ఓం శ్రీ మహా గణపతయే నమః
House facing according to Name
ఉపోత్ఘాతం:-
అతి ప్రాచీన మైన భారత దేశము శిల్ప కళలకు, వాస్తు వైభవం నకు ప్రఖ్యాతి వహించింది .
భారత దేశ నాగరికత అద్భుతమైన వాస్తు వైభవమునకు అద్దం పడుతుంది . భారత దేశం లోని
అన్ని గ్రామాలు , పట్టణాలు , మహా నగరాలు మహా సౌధాలు శిల్పకళలతో నిండి వాస్తు శాస్త్ర
విజ్ఞానాన్ని , మన పూర్వికుల శిల్పకళా మరియు నిర్మాణ సామర్ద్యాన్ని ప్రపంచానికి
చాటిచెబుతూ అందరిని అబ్బుర పరుస్తున్నాయి .
ఇలా పురములు,దివ్య సౌదములు మరియు సాధారణ గృహములు ఎన్నో కట్టడాలు
వస్తువులుగా తనయందు కలిగి వున్నది కావునే “ భూమికి “ దేవనాగరి యందు “ వాస్తు “
అని కూడా పేరుగలదు. అలాంటి ఎన్నో విషయములను తెలియజేయు విజ్ఞానమే “
వాస్తుశాస్త్రము “ అని పిలవబడినది.
“దిశ కుదిరి దశ కుదురు“ నను సామెత తెలిసిందే ! దిశ అనగా “ తాను నివసించు దిక్కు,
స్థలము,గృహము” అని అర్ధము! దశ అనగా జాతక రీత్యా ప్రాప్తించు అభివ్రుది, శుభ
యోగములు ! కనుక గృహనిర్మాణము తలపెట్టిన వారు శాస్త్ర సమ్మతముగా గృహం
నిర్మించుకోవాలి . నివసించే గ్రహము సొంతమైన కాక పోయిన అందు వసతులు నివసించు
వారు అనుబవించు నట్లు , అందలి దోషములను కూడా యజమానితో పంచుకోనవలసిందే.
అలాగే మంచిని కూడా నివాసము వుండే వారు యజమాని అనుభవిస్తారు .
ఎవరు జన్మించిన గృహము వారికి అత్యంత శుభము , కాని కొన్ని సందర్భాలలో వేరొక
ఇంటిలో నివసించ వలసి రావటం లేక నూతన గృహమును నిర్మించటం జరుగుతుంటుంది .
అలాంటి సందర్భములలో నిర్మించబోయే లేక నివసించబోయే గృహము మనకు మంచిదా ?
కదా ? అని తెలుసుకోనటాన్ని “ వాస్తుశాస్త్రం” లో అర్వణము అని అంటారు .
అర్వణము రెండు రకములుగా లెక్కించ వచ్చు 1. జన్మనక్షత్రము రీత్యా 2. నమనక్షత్రము రీత్యా .
నామ నక్షత్రమును బట్టి గృహము యొక్క సింహద్వారము ఎదిక్కున ఉండాలో నిర్ణయించటం
ఎక్కువగా వాడుకలో వున్నా శ్రేష్టమైన విడనంగా చెప్పవచ్చు. తెలుగు తమియ మలయాళ
కన్నడ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల వారు నక్షత్రాన్ని బట్టి మరియు రాశిని బట్టి కూడా
తెలుసుకుంటారు. కానీ ఈవిధానాలు అంత ఎక్కువ వాడుకలో లేక పోవటం గమనించ
వచ్చు. ముందుగా తన పేరునకు గల మొదటి అక్షరం ప్రకారం “దిశావర్గ” నిర్ణయం
చేసుకోవాలి. సాధారణం గా దంపతులు అనగా భార్య భర్తలు గృహ నిర్మాణం తలపెడితే
సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరును బట్టి మాత్రమే చూడాలి.
భార్య భర్తల ఇద్దరి పేరుతో చూడవలసిన అవసరం లేదు అని గమనించ వచ్చు . భూమి భార్య
పేరున కొనుగోలు చేసినప్పటికీ భర్త యొక్క పేరును బట్టి మాత్రమే సింహ ద్వారం
నిర్ణయించాలి.
“దిశావర్గ” నిర్ణయం :-
తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 51 వున్నవి. వీటిని 8 భాగాలుగా విభజించినారు. వీటినే
“అష్టవర్గులు” అని పిలుస్తారు. ఈ విధానాన్ని సులువుగా అర్ధం చేసుకోవటానికి పైన
ఇవ్వబడిన పట్టికను గమనించ గలరు.
మొదటది “అ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఋ, ౠ,ఎ, ఏ, ఐ, ఒ,
ఓ,ఔ,అం,అః” అనే 16 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా
అట్టివారు “అ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “తూర్పు దిక్కు” స్వదిశ
అవుతుంది.
