*శ్రీ సూక్తశ్లోకాలు
*శ్లో హిరణ్య వర్ణామ్ హరిణీమ్ సువర్ణ రజత స్రజామ్*
*చంద్రామ్ హిరణ్మయీమ్ లక్ష్మీమ్ జాతవేదో మమావహః*
*హిరణ్య వర్ణామ్* ~ కిరణమయములగు వర్ణము గలది; అనగా సూర్యుని కిరణములలో గల అన్ని వర్ణములు తన రూపముగా గలది.
*హరిణీమ్* ~ ఆడులేడివలె చపలమైన గమనముగలది.
*సువర్ణ రజత స్రజామ్* ~ మంచి వర్ణములను పుట్టించు వెండి వంటి స్వచ్చమైన కిరణము.
*చంద్రామ్* ~ ఆహ్లాదకరమైనది
*హిరణ్మయీమ్* ~ కిరణముల రూపము గలది. హకార రేఫములే తన రూపములుగా గల మంత్ర మూర్తి.
*లక్ష్మీమ్* ~ లక్ష్మి
*జాతవేదః* ~ తనయందు వేదము పుట్టినవాడు. అనగా జీవులలో 'నేను ' అను ప్రజ్ఞ గానున్న పురుషమూర్తి యగు అగ్ని, వానినుండియే వానికి సమస్త జ్ఞానము భాసించును.
*మమ ఆవహః*~ అట్టి జాతవేదుడు నాకు లక్ష్మీ వైభవము సాధించి పెట్టును గాక అని అర్థము.
కిరణముల రూపము గలది; హకార రేఫములే తన రూపములుగా గల మంత్రమూర్తి; లక్ష్మీ చిహ్నములు గలది. సూర్యకిరణముల వలననే ఆకారాలు, రంగులు మున్నగు రూప చిహ్నములు అవతరించుచున్నవి. అలాగే శబ్ధమయములగు నామచిహ్నములునూ అవతరించుచున్నవి ~ తనయందు వేదములు పుట్టినవాడు ~ అనగా జీవులలో నేను అను ప్రజ్ఙగా ఉన్న పురుషమూర్తి అగు అగ్ని వాని నుండియే వానికి సమస్త జ్ఙానము భాసించును. నాకు సాధించి పెట్టును గాక! అనగా అట్టి జాతవేదుడు నాకు లక్ష్మీ వైభవాన్ని సాదించి పెట్టును గాక! అని అర్థము.
*శ్రీ సూక్త శ్లోకం ~2*
*తామ్ మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్*
*యస్యామ్ హిరణ్యాం విందేయం గామశ్వం పురుషానహమ్*
వేదమునందు పుట్టిన వెలుగైన అగ్నీ! ఎన్నడునూ నన్ను విడిచిపోని లక్ష్మిని నాకు ఆవహింప జేయుము. దానివలన కిరణముల బంగారము, గోవులు, అశ్వములు, పురుషులు(పరివారము) అను సంపదను నేను పొందగలను.
*జాతవేదః* ~ ఓ జాతవేదుడా!
*అనపగామినీం* ~ విడిచిపోని యామెను
*తామ్ లక్ష్మీమ్* ~ ఆ లక్ష్మిని
*మే* ~ నాకు
*ఆవహ* ~ ఆవహింప జేయుము
*యస్యామ్*~ ఎవని వలన
*హిరణ్యం*~ కిరణముల వెలుగుల సిరులను
*గాం* ~ గోవును
*అశ్వం*~ గుర్రమును
*పురుషాన్* ~ స్థ్రీ పురుషులను (పరిచారమును)
*అహమ్*~ నేను
*విందేయమ్* ~ పొందగలను.
