Sunday, October 7, 2018

గోచారములో గురుడు పన్నెండు రాశులలో సంచరించునపుడు కలుగు ఫలితములు

గోచారములో గురుడు పన్నెండు రాశులలో సంచరించునపుడు కలుగు ఫలితములు

గురువు ఒక రాశిని విడిచి మరొక రాశిలో ప్రవేశించటాన్ని పుష్కరము అంటారు.గురువు మేషాదిగా 12 రాశులలో సంవత్సరానికి ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు.అలా ప్రవేశం జరిగినప్పుడు ఒకొక్కరాశికి ఒకొక్క నది చొప్పున క్రమముగా పుష్కరాలు వస్తాయి.గురువు ఆ రాశిలో ఉన్నంత కాలం ఆ నది పుష్కరములలో ఉన్నట్లే.

గోచారం ప్రకారం గురువు 2 5 7 9 11 రాశులలో ఉన్నప్పుడు  శుభ ఫలితములు కలుగజేయును. గోచారరీత్యా వృశ్చిక రాశిలోకి సంచరిస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి అష్టమ స్ధాన ఫలితాలను, వృషభరాశి వారికి సప్తమ స్ధాన ఫలితాలను, మిధునరాశి వారికి షష్టమ స్ధాన ఫలితాలను, కర్కాటకరాశి వారికి పంచమ స్ధాన ఫలితాలను, సింహరాశి వారికి చతుర్ధ స్ధాన ఫలితాలను, కన్యారాశి వారికి త్రుతీయ స్ధాన ఫలితాలను, తులారాశికి ద్వితీయ స్ధాన ఫలితాలను, వృశ్చికరాశి వారికి జన్మ స్ధాన ఫలితాలను, ధనస్సు రాశి వారికి వ్యయ స్ధాన ఫలితాలను, మకర రాశి వారికి లాభ స్ధాన ఫలితాలను, కుంభరాశి వారికి దశమ స్ధాన ఫలితాలను, మీనరాశి వారికి నవమ స్ధాన ఫలితాలను కలుగజేస్తాడు. గోచార రీత్య గురువు సంచరించే రాశులలో అష్టకవర్గు బిందువులు 28 పైన ఉన్న రాశులలో సంచారం చేస్తున్నప్పుడు అది శతృ రాశి ఐనా చిన్నపాటి రెమిడీస్ తో శుభ ఫైతాలను, 28 బిందువుల కంటే తక్కువ ఉన్న రాశులో గురువు సంచారం చేస్తున్నప్పుడు కిష్టమైన రెమిడీస్ తో శుభ ఫలితాలను పొందవచ్చును. అంతే కాక గురువు సంచరించే రాశులలో 4 అష్టక వర్గు బిందువుల కంటే ఎక్కువ ఇచ్చిన రాశులలో శుభ ఫలితాలను, 4 కంటే తక్కువ అష్టక వర్గు బిందువులను ఇచ్చినప్పుడు అశుభ ఫలితాలను ఇవ్వటానికి అవకాశాలను కలిగిస్తాడు.

 గురుడు : దేశ త్యాగం, విత్తం లాభం అనర్ధం ధన నాశనం
                   సంపద, క్లేశం, ఆరోగ్యం, ధన హానిం, ధనాగమం
                   పీడనం లాభ నష్టంచా క్రమేణ కురుతే గురుః 

తాత్పర్యము : గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .

శ్లోకం :   రాజకోపో యశోహానీ రుద్యోగస్య విరోధకం І
          బుద్ధిభ్రంశో భాగ్యహాని ర్భయంతను గతే గురౌ ІІ

జన్మ రాశిలో గురుడు సంచరించు నపుడు ప్రభుత్వ అధికారుల కోపమునకు గురియగుదురు. పేరు ప్రఖ్యాతలకు నష్టము కలుగును. చేయు వృత్తి, వ్యాపారములలో ఇబ్బందులు ఎదురగును. బుద్ది గతి తప్పును. సంపద నశించును. భయముగా ఉండును.

