Monday, December 23, 2024

హనుమాన్ మన్యుసూక్తం..!!_ 🙏🌹

*మన్యుసూక్తం*

(ఋగ్వేద సంహితా; మండలం 10; సూక్తం 83,84)

యస్తే” మన్యో‌உవి’ధద్ వజ్ర సాయక సహ ఓజః’ పుష్యతి విశ్వ’మానుషక్ | 
సాహ్యామ దాసమార్యం త్వయా” యుజా సహ’స్కృతేన సహ’సా సహ’స్వతా 1 


మన్యురింద్రో” మన్యురేవాస’ దేవో మన్యుర్ హోతా వరు’ణో జాతవే”దాః | 
మన్యుం విశ’ ఈళతే మాను’షీర్యాః పాహి నో” మన్యో తప’సా సజోషా”ః  2 


అభీ”హి మన్యో తవసస్తవీ”యాన్ తప’సా యుజా వి జ’హి శత్రూ”న్ | 
అమిత్రహా వృ’త్రహా ద’స్యుహా చ విశ్వా వసూన్యా భ’రా త్వం నః’  3 


త్వం హి మ”న్యో అభిభూ”త్యోజాః స్వయంభూర్భామో” అభిమాతిషాహః | 
విశ్వచ’ర్-షణిః సహు’రిః సహా”వానస్మాస్వోజః పృత’నాసు ధేహి  4 


అభాగః సన్నప పరే”తో అస్మి తవ క్రత్వా” తవిషస్య’ ప్రచేతః | 
తం త్వా” మన్యో అక్రతుర్జి’హీళాహం స్వాతనూర్బ’లదేయా”య మేహి’  5 


అయం తే” అస్మ్యుప మేహ్యర్వాఙ్ ప్ర’తీచీనః స’హురే విశ్వధాయః | 
మన్యో” వజ్రిన్నభి మామా వ’వృత్స్వహనా”వ దస్యూ”న్ ఋత బో”ధ్యాపేః  6 


అభి ప్రేహి’ దక్షిణతో భ’వా మే‌உధా” వృత్రాణి’ జంఘనావ భూరి’ | 
జుహోమి’ తే ధరుణం మధ్వో అగ్ర’ముభా ఉ’పాంశు ప్ర’థమా పి’బావ  7 


త్వయా” మన్యో సరథ’మారుజంతో హర్ష’మాణాసో ధృషితా మ’రుత్వః | 
తిగ్మేష’వ ఆయు’ధా సంశిశా”నా అభి ప్రయం”తు నరో” అగ్నిరూ”పాః  8 


అగ్నిరి’వ మన్యో త్విషితః స’హస్వ సేనానీర్నః’ సహురే హూత ఏ”ధి | 
హత్వాయ శత్రూన్ వి భ’జస్వ వేద ఓజో మిమా”నో విమృధో” నుదస్వ  9 


సహ’స్వ మన్యో అభిమా”తిమస్మే రుజన్ మృణన్ ప్ర’మృణన్ ప్రేహి శత్రూ”న్ | 
ఉగ్రం తే పాజో” నన్వా రు’రుధ్రే వశీ వశం” నయస ఏకజ త్వమ్  10 


ఏకో” బహూనామ’సి మన్యవీళితో విశం”విశం యుధయే సం శి’శాధి | 
అకృ’త్తరుక్ త్వయా” యుజా వయం ద్యుమంతం ఘోషం” విజయాయ’ కృణ్మహే  11 


విజేషకృదింద్ర’ ఇవానవబ్రవో(ఓ)3’‌உస్మాకం” మన్యో అధిపా భ’వేహ | 
ప్రియం తే నామ’ సహురే గృణీమసి విద్మాతముత్సం యత’ ఆబభూథ’  12 


ఆభూ”త్యా సహజా వ’జ్ర సాయక సహో” బిభర్ష్యభిభూత ఉత్త’రమ్ | 
క్రత్వా” నో మన్యో సహమేద్యే”ధి మహాధనస్య’ పురుహూత సంసృజి’  13 


సంసృ’ష్టం ధన’ముభయం” సమాకృ’తమస్మభ్యం” దత్తాం వరు’ణశ్చ మన్యుః | 
భియం దధా”నా హృద’యేషు శత్ర’వః పరా”జితాసో అప నిల’యంతామ్  14 


ధన్వ’నాగాధన్వ’ నాజింజ’యేమ ధన్వ’నా తీవ్రాః సమదో” జయేమ |
ధనుః శత్రో”రపకామం కృ’ణోతి ధన్వ’ నాసర్వా”ః ప్రదిశో” జయేమ ||

భద్రం నో అపి’ వాతయ మనః’ ||


ఓం శాంతా’ పృథివీ శి’వమంతరిక్షం ద్యౌర్నో” దేవ్య‌உభ’యన్నో అస్తు |
శివా దిశః’ ప్రదిశ’ ఉద్దిశో” న‌உఆపో” విశ్వతః పరి’పాంతు న్ శాంతిః శాంతిః శాంతిః’ ||...

Tuesday, August 13, 2024

ద్వాదశరాశులకు ఆధిపత్య గ్రహములు

 ద్వాదశరాశులకు ఆధిపత్య గ్రహములు  


1. మేష లగ్నమునకు : లగ్న అష్టమాధిపతి కుజుడు, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు, తృతీయ షష్టాదిపతి బుధుడు, చతుర్దాదిపతి చంద్రుడు, పంచమాదిపతి రవి, నవమ వ్యయాధిపతి గురువు, దశమ లాభాధిపతి శని. 


2. వృషభ లగ్నమునకు : లగ్నషష్టాధిపతి శుక్రుడు, ద్వితీయ పంచమాధిపతి బుధుడు, తృతీయాధిపతి చంద్రుడు, చతుర్దాధిపతి రవి, సప్తమవ్యయాధిపతి కుజుడు, అష్టమ లాభాధిపతి గురువు, నవమ దశమాధిపతి శని!


3.  మిధున లగ్నమునకు : లగ్న చతుర్ధాదిపతి బుధుడు, ద్వితీయాధిపతి చంద్రుడు, తృతీయాధిపతి రవి, పంచమ వ్యయాధిపతి శుక్రుడు, షష్టలాభాధిపతి  సప్తమ దశమాధిపతి గురుడు, అష్టమ నవమాధిపతి శని!


4. కర్కాటకలగ్నమునకు : లగ్నాధిపతి చంద్రుడు, ద్వితీయాధిపతి రవి, తృతీయవ్యాయాధిపతి బుధుడు, చతుర్ధ లాభాధిపతి శుక్రుడు, పంచమ ధశమాధిపతి కుజుడు,  షష్టభాగ్యాధిపతి గురువు, సప్తమ వ్యయాధిపతి శని!


5. సింహ లగ్నమునకు : లగ్నాధిపతి రవి, ద్వితీయ లభాదిపతి  బుధుడు, తృతీయ ధశమాధిపతి శుక్రుడు, చతుర్ధ భాగ్యాధిపతి కుజుడు, పంచమ అష్టమాధిపతి గురువు, షష్ట సప్తమాధిపతి శని, వ్యయాధిపతి చన్ద్రుదు. 


6. కన్యా లగ్నమునకు : లగ్న దశమాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యదిపతి శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి కుజుడు, చతుర్ధ సప్తమాధిపతి గురువు, పంచమ షష్టధిపతి శని, లాభాధిపతి చంద్రుడు, వ్యయాధిపతి రవి. 


7. తులా లగ్నమునకు : లగ్న అష్టమాధిపతి శుక్రుడు, ద్వితీయ సప్తమాధిపతి కుజుడు, తృతీయ షష్టధిపతి గురువు, చతుర్ధ పంచమా ధిపతి శని, నవమ వ్యయాధిపతి బుధుడు, దశమాదిపతి చంద్రుడు, లాభాధిపతి రవి! 


8. వృశ్చిక లగ్నమునకు : లగ్నషష్టాధిపతి కుజుడు, ద్వితీయ పంచమాధిపతి గురువు, తృతీయ చతుర్ధధిపతి శని, సప్తమ వ్యయధిపతి శుక్రుడు, అష్టమ లాభాధిపతి బుధుడు, నవమాధిపతి చంద్రుడు దశమాదిపతి రవి!


9. ధనుర్లగ్నమునకు : లగ్న చతుర్ధాదిపతి గురువు, ద్వితీయ తృతీయధిపతి శని, పంచమ వ్యయాధిపతి కుజుడు, షష్ట లాభాధిపతి శుక్రుడు, సప్తమ దశమాధిపతి బుధుడు, అష్టమాధిపతి చంద్రుడు,  నవమాధిపతి రవి!


10. మకర లగ్నమునకు :లగ్న ద్వితీయాధిపతి శని, తృతీయ వ్యయాధిపతి గురువు,  చతుర్ధ లాభాధిపతి కుజుడు, 

పంచమ దశమాదిపతి శుక్రుడు, షష్ట నవమాధిపతి బుధుడు, సప్తమాధిపతి చంద్రుడు, అష్టమాధిపతి రవి!