జాతవేదుడు అనగా వేదములయందు పుట్టినవాడు, వేదములను పుట్టించువాడు. చక్కగా సంస్కరింపబడిన మనలోని ప్రజ్ఞలే మానవుడు వ్రాయని గ్రంధాలు. అనపగామిని అనగా విడిచిపోవనిది. సంస్కారమున్నవాని చుట్టునూ ఆవరించియుండు శాంతిప్రదమగు సాన్నిధ్యము ~ దీనినే వర్చస్సు, ఇష్టదేవత, కళ అని అంటారు. ఇదే సర్వ సమర్ధతలకూ కారణము. ధర్మశీలుని ఆవరించి పరులకుపకరించు ఆత్మవిశ్వాసముగా ఇది వర్తించును. ఆవహింపజేయుట అనగా దేవతను ఆవాహనము చేయుట. ఇది కోరినవారు నిత్యార్చనలో దేవతలకు పూజానంతరము ఉద్ద్వాసనము చెప్పరాదు. గామ్ ~ గోవును ~ అశ్వం ~ గుర్రాన్ని అనగా ప్రాణమయ శరీరమనబడు అగ్నిని ~ దీనినే అశ్వర్థమందలి అశ్వర్తమందలి అశ్వర్తమందలి అశ్వమని వేదాలకవి సంప్రదాయము చెప్పును. పురుషాన్ అనగా పురుషులనూ పురుషసూక్తమున చెప్పబడిన పపరమపురుషుని రూపాలుగా నరులను ఆదరిించుట!!
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 3:*
*అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోధినీమ్*
*శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్:*
తొలుత అశ్వములు, నడుమన రథములు, కొసకు ఏనుగులు నిలబడి శబ్దములు చేయుచుండగా మేల్కొలుపులను పొందుచూ, వెలుగుల నాశ్రయించుట్టి శ్రీదేవిని మేము ఉపాసన చేయుదుము. మమ్ము ఆ శ్రీదేవి అభిలషించి ప్రోత్సహించును గాక!
*అశ్వపూర్వామ్* ~ అశ్వములు తొలుతగా గలది;
*రథమధ్యామ్*~ రథములు నడుమగా గలది
*హస్తినాద*~ ఏనుగుల నాదముచే;
*ప్రభోధినీం*~ మేల్కొలుప బడినది;
*శ్రియం* ~ ఆశ్రయించునది;
*దేవీం* ~ వెలుగుల రూపు గలది;
*ఉపహ్వయే*~ ఉపాసన చేయుదును; రమ్మని పలుకుదును;
*శ్రీం దేవీం*~ ఆశ్రయించునది, వెలుగులు గలదియు అగు ఆ శ్రీదేవి;
*మా* ~ నన్ను;
*జుషతామ్*~ అభిలషించును గాక!
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 4:*
*కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా ఆర్ద్రామ్*
*జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్*
*పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే:*
పరమపురుషుడగు నారాయణుడు, ఎవరిని తన అస్తిత్వముగా నేర్పరచుకొనెనో, అట్టి కిరణమయ ప్రాకారము రూపముగల ఆమెను, పద్మమున నిలిచిన పద్మ వర్ణ మూర్తిని అగు నామెను, శ్రీదేవిని నాయందు ఆవాహనము చేయుచున్నాను.
*సహః* ~ అతడు, వేదపురుషుడు;
*కాం* ~ ఎవతెను; అస్మితాం ~అస్తిత్వముగా, నేనున్నాను అను ప్రజ్ఙగా, సంకల్పరూపిణిగా(పొందెనో);
*హిరణ్య ప్రాకారాం*~ బంగారు వన్నె కిరణముల యావరణము గల దానిని;
*ఆర్ద్రామ్*~ ద్రవ స్వరూపిణిని; లేక రస స్వరూపిణిని, ఎర్రని రంగు గూడ కలిగిన ఉదయారుణ సూర్యకాంతి గలదానిని;
*జ్వలంతీ*~ జ్వాలా రూపము గల దానిని;
*తృప్తామ్* ~ తృప్తి గల దానిని;
*తర్పయంతీం*~ తృప్తిని కలిగించుచున్న దానిని;
*పద్మే స్థితాం* ~ పద్మమునందు ఉన్న దానిని;
*పద్మ వర్ణాం* ~ తమ్మి పువ్వు రంగు కల దానిని;
*పత్ + మ* ~ పదముల శోభతో కూడిన రంగు కల దానిని;
*తామ్ శ్రియం* ~ ఆ శ్రీదేవిని;
*ఇహ*~ ఇచ్చటకు, నాయందు స్థూల సూక్ష్మాది సృష్టి లోకమందు;
*ఉపహ్వయే* ~ సమీపమునకు పిలుచుచున్నాను.
*ఆర్ద్ర* ~ ఉదయ సూర్యరశ్మి ద్రవమువలె వ్యాపించునది యయ్యు, అగ్నిగా వేడి వెలుగుల నిచ్చునది. మరియూ ఆర్ద్ర అను నక్షత్రము లక్ష్మీ సమృధ్ధిగల సౌర కుటుంబము. దాని వెలుగును ఉపాసించుట లక్ష్మీ ప్రదము. ఇది భూమికి పగడము వలె కనిపించును. పగడముల చెట్లు ఈ నక్షత్ర ప్రభావము వలన ఉధ్భవించుచున్నవి. కనుక పగడములు కూడా లక్ష్మీ ప్రదములే~ స్థ్రీలచే ధరింపబడును. ప్రేరేపించును గాక!
