Friday, March 9, 2018

లగ్నంలో చంద్రుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు

లగ్నంలో చంద్రుడు ఉంటే గుండ్రని ముఖం, దట్టమైన జుట్టు, సున్నితమైన మనస్సు, బిడియం, సౌమ్యం, మానసికమైన సమస్యలు ( ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో), ఆటుపోటులు, కంటివ్యాది, మానసిక వ్యాది (అంతర్గత జబ్బు, ఎడమ చెవి ప్రాబ్లం, మాట త్వరగా రాకపోవటం( నత్తి), ధనానికి ప్రాబ్లం ఉండదు.

లగ్నంలో కుజుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో కుజుడు ఉంటే దూకుడుతనం, కలర్ తక్కువ కలిగి ఉంటారు, ముఖంపై మచ్చలు ఉండటం, దెబ్బలు తగలటం, జన, సోదర సహకారం కలిగి ఉండటం, క్రీడలలో రాణింపు, గట్టిగా మాట్లాడటం, వివాదాలు కలిగి ఉండటం, త్వరగా కోపం రావటం, ఇతరులను నిందించటం, కొట్టటం, చెడు అలవాట్లకు బానిస కావటం జరుగుతుంది.

లగ్నంలో బుధుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో బుధుడు ఉంటే తెలివితేటలు కలిగి ఉంటారు. అతితెలివి కూడా కలిగి ఉండటం. మంచి వస్త్రాలు ధరిస్తారు. చక్కని భాష కలిగి ఉంటారు. లెక్కలలో రాణిస్తారు. ప్రతి విషయాన్ని అంచనా వేస్తారు. వాక్ శుద్ధి కలిగి ఉంటారు. రాయబారాలు నెరవేరుస్తారు. కమ్యూనికేషన్ రంగంలో రాణిస్తారు. ఇతరులు ఏది చెబితే వింటారో అది చెప్పగలగటం, లాజిక్ గా తెలివిగా మాట్లాడి జనాలను ఆకర్షిస్తారు. నపుంసకత్వం, నరాల బలహీనత కలిగి ఉంటారు.

లగ్నంలో గురువు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో గురువు ఉంటే ఆరోగ్యవంతమైన శరీరం, కొవ్వు పట్టిన లావు శరీరం, ఉభకాయం,, ధర్మాన్ని కాపాడటం, శాంత స్వభావం, ఆలోచనా విధానం లో మార్పులు, తను కష్టపడి శత్రువుకైనా మంచి చేస్తాడు. శుభ్రత కలిగి ఉండటం, దైవ చింతన, తీర్ధయాత్రలు చేయటం, మంచి అలవాట్లు కలిగి ఉంటారు.

లగ్నంలో శుక్రుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో శుక్రుడు ఉంటే అందమైన శరీరం, సుగంధ ద్రవ్యాల యందు ప్రీతి, సున్నితమైన శరీరం, సుఖ జీవనంపైన మక్కువ, కష్టపడి పని చేయలేకపోవటం, ఆకర్షణ, స్త్రీలను అధికంగా ఆకర్షించుట, ఇతరుల ఆకర్షణకు లోబడటం జరుగుతుంది. లగ్జరీగా ఉండటం జరుగుతుంది.

లగ్నంలో శని ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో శని ఉంటే సన్నని పొడవైన శరీరం, బద్ధకం, నల్లని శరీరం, ప్రతి పని నిదానం, లోభం, పిసినారి తనం కలిగి ఉండటం, అపరిశుభ్రం, చింపిరి జుట్టు, చిన్నతనంలోనే ముసలి ఛాయలు, మురికి బట్టలు ధరించటం, ఆలస్య వివాహాలు, ప్రతి పనిలోనూ ఆటంకం, నిరాశగా ఉండటం జరుగుతుంది. మొండిగా ప్రవర్తించటం.

