తెలుగువారు అసలు రాహుకాలం మనం పాటించాలా...? వద్దా...?
రాహుకాలం కథేంటి ..?
తెలుసుకుందాం.
గత కొంత కాలంగా మన తెలుగుపంచాంగాల్లో రాహుకాలం అనే క్రొత్త విషయం వచ్చి చేరింది. దానితో ఈ రాహుకాలం అనేది చెడ్డకాలం కాబట్టి దీని విధిగా విసర్జించాలీ అనుకుని గడబిడ పడుతున్నారు చాలా మంది తెలుగువాళ్ళు. ఈ రాహు కాలం కూడా మనకు అలవాటైన వర్జ్యం, దుర్ముహూర్తం అనే వాటి సరసన చేర్చి దీనికి భయపడటం పెరుగుతోంది. ఈ రాహుకాలం ప్రతిరోజూ వస్తుంది. రాహుకాలం సమయాలు ఇలా కనిపిస్తున్నాయి కాలెండర్లలో.
వారం సమయము మొదలు-వరకు
ఆదివారం సాయంత్రం 4.30 - 6.00
సోమవారం ఉదయం 7.30 - 9.00
మంగళవారం మధ్యాహ్నం 3.00 - 4.30
బుధవారం మధ్యాహ్నం 12.00 - 1.30
గురువారం మధ్యాహ్నం 1.30 - 3.00
శుక్రవారం ఉదయం 10.30 - 12.00
శనివారం ఉదయం 9.00 - 10.30
చాలా పంచాంగాలు, గోడ కేలండర్లలో పైన చూపిన పట్టిక ప్రకారం రాహుకాలం చూపించటం బహుళంగా కనిపిస్తుంది. కాని ఇది చాలా తప్పు.
సూర్యోదయం ఉదయం గం.6:00 మరియు సూర్యాస్తమయం సాయంత్రం గం.6:00 ఐతే మాత్రమేపై పట్టికలో చూపించిన సమయాలు వర్తిస్తాయి.
కాని సాధారణంగా సూర్యోదయసూర్యాస్తమయ సమయాలు అలా ఉండవు. సర్వ సాధారణంగా దినప్రమాణం ఖచ్చితంగా 12 గంటలు ఉండదు. అలా పగలు రాత్రీ కూడా సమానంగా 12గంటలుగా ఉండేది సంవత్సరంలో కేవలం రెండు రోజులే సుమా! అందుచేత సూర్యోదయం నుండి సూర్యోదయం వరకూ పగటి సమయం ఎంత కాలమో దాన్ని ఎనిమిది భాగాలు చేసి, సూర్యోదయం నుండి ఆ భాగాలు లెక్కిస్తూ ఈ క్రింది పట్టికలో చూపినట్లుగా సరియైన విధంగా రాహుకాలం గ్రహించాలి.
వారం. రాహుకాల భాగం
ఆదివారం. 8వ భాగం
సోమవారం. 2వ భాగం
మంగళవారం 7వ భాగం
బుధవారం 5వ భాగం
గురువారం 6వ భాగం
శుక్రవారం 4వ భాగం
శనివారం 3వ భాగం
సూర్యోదయం ఉదయం 5గం. ప్రాంతంలో కూడా రావచ్చు వేసవిలో మే నెలలో. అటువంటప్పుడు సూర్యాస్తమయం సా॥7గం. కు అవుతుంది. అంటే పగటి సమయం ఇంచుమించు 14గం. పాటు ఉంటుంది. రాహుకాలం ప్రమాణం 14/8 = గం.1:45ని॥అవుతుంది. అలాగే శీతకాలంలో రాహుకాలం గం.1:15ని॥ కావచ్చును కూడా. రాహుకాలం ప్రారంభ కాలాలు కూడా చాలా తేడాగా వస్తాయి. ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే గోడకాలెండర్లలో ఉన్న రాహుకాలాలు ఎంత శుధ్ధతప్పో తెలుస్తోంది కదా!
ఉదాహరణకు ఒక వేసవికాలం ఆదివారం నాడు సూర్యోదయం గం.5:00 సూర్యాస్తమయం సాయంత్రం గం.7:00 ఐతే నాటి రాహుకాలం సాయంత్రం 5:15 నుండి 7:00 అవుతుంది కాని కేలండర్లలో ఇస్తున్నట్లుగా సాయంత్రం 4.30 - 6.00 కాదు. చూడండి ఎంత తేడా వస్తోందో!
