Thursday, September 19, 2019

పుత్ర సంతానము మరియు సర్ప శాంతి వివరణ

శ్లో:పుత్రస్థానగతే రాహో కుజేన చ నిరీక్షతే
కుజక్షేత్రగతేవాపి సర్పశాపాత్సుతక్షయ:

పుత్రేశే రాహుసంయుక్తే పుత్రస్థే భానునందనే
చంద్రేక్షితయుతేవాపి సర్పశాపాత్సుతక్షయ:

కారకే రాహుసంయుక్తే పుత్రేశే బలవర్జితే
లగ్నాధిపే సభౌమేపి సర్పశాపాత్సుతక్షయ:

(బృహత్పరాశర హోరాశాస్త్రం)

రాహువు పంచమమున ఉండి కుజునిచే చూడబడినా,కుజక్షేత్రమున రాహువున్నా,సర్పశాపమున పుత్రులు కలుగరు.పంచమాధిపతి రాహువుతో కూడియున్నా,శని పంచమమందున్నా,చంద్రునితో కూడినా,చూడబడినా సర్పశాపము. పుత్రకారకుడైన గురువు రాహువుతో కలసియున్నా,పంచమాధిపతి దుర్బలుడైనా,లగ్నాధిపతి కుజునితో కలసియున్నా సర్పశాపము.

ఇంకనూ: పుత్రకారకుడు గురువు కుజునితో కలసియున్నా,లగ్నమున రాహువున్నా,పంచమాధిపతి దుష్టస్థానమున-నీచ,శతృ రాశిలో ఉన్నా సర్పశాపము.కుజాంశలో కుజుడున్నా,పంచమాధిపతి బుధుడైనా,లగ్నమున రాహు,మాందులున్నా,సర్పశాపము.పంచమము కుజక్షేత్రమై పంచమాధిపతి రాహువుతో కలసియున్నా,బుధునితో కలసినా,చూడబడినా సర్పశాపము.పంచమమున రవి,శని,కుజుడు,రాహువు,గురువు,బుధులుండి పంచమ లగ్నాధిపతులు బలహీనులైనా సర్పశాపము.లగ్నాధిపతి రాహువుతో కూడినా,పంచమాధిపతి కుజయుతుడైనా,కారకుడు (గురువు) రాహు సహితుడైనా సర్పశాపము.
దోషశాంతి గురించి పరాశరులవారు చెప్పియున్నారు. నాగపూజ, స్వగృహ్యోక్తవిధానముగా నాగప్రతిష్ఠ,బంగారముతో నాగమూర్తిని చేయించి పూజించుట,గోవు,భూమి,తిలలు,బంగారము,యథాశక్తిగా దానమిచ్చుట దోషశాంతి ఉపాయములని శాస్త్రంలో చెప్పబడినది. ఇలా చేసినవారికి నాగేంద్రానుగ్రహమున సంతతి కలిగి,కులము వృధ్ధి పొందును! నాగప్రతిష్ఠ చేయించటం ఉత్తమం.

No comments:

Post a Comment