Tuesday, August 13, 2024

ద్వాదశరాశులకు ఆధిపత్య గ్రహములు

 ద్వాదశరాశులకు ఆధిపత్య గ్రహములు  


1. మేష లగ్నమునకు : లగ్న అష్టమాధిపతి కుజుడు, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు, తృతీయ షష్టాదిపతి బుధుడు, చతుర్దాదిపతి చంద్రుడు, పంచమాదిపతి రవి, నవమ వ్యయాధిపతి గురువు, దశమ లాభాధిపతి శని. 


2. వృషభ లగ్నమునకు : లగ్నషష్టాధిపతి శుక్రుడు, ద్వితీయ పంచమాధిపతి బుధుడు, తృతీయాధిపతి చంద్రుడు, చతుర్దాధిపతి రవి, సప్తమవ్యయాధిపతి కుజుడు, అష్టమ లాభాధిపతి గురువు, నవమ దశమాధిపతి శని!


3.  మిధున లగ్నమునకు : లగ్న చతుర్ధాదిపతి బుధుడు, ద్వితీయాధిపతి చంద్రుడు, తృతీయాధిపతి రవి, పంచమ వ్యయాధిపతి శుక్రుడు, షష్టలాభాధిపతి  సప్తమ దశమాధిపతి గురుడు, అష్టమ నవమాధిపతి శని!


4. కర్కాటకలగ్నమునకు : లగ్నాధిపతి చంద్రుడు, ద్వితీయాధిపతి రవి, తృతీయవ్యాయాధిపతి బుధుడు, చతుర్ధ లాభాధిపతి శుక్రుడు, పంచమ ధశమాధిపతి కుజుడు,  షష్టభాగ్యాధిపతి గురువు, సప్తమ వ్యయాధిపతి శని!


5. సింహ లగ్నమునకు : లగ్నాధిపతి రవి, ద్వితీయ లభాదిపతి  బుధుడు, తృతీయ ధశమాధిపతి శుక్రుడు, చతుర్ధ భాగ్యాధిపతి కుజుడు, పంచమ అష్టమాధిపతి గురువు, షష్ట సప్తమాధిపతి శని, వ్యయాధిపతి చన్ద్రుదు. 


6. కన్యా లగ్నమునకు : లగ్న దశమాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యదిపతి శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి కుజుడు, చతుర్ధ సప్తమాధిపతి గురువు, పంచమ షష్టధిపతి శని, లాభాధిపతి చంద్రుడు, వ్యయాధిపతి రవి. 


7. తులా లగ్నమునకు : లగ్న అష్టమాధిపతి శుక్రుడు, ద్వితీయ సప్తమాధిపతి కుజుడు, తృతీయ షష్టధిపతి గురువు, చతుర్ధ పంచమా ధిపతి శని, నవమ వ్యయాధిపతి బుధుడు, దశమాదిపతి చంద్రుడు, లాభాధిపతి రవి! 


8. వృశ్చిక లగ్నమునకు : లగ్నషష్టాధిపతి కుజుడు, ద్వితీయ పంచమాధిపతి గురువు, తృతీయ చతుర్ధధిపతి శని, సప్తమ వ్యయధిపతి శుక్రుడు, అష్టమ లాభాధిపతి బుధుడు, నవమాధిపతి చంద్రుడు దశమాదిపతి రవి!


9. ధనుర్లగ్నమునకు : లగ్న చతుర్ధాదిపతి గురువు, ద్వితీయ తృతీయధిపతి శని, పంచమ వ్యయాధిపతి కుజుడు, షష్ట లాభాధిపతి శుక్రుడు, సప్తమ దశమాధిపతి బుధుడు, అష్టమాధిపతి చంద్రుడు,  నవమాధిపతి రవి!


10. మకర లగ్నమునకు :లగ్న ద్వితీయాధిపతి శని, తృతీయ వ్యయాధిపతి గురువు,  చతుర్ధ లాభాధిపతి కుజుడు, 

పంచమ దశమాదిపతి శుక్రుడు, షష్ట నవమాధిపతి బుధుడు, సప్తమాధిపతి చంద్రుడు, అష్టమాధిపతి రవి!


11. కుంభ లగ్నమునకు : లగ్న వ్యయాధిపతి శని, ద్వితీయ లాభాధిపతి గురువు, తృతీయ ధశమాధిపతి కుజుడు, చతుర్ధ భాగ్యాధిపతి శుక్రుడు, పంచమ అష్టమాధిపతి బుధుడు, షష్టాధిపతి చంద్రుడు, సప్తమాధిపతి రవి!

12. మీన లగ్నమునకు : లగ్న దశమాదిపతి గురువు, ద్వితీయ నవమాధిపతి కుజుడు, తృతీయ అష్టమాధిపతి శుక్రుడు, చతుర్ధ సప్తమాధిపతి బుధుడు, పంచమాధిపతి చంద్రుడు, షష్టాధిపతి రవి, లాభవ్యయాధిపతి శని!


ద్వాదశ లగ్నములకు శుభ - పాప గ్రహములు 


1. మేష లగ్నమునకు రవి, గురులు శుభులు! బుధ, శుక్ర, శనులు పాపులు!!

2. వృషభ లగ్నమునకు రవి, శనులు, శుభులు! చంద్ర, గురు, శుక్రులు పపులు!!

3. మిధున లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! రవి, కుజ, గురు, శనులు పాపులు!!

4. కర్కాటక లగ్నమునకు కుజ, గురులు శుభులు! బుధ, శుక్రులు పాపులు!!

5. సింహ లగ్నమునకు కుజుడు మాత్రమే శుభుడు!బుధ, శుక్రులు పాపులు!!

6. కన్యా లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! చంద్ర, కుజ, గురు పాపులు!!

7. తులా లగ్నమునకు బుధ, శనులు శుభులు! రవి, కుజ, గురులు పాపులు!!

8. వృశ్చిక లగ్నమునకు గురువు మాత్రమే శుభుడు! బుధ, శుక్ర, శనులు పాపులు!!