అలా గని, అందరూ సరైన రాహుకాలాలు గణనం చేసుకుని వాడాలంటే కాలెండర్లలో సూర్యుడి ఉదయాస్తమయాల వివరాల సదుపాయం తక్కువే మరి. గోడకాలెండర్లలో కొన్ని కొన్ని మాత్రమే సూర్యోదయం చూపుతున్నాయి. సూర్యాస్తమయం చూపేవి తక్కువే. బండగా మొదటి పట్టిలో ఉన్నట్లుగా రాహుకాలాన్ని చూపించేవి మాత్రం కొల్లలు. మరి రాహుకాలం జనసామాన్యం సరిగా తెలుసుకునేది ఎలా అన్నది ప్రశ్న.
అసలు తెలుగువారు ఈ రాహుకాలం పాటించవలసిన అవసరం లేదు అన్నది జవాబు. అప్పుడు గణితమూ సరైన విలువా అంటూ గొడవే లేదు కదా!
ఒకవేళ ఎవరైనా రాహుకాలం పాటించి తీరాలీ అన్న స్థిరాభిప్రాయంలో ఉంటే వారికి వార్తాపత్రికలు కొన్ని ఉపకారం చేస్తున్నాయి. ఉదాహరణకు ఈనాడు పత్రికలో ప్రతిరోజూ ఆ నాటి పంచాంగం వివరాలను సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలతో సహా ఇస్తారు. వాటి ఆధారంతో ఓపిక ఉన్నవారు గణితం చేసుకోవచ్చును. ఐతే, ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలు పత్రిక స్థానిక ఎడిషన్ ప్రాంతానికే వర్తిస్తాయి. హైదరాబాదు ఎడిషన్ తీసుకుని కాకినాడవారు గణితం చేసుకోరాదు - ఆ అవకాశం తక్కువే అనుకోండి.
నిజానికి రాహుకాలాన్ని తెలుగువారు పాటించటం అన్న ఆచారం లేనే లేదు. పైన చెప్పినట్లుగా ఈ రాహుకాలం అనేది మన తెలుగుపంచాగాల్లో ఇటీవల చేరిన విశేషం మాత్రమే. బహుశ గత పాతికేళ్ళలో ఇది మన దగ్గరకు వచ్చింది.
రాహుకాలాన్ని తమిళులు ఎక్కువగా పాటిస్తారు.
శ్రీకప్పగంతు సుబ్బరామశర్మగారు ఆంధ్రభూమి పత్రికలో తమ రాహుకాలం - దుర్ముహూర్తం అన్న వ్యాసంలో తెలుగువారి పాత పంచాంగాలు తిరగేస్తే మనకు రాహుకాలంలో పంచాగకర్తలు సుముహూర్తాలు ఇచ్చిన దాఖలాలు కనిపిస్తాయని చెప్పారు. వారు నెల్లూరు నుండి తమిళనాడు, కర్ణాటకలలో రాహుకాలం, నెల్లూరు ఇవతల ఆంధ్రలో దుర్ముహూర్తం వాడకం ప్రధానమైంది అన్న విషయం తెలియ జేసారు. తమిళనాడు, కర్ణాటకలలో మరి ఇతర రాష్ట్రాల పంచాంగంలో ఇప్పటికీ దుర్ముహూర్తం గోచరించదు, మన పంచాంగవిధానంలో రాహుకాలం కనబడదు. మన పెద్దలు ఆచరించని రాహుకాలం మనం ఎందుకు ఆచరించాలి, అవసరం లేదు అని వారి అభిప్రాయం. ఇదే నా అబిప్రాయం కూడా.
రాహుకాలం పూజకు మంచి సమయం అన్నది తమిళదేశంలో ఆచారం. తెలుగుదేశంలోకాదు. వ్యాప్తిలోకి వస్తున్న మరొక అభిప్రాయం ఏమిటంటే దుర్గాపూజకు రాహుకాలం మంచిది అని. ఇది నిరాధారమైన అభిప్రాయం. దుర్గామాతపూజకూ రాహుకాలానికీ ఏ సంబంధమూ లేదు.
ఈ రాహుకాలం పాటించటం అనే దాని మీద వ్యగ్రత ఎంత దూరం వెళ్ళిందంటే రాహు కాలంలో పిల్లలు పుడితే దోషమేనా? అన్న ప్రశ్నకు జవాబుగా తప్పక కొన్ని శాంతులు చేయించవలసి వస్తుంది అన్న జవాబు ఇచ్చారు
Namasthe swamy, Naa Peru Madhusudhana Reddy, aswini nakshatram, naaku ee dikku simhadwaram ithe baguntundo teliyacheyagalara
ReplyDelete