Thursday, February 1, 2018

*మేషలగ్న ఫలము*

మేషలగ్నమునకు కోణాధిపతులగు రవి గురులు మిక్కిలి యెాగము నిచ్చువారగుదురు.కుజుడు అష్టమాధిపత్యము గలిగియుండుట వలన పాపుడని చెప్పవలసి యున్నప్పటికి,లగ్నాధిపత్యము గలిగియుండుట వలన ఈ కుజునకు శుభత్వము గలిగినది గాని ఆకుజుడు అష్టమమందు ఉన్న యెడల స్వక్షేత్రమందున్నవాడైనను యెాగము నిచ్చువాడుకాదు.
వ్యయమందు,చతుర్థమందు యిా మెుదలగు ఇతర స్థానములయందు కుజుడుండిన యెడల ఆ స్థానముల బలాబలమును బట్టి శుభాశుభ ఫలముల నిచ్చువాడగును.
8-6 స్థానముల పాపస్థానములయుందున్నన ఈ స్థాములకు అధిపతియగు బుధుడు మిక్కిలిపాప ఫలము నిచ్చును గాని శుభఫలము నివ్వడు.
పాపగ్రహములకు కేంద్రాధిపత్యము గలిగిన యెడల శుభఫలము నిచ్చును.ఈ మేషలగ్నమునకు శనిరాజ్యలాభస్థానముల కధిపతి యైయుండుట వల్లను,అందు రాజ్యస్థానము పూర్ణశుభఫలము నివ్వడు.
ద్వితీయ సప్తమస్థానములు మారకస్థానములని చెప్పబడియున్నవి.ఈ మేషరాశికి పైన చెప్పబడిన ఉభయ మారకస్థానములకు అధిపతియగును శుక్రుడు పాప ఫలమునిచ్చువాడగును.
పూర్ణచంద్రునకు కేంద్రాధిపత్యముగలిగిన యెడల ఆ కేంద్రాధిపత్య దోషమువలన పాపఫలము నిచ్చువాడగును ఇచ్చట చంద్రుని యెుక్క పూర్ణత్వమేమియు ఉపయెాగింపదు.
పూర్ణచంద్రుడు మేషలగ్నమునకు మారకస్థానము లందున్నను,మారకస్థానాధి పతులతోగలిసినను ప్రారంభమందు మంచి యెాగము నిచ్చును.పిమ్మట మారకము జేయును.ఆ చంద్రునకు క్షీణత్వము గలిగియుండిన,క్షీణచంద్రుడై నైసర్గికముగా పాపుడైనను శుభఫలము నేయిచ్చువాడగును.
ఈ మేషలగ్నమునకు,గురుచంద్రులేనను,రవి చంద్రులైనను గలిసియుండిన యెడల,వారిద్దరును అధిక ఫలము నిచ్చువారును,రాజయెాగము నిచ్చువారును అగుదురు.
రవి గురులిద్దరును కోణాధిపతుగుటవలన మీరద్దరును కలిసియుండిన యెడల స్వల్పఫలము నిచ్చువారగుదురు.
రవి చంద్ర గురులు ముగ్గురును కలిసిన యెడల పరిపూర్ణ రాజయెాగము నిచ్చువారగుదురు.
రవితో కూడిన గ్రహములకు అస్తంగత్వంగూడిన మాత్రమున దోషము కలుగునని చెప్పదురు. కాని ఒక నక్షత్రమందు అస్తంగత్వ దోషము గలుగదు.ఒక పాదమందు గూడియున్న గ్రహమున కాదోషము పట్టును.కావుననే నక్షత్రమందు ఒకే పాదమందుండ గూడదు.
ఏ లగ్నమునకైనను భాగ్యరాజ్యాధి పతులిద్దరునమ ఎక్కడ కలిసి యున్నను యెాగమునిచ్చువారని ప్పసిద్దము.
మేషలగ్నమునకు భాగ్యధిపతి గురుడును,రాజ్యాధిపతి శనియుకలిసి యుండిన యెాగభంగం గలుగును.
గురుశనులు భాగ్య రాజ్య ధిపతులేనను రెండవదగు వ్యయాధిపత్యము వలన గురుడును,లాభాధి పత్యము వలన శనియు మేషలగ్నమునకు పాపులగుచ్చున్నారు.
గురుడు నైసర్గికము వలన శుభుడు శని నైసర్గికము వలన పాపి వీరు కలియుట వలన నిశ్చయముగా పాప ఫవమునే యిచ్చు వారగుదురు.
మేషలగ్నమందు గురుశను లిద్దరును యెచ్చటనైనకలిసియుండిరేని యెగ భంగమును చేయుటయేగాక సంతాన క్లేశము ధననష్టము మెుదలగు నష్టములను బొందించు వారగుదురు.
మేషలగ్నమునకు లగ్నాధిపతియగు కుజుడు,భాగ్యాధిపతియగు గురుడు కలిసియుండిన యెడల కుజదశయందు విశేష ఫలమిచ్చునని గురుదశయందు సామాన్య ఫలమిచ్చునని చెప్పబడియున్నది.
లగ్న సప్తమాధిపతులగు కుజశుక్రులు కలిసిన కుజుదశ యందు మంచి యెాగము నిచ్చును.కళత్ర సౌఖ్యముండదు.
లగ్నవాహనాధిపతులగు కుజచంద్రులుగాని లగ్నపంచమాధిపతులగు కుజ రవులుగాని కలిసియున్న యెడల మంచి యెాగము నిచ్చువారగుదురు.
మేషలగ్నమునకు లగ్న రాజ్యాథిపతులగు కుజశనులు కలిసిరేని కొంతయెాగము నిచ్చుదురు.అట్టిజాతకుడు యెల్లప్పుడు శ్రమగలవాడు శరీరసౌఖ్యము లేనివాడు దయావిహీనుడు అగును.
లగ్నషష్ఠాధిపతులగు కుజ బధులు కలిసిన యెాగ భంగము చేయువారు దీర్ఘరోగకారకులు,లోకమందు పేరు లేనివారు అగుదురు,
కుజదశలోగాని బుధదశలోగాని విశేషకష్టములు గలుగును ఆయుర్థాయహీనుముగలుగును.
మేషలగ్నమునకు గురుచంద్రులు,రవిచంద్రులు,రవికుజులు,శనిశుక్రులు ఈ జంట గ్రహములు యితరులుతో గలియక ప్రత్యేకముగా యెక్కడన్నను ప్రబలయెాగము నిత్రురు. నీచయందున్న గ్రహములు మంచి ఫలమునీయరు.
లగ్నవాహన కోణభాగ్యాధిపతులగు కుజచంద్ర రవి గురులు యెక్కడ కలసియున్నను రాజయెాగముగలుగును
ఈ గ్రహములలో యెవరికి  నీచవట్టినను,ఆ నీచ గ్రహము శుభఫలము నీయదు.నీచగ్రహములతో నొక ఉచ్చగలిగిన గ్రహము గూడిన యెడల నీచదోషమును బోగొట్టి శుభఫలమునే యిచ్చును.
లగ్నాధిపతియగు కుజడు,ద్యితీయ సప్తమాధిపతి యగు శుక్రుడు పాపస్థానములందుగాని,మారకస్థానములందు గాని గూడియున్న యెడల మెుదట యెాగము నిచ్చును.పిమ్మట మారకమును జేయును.
మేషలగ్నమునకు ఉచ్చనుపొందియున్న గ్రహము స్వక్షేత్రమందున్న గ్రహము యిా రెండు యెక్కడ కలసి యున్నను పరిపూర్ణ సుఖ యెాగము నిచ్చును.

