టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ కాలంలో మన దేశ యువత దూసుకుపోతోంది. అన్ని దేశాల్లోనూ, అన్ని రంగాల్లోనూ మన యువత ముందుంటున్నారు. మన వారికి విదేశాల్లో మంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరులోను పెరుగుతోంది. దీనికి తగ్గట్టే ఉపాదికి తగ్గ విద్యను ఇక్కడే ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కాకపోయిన విద్యా కోసమైన విదేశాలకు వెళ్ళాలని ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే అందరు వెళ్ళగలుగుతున్నారా, అందరికి అలాంటి అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది వారి వారి జాతకాలను బట్టి ఉంటుంది. ఏయే గ్రహాలు జాతకుడిని విదేశీయానం వైపుకి తీసుకుపోతాయో పరిశీలిద్దాం.
దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు పూర్వకాలంలో జల యానం చేసే వారు. అంటే నౌకల ద్వారా తమ గమ్యం చేరుకునే వాళ్లు. అప్పటి కాలంలో విమానయానం లేదు కాబట్టి. జలయానం చేయాలంటే జల రాశులైన కర్కాటకం, మీనం, వృశ్చిక రాశులతో పాటు చంద్రబలం కూడా ఉండితీరాలి. ఇప్పుడు విమాన ప్రయాణాలు పెరిగాయి. దీనికి వాయుతత్వ రాశులైన మిధున, కుంభ, తుల రాశుల యొక్క ప్రభావం అధికమని చెప్పవచ్చును. దీనితో పాటు ఆకాశతత్వ ప్రభావాన్ని కలిగి ఉండే గురుగ్రహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
రాశులు తమ తమ స్వభావాలను బట్టి యాత్రలను చేసే అవకాశాలను కలిగిస్తాయి. వాటి వాటి స్వభావాల ప్రకారం విభజిస్తే చర, స్ధిర, ద్విస్వభావ రాశులనే మూడు రకాలుగా ఉంటాయి.
చరరాశులు: మేషం, కర్కాటకం, తుల, మకరం
స్ధిర రాశులు: వృషభం, సింహాం, వృశ్చికం, కుంభం
ద్విస్వభావ రాశులు: మిధునం, కన్య, ధనస్సు, మీనం
చరరాశులు వాటి స్వభావరీత్యా చలన గుణ సంపన్నమై ఉంటాయి. దాని వలన ఈ రాశిలోని వారు ఎప్పుడు యాత్రలు చేయాలనే అభిలాష కలిగి ఉంటారు. ముఖ్యంగా జలారాసులైన కర్కాటకం, మకర రాశులైతే మరింత యాత్రలు చేయాలనే అభిలాష కలిగి ఉంటారు. ద్వి స్వభావ రాశులలో ధనస్సు, మీనరాశులు సైతం ఇలాంటి విదేశీయాత్ర స్వభావాన్నే కలిగి ఉంటాయి. స్దిర రాశులకు ఇలాంటి విదేశీ ఆకాంక్షలు తక్కువనే చెప్పాలి. స్దిర రాశుల్లో వృశ్చికరాశికి విదేశీ అవకాశాలు కొంతవరకు ఉంటాయి. మిగిలిన వారికి వారి వారి జన్మదేశంలోనే ఉండి పోవాలనే ఆకాంక్ష అధికంగా ఉంటుంది.
కొన్ని నక్షత్ర స్వభావాలు కూడా విదేశీ ప్రయాణాల వైపుకు మొగ్గు చూపుతున్నాయి. అవి...
శనిగ్రహ నక్షత్రాలైన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర
రాహుగ్రహ నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిషం
గురుగ్రహ నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర
చంద్రగ్రహ నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణం
ఇంకా చర నక్షత్రాలైన స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ట, శతభిషం మొదలగు నక్షత్రాలు విదేశాలకు వెళ్ళాలనే కోరికను ప్రేరేపిస్తాయి.