*శ్రీసూక్తము ~ శ్లోకము ~ 5*
*చద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం*
*శ్రియం లోకే దేవ జుష్టా ముదారామ్*
*తాం పద్మినీం ఈం శరణ మహం ప్రపద్యే*
*అలక్ష్మీ ర్మే నశ్యతాం త్వాం వృణే:*
చంద్రాత్మకమైనది, వెలుగులను వెదజల్లునది, ప్రశస్థిచే లోకమునందు (లోకములుగా) వెలుగుచున్నది, దేవతల ప్రీతిని చూరగొన్నది, ఔదార్యం గలది, పద్మ లక్షణములు గలది, ఈం కార స్వరూపిణియగు ఆ శ్రీదేవికి నేను శరణాగతి చేయుచున్నాను. నిన్ను వరించుటవలన నాయందున్న అలక్ష్మి నశించు గాక!
*ప్రతిపదార్థాలు*
*చంద్రాం* ~ చంద్రతత్వంగలది, షోడశ కళాత్మకమైనది;
*ప్రభాసాం* ~ ప్రశస్తమైన వెలుగు గలది;
*యశసా* ~ ప్రసిధ్ధికి వలసిన లక్షణములచే;
*లోకే* ~ లోకము నందు;
*జ్వలంతీం* ~ ప్రకాశించు దానిని;
*దేవజుష్టాం* ~ దేవతల మక్కువను చూరగొనిన దానిని;
*ఉదారాం* ~ దానము చేయు గుణము కల దానిని;
*పద్మినీం* ~ పద్మ లక్షణములు గల నామెను;
*ఈం* ~ఈంకార స్వరూపిణిని;
*తాం*~ ఆమెను ( అట్టి శ్రీదేవిని);
*అహమ్* ~ నేను శరణము పొందుచున్నాను;
*త్వాం* ~ నిన్ను;
*వృణే* ~ వరించుట యందు ( ఆవరించుట యందు);
*మే* ~ నాయొక్క;
*అలక్ష్మీః*~ అశుభ లక్షణము;
*నశ్యతాం*~ నశించును గాక!
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 6:*
*ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతి స్తవ వృక్షోధ బిల్వః,*
*తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయస్చ బాహ్యా అలక్ష్మీ:*
*ఆదిత్యుని వర్ణముతో వెలుగొందు ఓ శ్రీదేవీ! నీ తపస్సుచేత అధిష్టించి పుట్టినది బిల్వము అను వనస్పతి. దాని ఫలములు మా తపస్సు చేత,*
*మాలోని మాయా సంభవములైన లోపలి, వెలుపలి అవలక్షణములను*
*తొలగించు గాక!*
*ప్రతిపదార్థాలు*
*ఆదిత్యవర్ణే* ~ ఆదిత్యుని వర్ణము గలదానా;
*తపసః* ~ తపస్సులకు;
*అధిజాతః*~ అదిష్టానముగా పుట్టినది యగు వనస్పతి అను జాతికి చెందిన;
*వృక్షః* ~ వృక్షము;
*అథః*~ అటుపైన ( తపస్సునకు అనంతరముగా పుట్టిన);
*బిల్వ* ~ మారేడు చెట్టు;
*తస్య ఫలాని* ~ దానియొక్క ఫలములు;
*తపసా*~ తపస్సు చేత;
*అంతరాయా + చ* ~ లోపలి నుండీ కలుగుననియు;
*బాహ్యా + చ* ~ పరిసరములనుండి కలుగుననుయు అగు;
*అలక్ష్మీః* ~ అలక్ష్మీ కరములగు;
*మాయాః* ~ మాయా సంభవ లక్షణములను;
*నుదంతు* ~ పోగొట్టును గాక: నశించునుగాక!
