Saturday, January 26, 2019

శిశు జనన కాల బాలారిష్ఠదోషములు అనగా ఏమిటి ? New born baby horoscope analysis / Balarishta Dosham ?

బాలారిష్ఠదోషములు

 Newly born baby horoscope analysis / Balarishta Dosham?

శిశువు జన్మించిన తరువాత శిశువు, తల్లి తండ్రులు లేక తాత, నాయనమ్మ లేక అమ్మమ్మలు  జనన సమయ మెట్లున్నదన్న ఆత్రుతతో సిద్ధాంతులను సంప్రదించు అచారము మనం సహజంగా గమనిస్తుంటాము. అది చాలా ఉత్తమైన విషయం. తద్వారా జనన కాల దోషాలను తెలుసుకొని నివారణ మార్గాలను ఆచరించ వచ్చు.

కానీ శిశువు జననానంతరము అట్టి సమయమున జాతకమెట్లున్నది. వృత్తి , ఐశ్వర్యం, అదృష్ట యోగాలు, బలా బలములేవి, మొదలగు ప్రశ్నలడుగుట సర్వ సాధారణం గా గమనించ వచ్చు . కాని  వెంటనే అట్టి ప్రశ్న లడుగరాదు.  జనన కాల శుభ పత్రిక మాత్రమే వ్రాయించుకొనవలెను.
వింశోత్తరి దశలు మరియు అధిక వివరాల లోకి పోరాదు .

జాతక చక్రము ,ఫలములు, మొదలగు వివరములు 1, 3, లేక 5, సం. తరువాత వ్రాయించుకోనూట ఉత్తమమని ధర్మ శాస్త్రము తెలుపు చున్నది

జననకాల శుభపత్రిక వ్రాయునపుడు కులపురోహితులు, కులగురువులు,
బాలారిష్ఠ దోషములున్నవా, అను విషయము చూచి చెప్పవలెను. అంతకుమించి,
చెప్పుటయు ,అడుగుటయు, సమంజసము కాదు . ఈ బాలారిష్ఠ దోషము గురించి వివరించెదను.

జన్మ లగ్న రీత్యా చంద్రుడు 8వ, కుజుడు 7వ, రాహువు 9వ, శని 1వ, గురుడు 3వ, రవి 5వ,
శుక్రుడు 6వ, బుధుడు, 4వ,  కేతువు 11వ,  స్థానముల యందున్న బాలారిష్ఠ దోషము
కలదని తెలుసుకో వలెను.

శిశు జన్మ లగ్నాధిపతి బలహీనుడై అనగా ,నీచ, శతృ క్షేత్రములందున్ననూ
కేంద్ర కోణములందు పాపులున్ననూ, పాపగ్రహము లగ్నమును చూచుచున్ననూ
బాలారిష్ట దోషము బలముగా వున్నదని భావించవలెను.

కానీ వీనికి వ్యతిరిక్తమైన దోషము, పరిహారమగునని చెప్పుచున్నారు. అది కొంత అంగీకార మైనను ,దోష పరిహారము కొరకు, గ్రహ శాంతి, జపము ,తైలావ లోకనము, మొదలగు శాంతి ప్రక్రియలు జరిపించిన శిశువు దీర్ఘాయుష్యము పొందును.

ఈ శాంతి, జపాదులు నామకరణ సమయమందు, 11 వ రోజున, 21 వ రోజున  29,వ రోజున లేక కనీసం 40 రోజుల లోపు జరిపించాలి ఏదైనా ఆరోగ్య కారణములు చే కుదరని పక్షమున  3 వ మాసమున జరిపించుట ఉత్తమము. శిశువు వున్న ప్రదేశము అనగా శిశువు శాంతి జరుగు సమయంలో ప్రత్యక్షంగా పాల్గొనుట  చాలా ముఖ్యము.

ఏ దోషములు లేకుండా అనగా బాలారిష్టములు లేకుండా జననము జరిగిన సంతోషించి , ఏదోషము లేక పోయిన ఈశ్వర అభిషేకము జరిపించుట శిశువునకు శుభదాయకం.

అక్కరలేని అనవసర శాంతులు జరిపించుట సమయ , ద్రవ్య , ధన నష్టము . భగవత్ ఆరాధన సర్వత్రా , సర్వాదా శుభము. అధిక  వివరాలకు, ప్రపంచంలో ఏ ప్రదేశంలో ఐన జన్మించిన శిశువు  జనన కాల జన్మ పత్రికకు తప్పక సంప్రదించ గలరు . మంగళం మహత్ .
Murali Krishna Sarma Bhuvanagiri . Email : sarmaaji@gmail.com. 

Thursday, January 10, 2019

తారాబలం చూడటం ఎలా?

తారాబలం చూడటం ఎలా?
   ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం.   ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.

  1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా....
1) జన్మతార,  2) సంపత్తార,  3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.

ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి.  ఆ 27  నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి.  అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది.  మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. 

పైవాటిలో  సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలు ‘సంపత్తార’ లోను,  ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోను, సాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది.

జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు.

చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.

ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.

ఉదాహరణ :  రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే,  ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి.   అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.
శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.

తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....

ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !

ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను,
2 వ నవకం లో ( 10 నుండి 18 తారలలో ) మూడవ తారను,
3 వ నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను,
ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు   వదిలి పెట్టవలెను.

అంటే జన్మనక్షత్రము లగాయతు  1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.

అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి  1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.