Tuesday, January 30, 2018

*గజకేసరి యోగం* వివరణ ? What is Gajakesari Yogam ?

*గజకేసరి యోగం*:- మనవ జాతకంలో గ్రహ స్థితిని బట్టి ఏర్పడిన యోగములలో ఈ యోగము చాలా మంచి ఫలితములిచ్చును. జాతక చక్రములో గురు, చంద్రుల ఉనికి వలన ఈ యోగము ఏర్పడుతుంది. చంద్రుని నుంచి గురుడు కేంద్రముల యందు ఉన్నప్పుడు అనగా గురుడు 4, 7, 10 స్థానములలో వున్నప్పుడు ఈ యోగబలము 4 కన్నా 7 లోనూ, 7 కన్నా 10 లోను అధికముగా వుంటుంది. ఈ యోగముల వారు సభ్యత, ఉదారము, సంపద, దానగుణము, ఉన్నతాధికారము మొదలగు సకల శుభ లక్షణములు కలిగి ఉందురు. కొందరు గురుడు కోణ మున్దున్నను ఈ యోగముగా భావించ వలెననుచున్నారు. కానీ నా అనుభవమున గురుని స్వస్థాన, ఉచ్చస్థాన, ధనుర్, మీన లగ్నమందు, కర్కాటక, వృషభ లగ్నమందు విశేష బలము కలుగునట్లు గమనించితిని. ఇతర రాశులలో దీని బలము నామ మాత్రమే. జాతకములో గజకేసరి యోగమును దాని బలమును నిర్థారించుటకు విశేష అనుభవము కావలెను. గురు చంద్రుల బలములు, గురుడు చంద్రుని కంటే ఎక్కువ బలము పొందిన ఆ జాతకులు విశేష ధన కీర్తి, సుఖమయ జీవితం జీవితాంతం గడిపినవారున్నారు !

ఈ యోగములలొ ఉన్న సర్వ శుభములు కనుపించుటకు ఆ గ్రహములన్నియు అస్థంగత దొషము లేకుండా ఉండవలెను. ఆ గ్రహములకు షడ్బలము దిగ్మలము కలిగిఉండవలెను. జాతకములలొ పైన చెప్పబడిన గ్రహస్తితి ఉన్ననూ ఈ బలములు లేనియడల ఆ యోగములు అంతగా ఫలితములను ఇచ్చుటలేదు. ఈ గ్రహస్తితినీ ఉనికినీ బలములనూ పరిగణలొనికి తీసుకునుని ఫలితములు చెప్పవలెను.

Thursday, September 7, 2017

యజ్ఞోపవీత మహిమ significance of Yagnopaveetham Telugu

 యజ్ఞోపవీత మహిమ (జంద్యము)

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యము’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతో వారి వారి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు ని బట్టి ఉపనయన సంస్కారం లో  వేయడం జరుగుతుంది

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

" సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్ "

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -

" ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ
ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః "

మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.

" తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్ "

ఈ శ్లోకంలో తాతపర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం. ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.

" చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్ "

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.

" పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్ "

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి. అలాగే శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకోవాలి

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. ఇదే యజ్ఞోపవీత మహిమ ..