లగ్నంలో రాహువు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో రాహువు ఉంటే మోసపోవటం, మోసగించటం, లొంగిపోవటం, లోగదీసుకోవటం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవటం, ఉద్రేకంగా ఉండటం, క్రూరమైన ఆలోచన కలిగి ఉండటం. మనస్సులో అనుకున్నది చెప్పకపోవటం, వక్రబుద్ధి కలిగి ఉండటం, చపలత్వం కలిగి ఉండటం, ఊహాత్మకమైన విషయాలు, అనుమానాలు, ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించుకొని బయపడటం, అనవసరమైన అపోహలు విదేశీయానం చేయటం, స్త్రీలకు వాయుతత్వ రాసులైన లగ్నంలో రాహువు మంచిది.

లగ్నంలో కేతువు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో కేతువు ఉంటే మూడ భక్తి కలిగి ఉంటారు. తప్పుడు సలహాలు ఇస్తారు. వివాహంపై మక్కువ లేకపోవటం జరుగుతుంది. ఈ పని సరిగా చేయకపోవటం, నిలకడలేకపోవటం, వితండవాదం చేయటం వీరికున్న లక్షణాలు. ప్రతి చిన్న విషయానికి అలగటం, భయపడటం, మౌనవ్రతం పాటించటం. దైవంపైన అతి భక్తి.

లగ్నాధిపతి వివిధ భావాలలో ఉంటే కలిగే ఫలితాలు
నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ అధిపతి సూచించు వృత్తి సంబందించిన విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది. లగ్నానికి యోగకారకులైన గ్రహాల యొక్క దశ అంతర్ధశలలోను వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి అయిన దశ అంతర్ధశాలలోనూ వృత్తి, వ్యాపార సంబంధ విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది.

లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ధైర్యం కలిగి ఉంటారు, మంచి ఆయుర్ధాయం, మంచి నేర్పరితనం, ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. ఎదుటివాళ్ళను లెక్కచేయకుండా గర్వం కలిగి ఉంటారు. నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడూ చెడ్డ ఆలోచనలు, చెడు స్నేహాలు కలిగి ఉంటారు. శుభగ్రహాలు ఉంటే మంచి నడవడిక, మృధు స్వభావం, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అన్నీ తనకు తెలుసు అని ఎదుటి వాళ్ళ మాట వినకుండా నిందించటం వీరి లక్షణాలు.

లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే శరీర పుష్టి, చక్కని మాట, ద్వితీయ కళత్రం కలిగి ఉంటారు. చక్కని బోజనప్రియులు, తనకంటే ఎక్కువ వయస్సు వారితో పరిచయాలు, స్నేహాలు, కుటుంబ పోషణ బాద్యత కలిగి ఉంటారు. భార్య తరుపున ఆస్తి కలసి రావటం, గురు శనులు కలిస్తే పిత్రార్జితం రాదు. వచ్చిన నిలవదు. మారక స్ధానం, విద్యలో రాణిస్తారు.

లగ్నాధిపతి తృతీయంలో ఉంటే శరీరం బలహీనం కలిగి ఉంటారు. కుటుంబంలో చిన్నగాని, పెద్దగాని ఆయి ఉంటారు.  పాపగ్రహాల కలయిక వలన శరీర ఇబ్బందులు. సోదరుల వలన సుఖం ఉండదు. సోదరుల అభివృద్ధి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు తరచుగా చేస్తారు. క్రీడలపై మక్కువ, స్వయంగా అభివృద్ధి కలిగి ఉంటారు. కుజ సంబంధం ఉంటే మంచి క్రీడాకారుడు అవుతాడు. కేతువు సంబంధం ఉంటే విదేశాలలో బందింపబడటం జరుగవచ్చును. బుధ సంబందం ఉంటే సంగీతం, కమ్యూనికేషన్, జర్నలిస్ట్ రంగాలలో రాణిస్తారు. శుక్ర సంబందం ఉంటే లలిత కళలలో రాణిస్తారు. శని సంబందం ఉంటే రాజకీయాలలో రాణిస్తారు.