శ్లోకం :   మనస్సౌఖ్యం యశోవృద్ధి స్సౌభాగ్యంచ ధనాగమః І
               ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్తానగేగురౌІІ

రెండవ రాశిలో గురు సంచార వేళలో మనస్సున సౌఖ్యము కలుగును, గృహమునందు శుభ కార్యములు జరుగును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. ధన రాబడి బాగుంటుంది. తీర్ధ యాత్రలు చేయడము, ధర్మ బద్దమైన కార్య క్రమములలో పాల్గొనడము జరుగుతుంది. సంతోషముగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము కలుగును.

శ్లోకం :   అతిక్లేశం బంధువైరం దారిద్యం దేహపీడనం І
               ఉద్యోగ భంగం కలహం తృతీయ స్తానగే గురు: ІІ

మూడవ రాశిలో గురుడు సంచారము చేయు చున్నప్పుడు శారీరక శ్రమ అధికము గా ఉంటుంది. చుట్టములతో విరోధము ఏర్పడుతుంది. దరిద్రమును అనుభవిస్తారు. ఉద్యోగ వ్యాపారములలో నష్టములు కలుగుతాయి. శరీరమునందు భాధలు, అనవసరమైన తగవులు ఏర్పడతాయి.

శ్లోకం :   యాచనం బుద్ది చాంచల్యం తేజో హానీం ధన వ్యయం І
                దేశ త్యాగంచ కలహం చతుర్ధ స్తానగే గురు: ІІ

నాలుగవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు దీన స్థితి కలుగుతుంది. బుద్ది చంచలముగా ఉండును. మర్యాద నశించును. ధన నష్టము కలుగును గొడవలు పెరుగుతాయి. స్థాన నాశనము కలుగుతుంది.

శ్లోకం :   అర్ధ లాభం తదైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం І
               సదా స్వజన సౌఖ్యంచ పంచమస్థే భావే ద్గురౌ ІІ

అయిదవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు ధన లాభము కల్గుతుంది. స్వయముగా చేపట్టిన పనులు అనుకూలించుటయే కాక విజయము లభించును. తన కుటుంబ మరియు బంధు వర్గముల వలన సౌఖ్యమును అనుభవిస్తారు.

శ్లోకం :   దారాపుత్ర విరోధశ్చ స్వజనై కలహస్తదా І
               చోరాగ్ని నృప భీతిశ్చ షష్టమస్తే భవేద్గురౌ ІІ

బృహస్పతి ఆరవ రాశి సంచారము లో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితోనూ, పిల్లలతోనూ విరోధము ఏర్పడును. అసహనము కలుగును, దొంగల వలన నష్టము ఏర్పడును. అగ్ని భయము కలుగును. ప్రభుత్వ సంభందిత వ్యవహారములలో ఇబ్బందులు కలుగును.

శ్లోకం :   రాజ దర్శన మారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం І
                అభీష్ట కార్య సిద్దిశ్చ సప్తమస్తే భవేద్గురౌ ІІ

ఏడవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు మంచి ఆరోగ్యముగా ఉంటారు. ప్రభుత్వ పరిపాలకుల తో పరిచయములు ఏర్పడతాయి. తలచిన కార్యములు నెరవేరుతాయి. ప్రతి పని తనకు అనుకూలముగా జరుగుతుంది.

శ్లోకం :   చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం І
               నిష్టురం సాహసం క్రోధం అష్టమస్తే గురౌ భవేత్ ІІ

ఎనిమిదవ రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు దొంగల వలన గానీ, అగ్ని వలన గానీ, నష్టము ఏర్పడును, శరీర సౌఖ్యము ఉండదు. నిస్టూరముగా మాట లాడడం, ప్రతి పనిలోనూ తెగింపు, కోపము ఎక్కువగా ఉండడము జరుగుతుంది.