జాతకచక్రంలో ఒక వ్యక్తికి విదేశీ గమన ఆకాంక్షను లగ్నం, తృతీయం, పంచమం, సప్తమం, అష్టమం, నవమం,
ద్వాదశ భావాలు కలిగిస్తాయి. చరలగ్న జాతకుడు తన భ్రమణ కారక ప్రవృత్తి వలన జన్మస్ధలానికి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. స్దిరలగ్న జాతకులు తమ జన్మ స్ధలంలోనే ఉండిపోతారు. ద్విస్వభావ లగ్న జాతకులు అప్పుడప్పుడు విదేశీ యాత్రలు చేసిన అధికంగా వారు స్వస్ధలానికే వచ్చేస్తుంటారు. తృతీయ స్ధాన ప్రభావం వలన దేశ సరిహద్దులకు మించి విదేశాలకు వెళ్ళలేరు. సప్తమ స్ధానాన్ని అనుసరించి విదేశాలలోనే స్దిర నివాసం ఉంటుందా లేదా స్వదేశానికి తిరిగి వస్తారా అన్నది తెలుసుకోవచ్చు. పంచమం, నవమ స్ధానాల వలన విదేశాలకు వెళ్ళాలనే కోరికలు పుడుతుంటాయి. అష్టమ భావం వలన వ్యక్తి విదేశాలలోనే ఉండిపోయే అవకాశాలను నవమ, ద్వాదశాల ప్రభావం కూడా ఉంటే తెలుసుకోవచ్చును. అష్టమ భావం వృశ్చికం అయితే విదేశాలలో ఉండిపోయే అవకాశాలు ఎక్కువ. అష్టమ భావం ధనస్సు నుండి మీనం వరకు ఉన్న రాశులలో ఉంటే విదేశీ అవకాశాలు ఎక్కువ.
నవమ భావం గమనాన్ని, పరివర్తనను, తీర్ధ యాత్రలను, దేశాంతర యానాన్ని తెలియజేస్తుంది. విదేశీయాత్రకు అవసరమైన భూమికను తయారుచేస్తుంది. నవమభావం ఆదిపత్యం లేకుండా విదేశీ ప్రయాణం చేయలేము.
ద్వాదశభావం దూరం అవటం, ఎడబాటు కలగటం తెలియజేస్తుంది. కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు దూరం కావటం. కుటుంబ సభ్యులకు ఎడబాటు కలగటం అంటే విదేశాలకు వెళ్ళటం.
విదేశాలలో స్ధిర నివాసం గురించి లగ్నం, లగ్నాధిపతి, చతుర్ధం, చతుర్ధాధిపతికి సంభంధం ఉంటే విదేశీ యోగం ఉంటుంది కానీ స్ధిర నివాసానికి అవకాశాలు తక్కువ. చతుర్ధభావం, చతుర్ధభావాధిపతికి ద్వాదశ భావ ప్రభావం ఉంటే అతడు విదేశాలకు వెళ్తాడు గాని స్దిర నివాస అవకాశాలు తక్కువ.
‘సర్వేశ్చరే స్ధితౌ రజ్జః’ అనే శ్లోకం ఆధారంగా రజ్జుయోగం ఉంటేనే విదేశీ యోగం ఉంటుందని అర్ధం. గ్రహాలన్నీ చరరాశిలో ఉన్న రజ్జుయోగం అంటారు.
“అనరప్తియ సురపాః ప్రదేశ జాతాః క్షీవ ప్రవాసీ వ్యయేశే పాపి సంయుక్తే వ్యవపాప సమన్వితే పాపగ్రహణే సందృష్టే దేశాంతర గతః “ సప్తమభావం రాహువు కలసి విదేశాలకు వెళ్ళే కారకాలు అవుతాయి. సప్తమం, రాహువు నిర్వాసనా స్దితిని తెలియజేస్తుంది. పూర్వకాలంలో నిర్వాసనా స్ధితి రాజదండన వలన కలిగేది ఇప్పుడు విదేశీయానంగా మారింది. రాహువు వ్యయంలో ఉండటం వలన బందనయోగం ఎర్పడి శుభగ్రహ ద్రుష్టి ఉంటే కుటుంబ సభ్యులను వదలి దూరంగా విదేశాలకు వెళ్తాడు.