రెండవది “క” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “క, ఖ, గ, ఘ, ఙ ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “క వర్గు” నకు చెందిన వారుగా
పరిగణింప బడతారు. వీరికి “ఆగ్నేయ దిక్కు” స్వదిశ అవుతుంది.
మూడవది “చ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “చ, ఛ, జ, ఝ, ఞ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “చ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “దక్షిణదిక్కు” స్వదిశ అవుతుంది.
నాల్గవది “ట” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ట, ఠ, డ, ఢ, ణ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ట వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ నైరుతి దిక్కు” స్వదిశ అవుతుంది.
ఐదవది “త” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “త, థ, ద, ధ, న” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “త వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ పడమర దిక్కు” స్వదిశ అవుతుంది.
ఆరవది “ప” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ప, ఫ, బ, భ, మ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ప వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ వాయవ్య దిక్కు” స్వదిశ అవుతుంది.
ఏడవది “య” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “య, ర, ల, వ” అనే 4 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “య వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఉత్తర దిక్కు” స్వదిశ అవుతుంది.
ఎనిమిదవది “శ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “శ, ష, స, హ, ళ, క్ష” అనే 6 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “శ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఈశాన్య దిక్కు” స్వదిశ అవుతుంది.
ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వర్గమునకు చెందిన వారో తెలుసు కోవాలి. తద్వారా సింహద్వారము దిశను నిర్ణయించు కోవాలి.
“దిశావర్గ ఫలితములు”
ప్రతి వారికి వారి జన్మ గృహము శుభము , తన జన్మ గృహము కాక మరియే ఇతర కారణముల వల్లనైన ఇంకో గృహమున నివసించ వలసివచ్చిన తప్పక “ సింహద్వారం దిశను” శాస్త్రరిత్య నిర్ణయించు కొనినివసించుట అత్యంత శుభము!
తన స్వదిశ లో సింహద్వారము ఉండుట అత్యంత శుభము. స్వదిశ మొదలుకొని 1,3,7 దిశలు కూడాఅత్యంత శుభములే. 2,4,6 దిశలు మద్యమ లేక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. 5,8 దిశలు ఎంచు కొనిన బాధలు, ఇబ్బందులు, చింతలు, ధనవ్యయం,అనారోగ్యం అధికమగును! తద్వారా దరిద్రమును అనుబవించ వలసి వచ్చును.ఫలితములు వరుసగా
స్వదిశ అనగా 1)పుష్టి 2) సమం 3) మిత్ర 4)సమం 5)శత్రు 6)సౌఖ్యం 7)భోగం 8)వ్యయం.
వీలైనంత వరకు విదిక్కులు లైన “ ఆగ్నేయం,నైరుతి,వాయవ్యం,ఈశాన్యం” లకు సింహద్వారము ఉండకుండా చూచుట శుభము . గృహమునకు “గేహము” అని పేరు వున్నది! వాస్తు పురుషుని స్వరూపము మనవ దేహము లాంటిది. అందుకు వాస్తుపురుషుని పూజ అంటే తనచే కట్టబడిన గృహమునకు పూజ అని అర్ధము .
“ సర్వాంగే నయనం ప్రధానం “ అనగా అన్ని దేహ అంగములలో కళ్ళు ప్రధానమైనవి అదే విధంగ “ గేహన్గే సింహ ద్వారం ప్రధానం” అంటే ఇంటికి సింహద్వారం చాలా ప్రధానంఅని అర్ధం.
“ గృహస్తస్య సర్వ క్రియాన సిద్యంతి గృహం వినా” అని శాస్త్ర వాక్యము. అనగా స్వగృహము లేకుండాపరుల గృహములలో ఎన్నాళ్ళు ఎన్ని సత్కర్మలు ఆచరించిన పరిపూర్ణముగా సిద్ధిoచవు. ఆ సత్కర్మల ఫలితమును సంపూర్ణముగా పొందుట కష్టసాద్యము . అందుకే చిన్నదో పెద్దదో తమది అనే ఒక గృహము చాలా అవసరము !
ఇహ పరములకు సాధనము గృహము. చెడు పాత్రలో కాచిన పాలు విరిగి పోయిన విధముగా, చవిటి నెలలో వేసిన పంట పండ నట్లు , వాస్తు సరిలేని గృహమునందు నివాసము నిష్ప్రయోజనం . గృహమునకు సింహద్వారము యెంత ప్రధానమో , గృహము శల్య వాస్తు మరియు ఇంటి లోపల వున్న గదుల నిర్మాణము వాటి స్థితి కూడా అంతే ప్రధానము. కావున తామందరూ శాస్త్రపరిజ్ఞాన సహాయతతో అందమైన,శుభ వాస్తు పరమైన గృహములను నిర్మించుకొని ఉత్తమ ఫలితాలను పొందాలని ఈశ్వరుని ప్రార్ధిస్తూ ..
మీ
భువనగిరి మురళీ కృష్ణ శర్మ ( శర్మాజీ )
నార్త్ కరోలిన, అమెరికా.