'సంస్కారో నామస భవతి యస్మిజ్ఞాతే పదార్థో భవతి యోగ్యః'
ఒక వ్యక్తిని లేదా ఒక పదార్థాన్ని ఒక నిర్ణీత ప్రయోజనానికి యోగ్యమైనదిగా చేసే ప్రక్రియనే 'సంస్కారం' అంటారు. ఇది జైమినీ సూత్ర భాష్యకారుడు ఇచ్చిన నిర్వచనం.
'వసుధైవ కుటుంబకం' అనే సూక్తిని నమ్మేవాళ్లం మనం. 'లోకాస్సమస్తా సుఖినోభవన్తు' అంటూ సమస్త లోక సకల సమాజాలూ బాగుండాలని కోరుకునేవాళ్లం మనం. 'ఇంట గెలిచి రచ్చ గెలవాలనే' విశ్వాసం ఉన్నవాళ్లం మనం. అందుకే, మన శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సూ కోరుతూ మనం అనేక 'సంస్కారాలు' జరుపుతుంటాం. వీటిలో కొన్ని వ్యక్తిగతమయిన ప్రయోజనం కోరేవే అయినా, మనం విస్తృత సమాజంలో భాగమే కాబట్టి, మనకు ఒనగూడే ప్రయోజనం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజానికీ మేలే చేస్తుంది గనుక, అన్ని సంస్కారాల వెనుకా ఉన్న సదుద్దేశం మాత్రం ఒక్కటే అని చెప్పాల్సి వస్తుంది. అదే సకలలోక కల్యాణం.
వ్యక్తిని శుద్ధి చేసేవే సంస్కారాలు. సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఒకర్ని తీర్చిదిద్దేవే సంస్కారాలు.
కొన్ని సంస్కారాలు వ్యక్తి క్ష్షేమం కోరేవి అయితే, కొన్ని కుటుంబప్రయాజనం కోరేవి. కొన్ని సంతాన వృద్ధి కోరేవి, కొన్ని పశుజంతుసంపదను ఆశించేవి. మరికొన్ని సంఘప్రయోజనం కోరేవి.
వ్యతిరేక ప్రభావాలను తొలగించుకోవడం, అనుకూల ప్రభావాలను బలపరుచుకోవడం, ఇహపరమైన ప్రయోజనాలను సాధించుకోవడం, ఆత్మవ్యక్తీకరణ జరుపుకోవడం వంటివి సంస్కారాల వల్ల కలిగే లాభాలని ప్రముఖ సిద్ధాంతకర్త రాజబలి పాండే వ్యాఖ్యానించారు.
మానవ జన్మను ఎత్తిన వ్యక్తి తన జన్మను సార్థకం, శుభప్రదం చేసుకోవడానికి అవసరమైన కొన్ని కర్మలను చేసుకోవటం అవసరం. అటువంటి సంస్కారాలు హైందవ మతంలో అనేకం ఉన్నాయి. గృహ్య సూత్రాలలో వివాహంతో ఆరంభించి సమావర్తనం వరకూ గల వాటిని పేర్కోవడం జరిగింది. అయితే వీటి గురించి పారస్కరుడు, అశ్వలాయనుడు, బౌధాయనుడు మాత్రమే సవివరంగా తెలియజేశారు.
సంస్కారాల చరిత్ర :
సంస్కారాలలో కొన్నింటి ఉనికిని మనం ఋగ్వేదంలో చూడగలం. వివాహం, గర్భాదానం, అంత్యేష్టి వంటి కొన్ని సంస్కారాలు మనకు ఋగ్వేదంలో కానవచ్చినా, వాటిగురించిన నియమనిబంధాలు, ఆచార వ్యవహారాల గురించీ ఏవీ ఋగ్వేదంలో కానరావు. సామవేదంలో సంస్కారాల ప్రసక్తి అంతగా కానరాదు. యజుర్వేదంలో కొంత వీటి ప్రస్తావన ఉంది. ముఖ్యంగా శ్రౌత, యాగ కార్యక్రమాల్లో ముఖ్యమయిన చూడాకరణం గురించి ఉండగా, అథర్వవేదంలో అక్షరాభ్యాసం, వేదాధ్యయనం, బ్రహ్మచర్యం, వివాహం వంటి వాటిగురించిన మంత్రాలు ఉన్నాయి.