శ్లోకం :   అర్ధంచ స్వకులాచారః గృహలాభః సుభోజనం І
                నిత్య స్త్రీ జన సంపర్కం నవమస్తే భవేత్ గురౌ ІІ

తొమ్మిదవ రాశిలో గురుని సంచారము ఉన్నప్పుడు సునాయాస ధన లాభము కలుగును. మంచి ఆచార సాంప్రదాయముల ప్రకారము నడచుకొంటారు. గృహము నిర్మించుకొంటారు. ఇరుగు పొరుగు వారితో కలసి మెలసి ఉంటారు. భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది.

శ్లోకం :   ధాన్య నాశో ధనచ్చేదః వృధా సంచరణం భయం І
                స్వజనై దూషనః చైవ దశమష్తో యదా గురు: ІІ

బృహస్పతి పదవ రాశిలో సంచరించు చున్నప్పుడు ధనమునకు నాశనము కలుగును, అనవసర ఖర్చులు పెరుగుతాయి. బ్రతుకు భయముగా సాగుతుంది. ఇతరులచే దూషించ బడతారు.

శ్లోకం :   యశో వృద్ధి బలం తేజ స్సర్వత్ర విజయ స్సుఖం І
                శత్రు నాశో మంత్రం సిద్ధి రేకాదశ గతే గురౌ ІІ

పదకొండవ రాశి లో గురుడు సంచారము  చేయుచున్నప్పుడు మంచి పేరును సంపాదిస్తారు. తేజస్సు, పలుకుబడి పెరుగుతుంది. శత్రువులు నాశనమవుతారు, అన్నివిధాలా లాభమును పొందుతారు.

శ్లోకం :   శుభ మూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం І
                స్థాన భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్తానగే గురౌ ІІ

పన్నెండవ రాశిలో గురుడు సంచారము జరిగేటప్పుడు ఇంటిలో శుభ కార్యములు జరుపుట వలన ధనము ఖర్చగును. ఆస్తులను అమ్ముకొంటారు. దరిద్రమును అనుభవించుట, స్థానమును మారుట మొదలగు ఫలితములను కలుగచేయును.


మేష రాశి వారికి గురువు అష్టమంలో సంచారం చేస్తాడు కావున పనులలో ఆటంకాలను కలిగించును. ధనం వృధాగా ఖర్చు అగును. అనారోగ్య సమస్యలు వేదించును. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. పెట్టుబడులకు సంబందించిన విషయాలలో జాగ్రత్తగా ఉండవలెను. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. తరచుగా ప్రయాణాలు కలగవచ్చు.

వృషభ రాశి వారికి గురువు సప్తమంలో సంచారం చేస్తాడు కావున వివాహం కానీ వారికి ఇది మంచి సమయం. గురు సంచారం వలన మనస్సుకు నచ్చిన జీవిత బాగస్వామిని ఎన్నుకోవచ్చును. వైవాహిక జీవితంలో అన్యోన్నత కలుగును. భాగస్వాములతో చేసే వ్యాపారాలు కలసి వచ్చును. ఉద్యోగ సంబంధ విషయాలలోనూ, వ్యాపార సంబంధ విషయాలలోనూ, ధన సంబంధ విషయాలలోనూ ఆచి తూచి నిర్ణయం తీసుకోవటం మంచిది.

మిధున రాశి వారికి గోచారరీత్యా గురువు షష్టమ స్ధాన సంచారం వలన శతృ స్ధానం వలన జాగ్రత్తగా ఉండవలెను.  ఈర్షా ద్వేషాలు ఎక్కువ అగును. నమ్మక ద్రోహం కలిగే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. చిన్న పనులను కూడా కష్ట సాద్యంగా ఎదుర్కోవలసి ఉంటుంది. కోర్టు సమస్యలు వలన సమస్యలు ఉంటాయి. 

