్ ।।౪।।

జన్మ రహితుడైన పరమాత్ముడి యొక్క అవతారాలు అనేకములు గలవు. అందులో జీవులకు స్వ స్వకృత కర్మల యొక్క ఫలాలను ఇచ్చేది సూర్యాది గ్రహ స్వరూపుడు అగు జనార్ధనుడను నామము గల రూప విశేషము ఒకటి కలదు. దైత్యుల (అనగా పరులకు నష్టం కలిగించే వారికి) నాశనము కొరకు మరియు దేవతల (పరులకు హితము చేయు వారికి) యొక్క బలాభివృద్ధి కొరకు, ధర్మ సంస్థాపన నిమిత్తము శుభ ప్రదములైన అవతారములు సూర్యాది గ్రహాల వలన జన్మించి యున్నవి. యథా (ఎట్లనగా):

రామోవతర స్సూర్యస్య చంద్రస్య యదునాయకాః ।

నృసింహో భూమి పుత్రస్య బుద్ధ స్సోమసుతస్య చ ।।౫।।

వామనో విభుధేజ్యస్య భార్గవో భార్గవస్య చ ।

కూర్మో భాస్కర పుత్రస్య సైంహికేయస్య సూకరః ।।౬।।

కేతో ర్మీనావతారశ్చ యే చాన్యే తేపి ఖేటజాః ।

పరాత్మాంశోఽధికో యేషు తే సర్వే ఖేచరాభిదాః ।।౭।।

నవగ్రహాల యందు ప్రధానుడైన శ్రీ సూర్యుడి వలన రామావతారము, చంద్రుని వలన కృష్ణావతారము, కుజుని వలన నృసింహ అవతారము, బుధుని వలన బుద్ధావతారం, బృహస్పతి వలన వామనావతారం,శుక్రుని వలన పరశురామావతారం, శని వలన కూర్మావతారం, రాహువు వలన వరాహావతారం, కేతువు వలన మీనావతారం కలిగినవి. వీటికంటే భిన్నమైన అవతారము లన్నియూ కూడా గ్రహముల వలననే అవతీర్ణములైనవి. వేని యందు అధికమైన పరమాత్మాంశము గోచరించు చుండునో అట్టి అవతారము లన్నియు ఖేచర నామధేయములు (అనగా దేవ వాచకములు) అగు చున్నవి.

కావున ప్రతి గ్రహ శ్రీమన్నారాయణ అవతారమే. కొన్ని గ్రహాలు కొన్ని లగ్నాలకు శుభులు అయినచో అవే గ్రహాలు మరికొన్ని లగ్నాల వారికి అశుభ ఫలాన్ని సూచిస్తారు. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి గురు మరియు శుక్ర భ అత్యంత శుభ గ్రహాలు. కాని వృషభ మరియు తులా లగ్నము లందు జన్మించిన వారికి గురు మారకుడు, అంతే కాదు ధనుర్మీన లగ్నాల వారికి శుక్రుడు మారకుడు. అత్యంత పాప గ్రహగా భావించే శని వృషభ తులా లగ్నాల వారికి శుభుడు మరియు యోగ కారకుడు. ఈ విధంగా జాతకాన్ని బట్టి శుభ మరియు అశుభ ఫలాలను అట్టి గ్రహాలు సూచిస్తాయే తప్ప అవి నిజానికి అట్టి ఫలితాలు ఇవ్వవు.

శని భగవానుడు 24.01.2020 నాడు స్వక్షేత్రమైన మకర రాశి ప్రవేశిస్తాడు. ఇట్టి గోచార ప్రభావము ముందుగా దేశకాల పరిస్థితులపై ఎలా ఉండబోతోందో చూద్దాము:

ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కుంటున్నాయి. భారత దేశం కూడా ఇట్టి చిక్కులను ఎదుర్కుంటుంది. మకర రాశిలో శని ప్రభావము వలన దేశ ఆర్థికాభివృద్ధి ఇంకనూ మందగతిన సాగు సూచనలున్నాయి. ప్రాజెక్ట్ ల యొక్క అభివృద్ధి మందగతిన సాగుతూ ఉంటుంది. ప్రజలు అధిక శ్రమతో కూడిన ఫలములను పొందు వారగుదురు. పాలకులు ఆర్థికాభివృద్ధిని నిలబెట్టుటకు గాను విపరీతంగా శ్రమించ వలసి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు నెలకునే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడూ November 2020 నుండి గురు సంచారము మకర రాశి యందు కూడా ఇట్టి ఆర్థిక మందగతిని సూచించు చున్నది. కావున పాలకులు భారీ ప్రాజెక్ట్ లు ప్రవేశ పెట్టేముందు జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక వనరులకై ఇబ్బంది పడవలసి ఉంటుంది. సముద్ర వస్తువుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. మత్స్యకారులకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. విద్య రంగ మరియు ఆర్ధిక రంగా సంస్థల అభివృద్ధి కుంటు బట్టి ఉంటుంది. అధర్మ మరియు అవినీతి విపరీతం పెరిగి పోతుంది. పాలకు నీచమైన ఆలోచనలతో రాజ్యాలను ఏలుదురు. తత్ప్రభావము వలన ప్రజలు కష్టాలను అనుభవిస్తారు. ఇట్టి పరిస్థితి భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియా ఖండంలో ప్రధానంగా చైనా అభివృద్ధి కూడా కుంటుబట్టే అవకాశం ఉంది.