గోపథబ్రాహ్మణంలో ఉపనయనం గురించిన వివరణలు ఉన్నాయి. అయితే, శతపథబ్రాహ్మణంలోనూ బ్రహ్మచర్యం అనే మాట కానవస్తుంది. ఛాందోగ్యోపనిషత్‌లో వేదవిద్యారంభ ప్రక్రియకు సంబంధించిన విషయూలు ఉన్నాయి. తైత్తరీయోసనిషత్‌లో స్నానకోత్సవం (గ్రాడ్యుయేషన్) గురించి ఉంది.
భ్రాహ్మణాల్లోనూ, ఉపనిషత్‌లలోనూ ఉన్న వాటికి మరికొంత వివరణలను కల్పసూత్రాలు మనకు అందిస్తున్నాయి. ఈ కల్పసూత్రాలు అనేక రకాలు.
కొన్ని శ్రౌతసూత్రాలు, మరికొన్ని గృహ్యసూత్రాలు. వీటిని రచించిన లేదా ప్రవచించిన ఋషిపుంగవుల పేరుమీదుగా వీటికి పేర్లున్నాయి. గృహ్యసూత్రాలలో కొన్ని :
1. ఆపస్తంభ గృహ్య సూత్రాలు
2. బౌధాయన గృహ్య సూత్రాలు
3. ఆశ్వలాయన గృహ్య సూత్రాలు
4. భారద్వాజ గృహ్య సూత్రాలు
5. గోభిల గృహ్య సూత్రాలు 6. హిరణ్యకేశీయ గృహ్య సూత్రాలు
7. జైమినీయ గృహ్య సూత్రాలు
8. ఖదీర గృహ్య సూత్రాలు 9. మానవ గృహ్య సూత్రాలు
10. ప్రాస్కర గృహ్య సూత్రాలు
11. శాంఖాయన గృహ్య సూత్రాలు
12. వరాహ గృహ్య సూత్రాలు .
ఇవి కాకుండా కొన్ని ధర్మసూత్రాలూ ఉన్నాయి. ఇవి గృహ్య సూత్రాలకు అదనపు జోడింపులు అనుకోవచ్చు.
వీటికి అదనంగా 'పరిశిష్టాలు' (శేషభాగాలు), 'వ్యాఖ్యానాలు', 'ప్రయోగాలు', 'కారికలు', వీటన్నిటికీ మరింత జోడింపుగా 'ఆప్తవాక్యాలు' ఉండనే ఉన్నాయి. వీటన్నింటిలోనూ సంస్కారాల ప్రస్తావన ఉందంటే, ఈ సంస్కారాలకు మన ప్రాచీనులు ఎంతటి ప్రాముఖ్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.
సంస్కారాలు ఎన్ని?
సంస్కారాలు ఎన్ని అనే వివరణ గురించి సంఖ్యాపరంగా ఇతమిత్థమయిన నిర్ధారణ లేదు. కొందరు వీటిని 16గా పేర్కొంటోంటే, మరికొందరు ఇవి 40 అంటారు. ఇంకొందరయితే, ఇవి 48 వరకూ ఉన్నాయనీ అంటారు.