9. ధనుర్లగ్నమునకు రవి, కుజులు శుభులు! బుధ, గురులు కూడా కొన్ని సందర్బములలో మంచివారు! శుక్రుడు పాపి!!

10. మకర లగ్నమునకు బుధ, శుక్రులు శుభులు! చంద్ర, కుజ, గురులు పాపులు!!

11. కుంభ లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు!చంద్ర, కుజ, గురులు పాపులు!!

12. మీన లగ్నమునకు చంద్ర, కుజలు శుభులు! రవి, బుధ, శుక్ర, శనులు పాపులు!!

13. లగ్నము వలన, ఆత్మ సంభంధమైన విషయములను, జాతకుని అనూహ్య కర్మలను తెలియధగియున్నది. 

14. చంద్ర లగ్నమువలన జాతకుడు తెలిసిజేయు కర్మలను, వాటి ఫలితములను గుర్తించవలెను. 

15. నవాంశలగ్నముల వల్ల జాతకుని పూర్వజన్మ కర్మలకు సంభందించిన ఫలితములు తెలియధగియున్నది. 

16. జన్మలగ్నము జాతకుని దేహస్థితి, అంగసోష్ట వము, శారీరక సుఖములను ధెల్పును. 

17. చంద్రలగ్నము మనో ధర్మములను, మానసిక స్థితి గతులను ధెల్పును. 

18. అంశలగ్నము శరీరచ్చయా, అంతర్గత స్వభావములను తెల్పును. 

19. లగ్నాధిపతి శుభుడై 5-9 స్థానములందు, పాపియై 1-4-7-10 స్థానములందు యున్న యెడల - జాతకునికి శుభ ఫలితములు ప్రాప్తించగలవు. 

20. 3-11 స్థానములలో లగ్నాధిపతియున్న - సామాన్య శుభ ఫలితములు కల్గును. 

21. 2-6-8-12 స్థానములలో లగ్నాధిపతి యున్న అశుభ ఫలితములు నివ్వగలడు. 


Wednesday, July 17, 2024

*షోడశ వర్గ చక్రాల విశ్లేషణ*

*షోడశ వర్గ చక్రాల విశ్లేషణ*

జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా భావచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి. 
జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలో పరిశీలించాలి.
ఈ షోడశవర్గుల పరిశీలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు 
అవకాశము కలదు.

ఈ షోడశవర్గులే కాక జైమిని పద్దతిలోనూ, 
తాజక పద్దతి యందు..
పంచమాంశ, 
షష్ఠాంశ, 
అష్ఠమాంశ, 
లాభాంశ లేక రుద్రాంశ 
అను నాలుగు వర్గులను సూచించినారు.

*పంచమాంశ*
పూర్వపుణ్యబలం, 
మంత్రం,సిద్దించునా లేదా తెలుసుకోవచ్చు.

*షష్టాంశ*
అనారోగ్యం అమంతర్గతంగా ఉందా లేదా 
బహిర్గతమంగా ఉందో తెలుపును.

*అష్టమాంశ*
ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు, యాక్సిండెంట్స్, వైద్యపరంగా యాక్సిడెంట్ ద్వారా అవయవాన్ని తొలిగించుట.యాసిడ్ దాడులు తెలుసుకోవచ్చు.

*లాభాంశ(రుద్రాంశ)*
ఆర్ధికపరమైన లాభాలు,
వృషభరాశి ఏలగ్నంగాని, గ్రహంగాని రాదు. 
వృషభరాశి శివుడికి సంబంధించిన రాశి కాబట్టి 
ఈ రాశిలో ఏగ్రహం ఉండదు.

*లగ్న కుండలి*
లగ్న కుండలి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియ జేస్తుంది. 
మనిషి మనస్తత్త్వం, శారీరక స్థితి, గుణగణాలు, 
జీవన విధానం మొదలైన అనేక విషయాలు 
లగ్నకుండలి ద్వారా తెలుసుకొవచ్చు.

*నవాంశ కుండలి(D9)*
రాశి చక్రమందు యోగం ఉండి నవాంశ యందు గ్రహాల స్ధితి యుతులలో అవయోగ మేర్పడిన రాశి యందలి ఫలితమునకు విఘాతం కలుగును. 
రాశిచక్రం జన్మమైతే నవాంశ ప్రాణం.
నవాంశ కుండలి మనిషి భాగ్యాన్ని, వైవాహిక జీవితాన్ని తెలియ జేస్తుంది. 
ఒక మనిషి అదృష్టవంతుడా, కాదా, అదృష్టం దేని ద్వారా వస్తుంది. 
తదితర విషయాలు వివాహానికి సంబంధించి 
వివాహ యోగం ఉన్నదా, లేదా, 
జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, 
వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు నవాంశ కుండలి ద్వారా తెలుస్తాయి.

*హోరా(D2) కుండలి*
హోరా కుండలి ఆర్థిక స్తితిని గురించి తెలియ జేస్తుంది. అలాగే మనలో ఉండే వివిధ అంశాల సంతులతను సూచిస్తుంది. 
రవిహోర(సింహరాశి)లో ఎక్కువ గ్రహలు ఉన్నట్లయితే కృషితో ఎక్కువ సంపాదన ఉంటుంది.
సింహం మనలో ఉండే బహిర్గత అంశాలను, 
కర్కాటకం అంతర్గత అంశాలను సూచిస్తుంది.