మకర రాశి యందు శని సంచారము మేషాది ద్వాదశ రాశుల వారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాము. శని గ్రహచార ప్రభావము అందరికీ ఒకే రకంగా ఉండదు. వారివారి కర్మ ఫలాలను అనుసరించి వారు ఫలితాలను పొందెదరు. అత్యంత ప్రతికూల గ్రహచారం లో కూడా అత్యంత శుభ ఫలాలు పొందు వారు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా మన కర్మ ఫలాలే. మనం పొందబోయే కర్మ ఫలాలు ఏవిధంగా ఉండబోతున్నాయో జ్యోతిష శాస్త్రం మాత్రమే చెప్పగలదు. గోచర ఫలాల ప్రభావం ఏవిధంగా ఉంటుందో మరికాస్త తెలుసుకొనుటకు గాను జాతక చక్రంలో గల అష్టకవర్గ బిందువులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జన్మ సమయానికి అష్టక వర్గాన్ని గుణించి చూసిన ఎడల ఏదేని గ్రహ వివిధ రాశులలో పొందిన అష్టకవర్గ బిందువుల ఆధారంగా అది ఫలాన్ని ఇస్తుంది. 4 బిందువులు తటస్థ ఫలాలను, 4 కంటే తక్కువ బిందువులు ప్రతికూల ఫలాలను అధికంగా ఇస్తుంది. 4 కంటే ఎక్కువ బిందువులు పొందినచో శుభ ఫలాలు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక జాతకుడికి శని మకర రాశిలో 4 బిందువులు పొందిన ఎడల వాడు గోచారంలో శని మకర రాశిలో సంచరించునపుడు తటస్థ ఫలాలను, 4 కంటే తక్కువ బిందులు పొందిన ఎడల ప్రతికూల ఫలాలను మరియు 4 కంటే ఎక్కువ బిందువులను పొందిన శుభ ఫలాలను పొందు సూచనలున్నాయి. అట్టి వారికి శని గాని మరే ఇతర గ్రహ గాని గోచారంలో ఇచ్చే శుభాశుభ ఫలాలు ఇట్టి అష్టకవర్గ బిందువులను అనుసరించి మారు సూచనలున్నాయి. అనగా అష్టక వర్గ బిందువులు గోచారం లో గ్రహాలు ఇచ్చే శుభాశుభ ఫలాలను ప్రభావితం చేస్తాయి. కావున గోచార ఫలాలను నిర్ధారణ చేసే ముందు అష్టక వర్గ బిందువులు కూడా చూడాలి.


మేష రాశి:

మేష రాశి వారికి గోచార రీత్యా దశమ స్థానమున శని సంచారము ప్రతికూల ఫలాలను ఇస్తుంది. కాని భాగ్య స్థానమున గురు మరియు తృతీయ స్థానమున రాహువు వలన నవంబర్ 2020 వరకు ఇట్టి ప్రభావము కాస్త స్వల్పముగానే ఉండు సూచనలున్నాయి. పనులు సమయానుసారముగా వెనకబడుట, శ్రమతో కూడిన ఫలములు, సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలములు, విద్యార్థులకు ఉన్నత విద్య పట్ల శ్రద్ధ తగ్గుట, పరీక్షల పట్ల శ్రద్ధ తగ్గుట, తగిన విధంగా ఫలములు లభించక పోవుట. ఉద్యోగులకు పదోన్నతులందు ప్రతికూలతలు, అనవసరమైన చికాకులు అధికం, పై అధికారులతో ఇబ్బందులు, ఉద్యోగ ప్రయత్నములు ఫలించక పోవుట, అధిక శ్రమ మరియు స్వల్ప ఫలములు, వ్యాపారులకు వ్యాపారము లందు స్తబ్దత. క్రొత్త వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఇట్టి రాశిలో జన్మించిన వారికీ మనోవ్యాకులత అధికం. వృధా సంచారం, దూర ప్రాంతాలకు స్థాన చలనం, పాప కార్యాచరణ, ఉద్యోగ భంగ సూచనలు, వ్యవహార నాశనము. ఇట్టి ప్రతికూలతలు నవంబర్ 2020 నుండి అధికమగు సూచనలున్నాయి. సెప్టెంబర్ 2020 ధన స్థానమున రాహువు సంచారము ఆర్ధిక విషయములందు ప్రతికూలతలు మరియు మోసాలను సూచించు చున్నది.