11. కుంభ లగ్నమునకు : లగ్న వ్యయాధిపతి శని, ద్వితీయ లాభాధిపతి గురువు, తృతీయ ధశమాధిపతి కుజుడు, చతుర్ధ భాగ్యాధిపతి శుక్రుడు, పంచమ అష్టమాధిపతి బుధుడు, షష్టాధిపతి చంద్రుడు, సప్తమాధిపతి రవి!

12. మీన లగ్నమునకు : లగ్న దశమాదిపతి గురువు, ద్వితీయ నవమాధిపతి కుజుడు, తృతీయ అష్టమాధిపతి శుక్రుడు, చతుర్ధ సప్తమాధిపతి బుధుడు, పంచమాధిపతి చంద్రుడు, షష్టాధిపతి రవి, లాభవ్యయాధిపతి శని!


ద్వాదశ లగ్నములకు శుభ - పాప గ్రహములు 


1. మేష లగ్నమునకు రవి, గురులు శుభులు! బుధ, శుక్ర, శనులు పాపులు!!

2. వృషభ లగ్నమునకు రవి, శనులు, శుభులు! చంద్ర, గురు, శుక్రులు పపులు!!

3. మిధున లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! రవి, కుజ, గురు, శనులు పాపులు!!

4. కర్కాటక లగ్నమునకు కుజ, గురులు శుభులు! బుధ, శుక్రులు పాపులు!!

5. సింహ లగ్నమునకు కుజుడు మాత్రమే శుభుడు!బుధ, శుక్రులు పాపులు!!

6. కన్యా లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! చంద్ర, కుజ, గురు పాపులు!!

7. తులా లగ్నమునకు బుధ, శనులు శుభులు! రవి, కుజ, గురులు పాపులు!!

8. వృశ్చిక లగ్నమునకు గురువు మాత్రమే శుభుడు! బుధ, శుక్ర, శనులు పాపులు!!

9. ధనుర్లగ్నమునకు రవి, కుజులు శుభులు! బుధ, గురులు కూడా కొన్ని సందర్బములలో మంచివారు! శుక్రుడు పాపి!!

10. మకర లగ్నమునకు బుధ, శుక్రులు శుభులు! చంద్ర, కుజ, గురులు పాపులు!!

11. కుంభ లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు!చంద్ర, కుజ, గురులు పాపులు!!

12. మీన లగ్నమునకు చంద్ర, కుజలు శుభులు! రవి, బుధ, శుక్ర, శనులు పాపులు!!

13. లగ్నము వలన, ఆత్మ సంభంధమైన విషయములను, జాతకుని అనూహ్య కర్మలను తెలియధగియున్నది. 

14. చంద్ర లగ్నమువలన జాతకుడు తెలిసిజేయు కర్మలను, వాటి ఫలితములను గుర్తించవలెను. 

15. నవాంశలగ్నముల వల్ల జాతకుని పూర్వజన్మ కర్మలకు సంభందించిన ఫలితములు తెలియధగియున్నది. 

16. జన్మలగ్నము జాతకుని దేహస్థితి, అంగసోష్ట వము, శారీరక సుఖములను ధెల్పును. 

17. చంద్రలగ్నము మనో ధర్మములను, మానసిక స్థితి గతులను ధెల్పును. 

18. అంశలగ్నము శరీరచ్చయా, అంతర్గత స్వభావములను తెల్పును. 

19. లగ్నాధిపతి శుభుడై 5-9 స్థానములందు, పాపియై 1-4-7-10 స్థానములందు యున్న యెడల - జాతకునికి శుభ ఫలితములు ప్రాప్తించగలవు. 

20. 3-11 స్థానములలో లగ్నాధిపతియున్న - సామాన్య శుభ ఫలితములు కల్గును. 

21. 2-6-8-12 స్థానములలో లగ్నాధిపతి యున్న అశుభ ఫలితములు నివ్వగలడు. 


Wednesday, July 17, 2024

*షోడశ వర్గ చక్రాల విశ్లేషణ*

*షోడశ వర్గ చక్రాల విశ్లేషణ*

జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా భావచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి. 
జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలో పరిశీలించాలి.
ఈ షోడశవర్గుల పరిశీలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు 
అవకాశము కలదు.

ఈ షోడశవర్గులే కాక జైమిని పద్దతిలోనూ, 
తాజక పద్దతి యందు..
పంచమాంశ, 
షష్ఠాంశ, 
అష్ఠమాంశ, 
లాభాంశ లేక రుద్రాంశ 
అను నాలుగు వర్గులను సూచించినారు.

*పంచమాంశ*
పూర్వపుణ్యబలం, 
మంత్రం,సిద్దించునా లేదా తెలుసుకోవచ్చు.

*షష్టాంశ*
అనారోగ్యం అమంతర్గతంగా ఉందా లేదా 
బహిర్గతమంగా ఉందో తెలుపును.

*అష్టమాంశ*
ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు, యాక్సిండెంట్స్, వైద్యపరంగా యాక్సిడెంట్ ద్వారా అవయవాన్ని తొలిగించుట.యాసిడ్ దాడులు తెలుసుకోవచ్చు.

*లాభాంశ(రుద్రాంశ)*
ఆర్ధికపరమైన లాభాలు,
వృషభరాశి ఏలగ్నంగాని, గ్రహంగాని రాదు. 
వృషభరాశి శివుడికి సంబంధించిన రాశి కాబట్టి 
ఈ రాశిలో ఏగ్రహం ఉండదు.

*లగ్న కుండలి*
లగ్న కుండలి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియ జేస్తుంది. 
మనిషి మనస్తత్త్వం, శారీరక స్థితి, గుణగణాలు, 
జీవన విధానం మొదలైన అనేక విషయాలు 
లగ్నకుండలి ద్వారా తెలుసుకొవచ్చు.

*నవాంశ కుండలి(D9)*
రాశి చక్రమందు యోగం ఉండి నవాంశ యందు గ్రహాల స్ధితి యుతులలో అవయోగ మేర్పడిన రాశి యందలి ఫలితమునకు విఘాతం కలుగును. 
రాశిచక్రం జన్మమైతే నవాంశ ప్రాణం.
నవాంశ కుండలి మనిషి భాగ్యాన్ని, వైవాహిక జీవితాన్ని తెలియ జేస్తుంది. 
ఒక మనిషి అదృష్టవంతుడా, కాదా, అదృష్టం దేని ద్వారా వస్తుంది. 
తదితర విషయాలు వివాహానికి సంబంధించి 
వివాహ యోగం ఉన్నదా, లేదా, 
జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, 
వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు నవాంశ కుండలి ద్వారా తెలుస్తాయి.

*హోరా(D2) కుండలి*
హోరా కుండలి ఆర్థిక స్తితిని గురించి తెలియ జేస్తుంది. అలాగే మనలో ఉండే వివిధ అంశాల సంతులతను సూచిస్తుంది. 
రవిహోర(సింహరాశి)లో ఎక్కువ గ్రహలు ఉన్నట్లయితే కృషితో ఎక్కువ సంపాదన ఉంటుంది.
సింహం మనలో ఉండే బహిర్గత అంశాలను, 
కర్కాటకం అంతర్గత అంశాలను సూచిస్తుంది.

*ద్రేక్కాణ(D3) కుండలి*
వైద్య జ్యోతిష్యంలో ద్రేక్కాణం ద్వారా ఏ శరీర భాగానికి అనారోగ్యం కలుగుతుందో తెలుసుకోవచ్చును.
ద్రేక్కాణం శరీర భాగాలు, ఆరోగ్య సమస్యల గురించి చెబుతుంది. 
ఇది లగ్న కుండలిలో 3 వ భావం, సోదరీమణులు, స్నేహితులు మరియు భాగస్వామ్యాలు గురించి చెబుతుంది. 
ఇది మన సామర్థ్యాన్ని పని, లేదా ఒక సమూహం లో, కొన్ని లక్ష్యాన్ని సాధించడాన్ని సూచిస్తుంది. 
శక్తి, ఆసక్తి, ధైర్యం, పరాక్రమం. మొదలైనవి ద్రేక్కాణ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు 
విశ్లేషణ కొరకు లగ్న కుండలి మరియు కుజుడి స్థితి మరియు 3 వ భావాన్ని తనిఖీ చెయ్యాలి.

*చతుర్థాంశ(D4) కుండలి*
చతుర్థాంశ మనకు కలిగే సౌకర్యాలు, 
గృహ వాహనాది యోగాలు, 
మన జీవితం కష్టాలతో కూడినదా లేక 
సుఖాలతో కూడినదా, 
తదితర అంశాల గురించి చెపుతుంది.

*సప్తాంశ(D7) కుండలి*
సప్తాంశ సంతానం గురించి అలాగే మనలో ఉండే సృజనాత్మక శక్తి గురించి చెపుతుంది.
సంతానం,వంశోన్నతి,వంశాభివృద్ధి చూడవచ్చు

*దశమాంశ(D10) కుండలి*
దశమాంశ ఉద్యోగము మరియు కీర్తి ప్రతిష్టల గురించి తెలియ జేస్తుంది. 
కర్మలు,వాటి ఫలితాలు, ఉద్యోగం,గౌరవాలు,కీర్తిప్రతిష్ఠలు, వృత్తిలో ఒడిదుడుకులు తెలుసుకోవచ్చు.