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ ~ 7:*
*ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ*
*ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి వృధ్ధిం దదాతు మే;*
*భావము*
*కీర్తి తోడను, మణులతోడను కలిసి దేవతలకు సఖుడగు కాముడు నా కెదురు వచ్చి సమీపించుగాక! నే నుధ్భవించిన ఈ రాష్ట్రము నందతడు నాకు సమృధ్ధిని కలిగించును గాక.*
*దేవసఖః* ~ దేవతలకు సఖుడు అగు కాముడు;
*కీర్తిః + చ*~ కీర్తియునూ;
*మణినా సః*~ మణితో కూడా;
*మాం*~ నన్ను;
*ఉప + ఏతు*~ సమీపించును గాక;
*అస్మిన్ రాష్ట్రే*~ ఈ రాష్ట్రము నందు;
*ప్రాదుర్భూతః + అస్మి*~ ఉధ్భ వించితిని;
*మే* ~ నాకు;
*కీర్తిం*~ ఆ కాముడు కీర్తిని;
*వృధ్ధిం* ~ సంవృధ్ధిని;
*దదాతు* ~ ఇచ్చును గాక!
*శ్రీసూక్తము ~ శ్లోకము ~ (8)*
*క్షుత్పిపాసా మలామ్ జ్యేష్టాః అలక్ష్మీ నాశయామ్యహం*
*అభూతిః అసమృధ్ధిం చ సర్వాః నిర్ణుద మే గృహాత్:*
*ఆకలి దప్పుల మలిన లక్షణము గల జ్యేష్టా దేవి అనబడు అలక్ష్మిని నేను నశింపజేయుదును. సంపద, సమృధ్ధి నా ఇంటి నుండి* *తరగకుండా అనుగ్రహించి నీవును అలక్ష్మిని పోగొట్టుము.*
*క్షుత్*~ ఆకలి;
*పిపాసా* ~ దప్పిక;
*మలాం* ~ మల స్వభావము గల దానిని;
*జ్యేష్టాః*~ జ్యేష్టాదేవిని అనగా దారిద్య దేవతను;
*అలక్ష్మీ*~ శుభ లక్షణములకు వ్యతిరేకమైన దానిని;
*అహం* ~ నేను;
*నాశయామి* ~ నశింపజేయుచున్నాను;
*అభూతిః* ~ సంపద లేకుండుటను;
*అసమృధ్ధిం చ*~ సమృధ్ధి లేకుండుటను;
*సర్వాః*~ సమస్త స్వరూపమగు జ్యేష్టాదేవిని;
*మే గృహాత్*~ నా ఇంటినుండీ;
*నిర్ణుద*~ పోగొట్టుము.
*ఒంటికి సంభంధించినది, ఇంటికి సంభంధించినది అగు* *దారిద్ర్యమురెండు విధములు: మొదటిది కర్మాధీనము ~ అనగా జీవుడు సత్కర్మచే నశింపజేసుకొన వలసినది. అనగా అనుగ్రహముచే తొలగిపోవలదినది. అందు మొదటిదానిని నేను తొలగించుకొందును. రెండవ దానిని నీవు తొలగింపుమని ఇందలి* *ప్రార్థన. పూర్వ కర్మ నశించుటకు సత్కర్మయూ, దైవానుగ్రహమునకు* *ప్రార్థనయూ సహజమైన పధ్ధతులు. ఇవి తారుమారు అయినచో పని చేయవు. దుష్కర్మ చేసి ప్రార్థన చేసినచో ఆపదలు తొలగవు. సత్కర్మ చేసి కలిసిరానిచో సుఖము కలుగదు. రెండింటి సామ్యము కొరకు ఈ మంత్రమును*
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 9:*
*గంధ ద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం*
*ఈశ్వరీగ్ం సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియం:*
*గంధద్వారాం* ~ గంధమే తన ద్వారముగా కల దానిని, సుగంధముతో
కూడిన ద్వారము కల దానిని;
*దురాధర్షాం*~ తేలికగా సమీపించుటకు వీలుకాని దానిని, జంకు కలిగించుటకు సాధ్యపడని దానిని;
*నిత్యపుష్టాం*~ నిత్యమూ పుష్టియైన దానిని;
*కరీషిణీం* ~ కరములచే అనగా కిిరణములచే పొందబడిన ఈషణములు కలదానిని(ఈషణములు అనగా ఆకార రేఖలు లేక అభిలాషలు)
*సర్వ భూతానాం* ~ సమస్త జీవరాశులకు;
*ఈశ్వరీం* ~ స్ధిదేవత యైన దానిని;
*తాం శ్రియం* ~ ఆ శ్రీదేవిని;
*ఉపహ్వయే* ~ సమీపించుటకు ఆహ్వానించుచున్నాను.