ఉపశమనాలు: శని జప శాంతులు. దాన ధర్మాదులను ఆచరించుట. దాన ధర్మాలు ఆచరించుట వలన ఇట్టి ప్రతికూలతలు చాలా వరకు తగ్గు సూచనలు. ధర్మ బద్ధంగా జీవించుట. ఆధ్యాత్మిక జీవనం గడుపుట. భూత దయ కలిగి ఉండుట. భూత యజ్ఞములను ఆచరించుట.


వృషభ రాశి:

వృషభ రాశి వారికి అష్టమ స్థానమున గురు, భాగ్య స్థానమున శని మరియు ధన స్థానమున రాహువు సంచారాలు అన్నియూ ప్రతికూలంగా ఉన్నాయి. ఇట్టి రాశిలో జన్మించిన వారికి అనారోగ్య సమస్యలు, ప్రధానంగా శరీరము నందలి గ్రంథులు, హార్మోనులు, జీర్ణకోశము నకు చెందిన సమస్యలు, అవకాశాలు చివరి క్షణమున చేజారిపోవుట. అదృష్టం కలిసి రాకపోవుట. కార్య భంగము. ఆర్ధిక వ్యవహారము లందు మోసాలు అధికం. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండాలి. మిత్రుల ద్వారా ను మరియు సన్నిహితుల ద్వారాను మోసాలు అధికం. పితృ సంబంధ అనారోగ్యము వలన చింత. మనో వ్యాకులత, దుఃఖము,ఆదాయము క్షీణించుట, తలపెట్టిన పనులు కుంటు బట్టుట, కార్య భంగము ఇత్యాది ప్రతికూల ఫలములు అధికం. విద్యార్థులకు తగిన విధంగా ఫలితములు లభించక పోవుట. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట. పదోన్నతులు నిలచిపోవుట, వ్యాపారులకు ఆర్ధిక లావాదేవీలందు మోసాలు అధికం. క్రొత్త పెట్టుబడులు మరియు ఆర్ధిక లావాదేవీలందు జాగ్రత్తగా ఉండాలి. ఇట్టి రాశిలో జన్మించిన వారికి నవంబర్ 2020 నుండి కొంత ఉపశమనము లభించు సూచనలున్నాయి. సెప్టెంబర్ 2020 నుండి జన్మ రాశిలో రాహువు గోచరము కొంత అనిశ్చితిని సృష్టించు సూచనలున్నాయి.

ఉపశమనాలు: శని గురు రాహువు  జప శాంతులు. దాన ధర్మాదులను ఆచరించుట. దాన ధర్మాలు ఆచరించుట వలన ఇట్టి ప్రతికూలతలు చాలా వరకు తగ్గు సూచనలు. ధర్మ బద్ధంగా జీవించుట. ఆధ్యాత్మిక జీవనం గడుపుట. బ్రాహ్మణులకు మరియు గురువులకు శుశ్రూష చేయుట. భూత దయ కలిగి ఉండుట. భూత యజ్ఞములను ఆచరించుట. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు.


మిథున రాశి:

మిథున రాశి వారికి అష్టమ స్థానమున సంచరించు శని, ఈ వత్సరాంతం వరకు కూడా జన్మ రాశిలో సంచరిస్తున్న రాహువు ప్రతికూలురు. ఈ వత్సరాంతం వరకు సప్తమ స్థానమున సంచరిస్తున్న గురు భ. శుభుడు. వీరికి అధిక శాతం ప్రతికూల ఫలాలు మరియు కొన్ని శుభ ఫలాలు కూడా లభించే అవకాశం ఉంది. వీరికి ప్రధానంగా స్వల్ప అనారోగ్య సమస్యలు, ప్రధానంగా జీర్ణకోశమునకు చెందిన చిక్కులు, స్వల్ప ప్రమాదాలు, అజీర్తి మరియు మలబద్ధము నకు చెందిన చిక్కులు, జీర్ణకోశమున అనుకోని చిక్కులు, పెరుగుదలలు, శ్వాసకోశము నకు చెందిన చిక్కులు, అధిక ధన వ్యయము, పెట్టుబడులు నిలచిపోవుట, వృత్తి రీత్యా అనుకోని ప్రతికూలతలు, అనూహ్యమైన మార్పులు, మానసిక చింత, పదోన్నతులు ఆగిపోవుట, సంతాన పరమైన చింత, స్వజనులకు ఇబ్బందులు, పరస్పర ద్వేషాలు, చేయని తప్పుకు బాధ్యులుగా చేయుట, రాజ దండన భయం, అవమానాలు. గౌరవ మర్యాదలు క్షీణించుట. అధిక శారీరిక శ్రమ మరియు శ్రమతో కూడిన ఫలితాలు. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలాలు. సప్తమ స్థానమున గురు భ నవంబర్ 2020 వరకు శుభుడు అగుట వలన ఇట్టి ప్రతికూలతలు కొంత తక్కువగాను మరియు అటుపిమ్మట ఇట్టి ప్రతికూలతలు అధికముగాను ఉండు సూచనలున్నాయి. సెప్టెంబర్ 2020 నుండి రాహువు సంచారము అనిశ్చితిని తగ్గించి, స్వల్ప వివాదాలను ప్రసాదించు సూచనలున్నాయి.