*ద్వాదశాంశ(D12) కుండలి*
ద్వాదశాంశ మన అదృష్టం గురించి, 
పూర్వ జన్మలో మనం చేసిన కర్మ ఫలితాలను గురించి తెలియజేస్తుంది. 
అలాగే వంశ సంబంధ దోషాలను గురించి కూడా 
తెలియ జేస్తుంది.
తల్లిదండ్రులతో అనుబంధాలు,
వారి నుండి వచ్చే అనారోగ్యాలు,
ఎవరి నుండి ఎవరికి సుఖం ఉన్నదో తెలుసుకోవచ్చును.

*షోడశాంశ(D16) కుండలి*
షోడశాంశ మనకు గల గృహ, వాహనాది సౌఖ్యాలను గురించి తెలియజేస్తుంది. 
అలాగే ఒక వ్యక్తి అంతర్గంతంగా ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.
వాహనసౌఖ్యం,వాహనాలతో చేసే వృత్తి వ్యాపారాలు లాభిస్తాయో లేదో తెలుసుకోవచ్చును.
వాహనానికి ఏరంగు మంచిదో తెలుసుకోవచ్చును.

*వింశాంశ(D20) కుండలి*
వింశాంశ మనం చేసే దైవారాధన, అనుకూల దైవం, గురూపదేశం తదితర ఆధ్యాత్మిక అంశాలను 
తెలియ జేస్తుంది. 
మనం ఏ దేవున్ని ఉపాసన చేయాలి అనేది 
దీని ద్వారా కనుక్కోవచ్చు.
మంత్రోచ్చారణ ,దేవుడిని పూజించేటప్పుడు అడ్డంకులు వస్తాయో లేదో తెలుసుకోవచ్చును.
వింశాంశలో శుక్రుడు బలహీనంగా ఉండాలి.
బలహీనంగా ఉంటేనే సన్యాసియోగం వస్తుంది.
అప్పుడే దైవచింతన చేయగలడు.

*చతుర్వింశాంశ(D24) కుండలి*
చతుర్వింశాంశ మన విద్యను గురించి ఆధ్యాత్మికతను గురించి తెలియజేస్తుంది. 
ఉన్నతవిద్య,విదేశి విద్య,
విద్యలో ఆటంకాలు గురించి తెలుసుకోవచ్చు.

*సప్తవింశాంశ(D27) కుండలి*
సప్తవింశాంశ మన శారీరక, మానసిక శక్తియుక్తుల గురించి తెలియజేస్తుంది. 
అలాగే మన జీవితానికి సంబందించిన అంశాల సూక్ష్మపరిశీలనకు లగ్న కుండలితో పాటు దీన్ని కూడా పరిశీలించాలి.
జాతకుడిలో ఉండే బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చును.

*త్రింశాంశ కుండలి(D30)*
త్రింశాంశ మన కష్ట, నష్టాలను గురించి, 
అనుకోకుండా వచ్చే ఆపదల గురించి, 
ప్రమాదాల గురించి తెలియజేస్తుంది.
స్త్రీ పురుషుల శీలం,
వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు,
అరిష్టాలు తెలుసుకోవచ్చును.

*ఖవేదాంశ(D40) కుండలి*
ఖవేదాంశ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, జాతకంలో కల శుభాశుభ అంశాలను తెలుసుకోవటానికి 
అలాగే మనకు కల అలవాట్లను, భావోద్వేగాలను అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది. మాతృవంశం నుండి వచ్చే శుభ కర్మ,
అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.

*అక్షవేదాంశ కుండలి(D45)*
అక్షవేదాంశ మనకుండే నైతిక విలువలను గురించి, జాతకానికి సంబంధించిన అంశాలను సూక్ష్మ పరిశీలన చేయటానికి ఉపయోగ పడుతుంది.
తండ్రివంశం నుండి వచ్చే శుభ కర్మ,
అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.

*షష్ట్యంశ కుండలి (D60)*
షష్ట్యంశ జాతకానికి సంబంధించి సూక్ష్మ పరిశీలనకు అలాగే కవలల జాతకాల పరిశీలన విషయంలో 
ఇది ఉపయోగపడుతుంది.
పూర్వజన్మ విషయాలు, 
కవలల విశ్లేషణకు,
ముహూర్తమునకు,
ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.

*వర్గులు*

*దశవర్గులు*
1.క్షేత్రము,2.హార,3.ద్రేక్కాణము,4.సప్తాంశ,5.నవాంశ,6.దశాంశ,7.ద్వాదంశాంశ,8.షోడశాంశ,9.త్రింశాంశ,10. షష్ట్యంశ యనునవి దశవర్గులు.ఇవి జీవులకు వ్యయదురితచయ శ్రీలనుగలుగ జేయును.

*షోడశవర్గులు*
1.క్షేత్రము లేక రాశి,2.హోర,3.ద్రేక్కాణము,4.చతుర్ధాంశ,5.సప్తమాంశ,6.నవమాంశ,7.దశమాంశ,8.ద్వాదశాంశ,9.షోడశాంశ,10.వింశాంశ,11.శిద్ధాంశ,12.భాంశ,13.త్రింశాంశ,14.ఖవేదాంశ,15.అక్షవేదాంశ,16.షష్ట్యంశ.

 *1.క్షేత్రము-30 భాగలు.*

*2.హోర-రాశిని రెండు సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము 15భాగల ప్రమాణమగును.బేసి రాశియందు మెుదటి సగభాగము రవిహోర,రెండవ సగభాగము చంద్రహోర.సమరాశియందుమెుదటి సమభాగము చంద్రహోర.రెండవ సగభాగము రవిహోర.

3.ద్రేక్కాణము-రాశిని 3 సమ భాగములు చేయగా ఒక్కాక్క భాగము10 బాగల ప్రమాణమగును.మెుదటి భాగమునకు ఆ రాశ్యాధిపతియే ద్రేక్కాణధిపతి.రెండవ భాగమునకు ఆ రాశికి పంచమ రాశ్యాధిపతి ద్రేక్కాణాధిపతి.మూడవ భాగమునకు ఆ రాశికి నవమ రాశ్యాధిపతి ద్రేక్కాణాధిపతియగును.

4.చతుర్థాంశ లేక తుర్యాంశ-రాశిని నాలుగు సమ భాగములుచేయగా ఒక్కొక్క భాగము7 భాగల 30 లిప్తలు లేక నిమిషములు అగును.మెుదటి భాగమునకు ఆరాశ్యాధిపతియు, రెండవ భాగమునకు ఆరాశికి చతుర్థాధిపతియు,మూడవ భాగమునకు ఆరాశికి సప్తమాధిపతియు,నాల్గవ భాగమునకు ఆ రాశికి దశమాధిపతియు అధిపతులగుదురు.

5.సప్తమాంశ- రాశిని 7 సమభాగములు చేయగా సంప్తమాంశయగును.ఒక్కొక్కభాగము 4భాగలు 17 1/7 లిప్తలగును.మేషమునకు కుజునితో ప్రారంభింప వలెను.వృషభమునకు వృశ్చిక కుజునితోప్రారంభింపవలెను.మిథునమునకు మిథున బుధునితోను,కర్కాటకమునకు మకర శనితోను,సింహమునకు రవితోను,కన్యకు మీన గురునితోను,తులకు తులా శుక్రునితోను,వృశ్చికమునకు వృశభ శుక్రునితోను,ధనస్సునకు ధనస్సు గురునితోను,మకరమునకు చంద్రునితోను,కుంభమునకు కుంభ శనితోను,మీనమునకు కన్యాబుధునితోను ప్రారంభించవలెను.ఆ క్రమమున ఆయాగ్రహములు అధిపతులగుదురు.

6.నవమాంశ-రాశిని తొమ్మిది భాగములు చేయగా నవమాంశ యగును.ఒక్కొకక్క భాగము 3 భాగల 20 లిప్తలు.మష ,సింహ,ధనస్సులకు మేషాదిగను; కర్కాట,వృశ్చిక,మీనములకు కర్కాటకాదిగను;వృషభ,కన్య,మకరములకు మకరదిగను; మిథున,తుల,కుంభములకు తులాదిగను నవాంశలను గుణించవలెను.మేష ,సంహ,ధనుస్సుల యెక్కనవాంశలకు మేషము మెుదలుకొని తొమ్మిది రాశుల యెక్కయధిపతులే యెక్కొక్క నవాంశమునకు అధిపతులనియును,కర్కాటక , వృశ్చిక,మీనములకు కర్కాటకాదిగను నవరాశుల అధిపతులు నవరాశుల అధిపతులు నవాంశాధి పతులనియును;వృషభ,కన్య,మకరములకు మకరాదిగ నవరాశ్యాధిపతులు నవాంశధి పతులనియును;మిథున,తుల ,కుంభములకు తులాదిగా నవరాశ్యధిపతులు నవాంశాధిపతులనియును గ్రహించవలెను.

