జ్యేష్ఠ మాసంలో వివాహం - త్రిజ్యేష్ఠ
త్రిజ్యేష్ఠ అనే అంశంలో నుండి ప్రారంభమైంది ఈ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠుడి పెళ్లి అనే అంశం. అయితే ముహూర్తాల విషయంలో వివాహం జ్యేష్ఠ మాసంలో శుభప్రదము అని చెప్పారు.
‘మాఘ ఫాల్గుణ వైశాఖా జ్యేష్ఠ మాసాశ్శుభప్రదా’ అని జ్యేష్ఠ మాసం విశేషంగా చెప్పారు. అందునా మరొక విశేషం ఏమిటి చెప్పారు అంటే ‘జ్యేష్ఠమాసి కరగ్రహో నశుభకృత్ జ్యేష్ఠాంగనా పుత్రయో’ అని వున్నది. అనగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులుగా పుట్టిన వధూవరులకు వివాహం చేయరాదు అని.
ఈ మధ్యకాలంలో జ్యేష్ఠ మాసంలో పెళ్లి అనే విషయం ప్రస్తావనకు వస్తే మా అబ్బాయి ఇంటిలో పెద్దవాడు కావున జ్యేష్ఠ మాసంలో వివాహం చేయము అనేవారు. జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవద్దని చెప్పేవారు ఎక్కువయ్యారు.
జ్యేష్ఠ సంతానం అనగా వున్న వారిలో జ్యేష్ఠులు కాదు. ‘అద్యగర్భప్రసూతాయాః’ ఏ తల్లికి అయిననూ ప్రథమ గర్భంలో పుట్టిన సంతతికి మాత్రమే జ్యేష్ఠులు అని వర్తించారు.
దంపతులు ఇరువురూ జ్యేష్ఠ సంతతి అయి వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయుట వలన మూడు జ్యేష్ఠలు అవుతాయి కావున త్రిజ్యేష్ఠ దోషం ఆపాదించబడుతుంది. కావున జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులయిన వధూవరులు యిరువురికి వివాహం చేయుట నిషేధము. ఒకరు జ్యేష్ఠులు మరొకరు జ్యేష్ఠులు కాకపోయిన ఎడల వివాహం చేయవచ్చును.
పూర్వకాలామృతంలో మరొక విశేషం చెప్పారు. ‘జ్యేష్ఠేమాస్యపి జాతియోశ్చ యదివా జ్యేష్ఠోడు సంభూతయేః దంపత్సోర్యది యేనకేన విధినా జ్యేష్ఠాత్రయం చాస్తిచేత్ త్రిజ్యేష్ఠాహ్వయ దోషదోహి సతతం నాప్యాద్య గర్భద్వయే’ - త్రిజ్యేష్ఠ స్వరూపం కాకపోయిననూ వధూవరులు ఇరువురూ జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టిననూ, ఇరువురూ జ్యేష్ఠ మాసంలో పుట్టిననూ ఆ వధూవరులకు జ్యేష్ఠ మాసంలో వివాహం నిషేధం అని చెప్పారు.
పై మూడు రూపాలలో ఒకవేళ జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవలసి వస్తే- ‘వివాహో యది కర్తవ్యశ్చాద్య గర్భ ద్వయరపి. అన్యోన్య రాశిమిత్రత్వే శుభం ప్రాహమునిర్మనుః’ - ఆ వివాహం చేసుకునే దంపతులకు రాశి మైత్రి వున్న యెడల వివాహం చేయవచ్చును అని వున్నది.
వధూవరులలో ఒకరు జ్యేష్ఠ మాసం మరొకరు వేరే మాసంలోను, ఒకరు జ్యేష్ఠా నక్షత్రం మరొకరు వేరే నక్షత్రంలోను, ఒకరు జ్యేష్ఠుడుగా మరొకరు అన్యులుగా జన్మిస్తే ఈ చర్చ అవసరం లేదు. త్రిజ్యేష్ఠ దోషంగా చెప్పబడిన వధూవరులకు యిరువురికీ మాసాధిపతుల మైత్రి వుంటే జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవచ్చును.
వధూవరులు ఇరువురు జ్యేష్ఠులు అయి వారిలో ఒకరిది జ్యేష్ఠా నక్షత్రమై జ్యేష్ఠమాసములో పెళ్ళి అయితే అది జ్యేష్ఠ చతుష్టయం అవుతుంది. ఇద్దరు జ్యేష్ఠులై వారిరువురి నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రాలై జ్యేష్ఠమాసంలో పెళ్ళి అయితే అది జ్యేష్ఠ పంచకం అవుతుంది. ఈ విధంగానైనా త్రిజ్యేష్ఠ గాని, జ్యేష్ఠా చతుష్టయం గాని, జ్యేష్ఠా పంచకం గాని పనికి రాదు.
‘అద్యగర్భ ప్రసూతయోర్యత్ర వివాహం కారయేద్యది మాసాధిపతి మిత్ర వశా దత్రశుభావహః - ముహూర్తదర్పణం ఈ విధంగా ఎన్నో మతాంతర పాఠాలు ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడికి వివాహం చేయు విషయంలో చెప్పారు.
ఇక ప్రజలు పరిధిని అతిక్రమించి కొత్త పాఠాలు మొదలుపెట్టారు. జ్యేష్ఠ మాసంలో పుట్టిన జ్యేష్ఠుడికి జ్యేష్ఠ కన్యను ఇచ్చి వివాహం చేయరాదట కదా! ఇలాంటి పిచ్చి శాస్త్రాలు మహర్షులు చెప్పలేదు. ఇక భవిష్యత్‌లో అందరూ ఒకరు లేదా ఇద్దరినే కంటారు. మరి అలాంటప్పుడు జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ మాసంలో పుట్టిన జ్యేష్ఠుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండాలా? అక్కర్లేదు. ఇలాంటి పిచ్చి అపవాదులకు అవకాశం శాస్త్రంలో లేదు.
శాస్త్రం చాలా చక్కగా దోషములు దోష పరిహారములతో పకడ్బందీగా చెప్పబడినది. అందువలన జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకు వివాహం చేయు విషయంలో పై విధంగా శాస్త్ర నిర్ణయాలు తెలుసుకోండి.
No comments:
Post a Comment