*ద్రేక్కాణ(D3) కుండలి*
వైద్య జ్యోతిష్యంలో ద్రేక్కాణం ద్వారా ఏ శరీర భాగానికి అనారోగ్యం కలుగుతుందో తెలుసుకోవచ్చును.
ద్రేక్కాణం శరీర భాగాలు, ఆరోగ్య సమస్యల గురించి చెబుతుంది. 
ఇది లగ్న కుండలిలో 3 వ భావం, సోదరీమణులు, స్నేహితులు మరియు భాగస్వామ్యాలు గురించి చెబుతుంది. 
ఇది మన సామర్థ్యాన్ని పని, లేదా ఒక సమూహం లో, కొన్ని లక్ష్యాన్ని సాధించడాన్ని సూచిస్తుంది. 
శక్తి, ఆసక్తి, ధైర్యం, పరాక్రమం. మొదలైనవి ద్రేక్కాణ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు 
విశ్లేషణ కొరకు లగ్న కుండలి మరియు కుజుడి స్థితి మరియు 3 వ భావాన్ని తనిఖీ చెయ్యాలి.

*చతుర్థాంశ(D4) కుండలి*
చతుర్థాంశ మనకు కలిగే సౌకర్యాలు, 
గృహ వాహనాది యోగాలు, 
మన జీవితం కష్టాలతో కూడినదా లేక 
సుఖాలతో కూడినదా, 
తదితర అంశాల గురించి చెపుతుంది.

*సప్తాంశ(D7) కుండలి*
సప్తాంశ సంతానం గురించి అలాగే మనలో ఉండే సృజనాత్మక శక్తి గురించి చెపుతుంది.
సంతానం,వంశోన్నతి,వంశాభివృద్ధి చూడవచ్చు

*దశమాంశ(D10) కుండలి*
దశమాంశ ఉద్యోగము మరియు కీర్తి ప్రతిష్టల గురించి తెలియ జేస్తుంది. 
కర్మలు,వాటి ఫలితాలు, ఉద్యోగం,గౌరవాలు,కీర్తిప్రతిష్ఠలు, వృత్తిలో ఒడిదుడుకులు తెలుసుకోవచ్చు.

*ద్వాదశాంశ(D12) కుండలి*
ద్వాదశాంశ మన అదృష్టం గురించి, 
పూర్వ జన్మలో మనం చేసిన కర్మ ఫలితాలను గురించి తెలియజేస్తుంది. 
అలాగే వంశ సంబంధ దోషాలను గురించి కూడా 
తెలియ జేస్తుంది.
తల్లిదండ్రులతో అనుబంధాలు,
వారి నుండి వచ్చే అనారోగ్యాలు,
ఎవరి నుండి ఎవరికి సుఖం ఉన్నదో తెలుసుకోవచ్చును.

*షోడశాంశ(D16) కుండలి*
షోడశాంశ మనకు గల గృహ, వాహనాది సౌఖ్యాలను గురించి తెలియజేస్తుంది. 
అలాగే ఒక వ్యక్తి అంతర్గంతంగా ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.
వాహనసౌఖ్యం,వాహనాలతో చేసే వృత్తి వ్యాపారాలు లాభిస్తాయో లేదో తెలుసుకోవచ్చును.
వాహనానికి ఏరంగు మంచిదో తెలుసుకోవచ్చును.

*వింశాంశ(D20) కుండలి*
వింశాంశ మనం చేసే దైవారాధన, అనుకూల దైవం, గురూపదేశం తదితర ఆధ్యాత్మిక అంశాలను 
తెలియ జేస్తుంది. 
మనం ఏ దేవున్ని ఉపాసన చేయాలి అనేది 
దీని ద్వారా కనుక్కోవచ్చు.
మంత్రోచ్చారణ ,దేవుడిని పూజించేటప్పుడు అడ్డంకులు వస్తాయో లేదో తెలుసుకోవచ్చును.
వింశాంశలో శుక్రుడు బలహీనంగా ఉండాలి.
బలహీనంగా ఉంటేనే సన్యాసియోగం వస్తుంది.
అప్పుడే దైవచింతన చేయగలడు.

*చతుర్వింశాంశ(D24) కుండలి*
చతుర్వింశాంశ మన విద్యను గురించి ఆధ్యాత్మికతను గురించి తెలియజేస్తుంది. 
ఉన్నతవిద్య,విదేశి విద్య,
విద్యలో ఆటంకాలు గురించి తెలుసుకోవచ్చు.

*సప్తవింశాంశ(D27) కుండలి*
సప్తవింశాంశ మన శారీరక, మానసిక శక్తియుక్తుల గురించి తెలియజేస్తుంది. 
అలాగే మన జీవితానికి సంబందించిన అంశాల సూక్ష్మపరిశీలనకు లగ్న కుండలితో పాటు దీన్ని కూడా పరిశీలించాలి.
జాతకుడిలో ఉండే బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చును.

*త్రింశాంశ కుండలి(D30)*
త్రింశాంశ మన కష్ట, నష్టాలను గురించి, 
అనుకోకుండా వచ్చే ఆపదల గురించి, 
ప్రమాదాల గురించి తెలియజేస్తుంది.
స్త్రీ పురుషుల శీలం,
వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు,
అరిష్టాలు తెలుసుకోవచ్చును.

*ఖవేదాంశ(D40) కుండలి*
ఖవేదాంశ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, జాతకంలో కల శుభాశుభ అంశాలను తెలుసుకోవటానికి 
అలాగే మనకు కల అలవాట్లను, భావోద్వేగాలను అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది. మాతృవంశం నుండి వచ్చే శుభ కర్మ,
అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.

*అక్షవేదాంశ కుండలి(D45)*
అక్షవేదాంశ మనకుండే నైతిక విలువలను గురించి, జాతకానికి సంబంధించిన అంశాలను సూక్ష్మ పరిశీలన చేయటానికి ఉపయోగ పడుతుంది.
తండ్రివంశం నుండి వచ్చే శుభ కర్మ,
అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.

*షష్ట్యంశ కుండలి (D60)*
షష్ట్యంశ జాతకానికి సంబంధించి సూక్ష్మ పరిశీలనకు అలాగే కవలల జాతకాల పరిశీలన విషయంలో 
ఇది ఉపయోగపడుతుంది.
పూర్వజన్మ విషయాలు, 
కవలల విశ్లేషణకు,
ముహూర్తమునకు,
ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.