లగ్నాధిపతి చతుర్ధంలో ఉంటే స్దిరత్వం కలిగి ఉంటారు. స్ధిరమైన ఆరోగ్యం, సుఖపడతాడు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణింపు, మాతృబలం కలిగి ఉంటారు. గృహ సౌఖ్యం కలిగి ఉంటారు. కుటుంబంలో గౌరవింపబడతారు. స్వయం కృషితో సౌఖ్యాలను అనుభవిస్తారు. కుటుంబంలో ఆ వ్యక్తి పుట్టిన తరువాత బాగా అభివృద్ధి చెందటం. ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం. విద్యలో రాణింపు, చతుర్ధంలో రవి ఉండి లగ్నాధిపతి కలసి ఉంటే పితృ దోషం ఉంటుంది. నవమాదిపతి చతుర్ధంలో ఉన్న పితృ దోషం కలిగి ఉంటారు.

లగ్నాధిపతి పంచమంలో ఉంటే మంచి ఆలోచన, ఉపాసనా శక్తి కలిగి ఉంటారు. మంచి గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు. పుణ్యబలం కలిగి ఉంటారు. మంచి సంతానం కలిగి ఉంటారు. విద్యలో రాణిస్తారు. క్రితం జన్మలో అకాల మృత్యువు జరగలేదని చెప్పవచ్చును. అదృష్టవంతుడు. పుణ్యబలం ఉండటం వలన తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సంపాదిస్తారు. పుణ్యస్నాలు తీర్ధయాత్రలు, సత్కర్మలు చేస్తారు. భవిష్యత్ (పంచమం రాబోవు రోజులలోని కర్మలపై ప్రభావం) కర్మలపై అవగాహన కలిగి ఉంటారు. దర్మబుద్ధి కలిగి ఉంటారు కాబట్టి న్యాయవాదిగా రాణిస్తారు సంతాన భాగ్యం కలుగుతుంది. పాప గ్రహ సంబంధం ఉంటే సంతాన నష్టం, కుజ రాహువులు ఉంటే నాగ దోషం, కుజుడు ఉంటే గర్భస్రావం చేస్తాడు. కేతువు ఉంటే అల్ప సంతానం కలిగి ఉంటారు. శుక్ర చంద్రులు ఉంటే షేర్లు, లాటరీలు, క్రీడా ద్వారా లాభాలు ఆర్జిస్తారు.

లగ్నాధిపతి షష్టంలో ఉంటే తను ఎవరి కిందయిన పనిచేస్తాడు. అప్పులు వసూలు చేసే శక్తి కలిగి ఉంటారు. అనారోగ్యాలు కలిగి ఉంటారు. శత్రువులపై విజయం, రవి, కుజుల సంబందం ఉంటే సర్జన్ గా రాణిస్తారు. రవి రాహువులు కలసి ఉన్న వైద్య వృత్తిలో రాణిస్తారు. గురువు ఉన్న ఆయుర్వేదంలో రాణిస్తారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. తిండి సరిగా తినక ముఖం కళ తప్పటం జరుగుతుంది. గొడవలు, కొట్లాటలు చేస్తారు.

లగ్నాధిపతి సప్తమంలో ఉంటే తనలో తాను గొప్పవాడుగా ఫీలవుతాడు. వివాహంపై మక్కువ ఉండదు. కామ త్రికోణం కావటం వలన కుజ, శుక్ర సంబంధం ఉంటే కామత్వం ఎక్కువ కలిగి ఉంటారు. సమాజంలో గౌరవాలు కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తారు. విదేశీ సంపాదన, విదేశాలలో రాణింపు కలిగి ఉంటారు. కుజ, రవి కలసి ఉన్న వైద్య వృత్తిలో రాణింపు, రాహు గాని కేతువు గాని ఉన్న శస్త్ర చికిత్సలు, పాప గ్రహ దృష్టి ఉంటే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువ. బలహీనంగా ఉంటే ఇతరులను మెప్పించటం కష్టం.

లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఆయుర్ధాయం కలిగి ఉంటారు. రహస్య సంపాదన కలిగి ఉంటారు. శరీరంలో ఏదో ఒక అనారోగ్యం లేదా లోపం ఉండి కూడా బయటకు తెలియకుండా రహస్య పరచటం జరుగుతుంది. లంచాలు, మాముళ్ళ ద్వారా సంపాదన కలిగి ఉంటారు. నిద్రలో నడిచే అలవాటు కలిగి ఉంటారు.

లగ్నాధిపతి నవమంలో ఉంటే అనుభవ పూర్వకమైన జీవితం కలిగి ఉంటారు. గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. దేవాలయ ప్రతిష్టలు చేస్తారు. మంచి గురువు దగ్గర వేద అద్యయనం చేస్తారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. స్పర్శ విద్యలో రాణిస్తారు. నాడీ వైద్యంలో రాణింపు. తండ్రితో మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి నేర్పు గల న్యాయ నిర్ణేతగా రాణిస్తారు. విదేశీ ప్రయాణాలపై మక్కువ కలిగి ఉంటారు. వ్యయాధిపతి, సప్తమాధిపతితో సంబంధం ఉంటే చిన్న వయస్సులోనే స్ధిరపడతారు.

లగ్నాధిపతి దశమంలో ఉంటే మంచి లక్షణాలు కలిగి ఉంటాడు. కర్మ స్ధానం కావటం వలన సత్కర్మలు చేస్తాడు. దర్మ కార్యాలు చేస్తాడు. కర్మ కారకుడైన శని ఈ స్ధానంలో ఉంటే చిన్న స్ధాయి నుండి ఎదుగుదల కలిగి ఉంటారు. సొంతంగా వ్యాపారం కలిగి ఉంటారు. స్వయం కృషితో రాణిస్తారు. అభివృద్ధి, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అధికారం చూపించి ఇతరులచే పనులు చేయించుకునే నేర్పరితనం కలిగి ఉంటారు. మంచి ఆయుర్ధాయం కలిగి ఉంటారు. ధర్మ ( 1,5,9) అర్ధ ( 2,6,10) భావాలకు సంబంధ గోచారంలో ఉంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే  ఆయువృద్ధి, రవి, బుధ, చంద్ర సంబంధం ఉంటే సుఖవంతమైన జీవితం కలిగి ఉంటారు. భౌతికపరమైన సుఖాలు, మంచి స్నేహితులు కలిగి ఉంటారు. పెద్దల ద్వారా లాభం, సొంతంగా లాభాలను ఆర్జిస్తారు. స్నేహితులకు ఉపయోగపడతాడు.

లగ్నాధిపతి ద్వాదశంలో ఉంటే బద్ధకం, చెడు ఆలోచన, ఇబ్బందులు ఎదుర్కోవటం,, పరస్త్రీలపైనా మక్కువ కలిగి ఉండటం, ఖర్చు ఎక్కువ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు లేకపోవటం, దేశం విడిచి పోవటం, కారాగారం, విదేశాలలో స్ధిరత్వం, ఖర్చుపై నియంత్రణ లేకపోవటం. తిండి, నిద్ర సరిగా లేక అనారోగ్యాలు తెచ్చుకోవటం జరుగుతుంది. వృద్ధాప్యంలో దైవ చింతన
కలుగుతుంది. కేతువుగాని, గురువు గాని అఖరి దశ లో  దైవ సంబంధమైన విషయాలు పురాణ సంబంధమైన విషయాలు పై ఆశక్తి  చూపుతారు.

Thursday, March 8, 2018

అష్టసిద్ధులంటే ఏమిటి?