ఉపశమనాలు: శని రాహువు  జప శాంతులు. దాన ధర్మాదులను ఆచరించుట. దాన ధర్మాలు ఆచరించుట వలన ఇట్టి ప్రతికూలతలు చాలా వరకు తగ్గు సూచనలు. ధర్మ బద్ధంగా జీవించుట. ఆధ్యాత్మిక జీవనం గడుపుట. భూత దయ కలిగి ఉండుట. భూత యజ్ఞములను ఆచరించుట. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు.


కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి సప్తమ స్థానమున శని, నవంబర్ 2020 వరకు షష్ఠ స్థానమున గురు, వ్యయ స్థానమున రాహువు  సంచారములు ప్రతికూలమైన ఫలాలను ప్రసాదించు సూచనలున్నాయి. వీరికి చెందిన పనులు కుంటు బడతాయి. శ్రమతో కూడిన ఫలములు లభిస్తాయి. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలములు,వృత్తి రీత్యా స్తబ్దత అధికంగా ఉంటుంది. వ్యాపారము లందు అభివృద్ధి నిలిచిపోయి ఉంటుంది. భాగస్వాములతో చిక్కులు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యాభ్యాసము పట్ల ప్రధానంగా ఉన్నత విద్య పట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుంది. అనుకున్నంతగా ఫలితాలు లభించవు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. పదోన్నతులు ఆగిపోతాయి. పై అధికారులతో చిక్కులు అధికంగా ఉంటాయి. అనుకోని ఊహించని చిక్కులు మరియు వివాదాలు అధికంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. జీర్ణకోశానికి చెందిన,కీళ్ళకు చెందిన, చర్మ సంబంధ చిక్కులు, శరీరము నందలి గ్రంథులు, హార్మోనులు, శ్వాసకోశ సంబంధిత చిక్కులు అధికంగా ఉంటాయి. కాళ్ళకు చర్మ సంబంధిత చిక్కులు. అనవసరమైన ఖర్చులు,రావలసిన ధనం సమయానికి అందక పోవుట. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఋణ భీతి అధికంగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు, వృధా సంచారం. పెట్టుబడులు కరిగిపోవుట. మానసిక చింత అధికంగా ఉంటుంది. ఇట్టి ప్రతికూలతలు నవంబర్ 2020 వరకు అధికంగాను అటుపిమ్మట స్వల్ప ఉపశమనము లభించు సూచనలున్నాయి. సెప్టెంబర్ 2020 నుండి ఏకాదశ లాభ స్థానమున రాహువు సంచారము కూడా ఉపశమనమును ప్రసాదించు సూచనలున్నాయి. ప్రతికూలతలు స్వల్పముగా తగ్గు సూచనలున్నాయి.

ఉపశమనాలు:శని గురు రాహువు భ జప శాంతులు. దాన ధర్మాదులను ఆచరించుట. దాన ధర్మాలు ఆచరించుట వలన ఇట్టి ప్రతికూలతలు చాలా వరకు తగ్గు సూచనలు. ధర్మ బద్ధంగా జీవించుట. ఆధ్యాత్మిక జీవనం గడుపుట. బ్రాహ్మణులకు మరియు గురువులకు శుశ్రూష చేయుట. భూత దయ కలిగి ఉండుట. భూత యజ్ఞములను ఆచరించుట. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు. 


సింహ రాశి:

సింహ రాశి వారు శుభప్రదమైన గోచర ఫలాలను అనుభవించు వారగుదురు. షష్ఠ స్థానమున సంచరిస్తున్న శని భ. పంచమ స్థానమున సంచరిస్తున్న గురు భ. మరియు ఏకాదశ లాభ స్థానములందు సంచరిస్తున్న రాహువు భ. శుభ ఫలాలను ప్రసాదించు వారగుదురు. వీరి కార్య విజయము చక్కగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతమగు సూచనలున్నాయి. చక్కని ఆర్థికాభివృద్ధి, ధన లాభము, తలపెట్టిన పనులందు విజయము, పదోన్నతులు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. చక్కని వ్యాపారాభివృద్ధి. విద్యార్థులకు పరీక్షలందు చక్కని విజయము. కాని స్వల్ప చంచలత్వము. గృహము నాడు శుభ కార్యములు, గృహ యోగములు, గృహ నిర్మాణ అవకాశాలు, సమయానుసారముగా ధనము అందుట. బంధు జన సంతోషము. కార్య సాఫల్యము, శతృ పరాభవము, స్వయం ఉపాధులందు ఉన్న వారికి చక్కని అభివృద్ధి, ఇత్యాది శుభ ఫలితాలు ఉంటాయి.