*వర్గులు*

*దశవర్గులు*
1.క్షేత్రము,2.హార,3.ద్రేక్కాణము,4.సప్తాంశ,5.నవాంశ,6.దశాంశ,7.ద్వాదంశాంశ,8.షోడశాంశ,9.త్రింశాంశ,10. షష్ట్యంశ యనునవి దశవర్గులు.ఇవి జీవులకు వ్యయదురితచయ శ్రీలనుగలుగ జేయును.

*షోడశవర్గులు*
1.క్షేత్రము లేక రాశి,2.హోర,3.ద్రేక్కాణము,4.చతుర్ధాంశ,5.సప్తమాంశ,6.నవమాంశ,7.దశమాంశ,8.ద్వాదశాంశ,9.షోడశాంశ,10.వింశాంశ,11.శిద్ధాంశ,12.భాంశ,13.త్రింశాంశ,14.ఖవేదాంశ,15.అక్షవేదాంశ,16.షష్ట్యంశ.

 *1.క్షేత్రము-30 భాగలు.*

*2.హోర-రాశిని రెండు సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము 15భాగల ప్రమాణమగును.బేసి రాశియందు మెుదటి సగభాగము రవిహోర,రెండవ సగభాగము చంద్రహోర.సమరాశియందుమెుదటి సమభాగము చంద్రహోర.రెండవ సగభాగము రవిహోర.

3.ద్రేక్కాణము-రాశిని 3 సమ భాగములు చేయగా ఒక్కాక్క భాగము10 బాగల ప్రమాణమగును.మెుదటి భాగమునకు ఆ రాశ్యాధిపతియే ద్రేక్కాణధిపతి.రెండవ భాగమునకు ఆ రాశికి పంచమ రాశ్యాధిపతి ద్రేక్కాణాధిపతి.మూడవ భాగమునకు ఆ రాశికి నవమ రాశ్యాధిపతి ద్రేక్కాణాధిపతియగును.

4.చతుర్థాంశ లేక తుర్యాంశ-రాశిని నాలుగు సమ భాగములుచేయగా ఒక్కొక్క భాగము7 భాగల 30 లిప్తలు లేక నిమిషములు అగును.మెుదటి భాగమునకు ఆరాశ్యాధిపతియు, రెండవ భాగమునకు ఆరాశికి చతుర్థాధిపతియు,మూడవ భాగమునకు ఆరాశికి సప్తమాధిపతియు,నాల్గవ భాగమునకు ఆ రాశికి దశమాధిపతియు అధిపతులగుదురు.

5.సప్తమాంశ- రాశిని 7 సమభాగములు చేయగా సంప్తమాంశయగును.ఒక్కొక్కభాగము 4భాగలు 17 1/7 లిప్తలగును.మేషమునకు కుజునితో ప్రారంభింప వలెను.వృషభమునకు వృశ్చిక కుజునితోప్రారంభింపవలెను.మిథునమునకు మిథున బుధునితోను,కర్కాటకమునకు మకర శనితోను,సింహమునకు రవితోను,కన్యకు మీన గురునితోను,తులకు తులా శుక్రునితోను,వృశ్చికమునకు వృశభ శుక్రునితోను,ధనస్సునకు ధనస్సు గురునితోను,మకరమునకు చంద్రునితోను,కుంభమునకు కుంభ శనితోను,మీనమునకు కన్యాబుధునితోను ప్రారంభించవలెను.ఆ క్రమమున ఆయాగ్రహములు అధిపతులగుదురు.

6.నవమాంశ-రాశిని తొమ్మిది భాగములు చేయగా నవమాంశ యగును.ఒక్కొకక్క భాగము 3 భాగల 20 లిప్తలు.మష ,సింహ,ధనస్సులకు మేషాదిగను; కర్కాట,వృశ్చిక,మీనములకు కర్కాటకాదిగను;వృషభ,కన్య,మకరములకు మకరదిగను; మిథున,తుల,కుంభములకు తులాదిగను నవాంశలను గుణించవలెను.మేష ,సంహ,ధనుస్సుల యెక్కనవాంశలకు మేషము మెుదలుకొని తొమ్మిది రాశుల యెక్కయధిపతులే యెక్కొక్క నవాంశమునకు అధిపతులనియును,కర్కాటక , వృశ్చిక,మీనములకు కర్కాటకాదిగను నవరాశుల అధిపతులు నవరాశుల అధిపతులు నవాంశాధి పతులనియును;వృషభ,కన్య,మకరములకు మకరాదిగ నవరాశ్యాధిపతులు నవాంశధి పతులనియును;మిథున,తుల ,కుంభములకు తులాదిగా నవరాశ్యధిపతులు నవాంశాధిపతులనియును గ్రహించవలెను.

7.దశాంశ-రాశిని 10 సమభాగములు చేేయగా దశాంశ ప్రాప్తించును.ఇది యెుక్కొక్క భాగము 3 భాగలగును మేష మెుదటి దశాంశ మేష కుజునితో ప్రారంభ మై మకర శనితో అంతమగును.వృషభ మెుదటిదశాంశ మకర శనితో ప్రారంభమై తులశుక్రునితో అంతమగును.ఓజరాశులకు ఆ రాశిమెుదలు,యుగ్మరాశులకు ఆ రాశికి తొమ్మిదవ రాశిమెదలు దశాంశ రాశులగును.ఆయా రాశ్యాధిపతులే ఆంశాధిపతులగుదురు.

8.ద్వాదశాంశ--రాశిని 12సమ భాగములు చేయగా ద్వాదశాంశయగును.ఇది 2 భాగల 30 లిప్తల ప్రమాణము గలది.ఈ అంశలకు అధిపతులు ఆయా రాశ్యాధిపతుల నుండి క్రమముగానుండును.