7.దశాంశ-రాశిని 10 సమభాగములు చేేయగా దశాంశ ప్రాప్తించును.ఇది యెుక్కొక్క భాగము 3 భాగలగును మేష మెుదటి దశాంశ మేష కుజునితో ప్రారంభ మై మకర శనితో అంతమగును.వృషభ మెుదటిదశాంశ మకర శనితో ప్రారంభమై తులశుక్రునితో అంతమగును.ఓజరాశులకు ఆ రాశిమెుదలు,యుగ్మరాశులకు ఆ రాశికి తొమ్మిదవ రాశిమెదలు దశాంశ రాశులగును.ఆయా రాశ్యాధిపతులే ఆంశాధిపతులగుదురు.

8.ద్వాదశాంశ--రాశిని 12సమ భాగములు చేయగా ద్వాదశాంశయగును.ఇది 2 భాగల 30 లిప్తల ప్రమాణము గలది.ఈ అంశలకు అధిపతులు ఆయా రాశ్యాధిపతుల నుండి క్రమముగానుండును.

9.షోడశాంశ- రాశిని 16 సమ భాగములు చేయగా షోడశాశయగును.ఒక్కొక్కభాగము 1భాగ 52 లిప్తల 30 విలిప్తలు,మేష,కర్కట,తుల,మకరములకు మేష కుజాది చంద్రుని వరకు;కర్కట,సింహ,వృశ్చిక,కుంభములకు రవ్యాది వృశ్చిక,కుజునివరకు;మిథున,కన్య,ధనుర్మీనములకు,ధనస్సుగురు మెుదలు మీన గురుని వరకు అధిపతులు.

10.వింశాంశ-రాశిని 20 సమ భాగములు చేయగా ఒక్కొక్కభాగము1భాగ 30 లిప్తలగును.చరరాశులకు మేష కుజునితోను, స్ఠిరరాశులకు ధనుస్సు గురునితోను,ద్విస్వభావ రాశులకు రవితోను అధిపతులు ప్రారంభమదురు.

సిద్ధాంశ-రాశిని 24 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము1 భాగ 15 లిప్తలగును. బేసి రాశులకురవ్యాదిగను,సమ రాశులకు చంద్రాదిగను గ్రహములు అధిపతులగుదురు.

12.భాంశ- రాశిని 27 సమభాగములు చేయగాఒక్కొక్క భాగము1 భాగ 6లిప్తల 40 విలిప్తల ప్రమాణమగును.ప్రతిరాశికి ఆ రాశినాధునితో ప్రారంభమై క్రమముగా 27 గ్రహములు భాంశనాధులగుదురు.

13.త్రింశాంశ-రాశిని 30 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము 1భాగ ప్రమాణమగును.ఓజరాశులందు మెదటి 5 భాగలకు కుజుడు.5నుండి 10 వరకు శని,10నుండి 18 వరకు గురుడు, 18 నుండి 25 వరకు బుధుడు 25 నుండి 30 వరకు శుక్రుడు అధిపతులు. సమరాశులకు మెదటి 5 భాగలకు శుక్రుడు, 5 నుండి 12 వరకు బుధుడు,12 నుండి 20 వరకు గురుడు,20 నుండి 25 వరకు శని,25 నుండి 30 వరకు కుజుడు అధిపతులు.
14.ఖవేదాంశ-రాశిని 40 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగమునకు 45లిప్తల ప్రామాణము ప్రాప్తించును.బేసి రాశులకు మేష కుజాదిగను,సమ రాశులకు తుల శుక్రాదిగను అంశనాధులగుచున్నారు.

15.అక్ష వేదాంశ-రాశిని 45 సమ భాగములు చేయగా ఒక్కొక్కభాగమునకు 40 లిప్తల ప్రమాణము ప్రాప్తించును.చర రాశులకు మేషాదిగను,స్ఠిర రాశులకు సింహదిగను,ద్విస్వభావ రాశులకుధనురాదిగను గ్రహములు అధిపతులగుదురు.

16.షష్ట్యంశ-రాశిని 60 భాగములు చేయగా ఒక్కొక్క భాగము 30 లిప్తల ప్రమాణమగును.బేసి రాశులందు మెుదటి రెండుపాప షష్ట్యంశలు.3 నుండి 6 వరకుశుభము 7నుండి 12వరకు పాపము.13-14 శుభము15.పాపము 16 నుండి 20 వరకు శుభము.27 పాపము.28-29 శుభము.30 నుండి 36 వరకు పాపము 37 నుండి39 వరకు శుభము 40-14 పాపము 42 శుభము 43-44 పాపము 45 నుండి 48 వరకు శుభము.49-50 పాపము 51 శుభము 52 పాపము 53 నుండి 58 వరకు శుభము 59 పాపము 60 శుభము.సమ రాశులు 1 శుభము. 2 పాపము.3 నుండి 8 వరకు శుభము 9 పాపము.10 శుభము.11-12 పాపము.13 నుండి 16 వరకు శుభము.17-18 పాపము.19 శుభము.20-21 పాపము 22 నుండి 24 వరకు శుభము.25 నుండి 31 వరకు పాపము.32-33 శుభము. 34 పాపము. 35 నుండి 45 వరకు శుభము.46 పాపము.47-48 శుభము 49 నుండి 54 వరకు పాపము.55 నుండి 58 వరకు శుభము!.59-60 పాపము.

Thursday, July 11, 2024

*వివాహ పొంతన సమగ్ర పరిశీలన*

*వివాహ పొంతన సమగ్ర పరిశీలన*

జీవితంలో వివాహం అనేది ఒక ముఖ్య వ్యవహారం.వదూవరుల మద్య భావాలు కలసి, భావైక్యత ఉందో లేదో తెలుసుకొని వివాహం చేస్తే జీవితం అన్యోన్యంగా ఉండేందుకు అవకాశం ఉంది.దీనికి ముఖ్యంగా లగ్నాన్ని,సప్తమభావాన్ని పరిగణలోకి తీసుకుంటారు.లగ్నంలో తాను,సప్తమంలో భార్య,లేదా భర్త సామాజిక సంబంధాలు ఉన్నాయి.కానీ ఏ ఇద్దరి మద్య అభిప్రాయాలు అన్నీ విషయాలలో ఏకీభవించకపోవచ్చు.అయితే కొన్ని ముఖ్యమైన అభిప్రాయాలు కూడా ఏకీభవించకపోతే కలసి జీవించటం కష్టం.
చంద్రుడు మనఃకారకుడు కావటం వల్ల చంద్రుడున్న నక్షత్రాన్ని,రవి ఆత్మశక్తికి కారకుడు కావటం వల్ల రవి ఉన్న నక్షత్రాన్ని ,లగ్నం శరీరశక్తి కావటంవల్ల లగ్నాన్ని పొంతన చూడాలి అని చెప్పిన అనుభవజ్ఞుల అభిప్రాయం మంచిదనిపిస్తుంది.
ఇరువురి రాశిచక్రాలలో చంద్ర స్ధానాధిపతుల,లగ్నాధిపతుల,రవి స్ధానాదిపతుల మైత్రి ఉంటే వారిద్దరి మద్య అవగాహన,మానసికమైన ఏకీకృత ఆలోచనా విధానం,శారీరక విషయాలలో లోపాలు లేకుండటం మొదలైన అంశాలు ప్రత్యేకంగా గుర్తించబడతారు.
ఇటువంటి విశేషాలతో కూడుకున్న మేలాపలకం అనేది సైద్ధాంతిక ప్రాతిపదికలతో కూడుకున్నటువంటిది.బాల్యవివాహాలు ఆచారంగా ఉన్న రోజుల్లో వేరు పిల్లల మధ్యలో అవగాహన కలిగించటానికి ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యకరమైన ఆనందకరమైన విధానమే ఈ మేలాపలకం.ఈ మేలాపలకం సరిగా ఉంటే వ్యక్తుల శరీర మానసిక ఆత్మిక ధోరణులలో ఐక్యత ఉండి దాదాపుగా ఇద్దరి ఆలోచనా ప్రవృత్తుల్లో ఆనందదాయకమైన ఫలితాలు ఏర్పడతాయి.లేకుంటే బలవంతంగా భావాలను,శరీరాలను పంచుకోవాల్సి రావటం వల్ల అక్రమ విధానాలకు,ఇబ్బందులకు వ్యక్తులు పాల్పడుతుంటారు.ప్రాశ్చాత్యులు కూడా ప్రస్తుత కాలంలో వివాహాల విషయంలో మేలాపకాదులను గమనిస్తున్నారంటే వారి విధానాల నుండి మన వైజ్ఞానిక మేలాపాక విధానం,సంప్రదాయ ఆరోగ్యవంతమైన జీవన విధానం వైపు వారు చూసే చూపును మనం అర్ధం చేసుకోవచ్చును.
చాలా మంది పంచాంగంలో పాయింట్లు చూసి 18 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాతకాలు కుదిరాయనుకుంటారు.ఈ నిర్ణయం చాలా తప్పు .అష్టకూటములలో సంతానం,వైదవ్యం,ద్వికళత్రయోగం లాంటివి తెలుసుకోవటానికి అవకాశం లేదు.ఉదా:-సప్తమస్ధానంలో కుజ,శుక్రుల సంయోగం ఉండి పాప వీక్షణ ఉన్న దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి.పంచమ స్ధానంలో రాహు,కేతువులు ,కుజుడు,శని గాని ఉండి పాప వీక్షణ ఉన్న సంతాన నష్టం,మృతశిశువు,గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ.ఇవి ఏవి అష్టకూటముల ద్వారా నిర్ణయించలేము.పాయింట్లు బాగున్నాయని వివాహం చేసుకోవచ్చని వివాహ నిర్ణయం చేయరాదు.36 పాయింట్లకు 34 వచ్చిన జాతక చక్రంలో అనుకూలంగా లేకపోతే ఉపయోగంలేదు.
వివాహ పొంతన విషయంలో తప్పనిసరిగా వదూవరులిద్దరి జాతకచక్రంలో పంచమం (సంతానం కోసం),సప్తమ స్ధానం (దాంపత్య జీవితం),అష్టమ స్ధానం(వైదవ్యం),దశ ,అంతర్దశలు (వివాహానంతర జీవితం)తప్పని సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.పాయింట్లకు ప్రాదాన్యత ఇవ్వరాదు.తారాబలం,గ్రహమైత్రి,నాడీమైత్రి బాగుండి జాతకచక్రం అనుకూలంగా ఉన్నప్పుడు వదూవరులిద్దరికి పొంతన కుదిరినట్లే.
వధూవరులకు

 వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణన లో తీసుకొన్నారు .
1 వర్ణకూటమి 2 వశ్యకూటము ౩ తారాకూటమి 4 యోనికూటము 5 గ్రహకూటమి 6. గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి
వీటిలో మొత్తం 18 గుణాలు దాటితే శుభం అనేది సామాన్య వచనం,కానీ సప్తమ,పంచమ,అష్టమ భావాలు సంపూర్ణ శుభత్వం ఉంటే వివాహం చేయవచ్చు.ఒక వేళ జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రాన్ని అనుసరించి చూడాలి.
వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే మంచిది.
కర్కాటకం,వృశ్చికం,మీన రాశుల వారు బ్రాహ్మణ వర్ణం.
మేషం,సింహం,దనస్సు రాశుల వారు క్షత్రియ వర్ణం.
మిధున,తుల,కుంభ రాశుల వారు వైశ్య వర్ణం.
వృషభ,కన్య,మకర రాశులు శూద్ర వర్ణం.
వదూవరులు ఇద్దరు ఏక వర్ణమైన ఉత్తమం.వధువు వర్ణం కంటే వరుడి వర్ణం ఎక్కువైన మద్యమం.వరుని వర్ణం కంటే వధువు వర్ణం ఎక్కువైన వర్ణ పొంతన కుదరదు.
2 . వశ్యపొంతన : మేషరాశికి - సింహము ,వృశ్చికం, వృషభ రాశివారికి – కర్కాటక ,తులారాశులు , మిదునమునకు – కన్యరాశి, కర్కాటకరాశికి – వృశ్చికం, ధనుస్సు , సింహరాశికి – తులారాశి , కన్యకు – మిధున , మేషములు , తులా రాశికి – కన్య, మకరం, వృశ్చికరాశికి – కర్కాటకం ,ధనుస్సుకు – మీనము , మకర రాశికి – మేషం , కుంభం కుంభరాశికి – మేషము , మీనమునకు – మకరం ఈ విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి . వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన కలిగి ఉండవలెను .మిధున,కన్య,తుల నర రాసులు.వీటికి సింహం తప్ప తక్కినవన్నీ వశ్యములే.సింహానికి వృశ్చికం తప్ప అన్నీ వశ్యాలే.
౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1 , ౩ , 5 , 7 శేషము వచ్చిన తారలు మంచివి కావు. అను జన్మతారలో చేసుకోవచ్చును.శుభతారలైతే 3 గుణాలు,అశుభ తారలైతే 1 న్నర గుణాలు ఉంటాయి.
4 . యోనిపొంతనము :
అశ్వని,శతభిషం-గుఱ్ఱం
స్వాతి,హస్త-ఎద్దు
ధనిష్ట,పూర్వాభాద్ర-సింహం
భరణి,రేవతి-ఏనుగు
పుష్యమి,కృత్తిక-మేక
శ్రవణం,పూర్వాషాడ-కోతి
ఉత్తరాషాడ,అభిజిత్-ముంగీస
రోహిణి,మృగశిర-పాము
జ్యేష్ఠ,అనూరాధ-లేడి
మూల,ఆరుద్ర-కుక్క
పునర్వసు,ఆశ్లేష-పిల్లి
మఘ,పుబ్బ-ఎలుక
విశాఖ,చిత్త-పులి
ఉత్తర,ఉత్తరాభాద్ర-ఆవు
పులి – ఆవు , పిల్లి – ఎలుక , లేడి – కుక్క , గుఱ్ఱము – దున్న , పాము – ముంగిస , సింహం – ఏనుగు , కోతి- మేక ఇవి విరోధ జంతువులు. వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి కాకూడదు.ఒకే యోని అయితే సంపద,భిన్న యోనులైతే శతృత్వం లేకపోతే మద్యమం,రాశి కూటం,వశ్య కూటం అనుకూలమైతే యోనికూటం కుదరకున్నా దోషం లేదు.
5 గ్రహకూటమి :
సూర్యుడు – శని , చంద్రుడు – బుధుడు , కుజుడు –బుధుడు .గురుడు –శుక్రుడు ఈ పైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ కూటమి ని చూసేటప్పుడు పై విధంగా ఉండ కూడదు.
వధూవరుల రాశులకు అన్యోన్యమైత్రి ఉత్తమం,సమమైత్రి మద్యమం,పరస్పర సమత్వం కనిష్ఠం,పరస్పర శతృత్వం మృత్యుపదం,శతృత్వం కలహాప్రదం.
6 గణ కూటమి :-
స్వగుణం చోత్తమం ప్రీతి మధ్యమం దైవమానుషం
అధమం దేవడైత్యానాం మృత్యుర్మానుష రాక్షసం.
వధూవరుల జాతకం పరిశీలించేటప్పుడు వరుని యొక్క మనస్తత్వం నిర్ణయించటానికి అతని జన్మ నక్షత్రం ఆదారంగా నిర్ణయించవచ్చు. నక్షత్ర విభజన వారి మనస్తత్వ ప్రకారం విభజించబడింది.వధువు నక్షత్రంతో వరుని నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలి కానీ వరుని నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు. నక్షత్రాలు 27 .నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు.
దేవగణ నక్షత్రాలు:-అశ్వని,మృగశిర,పునర్వసు,పుష్యమి,హస్త,స్వాతి,అనురాధ,శ్రావణం,రేవతి
దేవగణ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు.శాంత స్వభావం కలిగి ఉంటారు.పరోపకారులై ఉంటారు.ఓర్పు,సహనం కలిగి ఉంటారు.
మనుష్యగణ నక్షత్రాలు:-భరణి,రోహిణి,ఆరుద్ర,పుబ్బ,ఉత్తర,పూర్వాషాడ,ఉత్తరాషాడ,పూర్వభాధ్ర,ఉత్తర భాధ్ర
మనుష్యగణ నక్షత్ర జాతకులు రజో గుణ లక్షణాలు కలిగి ఉంటారు.మంచి చెడు రెండు కలిగి ఉంటారు.భాదించటం,వేధించటం చేయరు.ఎవ్వరికీ హాని తలపెట్టరు.
రాక్షస గణ నక్షత్రాలు:-కృత్తిక,ఆశ్లేష,మఖ,చిత్త,విశాఖ,జ్యేష్ఠ,మూల,ధనిష్ట,శతబిషం
రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు.అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు.కఠినంగా మాట్లాడుతారు.మిక్కిలి స్వార్ధపరులు.
వధూవరులిద్దరిది ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారం,ప్రేమానురాగాలు ఉంటాయి.వధువుది మనుష్య గణమై వరునిది రాక్షస గణమైతే వారిద్దరిమధ్య బొత్తిగా అవగాహన లేకపోవటం ,ఆమెకు విలువ ఇవ్వక తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. వధువుది దైవగుణం వరునిది రాక్షసగణం అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది.భార్యాభర్తల మద్య పొందిక కుదరదు.
.7. రాశి పొంతనము :
వధూవరుల జన్మ రాసులు ఒకదానికొకటి 6-8 అయితే మృత్యువు,5-9 అయితే సంతాన హాని,2-12 అయితే నిర్ధనత్వం.
ప్రీతి షడష్టకం:-మేషం-వృశ్చికం,మిధునం-మకరం,సింహం-మీనం,తుల-వృషభం,ధనస్సు-కర్కాటకం-కన్య.
మృత్యు షడష్టకం:-మేషం-కన్య,మిధునం-వృశ్చికం,సింహం-మకరం,తుల-మీనం,ధనస్సు-వృషభం,కుంభం-కర్కాటం.
శుభ ద్విర్ద్వాదశం:-మీనం-మేషం,వృషభం-మిధునం,కర్కాటకం-సింహం,కన్య-తుల,వృశ్చికం-ధనస్సు,మకరం-కుంభం.
అశుభ ద్విర్ద్వాదశం:-మేషం-వృషభం,మిధునం-కర్కాటం,సింహం-కన్య,తుల-వృశ్చికం,ధనస్సు-మకరం,కుంభం-మీనం.
శుభ నవపంచకాలు:-మేషం-సింహం,వృషభం-కన్య,మిధునం-తుల,సింహం-ధనస్సు,తుల-కుంభం,వృశ్చికం-మీనం,ధనస్సు-మేషం,మకరం-వృషభం.
అశుభ నవ పంచకాలు:-కర్కాటకం-వృశ్చికం,కన్య-మకరం,కుంభం-మిధునం,మీనం-కర్కాటకం.
ఏకరాశి:-సౌభాగ్యం,పుత్ర లాభాలు.
సమసప్తకం-ప్రీతి,ధన,భోగ,సుఖాలు.
తృతీయ లాభాలు:-ప్రీతి,ధనం,సౌఖ్యం.
చతుర్ధ దశమాలు:- ప్రీతి,ధనం,సౌఖ్యం.
8 నాడీపొంతనము : నాడీ దోషం ఎంతో విశిష్టమైనది.విడువరానిది.వదూవరులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేసుకొనకూడదు.వదూవరులిద్దరిదీ ఏక శరీర తత్వము కాకూడదు అనేది నాడీ నిర్ణయం.వివాహమునకు తరువాత వ్యక్తి క్రొత్త జీవితములోనికి ప్రవేశించునని పెద్దలు అంటారు, పెద్దలు ఇట్లు చెప్పుట చాలా వరకు సరైనది కూడ. వివాహమునకు తరువాత ప్రారంభమగు క్రొత్త జీవితము సుఖమయముగా వుండుటకు కుండలి యొక్క లెక్కింపు చేసెదరు. కుండలి యొక్క లెక్కింపు క్రమములో అష్టకూటము ద్వారా విచారణ చేసెదరు. ఈ అష్ట కూటములో ఎనిమిదవ మరియు అంతిమ కూటము నాడీ కూటము. నాడీ కూటమి సరిగా లేకుంటే మిగతా ఏడు కూటాల గుణాల్ని కూడా నాశనం చేస్తుంది.
శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు.జ్యోతిష్య శాస్త్రము లో నాడులు మూడు ప్రకారములుగా వుండును, ఈ నాడుల పేర్లు ఆదినాడి, మధ్య నాడి, అంత్య నాడి.
1. ఆది నాడి: జేష్ట, మూల, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తరఫల్గుని, హస్త, పూర్వభాద్ర,శతబిషం మరియు అశ్విని నక్షత్రములు ఆది లేదా ఆద్య నాడిలో వుండును. దీని వల్ల మేదోసంపత్తి,ప్రతీకార వాంఛ,ఆలోచనా విధానం,కోపం,ఆవేశం తెలుపుతుంది.వదూవరులిద్దరి నక్షత్రాలుగ ఉత్తర,శతభిషం,పూర్వాభాద్ర,పునర్వసు,ఆరుద్ర,మూల మొదలగు నక్షత్రాలకు ఆది నాడీ దోషం లేదు.
2. మద్య నాడి: పుష్యమి, మృగశిర, చిత అనురాధ, భరణి, దనిష్ట, పూర్వాషాడ, పూర్వఫల్గుణి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములు మధ్య నాడిలో వుండును. దీని వల్ల శరీరం మద్య భాగంలో ఉన్న రుగ్మతలు,సంతానం, ఊపిరితిత్తులుగుండెలో ఉన్న రుగ్మతలు తెలుపుతుంది. వదూవరులిద్దరి నక్షత్రాలు పూర్వాషాడ,అనురాధ,ధనిష్ఠ,పుష్యమి,చిత్త,పుబ్బ,మృగశిర,అను నక్షత్రాలకు మద్య నాడీ దోషం లేదు.
3. అంత్య నాడి: స్వాతి, విశాఖ, కృత్తిక, రోహిణి, ఆశ్లేష, మఘ, ఉత్తరాషాడ, శ్రవణ మరియు రేవతి నక్షత్రములు అంత్య నాడిలో వచ్చును. దీనివల్ల మర్మాయవాలు,కామవాంఛ,నపుంసకత్వం గురించి తెలియజేయును.వదూవరులిద్దరి నక్షత్రాలు కృత్తిక,విశాఖ,ఆశ్లేష,శ్రవణం,మఖ,ఉత్తరాషాడ,రోహిణి నక్షత్రాలకు అంత్య నాడీ దోషం లేదు.
జ్యోతిష్య శాస్త్ర ఆదారముగా వరుడు మరియు కన్య ఇరువురి నక్షత్రములు ఒకే నాడిలో వుండిన అప్పుడు ఈ దోషము కలుగును. అన్ని దోషముల కన్నా నాడీ దోషము అశుభ కరముగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఈ దోషము కలుగుట వలన 8 అంఖము యొక్క హాని కలుగును. ఈ దోషము కలుగుట వలన వివాహ ప్రసంసము చేయుట శుభకరముగా వుండదు.
మహర్షి వశిష్టుని అనుసారముగా నాడీ దోషము లో ఆది, మధ్య మరియు అంత్య నాడులకు వాతము, పిత్తము మరియు కఫము అనే పేర్ల ద్వారా తెలిపెదరు.
నాడి మానవుని యొక్క శారీరక ఆరోగ్యమును కూడ ప్రభావితము చేయును. ఈ దోషము కారణముగా వారి సంతానము మానసికముగా వికసితము లేని మరియు శారీరకముగా అనారోగ్యముతో వుండును 
ఈ స్థితులలో నాడీ దోషము కలుగదు:
1. యది వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రములు ఒకటిగా వుండిననూ ఇరువురి చరణములు ప్రదమ చరణమైన ఎడల నాడీ దోషము కలుగదు.
2. యది వరుడు - వదువు ఒకే రాశిగా వుండి మరియు జన్మ నక్షత్రము బిన్నమైన ఎడల నాడీ దోషము నుండి వ్యక్తి ముక్తి పొందగలడు.
3. వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రము ఒకటిగా వుండి మరియు రాశులు వేరు వేరుగా వుండిన ఎడల నాడీ దోషము కలుగదు.
తప్పనిసరి అయితే నాడీ దోష పరిహారానికి మృత్యుం.
*మీ మిత్రుడు యస్.నాగేశ్వరశర్మ(ప్రకాష్)*