సుగంధముతోకూడిన ద్వారముగలది. సులభంగా సమీపించుటకు వీలు కానిది, ఎల్లప్పుడూ పుష్టిగా ఉండేది, కిరణములచే ఆకారము కట్టుకొన్నది.
సర్వజీవులకూ పరమేశ్వరి అగు నా శ్రీదేవిని మమ్ము సమీపింపుమని ఆహ్వనించు చున్నాను. ఉపాసించబడును.
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 10:*
*మనసః కామ మాకూతిమ్ వాచః సత్య మశీ మహి*
*పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శయతాం యశః:*
*మనసః* ~ మనస్సు యొక్క;
*కామమ్* ~ కోరికను; అకూతిమ్ ~ కుతూహలమును;
*వాచః* ~ వాక్కుయొక్క; సత్యం ~ సత్యమును;
*పశూనాం* ~ పశువులయొక్క; అన్నస్య ~ అన్నముయొక్క;
*రూపం* ~ రూపములు; అశీమతి ~ నీ యందు రూపొందిచుకొని
అనుభవించెదము;
*యశః* ~ కీర్తి స్వరూపమగు;
*శ్రీః* ~ శ్రీదేవి;
*మయి* ~ నాయందు;
*శ్రయ తామ్*~ ఆశ్రయమును చెందునుగాక;
*మనస్సు యొక్క కోరికను, కుతూహలమును, వాక్కు యొక్క సత్యమును, నీయందు రూపొందించుకొందుము. పశు సంపద యొక్క, అన్నము యొక్క రూపమును నీయందు రూపించుకొందుము. కీర్తి స్వరూపమగు శ్రీదేవి నా యందు ఆశ్రయము చెందునుగాక.*
*మనస్సునకు కోరిక, కుతూహలము సహజములు. వాక్కునకు సత్యము సహజము. అసత్యమాడిన వాక్కునందు కూడా అతడు అసత్యమాడెనను సత్యము సహజముగా నుండును. వాక్కు భావ ప్రకటన స్వరూపము గనుక. ఎట్లుద్దేశింపబడిన సత్యమట్లే వ్యక్తమగుట సత్యము. ఈ సహజ సంపదను లోకదృష్టి యొక్క నానాత్వము వైపునకు చెదర నీయక నీయందు ప్రయోగింతు మని అర్థము.*
*పశువుల యన్నము అనగా పచ్చిక, నీరు మున్నగునవి. వానిని పెట్టి* *పోషించుటవలన పశువులు గవ్య సంపద నిచ్చును గనుక, పై* *వస్తువులను సంపదయొక్క రూపములుగ దర్శించి యాదరింతుమని* *అర్థము. అనగా మంచి ఆహారాదులచే పశువులయందు భూత దయ, ఆదరము కలిగి వుండి ఈ లక్షణములను నీ రూపమున* *నర్చింతుమని అర్థము. అట్లు ప్రవర్తించిన వారి సత్ప్రవర్తనము వలన లోకమున కలుగు సత్కీర్తియే శ్రీ స్వరూపము. అట్టి స్వరూపమునకు* *ఆశ్రయమిత్తుమని ఇందలి ప్రార్థనము.*
*దీనివలన శ్రీదేవి సహజముగా గొనవలెనని కోరుకొనుట ముఖ్యము.*
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 11:*
*కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ*
*శ్రియం వాసయ మే కులే మాతరం పద్మ మాలినీం:*
*కర్దమేన* ~ కర్దముని చేత;
*ప్రజాభూతా*~ సంతతిగ పొందబడినదగు;
*శ్రియం* ~ శ్రీదేవిని;
*మాతరం*~ మాతృస్వరూపిణిని;
*పద్మమాలినీం* ~ పద్మ మాల ధరించినదానిని;
*మే కులే* ~ నా వంశమునందు;
*వాసయ* ~ వసింపజేయుము;
*కర్దమ*~ ఓ కర్దముడా!
*మయి*~ నా యందు;
*సంభవ*~ నీవునూ ఉధ్భవింపుము.
*తాత్పర్యము:*
కర్దముడను ప్రజాపతి చేత సంతతిగ పొందబడిన సువర్ణ కర్దమ స్వరూపిణిని నాయందు కర్దమ స్వరూపిణివై యుధ్భవింపుము. ఓ కర్దమ ప్రజాపతీ! మాతృ స్వరూపిణియు, పద్మాలంకృతయు నగు శ్రీదేవిని మా వంశమునందు వసింపజేయుము.