9.షోడశాంశ- రాశిని 16 సమ భాగములు చేయగా షోడశాశయగును.ఒక్కొక్కభాగము 1భాగ 52 లిప్తల 30 విలిప్తలు,మేష,కర్కట,తుల,మకరములకు మేష కుజాది చంద్రుని వరకు;కర్కట,సింహ,వృశ్చిక,కుంభములకు రవ్యాది వృశ్చిక,కుజునివరకు;మిథున,కన్య,ధనుర్మీనములకు,ధనస్సుగురు మెుదలు మీన గురుని వరకు అధిపతులు.

10.వింశాంశ-రాశిని 20 సమ భాగములు చేయగా ఒక్కొక్కభాగము1భాగ 30 లిప్తలగును.చరరాశులకు మేష కుజునితోను, స్ఠిరరాశులకు ధనుస్సు గురునితోను,ద్విస్వభావ రాశులకు రవితోను అధిపతులు ప్రారంభమదురు.

సిద్ధాంశ-రాశిని 24 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము1 భాగ 15 లిప్తలగును. బేసి రాశులకురవ్యాదిగను,సమ రాశులకు చంద్రాదిగను గ్రహములు అధిపతులగుదురు.

12.భాంశ- రాశిని 27 సమభాగములు చేయగాఒక్కొక్క భాగము1 భాగ 6లిప్తల 40 విలిప్తల ప్రమాణమగును.ప్రతిరాశికి ఆ రాశినాధునితో ప్రారంభమై క్రమముగా 27 గ్రహములు భాంశనాధులగుదురు.

13.త్రింశాంశ-రాశిని 30 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము 1భాగ ప్రమాణమగును.ఓజరాశులందు మెదటి 5 భాగలకు కుజుడు.5నుండి 10 వరకు శని,10నుండి 18 వరకు గురుడు, 18 నుండి 25 వరకు బుధుడు 25 నుండి 30 వరకు శుక్రుడు అధిపతులు. సమరాశులకు మెదటి 5 భాగలకు శుక్రుడు, 5 నుండి 12 వరకు బుధుడు,12 నుండి 20 వరకు గురుడు,20 నుండి 25 వరకు శని,25 నుండి 30 వరకు కుజుడు అధిపతులు.
14.ఖవేదాంశ-రాశిని 40 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగమునకు 45లిప్తల ప్రామాణము ప్రాప్తించును.బేసి రాశులకు మేష కుజాదిగను,సమ రాశులకు తుల శుక్రాదిగను అంశనాధులగుచున్నారు.

15.అక్ష వేదాంశ-రాశిని 45 సమ భాగములు చేయగా ఒక్కొక్కభాగమునకు 40 లిప్తల ప్రమాణము ప్రాప్తించును.చర రాశులకు మేషాదిగను,స్ఠిర రాశులకు సింహదిగను,ద్విస్వభావ రాశులకుధనురాదిగను గ్రహములు అధిపతులగుదురు.

16.షష్ట్యంశ-రాశిని 60 భాగములు చేయగా ఒక్కొక్క భాగము 30 లిప్తల ప్రమాణమగును.బేసి రాశులందు మెుదటి రెండుపాప షష్ట్యంశలు.3 నుండి 6 వరకుశుభము 7నుండి 12వరకు పాపము.13-14 శుభము15.పాపము 16 నుండి 20 వరకు శుభము.27 పాపము.28-29 శుభము.30 నుండి 36 వరకు పాపము 37 నుండి39 వరకు శుభము 40-14 పాపము 42 శుభము 43-44 పాపము 45 నుండి 48 వరకు శుభము.49-50 పాపము 51 శుభము 52 పాపము 53 నుండి 58 వరకు శుభము 59 పాపము 60 శుభము.సమ రాశులు 1 శుభము. 2 పాపము.3 నుండి 8 వరకు శుభము 9 పాపము.10 శుభము.11-12 పాపము.13 నుండి 16 వరకు శుభము.17-18 పాపము.19 శుభము.20-21 పాపము 22 నుండి 24 వరకు శుభము.25 నుండి 31 వరకు పాపము.32-33 శుభము. 34 పాపము. 35 నుండి 45 వరకు శుభము.46 పాపము.47-48 శుభము 49 నుండి 54 వరకు పాపము.55 నుండి 58 వరకు శుభము!.59-60 పాపము.

