Friday, February 4, 2022

శ్యామల నవరాత్రులు/ గుప్త నవరాత్రులు


శ్యామల నవరాత్రులు/ గుప్త నవరాత్రులు

మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను “శ్యామలా నవరాత్రులు” గా శ్రీవిద్యా సాంప్రదాయంలో  వ్యవహరించబడతాయి. 

చైత్ర మాసంలో వసంత నవరాత్రి 
ఆషాడ మాసంలో వారాహి నవరాత్రి
అశ్వయుజ మాసంలో శారదా నవరాత్రి 
మాఘ మాసంలో శ్యామల నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి

చైత్ర, అశ్వయిజ నవరాత్రులు అందరకీ తెలుసు. మిగిలిన రెండు గుప్త నవరాత్రులు. ఇవి కేవలము సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా  జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు. వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో  తొమ్మిదిరోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో అంటే నవదుర్గలుగా  అలంకరించి పూజలు చేస్తారు. 

దక్షిణ భారత దేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి. ఈ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు,  విద్య, ఐశ్వర్యం లబిస్తాయి. అంతేకాక బార్య భర్తల మద్య అన్యోన్యం, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని  శాస్త్రం చెబుతుంది.

భండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీలలితాదేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో ఙ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన  శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది.  ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీ దేవి అని కూడా అంటారు.  ఈ తల్లిని దశ మహా విద్యల్లో  మాతంగి అని పిలుస్తారు. 

ఈ అమ్మరికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది? 
 
హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు  నీల సరస్వతి,  గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి  శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి.

పూజా విధానం

ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి/శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవరు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. వీలయితే చిలక పచ్చరంగు వస్త్రాలను గానీ, ఎర్రని వస్త్రాలను గానీ ధరించాలి. ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోండి.  ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయండి. 



శ్యామల షోడశ నామాలు
షోడశ నామా స్తోత్రం చదవలేని వాళ్ళు షోడశ నామాలు అయిన ఈ క్రింది 16 నామాలు తో పూజ చేసుకోండి. అవి 

1. సంగీత యోగిని 
2. శ్యామా
3. శ్యామలా
4. మంత్ర నాయిక
5. మంత్రిని
6. సచివేశి
7. ప్రధానేశీ
8. శుక ప్రియ
9. వీణా వతి
10. వైణికి
11. ముద్రిని
12. ప్రియక ప్రియా
13. నీప ప్రియ
14. కదంబేశి
15. కదంబ వనవాసిని
16. సదామలా

ఈ  నవరాత్రులు మాములువి కావు, చాలా విశేషమైనవి. అందరూ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహము పొందండి.

1 comment:

  1. Hi this is really a perfect site for information. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.

    ReplyDelete