కర్దముడు సృష్టి కారకులగు ప్రజాపతులలో ఒకడు. ఇతడు తన భార్యయందు సృష్టి సమస్తమును శ్రీ కళయైన హిరణ్య కర్దమముగా నుధ్భవింప జేసెను. ఇతని మహిమవలన సూర్యకిరణములనుండి యుధ్భవించింన మరుత్తులు వాయువులైనవి. అవే సూర్యకిరణములనుండి పుట్టిన అగ్ని వలన వాయువులు జలములైనవి. జలము పృథ్వీ తత్వమైనది. వాయు, జల, పృథ్వీ తత్వముల సమ్మిశ్రమగు కర్దమముపై (బురదపై) సూర్య కిరణములు ప్రసరించి జీవ సృష్టిని కలిగించినవి. ఇది యంతయూ కర్దమ ప్రజాపతి ప్రభావము. ప్రకృతి శ్రీ స్వరూపిణి గనుక కర్దముని సంతతిగా ఉధ్భవించినదని పురాణములయందు నిరూపింపబడినది.
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 12:*
*ఆప సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే*
*నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే:*
*ప్రతిపదార్థాలు*
*స్నిగ్ధాని* ~ మెరుపుకాంతులు కలిగిన; *ఆపః* ~ జలములు;
*సృజంతు* ~ సృష్టించుగాక; *చిక్లీత*~ ఓ చిక్లీతుడా;
*మే గృహే*~ నా గృహమున; *వస*~ వసియింపుము;
*మాతరం* ~ తల్లియగు; *శ్రియం దేవిం* ~ శ్రీదేవిని;
*మే కులే*~ నా వంశమునందు;
*నివాసయ చ* ~ నివసించునట్లు చేయుము.
*తాత్పర్యము*
*ఓ చిక్లీతుడా ! సరసములైన జలములు సృష్టించు గాక! నీవు నా* *గృహమున వసింపుము. మాతయైన శ్రీదేవిని నా వంశమున నిశ్చలముగా వసింప జేయుము.*
*చిక్లీతుడు లక్ష్మీ పుత్రులు ముగ్గురిలో నొకడు. కర్దముడు, చిక్లీతుడు,*
*ఆనందుడు, అను ముగ్గురూ లక్ష్మీ పుత్రులు సృష్టికి ప్రజాపతులుగా పని చేయుదురు. కేదనము అనగా తడుపుట. జలమునకు* *తడుపపు నట్టి శక్తి నిచ్చు దేవతయే చిక్లీతుడు. తడి యనునది జీవమునకు చిహ్నము. దానివలననే భూమి వర్షమున తడియుట, సృష్టి విత్తనమును మొలకెత్తించుట జరుగుచున్నది. వర్షములు లేకుండుట క్షామమునకు సూచకము. చిక్లీతుడు అను ప్రజాపతి వర్షముచే భూమిని తడిపి పంట పండించు దేవత. పూర్వకాలమున ఇతడు రైతుల ఇష్ట దైవముగా ఆరాధింపబడువాడు. ఇతడు ప్రసన్నుడైనచో స్నిగ్నిదములైన ఆపస్సులు ప్రసన్నములగును. అనగా మెరుపుకాంతులతో విద్యుత్ అనబడు ప్రాణశక్తిని తమలోని అంకురశక్తిగా పీల్చుకొని భూమికి దిగివచ్చు మేఘముల జలములివి. కనుకనే, సంపదలనిచ్చుచూ లక్ష్మికి రూపములై ఉన్నవి. తల్లి గర్భములో జలములు కారణముగా పిండము జీవించును గనుక మాతృ స్వరూపిణియైన జలములను చిక్లీతుడు సకాలమున భూమికి గొని రావలెనని ఇందలి ప్రార్థన.*
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 13:*
*ఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్:*
*చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహః:*
*ఆర్ద్రాం* ~దయార్ద్ర స్వరూపిణి, రస స్వరూపిణి, ఆర్ద్రా నక్షత్రమునుండి వెలుగుచున్న మహిమ కలదానిని;
*పుష్కరిణీం* ~ పోషణను కలిగించునది; తెల్ల కలువలమాలను ధరించినది; పుష్కరిణి అంటే కోనేరు; అందు పోషింపబడు తెల్ల కలువ పువ్వులు కలది అని అర్థము.
