Sunday, November 25, 2018

*అష్ట దిక్పాలకులు*

*అష్ట దిక్పాలకులు*

〰〰〰〰〰〰〰
1.ఇంద్రుడు - తూర్పు దిక్కు.
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము.

〰〰〰〰〰〰〰
2.అగ్ని - ఆగ్నేయ మూల
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం తగరు, వీరి ఆయుధం శక్తిఆయుధము.

〰〰〰〰〰〰〰
3యముడు - దక్షిణ దిక్కు
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము.

〰〰〰〰〰〰〰
4.నైఋతి - నైఋతి మూల
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము.

〰〰〰〰〰〰〰
5.వరుణుడు - పడమర దిక్కు
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు కాళికా దేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము.
〰〰〰〰〰〰〰

6.వాయువు - వాయువ్య మూల
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.

〰〰〰〰〰〰〰
7.కుబేరుడు - ఉత్తర దిక్కు.
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గము.

〰〰〰〰〰〰〰
8.ఈశాన్యుడు - ఈశాన్య మూల.
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు పార్వతీ దేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము.

Wednesday, November 7, 2018

జాతకాన్ని పరిశీలించటం ఎలా ?

జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా బావచక్రాన్ని,నవాంశ చక్రాన్ని,షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి. జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలోని పరిశీలించాలి.ఈ షోడషవర్గుల పరిశిలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు అవకాశము కలదు.

*లగ్న కుండలి(D1)*

లగ్న కుండలి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియ జేస్తుంది. మనిషి మనస్తత్త్వం, శారీరక స్థితి, గుణగణాలు, జీవన విధానం మొదలైన అనేక విషయాలు లగ్నకుండలి ద్వారా తెలుసుకొవచ్చు.

*నవాంశ కుండలి(D9)*

రాశి చక్రమందు యోగం ఉండి నవాంశ యందు గ్రహాల స్ధితి యుతులలో అవయోగ మేర్పడిన రాశి యందలి ఫలితమునకు విఘాతం కలుగును.రాశిచక్రం జన్మమైతే నవాంశ ప్రాణం.నవాంశ కుండలి మనిషి భాగ్యాన్ని, వైవాహిక జీవితాన్ని తెలియ జేస్తుంది. ఒక మనిషి అదృష్టవంతుడా, కాదా, అదృష్టం దేని ద్వారా వస్తుంది. తదితర విషయాలు వివాహానికి సంబంధించి వివాహ యోగం ఉన్నదా, లేదా, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు నవాంశ కుండలి ద్వారా తెలుస్తాయి.

*హోరా(D2) కుండలి*

హోరా కుండలి ఆర్థిక స్తితిని గురించి తెలియ జేస్తుంది. అలాగే మనలో ఉండే వివిధ అంశాల సంతులతను సూచిస్తుంది. రవిహోర(సింహరాశి)లో ఎక్కువ గ్రహలు ఉన్నట్లయితే కృషితో ఎక్కువ సంపాదన ఉంటుంది.సింహం మనలో ఉండే బహిర్గత అంశాలను, కర్కాటకం అంతర్గత అంశాలను సూచిస్తుంది.

*ద్రేక్కాణ(D3) కుండలి*

వైద్య జ్యోతిష్యంలో ద్రేక్కాణం ద్వారా ఏ శరీర భాగానికి అనారోగ్యం కలుగుతుందో తెలుసుకోవచ్చును.
ద్రేక్కాణం శరీర భాగాలు, ఆరోగ్య సమస్యల గురించి చెబుతుంది. ఇది లగ్న కుండలి లో 3 వ భావం, సోదరీమణులు, స్నేహితులు మరియు భాగస్వామ్యాలు గురించి చెబుతుంది. ఇది మన సామర్థ్యాన్ని పని, లేదా ఒక సమూహం లో, కొన్ని లక్ష్యాన్ని సాధించడాన్ని సూచిస్తుంది. శక్తి, ఆసక్తి, ధైర్యం, పరాక్రమం. మొదలైనవి ద్రేక్కాణ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు విశ్లేషణ కొరకు లగ్న కుండలి మరియు కుజుడి స్థితి మరియు 3 వ భావాన్ని తనిఖీ చెయ్యాలి.

*చతుర్థాంశ(D4) కుండలి*

చతుర్థాంశ మనకు కలిగే సౌకర్యాలు, గృహ వాహనాది యోగాలు, మన జీవితం కష్టాలతో కూడినదా లేక సుఖాలతో కూడినదా..తదితర అంశాల గురించి చెపుతుంది.