Wednesday, June 26, 2024

లలితా సహస్త్రనామ విశిష్టత

లలితా సహస్రనామ స్తోత్రము, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రము. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.

ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. 

స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది) ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది.

బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం “లలితోపాఖ్యానం”లో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది. ఇందులో లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. శ్రీమహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు. లలితా పురాణంలో భండాసురుని సంహరించడానికి దేవి అవతరించినట్లుగా వర్ణించారు. ఈ గ్రంథాలలో శ్రీపురమును సూచించే శ్రీచక్రం నిర్మాణం వర్ణించబడింది. ఆదిశంకరులు, భాస్కరాచార్యుడు త్రిశతి, సహస్రనామములకు వ్యాఖ్యానాలు అందించారు.

అగస్త్యమహర్షికి ఉపదేశంలో హయగ్రీవుడు శ్రీలలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని, పంచదశాక్షరి మంత్రాన్ని మరియు శ్రీయంత్రము, శ్రీవిద్య, శ్రీలలితాంబిక, శ్రీగురుదేవుల ఐక్యతను వివరించాడు. 

అగస్త్యుడు లలితాసహస్రనామమును ఉపదేశింపమని కోరగా అది గుహ్యమని, అర్హత లేనివారికి ఉపదేశించడం నిషిద్ధమని హయగ్రీవుడు తెలిపాడు. కాని అగస్త్యుడు అర్హత కలిగిన ఋషి గనుక హయగ్రీవుడు అతనికి లలితాసహస్రనామాన్ని ఉపదేశించాడు.

అన్ని పెద్ద స్తోత్రాలలాగానే లలితా సహస్రనామస్తోత్రంలో కొన్ని విభాగాలున్నాయి. పూజ, అర్చన లేదా పారాయణ చేసే సందర్భాన్ని బట్టి కొన్ని విధి విధానాలను పాటిస్తారు. సాధారణంగా భక్తులు ముందు శుచిగా స్నానాది కార్యములు ముగించుకొని నిత్య పూజా కార్యక్రమం చేసుకొని లలితా సహస్రనామస్తోత్రమును చదవడం జరుగుతుంటుంది.


*పూర్వ పీఠిక :*

పూర్వ పీఠికలో స్తోత్ర ఆవిర్భావాన్ని గురించి, ఆ స్తోత్రం గోప్యనీయత గురించి హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పిన వివరణ ఉంది. స్తోత్ర పారాయణ మహాత్మ్యము, అది చదవడంలో పాటించవలసిన నియమాలు వివరింపబడ్డాయి. 
పూర్వ పీఠికలో తెలుపబడిన కొన్ని ముఖ్యాంశాలు –

ముందుగా హయగ్రీవుడు అగస్త్యునికి శ్రీ లలితాదేవి చరిత్రను, భండాసురుని సంహారము, శ్రీపుర వర్ణన, శ్రీ విద్యా పంచాక్షరీ మంతరమహిమలను తెలిపాడు. హోమ విధానాలను చెప్పాడు. శ్రీచక్రానికి, శ్రీవిద్యకు, శ్రీదేవికి, గురుశిష్యులకు ఉండే అన్యోన్య తాదాత్మ్యాన్ని బోధించాడు. మంత్రిణి శ్యామలాంబ, దండిని వారాహిదేవి సహస్రనామాలను ఉపదేశించాడు. తనకు లలితా సహస్రనామాలను కూడా ఉపదేశించమని అగస్త్యుడు ప్రార్థించాడు.