కన్యా రాశి:

కన్యా రాశి వారికి అర్ధాష్ఠమ గురువు , పంచమ స్థానమున సంచరించు శని . మరియు రాజ్య స్థానమున సంచరించు రాహువు  అందరూ కూడా ప్రతికూలురు అగుట వలన సర్వత్రా ప్రతికూలమైన ఫలములు లభించు సూచనలున్నాయి. కార్య భంగము అధికంగా ఉంటుంది. అధిక ధన వ్యయము. మానసిక చింత. అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట. సంతాన రీత్యా ప్రయత్నాలు ఫలించక పోవుట. ఒడుదుడుకులు మరియు తెలియని అనిశ్చితి. విద్యార్థులకు కొంత వరకు మిశ్రమ ఫలాలు లభిస్తాయి. ఉన్నత విద్య పట్ల శ్రద్ధ క్రమముగా తగ్గుట. మరియు పరీక్షలందు అనుకున్నంతగా ఫలితాలు లభించక పోవుట. ఉద్యోగ వ్యాపార మరియు స్వయం ఉపాధులందు ఉన్న వారికి ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. తగాదాలు అధికంగా ఉంటాయి. వృత్తి పరమైన వివాదాలు ఎదురగు సూచనలు. ఉపాసన లందు ఉన్న వారికి ప్రతికూల ఫలాలు. నిష్ఠ భంగమగుట. శ్రద్ధ తగ్గుట. పెట్టుబడులు నిలిచి పోవుట. సంతానముతో చిక్కులు మరియు విభేదాలు అధికంగా ఉంటాయి. భాగస్వాములతో విభేదాలు అధికంగా ఉంటాయి. కార్యభంగము జరుగు సూచనలు. స్వల్ప ప్రమాదాలు. శ్వాస కోశానికి, జీర్ణ కోశానికి మరియు స్త్రీలకూ గర్భాశయానికి  చెందిన చిక్కులు అధికంగా ఉంటాయి.

ఉపశమనాలు: శని గురు రాహువు జప శాంతులు. దాన ధర్మాదులను ఆచరించుట. దాన ధర్మాలు ఆచరించుట వలన ఇట్టి ప్రతికూలతలు చాలా వరకు తగ్గు సూచనలు. ధర్మ బద్ధంగా జీవించుట. ఆధ్యాత్మిక జీవనం గడుపుట. బ్రాహ్మణులకు మరియు గురువులకు శుశ్రూష చేయుట. భూత దయ కలిగి ఉండుట. భూత యజ్ఞములను ఆచరించుట. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు. శ్రీ దుర్గా సప్తశతి పారాయణం. చండీ హోమాలు. 


తులా రాశి:

తులా రాశి వారికి అర్ధాష్ఠమ స్థానమున సంచరిస్తున్న శని, తృతీయ స్థానమున గురు, భాగ్య స్థానమున రాహువు. ఈ మూడు గోచారములు ప్రతికూలమగుట వలన వీరికి ఇట్టి శని గోచరము ప్రతికూలమైన ఫలమును ప్రసాదించు సూచనలున్నాయి. పనులు సమయానుసారముగా వెనకబడుట, కార్య భంగము అధికము, శ్రమతో కూడిన ఫలములు, సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలము. పనులు సకాలమున కాకపోవుట, పరాజయానికి చెందిన భయం, శారీరిక శ్రమ అధికం, వృధా సంచారం. మాతృ మరియు పితృ సంబంధమైన అనారోగ్యము. ఆస్తులకు చెందిన ప్రతికూలతలు. శారీరిక సుఖము లోపించుట. కుటుంబ వ్యవహారము లందు ప్రతికూలతలు. అవకాశాలు చివరి క్షణమున చేజారిపోవుట. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట. పదోన్నతులు ఆగిపోవుట, వ్యాపార లందు ఉన్న వారికి స్తబ్దత. వ్యాపారాలు క్రమంగా క్షీణించుట. లాభాలు తగ్గుట. విద్యార్థులకు విద్యాభ్యాసము పట్ల శ్రద్ధ తగ్గుట. మార్కులు అనుకున్నంతగా పొందక పోవుట. సోమరితనము ఆవహించుట. ఉన్నత విద్య పట్ల మరియు పని పట్ల శ్రద్ధ తగ్గుట. అనారోగ్యము. కీళ్ళకు మరియు చర్మ సంబంధిత చిక్కులు, స్వల్ప ప్రమాదాలు. వృద్ధులు మరియు అనారోగ్యాలతో బాధపడు వారికి అధిక ప్రతికూలతలు. శరీరము నందలి గ్రంథులు మరియు హార్మోనులకు చెందిన చిక్కులు. చెవి ముక్కు మరియు గొంతుకు చెందిన చిక్కులు,థైరాయిడ్ సమస్య తో బాధపడు వారికి ఇట్టి చిక్కులు అధికం.