*సప్తాంశ(D7) కుండలి*
సప్తాంశ సంతానం గురించి అలాగే మనలో ఉండే సృజనాత్మక శక్తి గురించి చెపుతుంది.సంతానం,వంశోన్నతి,వంశాభివృద్ధి చూడవచ్చు

*దశమాంశ(D10) కుండలి*

దశమాంశ ఉద్యోగము మరియు కీర్తి ప్రతిష్టల గురించి తెలియ జేస్తుంది.కర్మలు,వాటి ఫలితాలు,ఉద్యోగం,గౌరవాలు,కీర్తిప్రతిష్ఠలు,వృత్తిలో ఒడిదుడుకులు తెలుసుకోవచ్చు.

*ద్వాదశాంశ(D12) కుండలి*

ద్వాదశాంశ మన అదృష్టం గురించి, పూర్వ జన్మలో మనం చేసిన కర్మ ఫలితాలను గురించి తెలియజేస్తుంది. అలాగే వంశ సంబంధ దోషాలను గురించి కూడా తెలియ జేస్తుంది.తల్లిదండ్రులతో అనుబందాలు,వారి నుండి వచ్చే అనారోగ్యాలు,ఎవరి నుండి ఎవరికి సుఖం ఉన్నదో తెలుసుకోవచ్చును.

*షోడశాంశ(D16) కుండలి*

షోడశాంశ మనకు గల గృహ, వాహనాది సౌఖ్యాలను గురించి తెలిసజేస్తుంది. అలాగే ఒక వ్యక్తి అంతర్గంతంగా ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.వాహనసౌఖ్యం,వాహనాలతో చేసే వృత్తి వ్యాపారాలు లాభిస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వాహనానికి ఏరంగు మంచిదో తెలుసుకోవచ్చును.

*వింశాంశ(D20) కుండలి*

వింశాంశ మనం చేసే దైవారాధన, అనుకూల దైవం, గురూపదేశం తదితర ఆధ్యాత్మిక అంశాలను తెలియ జేస్తుంది. మనం ఏ దేవున్ని ఉపాసన చేయాలి అనేది దీని ద్వారా కనుక్కోవచ్చు.మంత్రోచ్చారణ ,దేవుడిని పూజించేటప్పుడు అడ్డంకులు వస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వింశాంశలో శుక్రుడు బలహీనంగా ఉండాలి.బలహీనంగా ఉంటేనే సన్యాసియోగం వస్తుంది.అప్పుడే దైవచింతన చేయగలడు.

*చతుర్వింశాంశ(D24) కుండలి*

చతుర్వింశాంశ మన విద్యను గురించి ఆధ్యాత్మికతను గురించి తెలియజేస్తుంది.ఉన్నతవిద్య,విదేశి విద్య,విద్యలో ఆటంకాలు గురించి తెలుసుకోవచ్చు.

*సప్తవింశాంశ(D27) కుండలి*

సప్తవింశాంశ మన శారీరక, మానసిక శక్తియుక్తుల గురించి తెలియజేస్తుంది. అలాగే మన జీవితానికి సంబందించిన అంశాల సూక్ష్మపరిశీలనకు లగ్నకుండలితో పాటు దీన్ని కూడా పరిశీలించాలి.జాతకుడిలో ఉండే బలాలు,బలహీనతలు తెలుసుకోవచ్చును.

*త్రింశాంశ కుండలి(D30)*

త్రింశాంశ మన కష్ట, నష్టాలను గురించి, అనుకోకుండా వచ్చే ఆపదల గురించి, ప్రమాదాల గురించి తెలియజేస్తుంది.స్త్రీ పురుషుల శీలం,వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు,అరిష్టాలు తెలుసుకోవచ్చును.

*ఖవేదాంశ(D40) కుండలి*

ఖవేదాంశ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, జాతకంలో కల శుభాశుభ అంశాలను తెలుసుకోవటానికి అలాగే మనకు కల అలవాట్లను, భావోద్వేగాలను అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది.మాతృవంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.

*అక్షవేదాంశ కుండలి(D45)*

అక్షవేదాంశ మనకుండే నైతిక విలువలను గురించి, జాతకానికి సంబంధించిన అంశాలను సూక్ష్మ పరిశీలన చేయటానికి ఉపయోగ పడుతుంది.తండ్రివంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.

*షష్ట్యంశ కుండలి (D60)*

షష్ట్యంశ జాతకానికి సంబంధించి సూక్ష్మ పరిశీలనకు అలాగే కవలల జాతకాల పరిశీలన విషయంలో ఇది ఉపయోగపడుతుంది.పూర్వజన్మ విషయాలు,కవలల విశ్లేషణకు,ముహూర్తమునకు,ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.

Monday, October 29, 2018

మీ పేరును బట్టి ఇంటి సింహ ద్వారమును ఎంచుకోవటం లేక ఏదిక్కు ఇల్లు మీకు అదృష్టాన్ని ఇస్తుందో తెలుసు కోవటం ఎలా ?