లలితాదేవి సహస్రనామాలు రహస్యమయాలనీ, శ్రీదేవియందు శ్రద్ధాభక్తులు కలిగి గురుముఖతః పఞ్చదశాక్షరీ మంత్రోపదేశాన్ని పొందిన శిష్యునకు మాత్రమే గురువు ఈ రహస్యనామాలను ఉపదేశించాలనీ హయగ్రీవుడు తెలిపాడు. లలితా తంత్రాలలో ఈ సహస్రనామాలే సర్వశ్రేష్టం. వీనివలన శ్రీలలితాదేవి సులభంగా ప్రసన్న అవుతుంది. ముందుగా శ్రీచక్రార్చన, పంచదశాక్షరీ జపం చేసి, అనంతరం సహస్రనామ పారాయణ చేయాలి. జపపూజాదులకు అసమర్ధులైనవారు నామసహస్రపారాయణం మాత్రం చేయవచ్చును. దేవి ఆజ్ఞానుసారం వశిన్యాది దేవతలు రచించిన ఈ స్తోత్రం పారాయణం చేసేవారికి లలితాదేవి అనుగ్రహం, సకలాభీష్ఠ సిద్ధి కలుగుతాయి. శ్రీదేవి ఆజ్ఞానుసారం బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలు, మంత్రిణి శ్యామలాంబవంటి శక్తులు కూడా ఈ లలితాసహస్రనామస్తోత్రాన్ని భక్తితో పఠిస్తున్నారు.

*పారాయణ భాగం*

పూర్వ పీఠిక, ఉత్తర పీఠికలను కొందరు పారాయణంలో భాగంగా చదువవచ్చును కాని సాధారణంగా వాటిని మినహాయించి “న్యాసం” నుండి “సహస్రనామము” వరకు పారాయణలో చదువుతారు.

న్యాసం
పారాయణ క్రమంలో ముందుగా న్యాసము చేస్తారు. చేయబోయే జపం ఏమిటి? ఎవరు దీనిని ముందు చెప్పారు? దాని ప్రాశస్త్యత ఏమిటి? అందుకు రక్షణ ఏమిటి? ఎందుకు ఈ జపం చేయబడుతున్నది వంటి విషయాలు న్యాసంలో చెబుతారు.

అస్య శ్రీలలితాసహస్ర నామస్తోత్రమాలా మంత్రస్య
వశిన్యాది వాగ్దేవతావతా ఋషయ:
అనుష్టుప్ ఛంద:
శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపురసుందరీ దేవతా
ఐం – బీజం,
 క్లీం – శక్తిః, 
సౌః – కీలకం
(శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ మధ్యకూటేతి శక్తి: శక్తికూటేతి కీలకమ్ )
సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్ధే
శ్రీలలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్రనామ జపే వినియోగ:

తరువాత - - “అంగన్యాసము”, “కరన్యాసము” చెబుతారు

న్యాసం తరువాత ధ్యానం పఠిస్తారు. 
ఏ దేవతనుద్దేశించి ఈ స్తోత్రం పారాయణం చేయబడుతున్నదో ఆ దేవతను ముందుగా ధ్యానించడం సంప్రదాయం 

– ఈ స్తోత్ర ధ్యానంలో మూడు శ్లోకాలున్నాయి. 

*“అరుణాం కరుణాంతరంగీమ్ … “,* 
*“ధ్యాయేత్ పద్మాసనస్థాం…”,* 
*“సకుంకుమ విలేపనామ్…”* 
అనేవి ఆ మూడు ధ్యాన శ్లోకాలు. 

వాటిలో మొదటిది క్రింద వ్రాయబడింది.

అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం
అణిమాదిభిరావృతాం మయూఖై
రహమిత్యేవవిభావయే భవానీమ్

తరువాత దేవికి “లమిత్యాది పంచపూజ” చేస్తారు. గురుధ్యానం కూడా చేస్తారు.

వేయి నామాలు
ఇది శ్రీదేవి వేయి నామములను స్తుతించే ప్రధాన భాగం. 

ఉదాహరణగా కొన్ని శ్లోకాలు ఇక్కడ వ్రాయడమైనది.

*1,2,3వ శ్లోకములు*
శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండ సమ్భూతా దేవకార్య సముద్యతా
ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహుసమన్వితా
రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా
మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా

*21వ శ్లోకము*
సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషితా
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభా

*52వ శ్లోకం*
సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ

*65వ శ్లోకము*
భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలినీ
పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ

*70వ శ్లోకము*
నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా

*118వ శ్లీకము*
ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా

*130వ శ్లోకము*
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ
సర్వధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ

*148వ శ్లోకము*
దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా

*172వ శ్లోకము*
స్తోత్రప్రియా స్తుతిమతీ శృతిసంస్తుత వైభవా
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః

*182, 183, 184వ శ్లోకములు* 
(చివరి మూడు)
అభ్యాసాతిశయజ్ఞాతా షడద్వాతీతరూపిణీ
అవ్యాజకరుణామూర్తి రజ్ఞానధ్వాందీపికా
ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ
శ్రీశివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా
ఏవం శ్రీలలితాదేవ్యాం నామ్నాం సాహస్రకం జగుః

*ఉత్తర పీఠిక (ఫలశృతి)*

మూడవ అధ్యాయం అయిన “ఉత్తర పీఠిక”లో ఫలశృతి చెప్పబడింది. అందులో హయగ్రీవుడు అగస్త్యునికి తెలిపిన కొన్ని విషయాలు :

శ్రీలలితాసహస్రనామములు రహస్యమయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలనూ కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి లలితాదేవియొక్క ఒక్కనామం చాలును. భక్తుడైనవాడు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ నామపారాయణ చేయాలి. విద్యలలో శ్రీవిద్య, దేవతలలో శ్రీలలితాదేవి, స్తోత్రాలలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రము అసమానములు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, రహస్యనామపారాయణ అనే భాగ్యాలు అల్పతపస్వులకు లభించవు. భక్తిహీనులకు దీనిని ఉపదేశింపరాదు. ఈ లలితాసహస్రనామస్తోత్రమును తప్పక పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.

*అర్ధాలు, రహస్యార్ధాలు*

ఉత్తరపీఠికలోను, పూర్వపీఠికలోను చెప్పబడిన విధంగా లలితాసహస్రనామస్తోత్రంలోని వివిధనామాలు రహస్యమయాలు, అనేక నిగూఢార్ధ సంహితములు అని అనేకులు భావిస్తారు. నామాలలో అనేక మంత్రాలు, బీజాక్షరాలు నిక్షిప్తమై యున్నాయని కూడా వారి విశ్వాసం. ముఖ్యంగా శాక్తేయులకు ఇవి చాలా విశిష్ఠమైనవి. ఈ శ్లోకంలోని నామాల అర్ధాలను, భావాలను అనేకులు వ్యాఖ్యానించారు. అంతేగాక వాటిని విషయపరంగా కొన్ని విభాగాలుగా చేసి, ఒక్కొక్క విభాగం ఒక్కొక్క తాత్విక లేదా తాంత్రిక ఆంశానికి చెందినట్లుగా భావిస్తున్నారు.

*సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము –* 
అనే పంచకృత్యాలకు అనుగుణంగా ఈ శ్లోకాలలోని నామములు కూర్చబడినాయని ఒక వివరణ. దేవి “పంచకృత్యపరాయణ” అని వర్ణింపబడింది.

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ — 63

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ
సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా — 64

అనగా దేవి బ్రహ్మరూపిణియై సృష్టిని, విష్ణు (గోవింద) రూపిణియై స్థితికార్యమును, రుద్రరూపిణియై సంహారమును, ఈశ్వరియై తిరోధానమును, సదాశివమూర్తియై అనుగ్రహమును నిర్వహించుచున్నది. మొదటి శ్లోకంలోని మొదటి మూడునామములు – శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి – కూడా సృష్టి, స్థితి, సంహారములను సూచించుచున్నవి. ఆలాగే తరువాతి రెండు నామములు – చిదగ్నికుండ సమ్భూతా, దేవకార్యసముద్యతా – అనునవి తిరోధానమును, అనుగ్రహమును సూచించునని అంటారు.

“ఉద్యద్భానుసహస్రాభా” నుండి “శింజాన మణిమంజీరమండిత శ్రీపదాంబుజా” వరకు శ్రీదేవి కేశాదిపాద సౌందర్యవర్ణన ఉంది. తరువాత దేవి ఆవాసమైన చింతామణిగృహవర్ణన, ఆపై భండాసురసంహారము, కుండలినీశక్తికి సంబంధించిన నామాలు ఉన్నాయి. ఆ తరువాత అనేక విద్యలు, పూజలు, మంత్రములు నిక్షిప్తమై ఉన్నాయంటారు.