Thursday, July 11, 2024

*వివాహ పొంతన సమగ్ర పరిశీలన*

*వివాహ పొంతన సమగ్ర పరిశీలన*

జీవితంలో వివాహం అనేది ఒక ముఖ్య వ్యవహారం.వదూవరుల మద్య భావాలు కలసి, భావైక్యత ఉందో లేదో తెలుసుకొని వివాహం చేస్తే జీవితం అన్యోన్యంగా ఉండేందుకు అవకాశం ఉంది.దీనికి ముఖ్యంగా లగ్నాన్ని,సప్తమభావాన్ని పరిగణలోకి తీసుకుంటారు.లగ్నంలో తాను,సప్తమంలో భార్య,లేదా భర్త సామాజిక సంబంధాలు ఉన్నాయి.కానీ ఏ ఇద్దరి మద్య అభిప్రాయాలు అన్నీ విషయాలలో ఏకీభవించకపోవచ్చు.అయితే కొన్ని ముఖ్యమైన అభిప్రాయాలు కూడా ఏకీభవించకపోతే కలసి జీవించటం కష్టం.
చంద్రుడు మనఃకారకుడు కావటం వల్ల చంద్రుడున్న నక్షత్రాన్ని,రవి ఆత్మశక్తికి కారకుడు కావటం వల్ల రవి ఉన్న నక్షత్రాన్ని ,లగ్నం శరీరశక్తి కావటంవల్ల లగ్నాన్ని పొంతన చూడాలి అని చెప్పిన అనుభవజ్ఞుల అభిప్రాయం మంచిదనిపిస్తుంది.
ఇరువురి రాశిచక్రాలలో చంద్ర స్ధానాధిపతుల,లగ్నాధిపతుల,రవి స్ధానాదిపతుల మైత్రి ఉంటే వారిద్దరి మద్య అవగాహన,మానసికమైన ఏకీకృత ఆలోచనా విధానం,శారీరక విషయాలలో లోపాలు లేకుండటం మొదలైన అంశాలు ప్రత్యేకంగా గుర్తించబడతారు.
ఇటువంటి విశేషాలతో కూడుకున్న మేలాపలకం అనేది సైద్ధాంతిక ప్రాతిపదికలతో కూడుకున్నటువంటిది.బాల్యవివాహాలు ఆచారంగా ఉన్న రోజుల్లో వేరు పిల్లల మధ్యలో అవగాహన కలిగించటానికి ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యకరమైన ఆనందకరమైన విధానమే ఈ మేలాపలకం.ఈ మేలాపలకం సరిగా ఉంటే వ్యక్తుల శరీర మానసిక ఆత్మిక ధోరణులలో ఐక్యత ఉండి దాదాపుగా ఇద్దరి ఆలోచనా ప్రవృత్తుల్లో ఆనందదాయకమైన ఫలితాలు ఏర్పడతాయి.లేకుంటే బలవంతంగా భావాలను,శరీరాలను పంచుకోవాల్సి రావటం వల్ల అక్రమ విధానాలకు,ఇబ్బందులకు వ్యక్తులు పాల్పడుతుంటారు.ప్రాశ్చాత్యులు కూడా ప్రస్తుత కాలంలో వివాహాల విషయంలో మేలాపకాదులను గమనిస్తున్నారంటే వారి విధానాల నుండి మన వైజ్ఞానిక మేలాపాక విధానం,సంప్రదాయ ఆరోగ్యవంతమైన జీవన విధానం వైపు వారు చూసే చూపును మనం అర్ధం చేసుకోవచ్చును.
చాలా మంది పంచాంగంలో పాయింట్లు చూసి 18 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాతకాలు కుదిరాయనుకుంటారు.ఈ నిర్ణయం చాలా తప్పు .అష్టకూటములలో సంతానం,వైదవ్యం,ద్వికళత్రయోగం లాంటివి తెలుసుకోవటానికి అవకాశం లేదు.ఉదా:-సప్తమస్ధానంలో కుజ,శుక్రుల సంయోగం ఉండి పాప వీక్షణ ఉన్న దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి.పంచమ స్ధానంలో రాహు,కేతువులు ,కుజుడు,శని గాని ఉండి పాప వీక్షణ ఉన్న సంతాన నష్టం,మృతశిశువు,గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ.ఇవి ఏవి అష్టకూటముల ద్వారా నిర్ణయించలేము.పాయింట్లు బాగున్నాయని వివాహం చేసుకోవచ్చని వివాహ నిర్ణయం చేయరాదు.36 పాయింట్లకు 34 వచ్చిన జాతక చక్రంలో అనుకూలంగా లేకపోతే ఉపయోగంలేదు.
వివాహ పొంతన విషయంలో తప్పనిసరిగా వదూవరులిద్దరి జాతకచక్రంలో పంచమం (సంతానం కోసం),సప్తమ స్ధానం (దాంపత్య జీవితం),అష్టమ స్ధానం(వైదవ్యం),దశ ,అంతర్దశలు (వివాహానంతర జీవితం)తప్పని సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.పాయింట్లకు ప్రాదాన్యత ఇవ్వరాదు.తారాబలం,గ్రహమైత్రి,నాడీమైత్రి బాగుండి జాతకచక్రం అనుకూలంగా ఉన్నప్పుడు వదూవరులిద్దరికి పొంతన కుదిరినట్లే.
వధూవరులకు

 వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణన లో తీసుకొన్నారు .
1 వర్ణకూటమి 2 వశ్యకూటము ౩ తారాకూటమి 4 యోనికూటము 5 గ్రహకూటమి 6. గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి
వీటిలో మొత్తం 18 గుణాలు దాటితే శుభం అనేది సామాన్య వచనం,కానీ సప్తమ,పంచమ,అష్టమ భావాలు సంపూర్ణ శుభత్వం ఉంటే వివాహం చేయవచ్చు.ఒక వేళ జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రాన్ని అనుసరించి చూడాలి.
వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే మంచిది.
కర్కాటకం,వృశ్చికం,మీన రాశుల వారు బ్రాహ్మణ వర్ణం.
మేషం,సింహం,దనస్సు రాశుల వారు క్షత్రియ వర్ణం.
మిధున,తుల,కుంభ రాశుల వారు వైశ్య వర్ణం.
వృషభ,కన్య,మకర రాశులు శూద్ర వర్ణం.
వదూవరులు ఇద్దరు ఏక వర్ణమైన ఉత్తమం.వధువు వర్ణం కంటే వరుడి వర్ణం ఎక్కువైన మద్యమం.వరుని వర్ణం కంటే వధువు వర్ణం ఎక్కువైన వర్ణ పొంతన కుదరదు.
2 . వశ్యపొంతన : మేషరాశికి - సింహము ,వృశ్చికం, వృషభ రాశివారికి – కర్కాటక ,తులారాశులు , మిదునమునకు – కన్యరాశి, కర్కాటకరాశికి – వృశ్చికం, ధనుస్సు , సింహరాశికి – తులారాశి , కన్యకు – మిధున , మేషములు , తులా రాశికి – కన్య, మకరం, వృశ్చికరాశికి – కర్కాటకం ,ధనుస్సుకు – మీనము , మకర రాశికి – మేషం , కుంభం కుంభరాశికి – మేషము , మీనమునకు – మకరం ఈ విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి . వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన కలిగి ఉండవలెను .మిధున,కన్య,తుల నర రాసులు.వీటికి సింహం తప్ప తక్కినవన్నీ వశ్యములే.సింహానికి వృశ్చికం తప్ప అన్నీ వశ్యాలే.
౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1 , ౩ , 5 , 7 శేషము వచ్చిన తారలు మంచివి కావు. అను జన్మతారలో చేసుకోవచ్చును.శుభతారలైతే 3 గుణాలు,అశుభ తారలైతే 1 న్నర గుణాలు ఉంటాయి.
4 . యోనిపొంతనము :
అశ్వని,శతభిషం-గుఱ్ఱం
స్వాతి,హస్త-ఎద్దు
ధనిష్ట,పూర్వాభాద్ర-సింహం
భరణి,రేవతి-ఏనుగు
పుష్యమి,కృత్తిక-మేక
శ్రవణం,పూర్వాషాడ-కోతి
ఉత్తరాషాడ,అభిజిత్-ముంగీస
రోహిణి,మృగశిర-పాము
జ్యేష్ఠ,అనూరాధ-లేడి
మూల,ఆరుద్ర-కుక్క
పునర్వసు,ఆశ్లేష-పిల్లి
మఘ,పుబ్బ-ఎలుక
విశాఖ,చిత్త-పులి
ఉత్తర,ఉత్తరాభాద్ర-ఆవు
పులి – ఆవు , పిల్లి – ఎలుక , లేడి – కుక్క , గుఱ్ఱము – దున్న , పాము – ముంగిస , సింహం – ఏనుగు , కోతి- మేక ఇవి విరోధ జంతువులు. వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి కాకూడదు.ఒకే యోని అయితే సంపద,భిన్న యోనులైతే శతృత్వం లేకపోతే మద్యమం,రాశి కూటం,వశ్య కూటం అనుకూలమైతే యోనికూటం కుదరకున్నా దోషం లేదు.
5 గ్రహకూటమి :
సూర్యుడు – శని , చంద్రుడు – బుధుడు , కుజుడు –బుధుడు .గురుడు –శుక్రుడు ఈ పైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ కూటమి ని చూసేటప్పుడు పై విధంగా ఉండ కూడదు.
వధూవరుల రాశులకు అన్యోన్యమైత్రి ఉత్తమం,సమమైత్రి మద్యమం,పరస్పర సమత్వం కనిష్ఠం,పరస్పర శతృత్వం మృత్యుపదం,శతృత్వం కలహాప్రదం.
6 గణ కూటమి :-
స్వగుణం చోత్తమం ప్రీతి మధ్యమం దైవమానుషం
అధమం దేవడైత్యానాం మృత్యుర్మానుష రాక్షసం.
వధూవరుల జాతకం పరిశీలించేటప్పుడు వరుని యొక్క మనస్తత్వం నిర్ణయించటానికి అతని జన్మ నక్షత్రం ఆదారంగా నిర్ణయించవచ్చు. నక్షత్ర విభజన వారి మనస్తత్వ ప్రకారం విభజించబడింది.వధువు నక్షత్రంతో వరుని నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలి కానీ వరుని నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు. నక్షత్రాలు 27 .నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు.
దేవగణ నక్షత్రాలు:-అశ్వని,మృగశిర,పునర్వసు,పుష్యమి,హస్త,స్వాతి,అనురాధ,శ్రావణం,రేవతి
దేవగణ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు.శాంత స్వభావం కలిగి ఉంటారు.పరోపకారులై ఉంటారు.ఓర్పు,సహనం కలిగి ఉంటారు.
మనుష్యగణ నక్షత్రాలు:-భరణి,రోహిణి,ఆరుద్ర,పుబ్బ,ఉత్తర,పూర్వాషాడ,ఉత్తరాషాడ,పూర్వభాధ్ర,ఉత్తర భాధ్ర
మనుష్యగణ నక్షత్ర జాతకులు రజో గుణ లక్షణాలు కలిగి ఉంటారు.మంచి చెడు రెండు కలిగి ఉంటారు.భాదించటం,వేధించటం చేయరు.ఎవ్వరికీ హాని తలపెట్టరు.
రాక్షస గణ నక్షత్రాలు:-కృత్తిక,ఆశ్లేష,మఖ,చిత్త,విశాఖ,జ్యేష్ఠ,మూల,ధనిష్ట,శతబిషం
రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు.అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు.కఠినంగా మాట్లాడుతారు.మిక్కిలి స్వార్ధపరులు.
వధూవరులిద్దరిది ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారం,ప్రేమానురాగాలు ఉంటాయి.వధువుది మనుష్య గణమై వరునిది రాక్షస గణమైతే వారిద్దరిమధ్య బొత్తిగా అవగాహన లేకపోవటం ,ఆమెకు విలువ ఇవ్వక తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. వధువుది దైవగుణం వరునిది రాక్షసగణం అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది.భార్యాభర్తల మద్య పొందిక కుదరదు.