ఓం శ్రీ మహా గణపతయే నమః
House facing according to Name
ఉపోత్ఘాతం:- 

అతి ప్రాచీన మైన భారత దేశము శిల్ప కళలకు, వాస్తు వైభవం నకు ప్రఖ్యాతి వహించింది .
భారత దేశ నాగరికత అద్భుతమైన వాస్తు వైభవమునకు అద్దం పడుతుంది . భారత దేశం లోని
అన్ని గ్రామాలు , పట్టణాలు , మహా నగరాలు మహా సౌధాలు శిల్పకళలతో నిండి వాస్తు శాస్త్ర
విజ్ఞానాన్ని , మన పూర్వికుల శిల్పకళా మరియు నిర్మాణ సామర్ద్యాన్ని ప్రపంచానికి
చాటిచెబుతూ అందరిని అబ్బుర పరుస్తున్నాయి .

ఇలా పురములు,దివ్య సౌదములు మరియు సాధారణ గృహములు ఎన్నో కట్టడాలు
వస్తువులుగా తనయందు కలిగి వున్నది కావునే “ భూమికి “ దేవనాగరి యందు “ వాస్తు “
అని కూడా పేరుగలదు. అలాంటి ఎన్నో విషయములను తెలియజేయు విజ్ఞానమే “
వాస్తుశాస్త్రము “ అని పిలవబడినది.

“దిశ కుదిరి దశ కుదురు“ నను సామెత తెలిసిందే ! దిశ అనగా “ తాను నివసించు దిక్కు,
స్థలము,గృహము” అని అర్ధము! దశ అనగా జాతక రీత్యా ప్రాప్తించు అభివ్రుది, శుభ
యోగములు ! కనుక గృహనిర్మాణము తలపెట్టిన వారు శాస్త్ర సమ్మతముగా గృహం
నిర్మించుకోవాలి . నివసించే గ్రహము సొంతమైన కాక పోయిన అందు వసతులు నివసించు
వారు అనుబవించు నట్లు , అందలి దోషములను కూడా యజమానితో పంచుకోనవలసిందే.
అలాగే మంచిని కూడా నివాసము వుండే వారు యజమాని అనుభవిస్తారు .

ఎవరు జన్మించిన గృహము వారికి అత్యంత శుభము , కాని కొన్ని సందర్భాలలో వేరొక
ఇంటిలో నివసించ వలసి రావటం లేక నూతన గృహమును నిర్మించటం జరుగుతుంటుంది .
అలాంటి సందర్భములలో నిర్మించబోయే లేక నివసించబోయే గృహము మనకు మంచిదా ?
కదా ? అని తెలుసుకోనటాన్ని “ వాస్తుశాస్త్రం” లో అర్వణము అని అంటారు .


అర్వణము రెండు రకములుగా లెక్కించ వచ్చు 1. జన్మనక్షత్రము రీత్యా 2. నమనక్షత్రము రీత్యా .
నామ నక్షత్రమును బట్టి గృహము యొక్క సింహద్వారము ఎదిక్కున ఉండాలో నిర్ణయించటం
ఎక్కువగా వాడుకలో వున్నా శ్రేష్టమైన విడనంగా చెప్పవచ్చు. తెలుగు తమియ మలయాళ
కన్నడ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల వారు నక్షత్రాన్ని బట్టి మరియు రాశిని బట్టి కూడా
తెలుసుకుంటారు. కానీ ఈవిధానాలు అంత ఎక్కువ వాడుకలో లేక పోవటం గమనించ
వచ్చు. ముందుగా తన పేరునకు గల మొదటి అక్షరం ప్రకారం “దిశావర్గ” నిర్ణయం
చేసుకోవాలి. సాధారణం గా దంపతులు అనగా భార్య భర్తలు గృహ నిర్మాణం తలపెడితే
సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరును బట్టి మాత్రమే చూడాలి.
భార్య భర్తల ఇద్దరి పేరుతో చూడవలసిన అవసరం లేదు అని గమనించ వచ్చు . భూమి భార్య
పేరున కొనుగోలు చేసినప్పటికీ భర్త యొక్క పేరును బట్టి మాత్రమే సింహ ద్వారం
నిర్ణయించాలి.

“దిశావర్గ” నిర్ణయం :- 

తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 51 వున్నవి. వీటిని 8 భాగాలుగా విభజించినారు. వీటినే
“అష్టవర్గులు” అని పిలుస్తారు. ఈ విధానాన్ని సులువుగా అర్ధం చేసుకోవటానికి పైన
ఇవ్వబడిన పట్టికను గమనించ గలరు.

మొదటది “అ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఋ, ౠ,ఎ, ఏ, ఐ, ఒ,
ఓ,ఔ,అం,అః” అనే 16 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా
అట్టివారు “అ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “తూర్పు దిక్కు” స్వదిశ
అవుతుంది.