సంస్కారాలు 40 అని చెప్పేవారు పేర్కొనే పట్టిక ఇది :
1. గర్భాదానం
2. పుంసవనం
3. సీమంతం
4. జాతకర్మ
5. నామకరణం
6. అన్నప్రాసనం
7. చౌలం
8. ఉపనయనం
9. ప్రజాపత్యం
10. సౌమ్యం
11. ఆగ్నేయం
12. వైశ్వదేవం
13. సమావర్తనం
14. వివాహం
15. దేవయజ్ఞం
16. పిత్రుయజ్ఞం
17. మనుష్యయజ్ఞం
18. భూతయజ్ఞం
19. బ్రహ్మయజ్ఞం 20.అన్వాష్టకం
21. పర్వాణం
22. స్థాలీపాకం 23. అగ్రహాయణి
24. సర్వాణి
25. చైత్రి
26. ఆశ్వయుజి
27. అగ్ని ఆధానం
28. అగ్నిహోత్రం
29. దర్శ పూర్ణమాసం 30. అగ్రాయణం
31. చాతుర్మాస్యం
32. నిరూడ పశుబంధం 33. శాంతరమణి
34. అగ్నిష్టోమం
35. అత్యాగ్నిష్టోమం
36. ఉక్త్యం
37. షోడశి 38. వాజపేయం
39. అతిరాత్రం
40. అబ్దోర్యమం
అయితే, పైన పేర్కొన్న సంస్కారాలలో కొన్ని, కొన్ని రకాల హోమాలు, యజ్ఞాలకు సంబంధించినవి కాగా, సంస్కారాలు మాత్రం 16 అని కొందరు అంటారు.
సంస్కారాలు ప్రధానంగా రెండు రకాలు. 1. స్మార్త సంస్కారాలు, 2. శ్రౌత సంస్కారాలు.
స్మార్త సంస్కారాలు ఇంట్లో నిర్వహించుకునేవి. ఇవి ఇంట్లోనే అగ్నిహోత్రం ఎదురుగా గృహ యజమాని నిర్వహించుకునేవి.
ఇక, శ్రౌత సంస్కారాలు అనేవి పురోహితుల ఆధ్వర్యంలో, వారి సమక్షంలో గృహ యజమాని నిర్వహించుకునేవి. వీటి నిర్వహణలో యజమాని పాత్ర బహుస్వల్పం. స్వచ్ఛందంగా వీటిని యజమాని కోరి నిర్వహించుకోవటం విశేషం. అందుకే, వీటిని 'కామ్య సంస్కారాలు' అనీ అంటారు.
ఇటువంటి సంస్కారాలు ఎన్ని అనే విషయమై కొన్ని సందేహాలు ఉన్నాయి. కొందరు వీటిని 12 అంటే, కొందరు 16 అని, మరికొందరు 18 అనీ అంటారు. అయితే అత్యధికులు వీటి సంఖ్యను 16గా భావించడం విశేషం. జ్యోతిష శాస్త్రంలో డాక్టరేట్ అయిన ఆదిరాజు శ్రీనివాస ఫణీంద్ర 'వ్యక్తి జన్మించే ముందునుంచే శుభ ఫలితాలు పొందడం కోసం ముహూర్తం పెట్టించి చేసుకోగలవే మన వైదిక సంస్కారాలు. ఇవి పదిహేను' అంటారు 2011 'రంజని' ఉగాది సంచికలో రాసిన 'ముహూర్తం - పరిచయం' వ్యాసంలో (పే.6). ముహూర్తం పెట్టుకోలేని అంత్యేష్టిని కూడా కలిపితే, మొత్తం 16 (షోడశ) కర్మలు అవుతాయని లెక్క చెప్పారు. స్వామి దయానంద సరస్వతి రచించిన 'సంస్కార విధి'లోనూ, పండిట్ భీమసేన్ శర్మ రచించిన 'షోడశ సంస్కార విధి'లోనూ పేర్కొన్న ఆ 16 సంస్కారాలు ఇవీ.
1. గర్భాదానం 2. పుంసవనం 3. సీమంతోన్నయనం 4. జాతకర్మ 5. నామకరణం 6. నిష్క్రమణం 7. అన్నప్రాసనం 8. చూడాకరణం
9. కర్ణవేధ 10. విద్యారంభం 11. ఉపనయనం 12. వేదారంభం 13. కేశాంతం 14. సమావర్తనం 15. వివాహం 16. అంత్యేష్టి