.7. రాశి పొంతనము :
వధూవరుల జన్మ రాసులు ఒకదానికొకటి 6-8 అయితే మృత్యువు,5-9 అయితే సంతాన హాని,2-12 అయితే నిర్ధనత్వం.
ప్రీతి షడష్టకం:-మేషం-వృశ్చికం,మిధునం-మకరం,సింహం-మీనం,తుల-వృషభం,ధనస్సు-కర్కాటకం-కన్య.
మృత్యు షడష్టకం:-మేషం-కన్య,మిధునం-వృశ్చికం,సింహం-మకరం,తుల-మీనం,ధనస్సు-వృషభం,కుంభం-కర్కాటం.
శుభ ద్విర్ద్వాదశం:-మీనం-మేషం,వృషభం-మిధునం,కర్కాటకం-సింహం,కన్య-తుల,వృశ్చికం-ధనస్సు,మకరం-కుంభం.
అశుభ ద్విర్ద్వాదశం:-మేషం-వృషభం,మిధునం-కర్కాటం,సింహం-కన్య,తుల-వృశ్చికం,ధనస్సు-మకరం,కుంభం-మీనం.
శుభ నవపంచకాలు:-మేషం-సింహం,వృషభం-కన్య,మిధునం-తుల,సింహం-ధనస్సు,తుల-కుంభం,వృశ్చికం-మీనం,ధనస్సు-మేషం,మకరం-వృషభం.
అశుభ నవ పంచకాలు:-కర్కాటకం-వృశ్చికం,కన్య-మకరం,కుంభం-మిధునం,మీనం-కర్కాటకం.
ఏకరాశి:-సౌభాగ్యం,పుత్ర లాభాలు.
సమసప్తకం-ప్రీతి,ధన,భోగ,సుఖాలు.
తృతీయ లాభాలు:-ప్రీతి,ధనం,సౌఖ్యం.
చతుర్ధ దశమాలు:- ప్రీతి,ధనం,సౌఖ్యం.
8 నాడీపొంతనము : నాడీ దోషం ఎంతో విశిష్టమైనది.విడువరానిది.వదూవరులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేసుకొనకూడదు.వదూవరులిద్దరిదీ ఏక శరీర తత్వము కాకూడదు అనేది నాడీ నిర్ణయం.వివాహమునకు తరువాత వ్యక్తి క్రొత్త జీవితములోనికి ప్రవేశించునని పెద్దలు అంటారు, పెద్దలు ఇట్లు చెప్పుట చాలా వరకు సరైనది కూడ. వివాహమునకు తరువాత ప్రారంభమగు క్రొత్త జీవితము సుఖమయముగా వుండుటకు కుండలి యొక్క లెక్కింపు చేసెదరు. కుండలి యొక్క లెక్కింపు క్రమములో అష్టకూటము ద్వారా విచారణ చేసెదరు. ఈ అష్ట కూటములో ఎనిమిదవ మరియు అంతిమ కూటము నాడీ కూటము. నాడీ కూటమి సరిగా లేకుంటే మిగతా ఏడు కూటాల గుణాల్ని కూడా నాశనం చేస్తుంది.
శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు.జ్యోతిష్య శాస్త్రము లో నాడులు మూడు ప్రకారములుగా వుండును, ఈ నాడుల పేర్లు ఆదినాడి, మధ్య నాడి, అంత్య నాడి.
1. ఆది నాడి: జేష్ట, మూల, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తరఫల్గుని, హస్త, పూర్వభాద్ర,శతబిషం మరియు అశ్విని నక్షత్రములు ఆది లేదా ఆద్య నాడిలో వుండును. దీని వల్ల మేదోసంపత్తి,ప్రతీకార వాంఛ,ఆలోచనా విధానం,కోపం,ఆవేశం తెలుపుతుంది.వదూవరులిద్దరి నక్షత్రాలుగ ఉత్తర,శతభిషం,పూర్వాభాద్ర,పునర్వసు,ఆరుద్ర,మూల మొదలగు నక్షత్రాలకు ఆది నాడీ దోషం లేదు.
2. మద్య నాడి: పుష్యమి, మృగశిర, చిత అనురాధ, భరణి, దనిష్ట, పూర్వాషాడ, పూర్వఫల్గుణి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములు మధ్య నాడిలో వుండును. దీని వల్ల శరీరం మద్య భాగంలో ఉన్న రుగ్మతలు,సంతానం, ఊపిరితిత్తులుగుండెలో ఉన్న రుగ్మతలు తెలుపుతుంది. వదూవరులిద్దరి నక్షత్రాలు పూర్వాషాడ,అనురాధ,ధనిష్ఠ,పుష్యమి,చిత్త,పుబ్బ,మృగశిర,అను నక్షత్రాలకు మద్య నాడీ దోషం లేదు.
3. అంత్య నాడి: స్వాతి, విశాఖ, కృత్తిక, రోహిణి, ఆశ్లేష, మఘ, ఉత్తరాషాడ, శ్రవణ మరియు రేవతి నక్షత్రములు అంత్య నాడిలో వచ్చును. దీనివల్ల మర్మాయవాలు,కామవాంఛ,నపుంసకత్వం గురించి తెలియజేయును.వదూవరులిద్దరి నక్షత్రాలు కృత్తిక,విశాఖ,ఆశ్లేష,శ్రవణం,మఖ,ఉత్తరాషాడ,రోహిణి నక్షత్రాలకు అంత్య నాడీ దోషం లేదు.
జ్యోతిష్య శాస్త్ర ఆదారముగా వరుడు మరియు కన్య ఇరువురి నక్షత్రములు ఒకే నాడిలో వుండిన అప్పుడు ఈ దోషము కలుగును. అన్ని దోషముల కన్నా నాడీ దోషము అశుభ కరముగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఈ దోషము కలుగుట వలన 8 అంఖము యొక్క హాని కలుగును. ఈ దోషము కలుగుట వలన వివాహ ప్రసంసము చేయుట శుభకరముగా వుండదు.
మహర్షి వశిష్టుని అనుసారముగా నాడీ దోషము లో ఆది, మధ్య మరియు అంత్య నాడులకు వాతము, పిత్తము మరియు కఫము అనే పేర్ల ద్వారా తెలిపెదరు.
నాడి మానవుని యొక్క శారీరక ఆరోగ్యమును కూడ ప్రభావితము చేయును. ఈ దోషము కారణముగా వారి సంతానము మానసికముగా వికసితము లేని మరియు శారీరకముగా అనారోగ్యముతో వుండును 
ఈ స్థితులలో నాడీ దోషము కలుగదు:
1. యది వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రములు ఒకటిగా వుండిననూ ఇరువురి చరణములు ప్రదమ చరణమైన ఎడల నాడీ దోషము కలుగదు.
2. యది వరుడు - వదువు ఒకే రాశిగా వుండి మరియు జన్మ నక్షత్రము బిన్నమైన ఎడల నాడీ దోషము నుండి వ్యక్తి ముక్తి పొందగలడు.
3. వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రము ఒకటిగా వుండి మరియు రాశులు వేరు వేరుగా వుండిన ఎడల నాడీ దోషము కలుగదు.
తప్పనిసరి అయితే నాడీ దోష పరిహారానికి మృత్యుం.
*మీ మిత్రుడు యస్.నాగేశ్వరశర్మ(ప్రకాష్)*