మరికొందరు విశ్లేషకులు ఈ వెయ్యి నామాలను వందేసి నామములున్న పది విభాగాలుగా చెబుతారు. ఆ పది విభాగాలలోని మొదటి నామముల క్రమం ఇలా ఉన్నది –

శ్రీమాతా – చూడండి: 
లలితా సహస్ర నామములు- 1-100
మణిపూరాంతరూఢితా – చూడండి: 
లలితా సహస్ర నామములు- 101-200
సద్గతిప్రదా – చూడండి: 
లలితా సహస్ర నామములు- 201-300
హ్రీంకారీ – చూడండి: 
లలితా సహస్ర నామములు- 301-400
వివిధాకారా – చూడండి: 
లలితా సహస్ర నామములు- 401-500
గుడాన్నప్రీతమనసా – చూడండి: 
లలితా సహస్ర నామములు- 501-600
దరాందోళిత దీర్ఘాక్షీ – చూడండి: 
లలితా సహస్ర నామములు- 601-700
దేశకాలపరిచ్ఛిన్నా – చూడండి: 
లలితా సహస్ర నామములు- 701-800
పుష్టా – చూడండి: 
లలితా సహస్ర నామములు- 801-900
నాదరూపిణీ – చూడండి: 
లలితా సహస్ర నామములు- 901-1000

శ్రీ విద్య, లలితాసహస్రనామము

లలితాసహస్రనామ పారాయణ (మంత్రము), 
శ్రీచక్ర పూజ (యంత్రము), 
కుండలినీయోగ సాధన (తంత్రము), – 
అనేవి శ్రీవిద్యోపాసనలో ముఖ్యమైన అంశాలు. సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన అనే రెండు విధానాలు ఈ విద్యాసాధనలో నిక్షిప్తమై ఉన్నాయి. యోగసాధనలో చెప్పబడే షట్చక్రాలు 
(మూలాధార చక్రము, స్వాధిష్ఠాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము) 
లలితాసహస్రనామంలో చెప్పబడినాయి. 
ఈ చక్రాలను అధిగమించి సహస్రారంలో కొలువైయున్న జగన్మాతృకా స్వరూపాన్ని చేరుకోవడమే కుండలినీయోగసాధనలోని లక్ష్యం.

ఇలా లలితా సహస్త్రనామం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది..
తెలుసు కుంటున్న కొద్దీ ఆశ్చర్యం గానే ఉంటుంది…
లలితా సహస్త్రనామం లో ఒక్క నామంతోనే మహోన్నతి స్థితి ని పొందిన వారు ఉన్నారు.. ఒక్కో నామాన్ని హోమంలో సంపుటీకరణ చేసినప్పుడు ఒక్కో నామం ఒక్కో బీజాక్షరంగా వ్యక్తం అయినట్లు నిరూపించ బడింది…..
ఇలాంటి నామాలను మనము రోజూ ఒక్కోటి స్మరిస్తున్నాము…
             
         *ఓం శ్రీ మాత్రే నమః*

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Sunday, June 9, 2024

జ్యేష్ఠ మాసంలో వివాహం - త్రిజ్యేష్ఠ

 జ్యేష్ఠ మాసంలో వివాహం - త్రిజ్యేష్ఠ


త్రిజ్యేష్ఠ అనే అంశంలో నుండి ప్రారంభమైంది ఈ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠుడి పెళ్లి అనే అంశం. అయితే ముహూర్తాల విషయంలో వివాహం జ్యేష్ఠ మాసంలో శుభప్రదము అని చెప్పారు.

‘మాఘ ఫాల్గుణ వైశాఖా జ్యేష్ఠ మాసాశ్శుభప్రదా’ అని జ్యేష్ఠ మాసం విశేషంగా చెప్పారు. అందునా మరొక విశేషం ఏమిటి చెప్పారు అంటే ‘జ్యేష్ఠమాసి కరగ్రహో నశుభకృత్ జ్యేష్ఠాంగనా పుత్రయో’ అని వున్నది. అనగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులుగా పుట్టిన వధూవరులకు వివాహం చేయరాదు అని.

ఈ మధ్యకాలంలో జ్యేష్ఠ మాసంలో పెళ్లి అనే విషయం ప్రస్తావనకు వస్తే మా అబ్బాయి ఇంటిలో పెద్దవాడు కావున జ్యేష్ఠ మాసంలో వివాహం చేయము అనేవారు. జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవద్దని చెప్పేవారు ఎక్కువయ్యారు.

జ్యేష్ఠ సంతానం అనగా వున్న వారిలో జ్యేష్ఠులు కాదు. ‘అద్యగర్భప్రసూతాయాః’ ఏ తల్లికి అయిననూ ప్రథమ గర్భంలో పుట్టిన సంతతికి మాత్రమే జ్యేష్ఠులు అని వర్తించారు.

దంపతులు ఇరువురూ జ్యేష్ఠ సంతతి అయి వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయుట వలన మూడు జ్యేష్ఠలు అవుతాయి కావున త్రిజ్యేష్ఠ దోషం ఆపాదించబడుతుంది. కావున జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులయిన వధూవరులు యిరువురికి వివాహం చేయుట నిషేధము. ఒకరు జ్యేష్ఠులు మరొకరు జ్యేష్ఠులు కాకపోయిన ఎడల వివాహం చేయవచ్చును.

పూర్వకాలామృతంలో మరొక విశేషం చెప్పారు. ‘జ్యేష్ఠేమాస్యపి జాతియోశ్చ యదివా జ్యేష్ఠోడు సంభూతయేః దంపత్సోర్యది యేనకేన విధినా జ్యేష్ఠాత్రయం చాస్తిచేత్ త్రిజ్యేష్ఠాహ్వయ దోషదోహి సతతం నాప్యాద్య గర్భద్వయే’ - త్రిజ్యేష్ఠ స్వరూపం కాకపోయిననూ వధూవరులు ఇరువురూ జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టిననూ, ఇరువురూ జ్యేష్ఠ మాసంలో పుట్టిననూ ఆ వధూవరులకు జ్యేష్ఠ మాసంలో వివాహం నిషేధం అని చెప్పారు.

పై మూడు రూపాలలో ఒకవేళ జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవలసి వస్తే- ‘వివాహో యది కర్తవ్యశ్చాద్య గర్భ ద్వయరపి. అన్యోన్య రాశిమిత్రత్వే శుభం ప్రాహమునిర్మనుః’ - ఆ వివాహం చేసుకునే దంపతులకు రాశి మైత్రి వున్న యెడల వివాహం చేయవచ్చును అని వున్నది.

వధూవరులలో ఒకరు జ్యేష్ఠ మాసం మరొకరు వేరే మాసంలోను, ఒకరు జ్యేష్ఠా నక్షత్రం మరొకరు వేరే నక్షత్రంలోను, ఒకరు జ్యేష్ఠుడుగా మరొకరు అన్యులుగా జన్మిస్తే ఈ చర్చ అవసరం లేదు. త్రిజ్యేష్ఠ దోషంగా చెప్పబడిన వధూవరులకు యిరువురికీ మాసాధిపతుల మైత్రి వుంటే జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవచ్చును.

వధూవరులు ఇరువురు జ్యేష్ఠులు అయి వారిలో ఒకరిది జ్యేష్ఠా నక్షత్రమై జ్యేష్ఠమాసములో పెళ్ళి అయితే అది జ్యేష్ఠ చతుష్టయం అవుతుంది. ఇద్దరు జ్యేష్ఠులై వారిరువురి నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రాలై జ్యేష్ఠమాసంలో పెళ్ళి అయితే అది జ్యేష్ఠ పంచకం అవుతుంది. ఈ విధంగానైనా త్రిజ్యేష్ఠ గాని, జ్యేష్ఠా చతుష్టయం గాని, జ్యేష్ఠా పంచకం గాని పనికి రాదు.

‘అద్యగర్భ ప్రసూతయోర్యత్ర వివాహం కారయేద్యది మాసాధిపతి మిత్ర వశా దత్రశుభావహః - ముహూర్తదర్పణం ఈ విధంగా ఎన్నో మతాంతర పాఠాలు ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడికి వివాహం చేయు విషయంలో చెప్పారు.

ఇక ప్రజలు పరిధిని అతిక్రమించి కొత్త పాఠాలు మొదలుపెట్టారు. జ్యేష్ఠ మాసంలో పుట్టిన జ్యేష్ఠుడికి జ్యేష్ఠ కన్యను ఇచ్చి వివాహం చేయరాదట కదా! ఇలాంటి పిచ్చి శాస్త్రాలు మహర్షులు చెప్పలేదు. ఇక భవిష్యత్‌లో అందరూ ఒకరు లేదా ఇద్దరినే కంటారు. మరి అలాంటప్పుడు జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ మాసంలో పుట్టిన జ్యేష్ఠుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండాలా? అక్కర్లేదు. ఇలాంటి పిచ్చి అపవాదులకు అవకాశం శాస్త్రంలో లేదు.

శాస్త్రం చాలా చక్కగా దోషములు దోష పరిహారములతో పకడ్బందీగా చెప్పబడినది. అందువలన జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకు వివాహం చేయు విషయంలో పై విధంగా శాస్త్ర నిర్ణయాలు తెలుసుకోండి.