*పుష్టిం* ~ పోషణ స్వరూపిణిని; పింగళాం ~ పింగళ వర్ణము(తేనెరంగు)
కలది;
*పద్మమాలినీం* ~ పద్మముల మాలను ధరించినదానిని;
*చంద్రాం*~ చంద్రుని స్వరూపమైన చల్లని వెలుగులు గలదానిని;
*హిరణ్మయీం* ~ బంగారు రంగున వెలుగొందుదానిని; కిరణ్మయ స్వరూపిణిని;
*లక్ష్మీం* ~ శుభ లక్షణములు గలదానిని;
*మే + ఆవహః* ~ నాయందు ఆవాహన చేయుము.
*ఓ జాతవేదుడా! ఆర్ద్ర స్వరూపిణియు, కలువపువ్వుల, *తమ్మిపువ్వుల*దండ ధరించినదియు, పోషణము, పుష్టి కలిగించునదియు, పింగళవర్ణము గలదియు, హిరణ్మయ మూర్తియు, చంద్రుని స్వరూపము గలదియు అగు లక్ష్మిని నాయందు ఆవహింపజేయుము.*
*ఆర్ద్ర* అనగా *దయార్ద్ర స్వరూపిణి; రస స్వరూపిణి; ఆర్ద్రా* *నక్షత్రమునుండీ వెలుగుచున్న మహిమ కలదానిని. పుష్కరిణి అంటే కోనేరు; అందు పోషింపబడు తెల్ల కలువ పువ్వులు కలది అని అర్థము.* *చంద్రుడు తెల్లకలువలను వికసింపచేసి శోభ కలుగజేయును. కనుకనే ఇక్కడ శ్రీదేవి వర్ణింపబడినది.*
*గృహారామమున కోనేరు, తెల్ల కలువలుండుట లక్ష్మీప్రదము. ఆర్ద్రా నక్షత్రమున వానినారంభము చేయుట శుభప్రదము. *పింగళ* అనగా *తేనె* *రంగు కలది. తేనె లక్ష్మీకరములగు ఆహారములలో ఒకటి. దానిని సేవించుట ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదము; మరియూ పింగళనాడి లక్ష్మీ* *స్వరూపము. దానినే సూర్యనాడి అని అంటారు. దాని వల్ల యోగులకు* *ఊర్ధ్వగతి. భోగమోక్షములు*
*శ్రీసూక్తము ~ శ్లోకం ~ 14:*
*ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్*
*సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ:*
*ప్రతిపదార్థాలు*
*కరిణి*~ ఏనుగులుకలది;
*యష్టిం*~ యజ్ఙదండముయొక్క స్వరూపమైనది;
*సువర్ణ*~ బంగారురంగుకలది లేక మంచి వర్ణములచే వ్యక్తమగునది;
వర్ణములు అనగా అక్షరములు మరియు రంగులు; మంచి అక్షరముల సముదాయముతో శుభమైన పద ప్రయోగముతో చేయు సంభాషణలలో
లక్ష్మి ఉండును. సూర్యుని కాంతినుండీ ఏడు రంగులుధ్భవించును. కనుక
లక్ష్మి సువర్ణ స్వరూపిణి;
*హేమమాలిని* ~ బంగారు హారములుగలది;
*సూర్య* ~ సూర్యుని వెలుగు తన స్వరూపముగా కలది.
*తాత్పర్యము*
ఏనుగులు సంపదను, లక్ష్మీ ప్రసన్నమును సూచించును కనుక, అటునిటు
ఏనుగులతో లక్ష్మిని ధ్యానము చేయవలెను. ఈ ధ్యానమునే గజలక్ష్మి అని
అందురు. యజ్ఞమున యజ్ఞశాలలోని స్థంభము పశువును బలి యిచ్చుటకు గుర్తు. జీవుని పశుత్వమును బలియిచ్చి దివ్యత్వమును వర్ధిల్లజేయుట వలన
లక్ష్మీ కళ పెరుగును.
సూర్య అనగా సూర్యుని ఆకారము, కాంతి, రంగులు, పేరులు తన
స్వరూపముగా గలది అని అర్థము. గుణమయి యగు ప్రకృతి అంతయూ
లక్ష్మీ స్వరూపము. అందుండు పురుషుడే అంతర్యామియై
సౌరకుటుంబములోని లోకములన్నిటనూ వ్యాపించి యుండి నారాయణుడుగా తెలియబడు చున్నాడు. లక్ష్మి ఈ మంత్రమున నారాయణ సహితముగా ధ్యానము చేయబడి సాధకుని లోనికి ఆవహింపబడుచున్నది...