ఉపశమనాలు: శని గురు రాహువు జప శాంతులు. దాన ధర్మాదులను ఆచరించుట. దాన ధర్మాలు ఆచరించుట వలన ఇట్టి ప్రతికూలతలు చాలా వరకు తగ్గు సూచనలు. ధర్మ బద్ధంగా జీవించుట. ఆధ్యాత్మిక జీవనం గడుపుట. బ్రాహ్మణులకు మరియు గురువులకు శుశ్రూష చేయుట. భూత దయ కలిగి ఉండుట. భూత యజ్ఞములను ఆచరించుట. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు. శ్రీ దుర్గా సప్తశతి పారాయణం. చండీ హోమాలు. శని మూలమంత్ర సంపుటి తో మహాన్యాస రుద్రాభిషేకాలను. పేదలకు అన్నదానం.


వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి శుభ ఫలములు అధికముగా లభించు సూచనలున్నాయి. ఏలినాటి శని ముగియుట అత్యంత శుభప్రదము. ధన స్థానమున గురు భ స్థితి అత్యంత శుభప్రదము. అష్టమ స్థానమున సంచరిస్తున్న రాహువు భ ప్రతికూలుడు.

వీరికి శుభ ఫలాలు అధికంగా ఉంటాయి. ఏలినాటి శని కాలం ముగియుట వలన ఆగిపోయిన పనులన్నీ కూడా వేగాన్ని పుంజుకుంటాయి. చక్కని కార్య సిద్ధి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమగుట, పదోన్నతులు,సర్వత్రా శుభ ఫలాలు, విద్యార్థులకు మరియు వ్యాపారులకు కూడా శుభ ఫలాలు. చక్కని వ్యాపారాభివృద్ధి. కీర్తి ప్రతిష్టలు, శ్రమకు తగిన గుర్తింపు, ప్రయాణాలు లాభసాటిగా ఉండుట, చేపట్టిన వ్యవహారములు సఫలీక్రుతమగుట. చక్కని ఆర్థికాభివృద్ధి. సజ్జన సాంగత్యము,ధర్మ కార్యములను నిర్వర్తించుట, గృహము నందు శుభ కార్యములు. కాని ఆర్ధిక లావాదేవీలందు స్వల్ప ప్రతికూలతలు మరియు ఒడుదుడుకులు కోన సాగు సూచనలున్నాయి. నేత్ర సంబంధిత చిక్కులు, కళ్ళలో ఎలర్జీ లకు చెందిన చిక్కులు.

ఉపశమనాలు: రాహువు మరియు కేతువు  జప శాంతులు. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు. సర్ప పాశుపత మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు.


ధనుస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ధన స్థానమున సంచరించు శని ,జన్మ రాశిలో గురు. మరియు కేతువు. సప్తమ స్థానమున రాహువు. ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రతికూల గోచారము వలన మరియు ఇతర గ్రహాల ప్రతికూల గోచారము వలన ప్రతికూలముగా ఉండు ఫలములు అధికముగా పొందు సూచనలున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల పరముగా ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. ప్రతి పనిలోని ఎదో ఒక రకమైన అనిశ్చితి కొనసాగుతూ ఉంటుంది. అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. బంధు విరోధము. వ్యాపారులకు లాభాలు క్షీణించుట. పెట్టుబడులు నిలిచి పోవుట. రావలసిన ధనము సమయానికి అందక పోవుట. ఋణ భీతి అధికం. విద్యార్థులకు ఉన్నత విద్య పట్ల శ్రద్ధ తగ్గుట. శ్రమతో కూడిన ఫలములు మరియు సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలము. వృత్తి మరియు వ్యాపారము లందు అనుకోని మార్పులు మరియు ఒడుదుడుకులు. జన్మ రాశి స్థిత గురు భ వలన సత్కార్య చింతన. ధార్మిక చింతన అధికంగా ఉంటుంది. శని భ వలన కీర్తిప్రతిష్ఠలకు భంగము వాటిల్లుట, వృధా సంచారము. దూషణలు. అనవసర కలహాలు. అనారోగ్యము. నేత్ర సంబంధిత చిక్కులు, ప్రమాదాలు, నోరు మరియు దంత సంబంధిత చిక్కులు, జీర్ణకోశము మరియు చర్మ సంబంధిత చిక్కులు. ముఖము కళావిహీనమగుట. ఇత్యాది ప్రతికూల ఫలాలు ఉండుట. వీరికి నవంబర్ 2020 నుండి స్వల్ప ఉపశమనము లభించు సూచనలున్నాయి.