రెండవది “క” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “క, ఖ, గ, ఘ, ఙ ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “క వర్గు” నకు చెందిన వారుగా
పరిగణింప బడతారు. వీరికి “ఆగ్నేయ దిక్కు” స్వదిశ అవుతుంది.

మూడవది “చ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “చ, ఛ, జ, ఝ, ఞ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “చ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “దక్షిణదిక్కు” స్వదిశ అవుతుంది.

నాల్గవది “ట” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ట, ఠ, డ, ఢ, ణ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ట వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ నైరుతి దిక్కు” స్వదిశ అవుతుంది.

ఐదవది “త” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “త, థ, ద, ధ, న” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “త వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ పడమర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఆరవది “ప” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ప, ఫ, బ, భ, మ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ప వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ వాయవ్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఏడవది “య” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “య, ర, ల, వ” అనే 4 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “య వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఉత్తర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఎనిమిదవది “శ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “శ, ష, స, హ, ళ, క్ష” అనే 6 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “శ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఈశాన్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వర్గమునకు చెందిన వారో తెలుసు కోవాలి. తద్వారా సింహద్వారము దిశను నిర్ణయించు కోవాలి.

“దిశావర్గ ఫలితములు”

ప్రతి వారికి వారి జన్మ గృహము శుభము , తన జన్మ గృహము కాక మరియే ఇతర కారణముల వల్లనైన ఇంకో గృహమున నివసించ వలసివచ్చిన తప్పక “ సింహద్వారం దిశను” శాస్త్రరిత్య నిర్ణయించు కొనినివసించుట అత్యంత శుభము!

తన స్వదిశ లో సింహద్వారము ఉండుట అత్యంత శుభము. స్వదిశ మొదలుకొని 1,3,7 దిశలు కూడాఅత్యంత శుభములే. 2,4,6 దిశలు మద్యమ లేక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. 5,8 దిశలు ఎంచు కొనిన బాధలు, ఇబ్బందులు, చింతలు, ధనవ్యయం,అనారోగ్యం అధికమగును! తద్వారా దరిద్రమును అనుబవించ వలసి వచ్చును.ఫలితములు వరుసగా

స్వదిశ అనగా 1)పుష్టి 2) సమం 3) మిత్ర 4)సమం 5)శత్రు 6)సౌఖ్యం 7)భోగం 8)వ్యయం. 

వీలైనంత వరకు విదిక్కులు లైన “ ఆగ్నేయం,నైరుతి,వాయవ్యం,ఈశాన్యం” లకు సింహద్వారము ఉండకుండా చూచుట శుభము . గృహమునకు “గేహము” అని పేరు వున్నది! వాస్తు పురుషుని స్వరూపము మనవ దేహము లాంటిది. అందుకు వాస్తుపురుషుని పూజ అంటే తనచే కట్టబడిన గృహమునకు పూజ అని అర్ధము .

 “ సర్వాంగే నయనం ప్రధానం “ అనగా అన్ని దేహ అంగములలో కళ్ళు ప్రధానమైనవి అదే విధంగ “ గేహన్గే సింహ ద్వారం ప్రధానం” అంటే ఇంటికి సింహద్వారం చాలా ప్రధానంఅని అర్ధం.

“ గృహస్తస్య సర్వ క్రియాన సిద్యంతి గృహం వినా” అని శాస్త్ర వాక్యము. అనగా స్వగృహము లేకుండాపరుల గృహములలో ఎన్నాళ్ళు ఎన్ని సత్కర్మలు ఆచరించిన పరిపూర్ణముగా సిద్ధిoచవు. ఆ సత్కర్మల ఫలితమును సంపూర్ణముగా పొందుట కష్టసాద్యము . అందుకే చిన్నదో పెద్దదో తమది అనే ఒక గృహము చాలా అవసరము !

ఇహ పరములకు సాధనము గృహము. చెడు పాత్రలో కాచిన పాలు విరిగి పోయిన విధముగా, చవిటి నెలలో వేసిన పంట పండ నట్లు , వాస్తు సరిలేని గృహమునందు నివాసము నిష్ప్రయోజనం . గృహమునకు సింహద్వారము యెంత ప్రధానమో , గృహము శల్య వాస్తు మరియు ఇంటి లోపల వున్న గదుల నిర్మాణము వాటి స్థితి కూడా అంతే ప్రధానము. కావున తామందరూ శాస్త్రపరిజ్ఞాన సహాయతతో అందమైన,శుభ వాస్తు పరమైన గృహములను నిర్మించుకొని ఉత్తమ ఫలితాలను పొందాలని ఈశ్వరుని ప్రార్ధిస్తూ ..

మీ
భువనగిరి మురళీ కృష్ణ శర్మ ( శర్మాజీ )
నార్త్ కరోలిన, అమెరికా.