*శ్రీ సూక్తము ~ శ్లోకము 15:*
*తాం మ ఆహవ జాతవేదో లక్ష్మీ మనపగామినీ*
*యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్*
*విందేయంపురుషానహమ్:*
*ప్రతిపదార్థాలు*
*జాతవేదాః* ~ ఓ జాతవేదుడా!
*యస్యాం*~ఎవతెయందు;
*హిరణ్యం* ~ బంగారమును;
*గావః* ~ గోవులను;
*దాస్యః* ~దాసీజనమును;
*అశ్వాన్*~ అశ్వములను;
*పురుషాన్*~ పురుషులను;
*అహం* ~ నేను;
*విందేయం*~ పొందగలనో;
*తాం*~ ఆమెను;
*అనపగామినీమ్*~ ఎడబాయని లక్షణములు గల దానిని;
*లక్ష్మీం*~ శుభ లక్షణ దేవతను;
*ఆవహః*~ ఆవహింపజేయుము;
*తాత్పర్యము*
అపగమనము అనగా నెడబాయుట. ఆ లక్షణములు లేనిది
అనపగామిని. అభ్యాసమైన శుభలక్షణము ఎడబాయదు. సంపద దాని నెడబాయదు. హిరణ్యమనగా బంగారు రంగు వెలుగు. జీవ స్వరూపమైన సూర్యకిరణము. గోవు అనగా తెల్లనిరంగు కిరణములు. సూర్యుని ఈ కిరణములవలన. ఆనందమయ కోశము మేల్మొనును. దాసులనగా ఇంద్రియములు. ఇవి దాస్యము చేయుట యోగవిద్య. అశ్వమనగా ప్రాణమయ శరీరము. దీనివలన చైతన్యము, గమనము కలుగును. పురుషుడనగా జీవుడు. శ్రీసూక్త సిధ్ధి వలన సర్వజీవ మైత్రి
కలుగును. దానితో సంపద కలుగును.
*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 16:* *(ఫలశృతి శ్లోకము:)*
*యశ్శుచిః ప్రయతో భూత్వా జుహుయా దాజ్య మన్వహం*
*శ్రియః పంచదశర్చం చ శ్రీ కామః సతతం జపేత్:*
*ప్రతిపదార్థాలు*
*యః*~ ఎవడు; శ్రీకామః ~ సంపదకోరునో ( అతడు);
*శుచిః* ~ శుచికలవాడై;
*ప్రయతః*~ ప్రయత్నముకలవాడై(శ్రధ్ధావంతుడై);
*అన్వహం* ~ అనుదినము;
*ఆజ్యం*~ నేతిని;
*జుహూయాత్*~ హోమము చేయవలెను; చ ~ మరియు;
*శ్రియః*~ శ్రీదేవి యొక్క;
*పంచదశ*~ పదునైదు;
*ఋచం* ~ ఋక్కుల సమూహమును;
*సతతం*~ ఎల్లప్పుడును;
*జపేత్*~ జపించవలెను.
*తాత్పర్యము*
శుచిమంతుడై, ప్రయత్నము గలవాడై అనుదినమూ శ్రీసూక్తము యొక్క పదునైదు ఋక్కులను శ్రీకాముడైనవాడు నేతితో హోమము చేయుచూ జపించవలెను.
శ్రీకాముడనగా సంపద కోరినవాడు. ఇది ఇహలోక పరలోక సంపద.
నేతిని హోమము చేయుట బహిర్యాగము. మధురమైన మైత్రీ భావమును
జపించుట అనగా, ఎల్లప్పుడునూ నిలుపుకొనుట అంతర్యాగము. శ్రీదేవి
అంతర్యాగముచే చక్కగా నారాధింప బడదగిన దనియూ, బహిర్యాగ
మునకు దుర్లభ రూపమున లభించుననియూ, శ్రీవిద్య యందు చెప్ప
బడినది. శుచిత్వ మనగా శరీరము, మనస్సు, ఇంద్రియములు శుచిగా
ఉండుట. ప్రయత్నము లేక శ్రధ్ధ యనగా నెల్లప్పుడునూ శ్రీదేవిని గుర్తుంచు
కొనుట, అనగా సర్వ జీవరాశులయందునూ దర్శించుట.
*ఇది శ్రీసూక్తమునకు ఫల శృతి.*