ఉపశమనాలు: శని,గురు, రాహువు జప శాంతులు. దాన ధర్మాదులను ఆచరించుట. దాన ధర్మాలు ఆచరించుట వలన ఇట్టి ప్రతికూలతలు చాలా వరకు తగ్గు సూచనలు. ధర్మ బద్ధంగా జీవించుట. ఆధ్యాత్మిక జీవనం గడుపుట. బ్రాహ్మణులకు మరియు గురువులకు శుశ్రూష చేయుట. భూత దయ కలిగి ఉండుట. భూత యజ్ఞములను ఆచరించుట. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు. శ్రీ దుర్గా సప్తశతి పారాయణం. చండీ హోమాలు. శని మూలమంత్ర సంపుటి తో మహాన్యాస రుద్రాభిషేకాలను. పేదలకు అన్నదానం.


మకర రాశి:

మకర రాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్న శని, వ్యయ స్థానమున గురు భ ప్రతికూలురు. 6 వ స్థానమున సంచరిస్తున్న రాహువు శుభుడు.

వీరికి ప్రతికూల ఫలాలు అధికముగాను మరియు శుభ ఫలాలు స్వల్పముగాను లభించు సూచనలున్నాయి. పనులు మందగతిన సాగుతూ ఉంటాయి. సమయానుసారముగా వెనకబడుతూ ఉంటాయి. శ్రమతో కూడిన ఫలములు మరియు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలములు. కార్య భంగము అధికము. పదోన్నతులు నిలిచి పోవుట. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట. వృధా సంచారము. అధిక ధన వ్యయము. ప్రయాణాలందు అధిక ఖర్చులు. వ్యాపారులకు స్తబ్దత ఉంటుంది. పెట్టుబడులు ఆగిపోతాయి. రావలసిన ధనము అందక పోవుట. ఋణ భీతి అధికము. తేజస్సు క్షీణించుట. నూతన ఉద్యోగ మరియు వ్యాపార ప్రయత్నాలు ఫలించక పోవుట. వ్యాపారాలు తగ్గిపోవుట. రాబడి తగ్గుట. ఖర్చులు అధికం. సన్నిహితులతో విభేదాలు. పనుల పట్ల మరియు పని పట్ల శ్రద్ధ తగ్గుట. సోమరితనము ఆవహించుట. అనారోగ్యము. కీళ్ళకు మరియు చర్మ సంబంధిత చిక్కులు. స్వల్ప ప్రమాదాలు. 6 వ స్థానమున సంచరిస్తున్న రాహువు మీకు స్వల్ప ఉపశమనమును ప్రసాదించు సూచనలున్నాయి.

ఉపశమనాలు: శని గురు జప శాంతులు. దాన ధర్మాదులను ఆచరించుట. దాన ధర్మాలు ఆచరించుట వలన ఇట్టి ప్రతికూలతలు చాలా వరకు తగ్గు సూచనలు. ధర్మ బద్ధంగా జీవించుట. ఆధ్యాత్మిక జీవనం గడుపుట. బ్రాహ్మణులకు మరియు గురువులకు శుశ్రూష చేయుట. భూత దయ కలిగి ఉండుట. భూత యజ్ఞములను ఆచరించుట. శని మూలమంత్ర సంపుటి తో మహాన్యాస రుద్రాభిషేకాలను. పేదలకు అన్నదానం. గురు మూలమంత్ర సంపుటి తో మహాన్యాస రుద్రాభిషేకాలను.


కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం. కాని ఏకాదశ లాభ స్థానమున గురు నవంబర్ 2020 వరకు శుభుడు. పంచమ స్థానమున రాహువు ప్రతికూలుడు.