భారతీయ తత్వ శాస్త్రంలో సిద్ధి అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. అప్పుడు అతనికి సిద్ధించే శక్తులే ‘సిద్ధులు’. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా నిర్వచిస్తున్నప్పటికీ.... ప్రచారంలో ఉన్నది మాత్రం అష్టసిద్ధులే! వాటిని శ్లోక రూపంలో చెప్పుకోవాలంటే...
“అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః”

దీని బట్టి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అన్న ఎనిమిది సిద్ధులే ఆ అష్టసిద్ధులని తెలుస్తోంది. పతంజలి యోగ సూత్రాల ప్రకారం ఈ సిద్ధులు కేవలం యోగం ద్వారానే కాకుండా, ఒకోసారి జన్మతః సిద్ధించవచ్చు. మంత్రబలంతోనూ సాధించవచ్చు. ఒకోసారి దివ్యౌషుధలని స్వీకరించడం ద్వారా కూడా వీటిని పొందవచ్చు. అయితే సాధకుడు ఈ సిద్ధుల భ్రమలో పడితే, మోక్షం అనే అసలు లక్ష్యం నుంచి దూరమైపోతాడని హెచ్చరిస్తాయి పతంజలి యోగ సూత్రాలు!
అష్టసిద్ధుల గురించి ప్రస్తావన రాగానే వినాయకుడు, హనుమంతుడు గుర్తుకురాక మానరు. వీరిరువురికీ అష్టసిద్ధుల మీద పూర్తి సాధికారత ఉందనీ, వీరిన పూజించిన భక్తులకు ఆయా సిద్ధులను అతి సులభంగా అనుగ్రహించగలరనీ ఓ నమ్మకం. అందుకనే హనుమంతుని ‘అష్టసిద్ధి నవవిధికే దాతా’ అంటాడు తులసీదాసు తన హనుమాన్‌ చాలీసాలో. ఇక వినాయకుని భార్య సిద్ధి అన్నది కేవలం ఒక పేరు మాత్రమే కాదు... ఆమె అష్టసిద్ధులకు ప్రతిరూపం అన్నది ఓ విశ్లేషణ! ఇంతకీ ఈ అష్టసిద్ధుల ద్వారా సాధకులు సాధించే శక్తులు ఏమిటంటే...

అణిమి- శరీరాన్ని అతి సూక్ష్మరూపంలోకి తీసుకురాగలగడం.
మహిమ- ఎంత పెద్దగానైనా శరీరాన్ని మార్చేయగలగడం.
గరిమ- ఎంతటి బరువునైనా సాధించగలగడం.
లఘిమ- కావల్సినంత తేలికగా తన బరువును మార్చుకోవడం.
ప్రాప్తి- ఏ వస్తువు కావాలనుకున్నా దాన్ని శూన్యం నుంచి సైతం సాధించడం.
ప్రాకామ్యం- కోరుకున్నది సాధించడం.
ఈశత్వం- అష్టదిక్పాలకును శాసించగల ఆధిపత్యం.
వశిత్వం- సకల జీవరాశులను వశం చేసుకోగల అధికారం.
 

నవనిధుల్లో పుణ్యం వల్ల కలిగేవి, శాంతం వల్ల కలిగేవి, ధర్మం వల్ల కలిగేవి
పద్మనిధి, మహాపద్మనిది, నీలనిధి.
నవనిధుల్లోని ఈ మూడు నిధులే సుఖాలు.. సౌఖ్యాలు... కీర్తి... ఆరోగ్యం.. పరమానందమును తన కుటుంబ సభ్యులకి, తన రక్త సంబంధీకులకి, స్నేహితులకి ఇస్తాయి. రెండు చేతులతో దండం పెట్టాలనిపించే గౌరవాన్ని తెచ్చిపెడతాయి.

కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, వ్యధలు, నష్టాలను తెచ్చే నిధులు....
కుందనిది, శంఖనిధి, ముకుందనిది, మిశ్ర నిధి, మకరనిధి, కచ్ఛపనిధి. 
అధర్మం.. అన్యాయం.. అక్రమం.. నీచం.. స్నేహంలో ద్రోహం.. నమ్మినవారిని మోసం చెయ్యటం వల్ల, అధిక వడ్డీల వల్ల వచ్చేవే పై నిధులు.  ఆ నిధులన్నీ వేశ్యల పాలు, విలాసాలపాలు,  వైద్యశాలల పాలు,  అపాత్రుని పాలు అవుతాయి.
నిలువెత్తు సంపదలున్నా అనుక్షణం వెలితి, దిగులు, నిరాశ, నిస్సహాయత, తగాదాలు, గొడవలు, కోట్లు కరిగించినా పోని దరిద్రాలు.

*జ్యోతిష్యంలో చతుర్విద పురుషార్ధలు*

*జ్యోతిష్యంలో చతుర్విద పురుషార్ధలు*

ధర్మ,కామ త్రికోణాలు రెండు కలిసిన యంత్రం షట్కోణ సుబ్రమణ్యేశ్వర యంత్రం.....

రాశి చక్రంలో దర్మ,అర్ధ,కామ,మోక్ష త్రికోణాలనే 4 పురుషార్ధాలు ఉన్నాయి.

1,5,9 ధర్మ త్రికోణాలు.

2,6,10 అర్ధ త్రికోణాలు,

3,7,11 కామ త్రికోణాలు,

4,8,12 మోక్ష త్రికోణాలు.

ధర్మ త్రికోణాలను కామ త్రికోణాలు ఎదురెదురుగా ఉండి సూటిగా ఖండించుకుంటాయి.
ఈ రెండు త్రికోణాలకు సామాన్యంగా పొసగదు.కానీ ఈ రెండిటినీ చక్కగా వినియోగించుకుంటే జీవితం భగవంతుని ఆదేశాలకు (1,5,9),ప్రకృతి (3,7,11) యొక్క అమరికలకు అనుగుణంగా ఉంటుంది.అప్పుడు మానవుడు భూమ్మీద భగవంతుని ఆదేశాలతో ప్రతిరూపం కాగలడు.

పార్వతి పరమేశ్వరుల సంతానం కుమారస్వామి.ఎవరైతే ధర్మ భావాలను(1,5,9),కామ భావాలను (3,7,11) సరిగా సమన్వయం చేయగలడో వాడు కుమారుని అంశ అవుతాడు.దీనిని సూచిస్తూ ఎదురెదురుగా ఖండించుకుంటున్న రెండు త్రికోణాలు ఉంటాయి.

ఊర్ధ్వముఖంగా ఉన్న 1,5,9 భావాలు దర్మాత్రికోణాలు,అగ్నితత్వం కలిగి ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే ఉంటాయి.(అగ్నిజ్వాల ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే ప్రజ్వలిస్తూ ఉంటుంది.)

అదోముఖంగా ఉన్న 3,7,11 భావాలు కామ త్రికోణాలు,జలతత్వం కలిగి ఎప్పుడు అదోముఖంగానే ఉంటాయి.(నీరు ఎప్పుడు అదోముఖంగానే ప్రవహిస్తూ ఉంటుంది.)

దర్మ,కామ రాశి చక్రంలోని భావ త్రికోణాలు ఆరు కోణాలుంటాయి.అందుకే శివశక్తుల కలయిక అయిన కుమార స్వామిని "షణ్ముఖుడు" అంటారు.

"ధర్మం ఎక్కువై కామం తగ్గితే దైవత్వం
కామం ఎక్కువై ధర్మం తగ్గితే రాక్షతత్వం"

రెండు సమపాళ్ళలో ఉంటేనే మానవత్వం.

ఈ ఙ్ఞానం కలగాలంటే పై ఆరు భావాలు బాగుండాలి.కాబట్టి సంతానం లేనివారు షట్కోణ సుబ్రమణ్యేశ్వరస్వామి యంత్రాన్ని నిష్ఠగా పూజిస్తే సంతానం కలుగుతుంది అని ప్రతీతి.

🙏🙏🙏🙏🙏