కర్కాటక రాశి వారికి గోచారరీత్యా గురువు పంచమ స్ధాన సంచారం వలన సంతాన సమస్యలు ఉన్నవారికి ఈ రాశిలో గురు సంచారం వలన సంతానం పొందే అవకాశాలు ఉంటాయి. ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి. విధ్యార్ధులకు మంచి సమయం. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరగవచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగును. ప్రభుత్వ అధికారుల నుండి ప్రయోజనాలు పొందవచ్చును.

సింహరాశి వారికి గోచారరీత్యా గురువు చతుర్ధ స్ధాన సంచారం వలన స్ధిరాస్తులు కలసి వచ్చును. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ పెరుగును. స్నేహితుల మరియు బంధు మిత్రుల సహకారం లభించును. మానసికమైన ఇత్తిడి పెరుగును. తల్లి ఆరోగ్య విషయంలోనూ, పిల్లల ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ వహించాలి. వాహన సంబంధ విషయాలలో ఇబ్బందులు ఉంటాయి.

కన్యారాశి వారికి గోచారరీత్యా గురువు తృతీయ స్ధాన సంచారం వలన దగ్గరి ప్రయాణాలు కలగవచ్చును. వ్యాపార సంబంధ విషయాలలో అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఎంతో కష్టపడితే గాని ఫలితాలు పొందలేరు. స్నేహితులు స్వార్ధపూరితంగా సహకరించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ సంబంధ ప్రమోషన్ విషయంలో ప్రతికూలతలు ఏర్పడవచ్చును.

తులారాశివారికి గోచారరీత్యా గురువు ద్వితీయ స్ధాన సంచారం వలన కుటుంబ విషయాలలో మంచి జరుగును. కుటుంబంలోకి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు సుగుమం అగును. పెట్టుబడిగా పెట్టిన ధనం విషయంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అన్నీ విధాల ఆదాయ మార్గాలు అనుకూలం అగును. కృషికి తగిన ఫలితం పొందవచ్చును. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన కలగటానికి మంచి సమయం. చేతిలో డబ్బు నిలబడుతుంది. మాటకు విలువ పెరుగుతుంది.

వృశ్చిక రాశి వారికి గోచారరీత్యా గురువు జన్మ స్ధానంలో సంచారం వలన స్దాన చలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహం వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవటం వలన నష్టపోవచ్చును. మానసికఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు రాశి వారికి గోచారరీత్యా గురువు వ్యయ స్ధాన సంచారం వలన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. స్ధిరాస్ధులు కొనుగోలు అమ్మకాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ విషయాలలో ఇబ్బందులు కలగవచ్చును. అనవసరమైన ఖర్చులు కలగవచ్చును. అనారోగ్య సమస్యల వలన హాస్పటల్ ఖర్చులు వచ్చును. సమయం, డబ్బు వృధా జరగవచ్చును.

మకర రాశి వారికి గురువు గోచారరీత్యా లాభ స్ధాన సంచారం వలన కృషికి తగిన ఫలితం పొందవచ్చును. ఉద్యోగ సంబంద విషయాలలో ఆదాయం పెరగవచ్చును లేదా ప్రమోషన్స్ పొందవచ్చును. వ్యాపార లావాదేవీలు అనుకూలత పొంది వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల వలన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును.

కుంభ రాశి వారికి గోచారరీత్యా గురువు దశమ స్ధాన సంచారం వలన ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాలలో మార్పులు కలగవచ్చును. ఉద్యోగ, వ్యాపా మార్పులు కలగవచ్చును. పిత్రార్జితం కలగవచ్చును. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా బలం పొందే అవకాశాలు ఉన్నాయి. కృషితో సంపాదిస్తారు. ఉద్యోగ, వ్యాపార విషయాలలో కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.

మీనరాశి వారికి గోచారరీత్యా గురువు నవమ స్ధాన సంచారం వలన దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు కలగవచ్చును. తీర్ధయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆలోచించింది, ఊహించిన విషయాలను ఆచరణలోకి పెట్టవచ్చును. తండ్రి సలహాలను పాటించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.

No comments:

Post a Comment