అష్టమ, నవమాధిపతుల యుతి ఉంటే విదేశీగమన యానం ఉంటుంది. చతుర్ధభావంలో పాపగ్రహం ఉండి, చతుర్ధాధిపతి పాపగ్రహ యుతి కలిగి చంద్రుడు కూడా పాపగ్రహంతో కలసి ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న చదువు కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దీనికి తోడు దశమాధిపతికి, షష్టమాధిపతికి సంబంధం ఉన్నా లేదా దశమభావం పైన షష్టమాధిపతి ప్రభావం ఉన్న ఆ వ్యక్తి విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువ.
వ్యయాధిపతి వ్యయంలో గాని, కోణంలో గాని ఉన్న ధనార్జన కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దశమాధిపతి సంబంధం ఉంటే ఉద్యోగరీత్యా ధనార్జన ఉంటుంది. సప్తమభావాధిపతి, లగ్నాధిపతి ద్వాదశభావంలో కలసి ఉన్న లేదా, సప్తమాధిపతికి, లగ్నాధిపతికి, ద్వాదశాధిపతికి సంభంధం ఉన్న విదేశాలలో వివాహం చేసుకుంటాడు.
సప్తమాధిపతికి, దశమాధిపతికి సంభంధం ఉన్న, సప్తమాధిపతి దశమంలో ఉన్న, దశమాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమభావ, దశమభావ గ్రహాధిపతుల మధ్య పరివర్తన ఉన్న విదేశాలలో ఉద్యోగం లభిస్తుంది. నవమస్ధానం పైన గాని, నవమాధిపతి పైన గాని శని ప్రభావం ఉంటే వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. నవమస్ధానంపైన గాని, నవమాధిపతి పైన గాని గురుగ్రహ ప్రభావం ఉంటే విద్య కొరకు, దేవాలయ దర్శనం కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ.
షష్ఠమాధిపతి నవమంలో ఉన్న, నవమాధిపతి షష్థంలో ఉన్న నవమ, షష్ఠ భావ గ్రహాదిపతుల మధ్య పరివర్తన జరిగిన ఆరోగ్య సమస్యలరీత్యా విదేశీయానం చేయవలసి ఉంటుంది. నవమస్ధానం, నవమాధిపతులపైన, ద్వాదశ స్ధానం, ద్వాదశాధిపతుల పైన శుక్రగ్రహ ప్రభావం ఉంటే టూరిస్ట్ లుగా విదేశీ అందాలను తిలకించటానికి విదేశీయాత్ర చేసే అవకాశాలు ఉంటాయి.
నవమస్ధానం పైన, నవమాధిపతికి గురుగ్రహ, శని గ్రహ సంబంధం ఉంటే స్వాములు, అవధూతలు, మత ప్రచారకులు, మతభోధకులు, ప్రవాచాలాలు చేసే ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్తుంటారు. నవమస్ధానంలో రవి ఉన్న చంద్రుడు ఉన్న కాళ్ళకు చక్రాలు పెట్టుకున్నట్లుగా భ్రమణకాంక్షగా విదేశాలకు తరచుగా వెళ్తుంటారు.
చరలగ్నం, లగ్నాధిపతి చరలగ్నంలో ఉండి, నవాంశ కూడా చరలగ్నం అయితే ఆ జాతకుడు విదేశీ యాత్రలద్వారానే ధనార్జన చేస్తాడు. నవమస్ధానంలో గురువు ఉండి శని, చంద్రుల దృష్టి ఉంటే వారు విదేశాలకు వెళ్ళటమే కాకుండా అక్కడ స్దిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. నవమస్ధానంలో శుక్రుడు, గురువు, బుధుడు, శని గ్రహాలు ఉంటే ఆ వ్యక్తి అశేషమైన విదేశీ ధనాన్ని సముపార్జిస్తారు.
జాతకచక్రంలో గ్రహాల పొందికను బట్టి విదేశీయానం ఉన్న, ఆ వ్యక్తి యొక్క కుటుంబం, ఆర్ధిక పరిస్ధితులు పరిగణనలోకి తీసుకోవాలి. నక్షత్రాలు, గ్రహాలు, రాశులు అన్నీ కలసిన కుటుంబంలో ధనలక్ష్మీ లేకున్నా, దైవానుగ్రహం, పూర్వపుణ్య బలం లేకున్న నక్షత్రాబీలు, గ్రహాలు, రాశులు ఏవి మనకు సహాయపడలేవని గుర్తించాలి.
శుభం భూయత్...
Nice Blog, It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.
ReplyDelete