కుంభ రాశికి వారికి మిశ్రమ లేదా స్వల్ప ప్రతికూల ఫలాలు ఉంటాయి. కొన్ని శుభ ఫలాలు కూడా లభించు సూచనలు. ఏలినాటి శని వలన అధిక ధన వ్యయము, వృధా సంచారము, దూర ప్రయాణాలు, స్వల్పకాలిక విదేశీయాన యోగాలు, పెట్టుబడుల పరముగా ప్రతికూలతలు, సన్నిహితులతో విభేదాలు, ఆధ్యాత్మిక మరియు ధార్మిక చింతన అధికమగుట, అధిక వ్యయ ప్రయాసలు, శ్రమతో కూడిన ఫలములు. మానసిక చింత, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. నవంబర్ 2020 వరకు గురు శుభుడు అగుట వలన సమయానుసారముగా ధనం అందుట. కొంత శ్రమ ఉన్నను చక్కని కార్య విజయము, స్పురణ శక్తి పెంపొందుట, ఉపాసన లందు ఉన్న వారికి శుభ ఫలితాలు, సంతాన రీత్యా చింత అధికం. నవంబర్ 2020 నుండి గురు శని మరియు రాహువులు ప్రతికూలులగుట వలన ప్రతికూల ఫలాలు అధికముగా లభించు సూచనలున్నాయి. ధన నష్టము, కీర్తి నష్టము, అనుకొని ఒడుదుడుకులు, అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట. కుంభ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమతో కూడిన ఫలితం లభిస్తుంది. మనస్సు నిగ్రహంలో ఉంచుకోవాలి. ఈ రాశి వారికి స్వల్ప అనారోగ్యము. కీళ్ళ నొప్పులు మరియు చర్మ సంబంధిత చిక్కులు, కాళ్ళకు తరచు దెబ్బలు తగులుట, స్వల్ప ప్రమాదాలు సంభవించు సూచనలు. శ్వాస కోశమునకు చెందిన చిక్కులు.

ఉపశమనాలు: శని గురు జప శాంతులు. దాన ధర్మాదులను ఆచరించుట. దాన ధర్మాలు ఆచరించుట వలన ఇట్టి ప్రతికూలతలు చాలా వరకు తగ్గు సూచనలు. ధర్మ బద్ధంగా జీవించుట. ఆధ్యాత్మిక జీవనం గడుపుట. బ్రాహ్మణులకు మరియు గురువులకు శుశ్రూష చేయుట. భూత దయ కలిగి ఉండుట. భూత యజ్ఞములను ఆచరించుట. శని మూలమంత్ర సంపుటి తో మహాన్యాస రుద్రాభిషేకాలను. పేదలకు అన్నదానం. గురు మూలమంత్ర సంపుటి తో మహాన్యాస రుద్రాభిషేకాలను.


మీన రాశి:

మీన రాశి వారికి శుభ ఫలాలు అధికముగా ఉండు సూచనలున్నాయి. ఏకాదశ లాభ స్థానము న శని శుభుడు. చతుర్థ స్థానమున రాహువు ప్రతికూలుడు. నవంబర్ 2020 వరకు గురు ప్రతికూలుడు.

మిశ్రమ గ్రహచార ప్రభావము వలన స్వల్ప మిశ్రమ మరియు శుభ ఫలాలు లభించు సూచనలున్నాయి. కార్య విజయము చక్కగా ఉంటుంది. తలపెట్టిన పనులు విజయవంతమౌతాయి. క్రొత్త అవకాశాలు లభిస్తాయి. ధన లాభము. రావలసిన ధనము అందుట. పెట్టుబడుల పరముగా లాభాలు అధికంగా ఉంటాయి. సంతోషము, సర్వత్రా ఆహ్లాదకర స్థితి. ఉద్యోగ ప్రయత్నాలయందు స్వల్ప ప్రతికూలతలు ఉన్నను చివరిగా విజయము సాధించుట. వ్యాపారులకు చక్కని లాభాలు. అధిక ధన లాభము. క్రొత్త వ్యాపార అవకాశాలు లభించుట. విద్యార్థులకు రాబోవు అకాడమిక్ సంవత్సరం నుండి అత్యంత శుభ ఫలితాలు. ఈ రాశి వారికి కొన్ని సందర్భాలందు చివరి క్షణంలో అవకాశాలు చేజారిపోవు సూచనలు. నవంబర్ 2020 నుండి అత్యంత శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి. పదోన్నతులు, క్రొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రయాణాలు విజయవంతమగుట, చెవి ముక్కు మరియు గొంతుకు చెందిన చిక్కులు.

ఉపశమనాలు: రాహువు జప శాంతులు 


ముఖ్య గమనిక:

జాతక స్థిత శని షడ్బలము లందు శక్తి వంతుడై ఉన్నపుడు, 3, 6 మరియు 11 స్థానములందు ఉన్నపుడు,ఉచ్ఛ స్థానము లందు ఉన్న ఎడల, స్వక్షేత్రము లందు ఉన్న ఎడల ఇట్టి ప్రతికూలతలు తక్కువగా ఉండు సూచనలున్నాయి. జన్మ కాల దశలు ఇట్టి శుభాశుభ ఫలములను ప్రభావితం చేయు సూచనలున్నాయి. కావున పైన వివరించిన ఫలములు అందరికీ ఒకే విధంగా ఉండక పోవచ్చని గ్రహించాలి.

Dr బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ. నార్త్ కరోలినా . అమెరికా . 


1 comment:

  1. Nice blog thanks for sharing with us... It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.

    ReplyDelete